వారాహి చలనచిత్రం
తుంగభద్ర
నటీనటులు: ఆదిత్, డిరపుల్, సత్యరాజ్, కోట శ్రీనివాసరావు,
రవివర్మ, పవిత్ర లోకేష్, జబర్దస్త్ శ్రీను, నవీన్ తదితరులు
కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్
సంగీతం: హరి గౌర
ఎడిటింగ్: అమ్మిరాజు
సమర్పణ: సాయి శివాని
నిర్మాత: రజని కొర్రపాటి
రచన, దర్శకత్వం: శ్రీనివాసకృష్ణ గోగినేని
విడుదల తేదీ: 20.03.2015
వారాహి చలన చిత్రం బేనర్ అంటే మంచి చిత్రాలు, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు నిర్మించే సంస్థగా పేరు తెచ్చుకుంది. ఈ సంస్థ నుంచి వచ్చిన మరో చిత్రం ‘తుంగభద్ర’. ప్రేమ, ఫ్యాక్షన్‌లను మిళితం చేస్తూ తయారు చేసిన కథతో పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో నిర్మించిన చిత్రమిది. ఆదిత్, డిరపుల్ జంటగా కోట శ్రీనివాసరావు, సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో శ్రీనివాసకృష్ణ గోగినేని దర్శకత్వంలో సాయి కొర్రపాటి సారధ్యంలో నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ‘తుంగభద్ర’ సినిమా వారాహి బేనర్ ప్రతిష్టను పెంచే చిత్రమైందా? ప్రేమ, ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నమైన కథ, కథనాలు ఈ చిత్రంలో ఏం వున్నాయి? ఫ్యాక్షన్ చిత్రాలను పక్కన పెట్టి ఎంటర్‌టైన్‌మెంట్, హార్రర్ చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం.
కథ: రామరాజు(సత్యరాజ్) తాటికొండ గ్రామంలో మంచి పేరున్న వ్యక్తి. ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి అయిన పైడితల్లి(కోట శ్రీనివాసరావు)ను ఓడిస్తాడు. అంతే కాకుండా ఎలక్షన్ టైమ్‌లో జరిగిన గొడవల్లో చలపతిరావును చంపేస్తాడు రామరాజు. తమ తండ్రిని చంపిన రామరాజుపై పగ పెంచుకొని అదను కోసం ఎదురుచూస్తుంటారు చలపతిరావు కొడుకులు. ఓరోజు అతనిపై బాంబులతో దాడి చేస్తారు. రామరాజు అనుచరులు అతన్ని కాపాడతారు. దాంతో భయపడిపోయిన చలపతిరావు కొడుకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. కట్ చేస్తే రామరాజుకు నమ్మినబంటుగా వుండే కుర్రాడు శ్రీను. తన కూతురు ప్రేమలో పడిరదేమోనన్న డౌట్‌తో వున్న రామరాజు రోజూ టౌన్‌కి వెళ్ళి కాలేజీలో చదువుకునే తన కుమార్తె గౌరి(డిరపుల్)ను ఓ కంట కనిపెట్టమని, తను చందు అనే కుర్రాడితో క్లోజ్‌గా వుంటోందని, అది స్నేహమైతే ఓకే. ప్రేమ అయితే అతన్ని చంపెయ్యమని అతనికి చెప్పి పంపిస్తాడు. శ్రీను రోజూ గౌరిని ఫాలో అవుతూ వుంటాడు. అలా ఫాలో అవుతూ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. గౌరి కూడా శ్రీనుని ప్రేమిస్తుంది. ఇదిలా వుంటే మళ్ళీ జరిగిన ఎలక్షన్స్‌లో పైడితల్లి పవర్‌లోకి వస్తాడు. అప్పటివరకు పగతో రగిలిపోతున్న పైడితల్లి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? శ్రీను, గౌరిల ప్రేమ ఫలించిందా? వారిద్దరి ప్రేమను రామరాజు అంగీకరించాడా? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్: ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవడానికి ఏమీ లేవు. అయినా సత్యరాజ్ పెర్‌ఫార్మెన్స్, అక్కడక్కడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. అక్కడక్కడా కామెడీ, సినిమాలోని చివరి 20 నిముషాలు ఈ చిత్రానికి వున్న ప్లస్ పాయింట్స్.
మైనస్ పాయింట్స్: ఈ సినిమాకి ఎంచుకున్న కథ కొత్తది కాదు, కథనంలో కొత్తదనం లేదు. ఇప్పటివరకు ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు చూసి చూసి విసిగి వేసారి వున్నారు. మళ్ళీ వారిపై ఇలాంటి కథను తీసుకొచ్చి రుద్దడం ఎంత మాత్రం సమంజసం కాదు. సినిమా స్టార్టింగ్ సీన్‌లోనే మనకు ‘యజ్ఞం’ సినిమా గుర్తొస్తుంది. అలా గుర్తొచ్చిన ‘యజ్ఞం’ ప్రతి సీన్‌లోనూ మనల్ని వెంటాడుతూ వుంటుంది. పైగా యజ్ఞంలో గోపీచంద్ క్యారెక్టర్ పేరు శ్రీను. ఈ సినిమాలో కూడా అదే పేరు పెట్టారు. కథలో బలం లేకపోవడంతో రెండు గంటల సేపు థియేటర్‌లో కూర్చోవడం ఆడియన్స్‌కి కష్టమైన పనే అనిపిస్తుంది. కాకపోతే ఈ సినిమా మొత్తానికి చివరి 20 నిముషాలు మాత్రమే చెప్పుకోదగిందిగా వుంది. ఇందులో హీరోది అంతగా ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్. స్మార్ట్‌గా వున్న హీరోకి గడ్డం పెంచేసి మాస్ లుక్ తేవాలని ట్రై చేసినా అది ఎంతమాత్రం వర్కవుట్ అవ్వలేదు. అతని గెటప్‌కి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ లేకపోవడం కూడా ఆ క్యారెక్టర్‌కి మైనస్ అయింది. ఇక గౌరి క్యారెక్టరైజేషన్ కూడా సరిగ్గా లేకపోవడం, ఒక్కో సందర్భంలో ఒక్కోలా బిహేవ్ చెయ్యడం కూడా ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తుంది. కూతురు ప్రేమలో పడిరదేమోనన్న డౌట్‌తో తన దగ్గర పనిచేసే కుర్రాడిని ఆమె వెంట పంపించడం ఎంతవరకు కరెక్టో ఆ తండ్రికే తెలియాలి. ఈ ప్రాసెస్‌లో బస్సులు ఎక్కడం, దిగడంతోనే సగం సినిమా గడిచిపోతుంది. మధ్య మధ్య మనకు ఏమాత్రం నవ్వు రాని కామెడీ సీన్స్‌తో వీలైనంత విసిగించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కామెడీ లేకపోగా స్లో నేరేషన్ వల్ల ఎక్కడి కథ అక్కడే ఆగిపోతుంది. ప్రీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి హీరో, హీరోయిన్ల క్యారెక్టర్స్ ఎండ్ అయిపోయి సత్యరాజ్ క్యారెక్టర్ మెయిన్ అయిపోతుంది. దాంతో హీరో క్యారెక్టర్ తేలిపోయింది. హరి గౌర మ్యూజిక్ అంతంత మాత్రంగా వుంది. అక్కడక్కడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఫర్వాలేదనిపించాడు.
విశ్లేషణ: ఒక మూస కథతో ప్రారంభమై స్లో నేరేషన్‌తో నడుస్తూ ఫస్ట్ హాఫ్ అయిందనిపించుకొని సెకండాఫ్‌లో కాస్త స్పీడందుకొని చివరి 20 నిముషాలు మాత్రమే సినిమా మీద ఇంట్రెస్ట్ కలిగించగలిగాడు డైరెక్టర్. కథలో, కథనంలో ఏమాత్రం కొత్తదనం లేని సినిమా ఇది. ఒక కొత్త సినిమా చూడాలనుకునేవారికి ఈ సినిమా ఎంత మాత్రం నచ్చదు. చాలా సినిమాల్లోని సన్నివేశాలు కలిపి ఒకే సినిమాలో చూస్తున్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. కొన్ని సీన్స్ ఎందుకు జరుగుతున్నాయో కూడా అర్థం కాని స్థితిలో మనం సినిమా చూడాల్సి వస్తుంది. హీరో క్యారెక్టర్‌కిగానీ, హీరోయిన్ క్యారెక్టర్‌కి గానీ ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆ మాటకి వస్తే ఏ క్యారెక్టర్‌కీ సరైన ఇంపార్టెన్స్, ఒక పర్పస్ అనేది లేదు. సినిమాలో కేవలం సత్యరాజ్ పాత్ర తప్ప ఏ క్యారెక్టరూ మనకి కనెక్ట్ అవ్వదు. కథ విషయంలోగానీ, కథనం విషయంలోగానీ డైరెక్టర్ ఎలాంటి కేర్ తీసుకోలేదని అర్థమవుతుంది. రెండు గంటల సినిమా తీశామంటే తీశాం అనేలా వుంది. ‘యజ్ఞం’లోని చాలా సీన్స్ ఇందులో రిపీట్ అవుతున్నా ఈ విషయం దర్శకనిర్మాతలు గమనించకపోవడం విచిత్రంగానే అనిపిస్తుంది. ఇక హీరో క్యారెక్టర్‌కి సినిమా రిలీజ్‌కి ముందు ఇచ్చినంత బిల్డప్ సినిమాలో మనకి కనిపించదు. హీరోయిన్ ఒక్కో సీన్‌లో ఒక్కోలా కనిపిస్తుంది. కొన్ని సీన్స్‌లో ఆమె మొహంలోని హావభావాలు ఏమిటో హీరోకి అర్థం కావు, మనకీ అర్థం కావు. ఫైనల్‌గా చెప్పాలంటే తుంగభద్ర పేరుతో ఓ కొత్త సినిమా వచ్చిందని వెళ్ళే వారికి పాత సినిమా చూశామన్న ఫీలింగ్ కలగక మానదు. ఈమధ్య కాలంలో ఇలాంటి సినిమాలకు ఆదరణ తక్కువగానే వుంది కాబట్టి కమర్షియల్‌గా కూడా ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది డౌటే.
సినీజోష్ రేటింగ్: 2.5/5