కల్పన చిత్ర
నాలో ఒకడు
నటీనటులు: సిద్ధార్థ్, దీపా సన్నిధి, సృష్టి డాంగే,
ఆడుకాలం నరేన్, జాన్ విజయ్, యోగ్ జేపి, అజయ్‌రత్నం
సినిమాటోగ్రఫీ: గోపి అమర్‌నాథ్
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటింగ్: లియో జాన్‌పాల్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
సమర్పణ: కోనేరు కల్పన
నిర్మాత: ప్రకృతి
దర్శకత్వం: ప్రసాద్ రమర్
విడుదల తేదీ: 8.05.2015
మనిషి ఆశాజీవి. తను వున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని కలలు కంటాడు. ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి కృషి చేస్తాడు. కానీ, కొందరు తాము కోరుకున్న జీవితాన్ని కలల్లోనే చూసుకొని తృప్తి పడుతుంటారు. పేదవాడిగా వున్నవాడు ధనవంతుడై పోయినట్టు కల కంటాడు, ఎలాంటి టెన్షన్స్‌లేని ప్రశాంతమైన జీవితం గడుపుతున్నట్టు కల కంటాడు ధనికుడు. అలాంటి ఒక యువకుడి కథే ‘నాలో ఒకడు’. కన్నడలో ‘లూసియా’గా రూపొంది ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తమిళ్‌లో ‘ఎలక్కుల్ ఒరువన్’ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రాన్ని కల్పన చిత్ర బేనర్‌లో కోనేరు కల్పన తెలుగు ప్రేక్షకులకు అందించారు. కన్నడ, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఈరోజు తెలుగులో విడుదలైంది. మరి తెలుగు ప్రేక్షకుల్ని ఈ చిత్రం ఏమేర ఆకట్టుకుందనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ: అతని పేరు విక్కీ(సిద్థార్థ్) ఒక పాత థియేటర్‌లో లైట్ బోయ్‌గా పనిచేస్తుంటాడు. అతనికి ఒక ప్రాబ్లమ్ వుంటుంది. అది నిద్ర పట్టకపోవడం. ఓరోజు రాత్రి విక్కీకి ఒక వ్యక్తి పరిచయమవుతాడు. అతనికి తన సమస్య గురించి చెప్పగానే విక్కీని ఓ చోటికి తీసుకెళ్తాడు. అక్కడ లూసియా అనే పేరు గల కాప్స్యూల్స్ ఇస్తారు. అవి ప్రతిరోజూ వేసుకుంటే నిద్ర బాగా పడుతుందని, తన జీవితం ఎలా వుండాలని కోరుకుంటూ పడుకుంటామో వచ్చే కల కూడా అలాగే వుంటుందని, అది ఒక సీరియల్‌లా నిద్రపోయినప్పుడల్లా కంటిన్యూ అవుతుందని చెప్తాడు ఆ మందు ఇచ్చిన వ్యక్తి. విక్కీ ఆరోజు నుంచే కాప్స్యూల్స్ వాడడం స్టార్ట్ చేస్తాడు. వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయి తను కోరుకుంటున్న జీవితాన్ని కలలోనే నిజం చేసుకుంటూ వుంటాడు. నిజ జీవితంలో తనను పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడని అమ్మాయితో కలలో ప్రేమకథ నడుపుతూ వుంటాడు. అలా గడిచిపోతున్న విక్కీ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? అతను కలలో ఎలాంటి జీవితాన్ని గడుపుతుంటాడు? ఆ మందు వాడడం వల్ల అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? దాని నుంచి బయటపడ్డాడా? తను నిజ జీవితంలో కోరుకున్న అమ్మాయి విక్కీకి దక్కిందా? అనేది తెరమీద చూడాల్సిందే.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్: థియేటర్‌లో లైట్‌బోయ్ విక్కీగా, సూపర్‌స్టార్ విఘ్నేష్‌గా సిద్ధార్థ్ ఈ చిత్రంలో రెండు విభిన్నమైన క్యారెక్టర్లు చేశాడు. విక్కీది గ్లామర్ లేని క్యారెక్టర్ అయితే, విఘ్నేష్ క్యారెక్టర్ మాత్రం చాలా రిచ్‌గా వుంటూ, డిగ్నిఫైడ్‌గా వుంటుంది. ఈ రెండు క్యారెక్టర్లలో సిద్ధార్థ్ జీవించాడని చెప్పాలి. సినిమా హీరోగా అతని లుక్‌గానీ, వాకింగ్ గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ చాలా స్టైలిష్‌గా వుండేలా చూసుకున్నాడు. అలాగే డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్ అయిన విక్కీగా పూర్తిగా ఆపోజిట్‌గా వుండే క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించాడు. ఆ రెండు క్యారెక్టర్స్ చేసింది సిద్ధార్ధేనా అన్నట్టుగా తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ మెప్పించాడు. దివ్యగా సిద్థార్థ్ సరసన నటించిన దీపా సన్నిధి కూడా చాలా వేరియేషన్స్ వున్న తన క్యారెక్టర్‌ని అద్భుతంగా పోషించింది. లైట్‌బోయ్‌ని ఇష్టపడని అమ్మాయిగా, ఆ తర్వాత అతనే సర్వస్వంగా అనుకునే ప్రేమికురాలిగా దీపా నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. విక్కీకి, విఘ్నేష్‌కి ఆత్మీయుడిగా కోటి పాత్రలో నటించిన ఆడుకాలం నరేన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా సిద్ధార్థ్, నరేన్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ ఆడియన్స్‌కి చక్కని అనుభూతిని కలిగిస్తాయి. పోలీసాఫీసర్ రంజిత్‌గా నటించిన ఉదయ్ మహేష్, అజయ్‌రత్నం తమ క్యారెక్టర్స్‌కి వున్న పరిధిలో బాగానే చేశారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్: ఈ సినిమాకి గోపీ అమర్‌నాథ్ అందించిన ఫోటోగ్రఫీ సూపర్బ్ అని చెప్పాలి. ప్రతి సన్నివేశాన్ని చాలా రిచ్‌గా చూపించడంలో గోపీ సక్సెస్ అయ్యాడు. సినిమాలోని కథకు తగ్గట్టుగా, ఆయా సన్నివేశాల్లోని మూడ్‌కి తగ్గట్టు చక్కని లైటింగ్స్‌తో ప్రతి సీన్‌ని బాగా తీశాడు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణన్ పాటల విషయంలో అంతగా మనసు పెట్టకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకున్నాడని చెప్పాలి. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, డిఫరెంట్ టైమింగ్స్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్‌తో నడిచే కథ కావడం, ఆయా సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చెయ్యడంలో సంతోష్ సక్సెస్ అయ్యాడు. ఎన్నో మెలికలు వున్న ఈ కథని ఎడిట్ చెయ్యడంలో లియో జాన్‌పాల్ తన టాలెంట్‌ని చూపించాడు. అయితే కథ పరంగా అక్కడక్కడా వచ్చిన ల్యాగ్‌ని మాత్రం ఎడిటర్ ఏమీ చెయ్యలేకపోయాడు. డైరెక్టర్ విషయానికి కన్నడలో పవన్‌కుమార్ చాలా తెలివిగా రాసుకున్న ఈ కథని తెరకెక్కించడంలో ప్రసాద్ రమర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కథ పరంగా, కథనం పరంగా ప్రసాద్ ఓకే అయినప్పటికీ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌కి స్కోప్ ఇవ్వకపోవడం వల్ల సినిమా ఒక డాక్యుమెంటరీలా వుంది తప్ప ఎక్కడా ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగలేదు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కంప్లీట్ అయ్యేవరకు ప్రతి సీన్ సీరియస్‌గానే నడుస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు బాగానే వుంది అనిపించినా ఎక్కడా రిలీఫ్ అనేది లేకపోవడం వల్ల సినిమా కంప్లీట్ అయిన తర్వాత సినిమాలో ఏమీ లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే డైరెక్టర్ కథని హ్యాండిల్ చేసిన విధానాన్ని తప్పకుండా అప్రిషియేట్ చెయ్యాల్సిందే. కథని కథగా తెరకెక్కించడంలో ప్రసాద్ రమర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్:
కథ, కథనం, ఎమోషన్స్, ఆడియన్స్‌ని థ్రిల్ చేసే అంశాలు
మైనస్ పాయింట్స్:
ఎంటర్‌టైన్‌మెంట్ లోపించడం,
సీరియస్ కథ వల్ల ఎక్కడా రిలీఫ్ లేకపోవడం
విశ్లేషణ: ఒక మంచి కథ, మంచి కథనం. ఇంతవరకు తెలుగు ప్రేక్షకులు చూడని కథ అనే చెప్పాలి. దాన్ని అందంగా, ఆసక్తికరంగా తెరకెక్కించడంలో ప్రసాద్ రమర్ సక్సెస్ అయినప్పటికీ ఇది ఎంతవరకు తెలుగు ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందనేది ప్రశ్నగా మిగిలిపోతుంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు జీరో పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఇప్పటి ఆడియన్స్ సినిమా చూడగలరా? కథ బాగున్నా, కథనం బాగున్నా, సిద్ధార్థ చేసిన క్యారెక్టర్లు అద్భుతంగా వున్నా, హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినా రెండుంపావు గంటలు తదేకంగా సినిమాని చూడడం అనేది తెలుగు ప్రేక్షకుల వల్ల కాదు. స్టార్టింగ్ టు ఎండిరగ్ ఒకే ఫ్లోలో సినిమా వెళ్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా వుండదు. అయితే క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం ఆడియన్స్‌ని నిజంగానే థ్రిల్ చేస్తుంది. ఆ ట్విస్ట్‌ని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. ఇలా కూడా కథ వుంటుందా అని ఆశ్చర్యపోయేలా వుంటుంది. ఈ విషయంలో కథకుడు పవన్‌కుమార్‌ని అభినందించాలి. డైరెక్టర్ ప్రసాద్ రమర్ ఆర్టిస్టులతో చక్కని పెర్‌ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. ఫైనల్‌గా చెప్పాలంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ మల్టీప్లెక్స్ సినిమా. బి, సి సెంటర్స్ ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చకపోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ వారికి అర్థం కాదు. సినిమా బాగున్నా ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం వల్ల మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. అయితే ఒక కొత్త తరహా సినిమా, ఒక కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా చూడాలనుకునే ఆడియన్స్‌కి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది.
ఫినిషింగ్ టచ్: ఎంటర్‌టైన్‌మెంట్ లోపించిన ‘నాలో ఒకడు’
సినీజోష్ రేటింగ్: 2.5/5