ఎన్.వి.ఆర్. సినిమా
టైగర్
నటీనటులు: సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్,
తనికెళ్ళ భరణి, సుప్రీత్, ప్రవీణ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు
సంగీతం: ఎస్.ఎస్.థమన్
ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్
మాటలు: అబ్బూరి రవి
సమర్పణ: ఠాగూర్ మధు
నిర్మాత: ఎన్.వి.ప్రసాద్
రచన, దర్శకత్వం: వి.ఐ.ఆనంద్
విడుదల తేదీ: 26.06.2015
‘ప్రస్థానం’ చిత్రంతో పరిచయమై నటుడుగా తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న సందీప్ కిషన్ ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా సాధించిన హిట్‌తో ఓ అరడజను సినిమాలు చేసినప్పటికీ కమర్షియల్‌గా ఏదీ సక్సెస్ అవ్వలేదు. లేటెస్ట్‌గా మరో హీరో రాహుల్ రవీంద్రన్‌తో కలిసి ‘టైగర్’ అనే డిఫరెంట్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు సందీప్. ఠాగూర్ మధు సమర్పణలో ఎ.ఆర్.మురుగదాస్ శిష్యుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మించిన ‘టైగర్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సందీప్‌కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చింది? ‘టైగర్’ అనే టైటిల్‌ని సందీప్ జస్టిఫై చెయ్యగలిగాడా? ఈ విషయాలన్నీ సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ: అది రాజమండ్రిలోని ఓ అనాధాశ్రమం. అక్కడ వున్నవారిలో టైగర్(సందీప్ కిషన్), విష్ణు(రాహుల్ రవీంద్రన్) స్నేహితులు. విష్ణుని ప్రాణంగా ప్రేమించే స్నేహితుడిగా అతని కోసం ఏం చెయ్యడానికైనా వెనకాడడు టైగర్. ఎప్పుడూ విష్ణు సంతోషాన్ని కోరుకుంటాడు టైగర్. ఇలా వుండగా తమ కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు విష్ణుని దత్తత తీసుకుంటారు. అలా విష్ణు మరో చోట పెరుగుతాడు. అయినప్పటికీ వారి స్నేహం కొనసాగుతుంది. విష్ణు చదువుతున్న కాలేజీకి ఓ కార్యక్రమం నిమిత్తం కాశీ నుంచి గంగ(సీరత్‌కపూర్) వస్తుంది. ఆమెతో పరిచయం ఏర్పడిన కొంత కాలానికే అది ప్రేమగా మారుతుంది. ఈ విషయం తెలుసుకున్న టైగర్ ఆ అమ్మాయి విషయంలో విష్ణుతో గొడవపడతాడు. దాని ఫలితంగా స్నేహితులిద్దరూ విడిపోతారు. కట్ చేస్తే ఓరోజు కాశీ నుంచి టైగర్‌కి ఫోన్ వస్తుంది. అతని స్నేహితుడు చావు బ్రతుకుల మధ్య వున్నాడని, అర్జెంట్‌గా రమ్మని ఆ ఫోన్ సారాంశం. వెంటనే కాశీ బయల్దేరతాడు టైగర్. కాశీలో టైగర్‌కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తన స్నేహితుడు విష్ణుని ఏ పరిస్థితుల్లో చూడాల్సి వస్తుంది? గంగ వల్ల విష్ణుకి ఎదురైన సమస్య ఏమిటి? ఆ ప్రేమికులిద్దరినీ కలపడానికి టైగర్ ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు? చివరికి వారిద్దరినీ ఒక్కటి చెయ్యగలిగాడా? అనేది మిగతా కథ.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్: టైగర్‌గా సందీప్ కిషన్ పెర్‌ఫార్మెన్స్ ఫర్వాలేదు అనిపించింది. అతని గత చిత్రాల్లోని పెర్‌ఫార్మెన్స్‌తో పోలిస్తే కొన్ని విషయాల్లో బెటర్‌గా, మరికొన్ని విషయాల్లో నాట్ బెటర్ అనిపించాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో బాగా చేశాడనిపించినా, హీరోగా బిల్డప్ ఇచ్చే సీన్స్‌లో కొంత ఓవర్ చేశాడనిపించింది, ఓవర్‌గా చేయించారని కూడా అనిపిస్తుంది. రాహుల్ రవీంద్రన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో బాగానే చేశాడు. హీరోయిన్ సీరత్‌కపూర్ పెర్‌ఫార్మెన్స్ పరంగా కొంత ఓకే అనిపించినా, స్క్రీన్ ప్రజెన్స్ అంత బాగాలేదు. ఆకట్టుకునే గ్లామర్ ఆమె దగ్గర లేకపోవడం కొంత మైనస్ అయింది. తాగుబోతు రమేష్ తన కామెడీతో అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు. అలాగే ప్రవీణ్ కూడా తన వంతు నవ్వించడానికి ట్రై చేశాడు.
టెక్నీషియన్స్: టెక్నీషియన్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది ఛోటా కె.నాయుడు ఫోటోగ్రఫీ గురించి. ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో కేర్ తీసుకొని చేశాడని సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రతి సీన్ చాలా రిచ్‌గా రావడంలో ఛోటా పార్టిసిపేషన్ చాలా వుంది. సెకండాఫ్‌లో వచ్చే కాశీ సీన్స్‌ని చాలా బాగా పిక్చరైజ్ చేశాడు. నెక్స్‌ట్ చెప్పుకోవాల్సింది థమన్ మ్యూజిక్ గురించి. ఈ సినిమాలో పాటలు పెద్దగా లేవు. వున్న పాటలు కూడా అంతగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా ఎక్స్‌లెంట్‌గా చేశాడు థమన్. సినిమాలోని చాలా ఎమోషనల్ సీన్స్ థమన్ మ్యూజిక్‌తోనే క్యారీ అయ్యాయి. స్టార్టింగ్ టు ఎండిరగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో థమన్ చాలా కేర్ తీసుకున్నాడని చెప్పాలి. ఇక ఛోటా కె.ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమా రన్ టైమ్ కూడా తక్కువ కావడం, సీన్స్ కూడా ఫాస్ట్‌గా మూవ్ అవడంలో ఎడిటర్ వర్క్ కనిపిస్తుంది. వెంకట్ కంపోజ్ చేసిన ఫైట్స్ చాలా రొటీన్‌గా వున్నాయి. ఇక డైరెక్టర్ ఆనంద్ గురించి చెప్పాలంటే అతను ఎంచుకున్న కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చే స్నేహితుడు, తన స్నేహితుడి లవ్‌ని సక్సెస్ చెయ్యడం కోసం అతను చేసే సాహసాలు..ఇదీ క్లుప్తంగా కథ. ఇలాంటి కథలు ఇది వరకు చాలా చూశాం. అయితే ఈ సినిమాలో కాశీ బ్యాక్‌డ్రాప్‌తో, అక్కడ వున్న సామాజిక దురాచారాన్ని జతచేసి కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. తమ కులం కాని వాడిని ప్రేమించిందన్న కోపంతో కన్న కూతుర్ని హతమార్చిన సంఘటనలు మనం పేపర్లలో చదివాం. అది మన తెలుగువారికి సంబంధించిన అంశం కాదు కాబట్టి ఆడియన్స్‌కి ఈ పాయింట్ కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువ. కూతుర్ని, ఆమె ప్రియుడ్ని చంపడానికి ఆ ఊరి పెద్దలు ప్రవర్తించే తీరు ఆడియన్స్‌కి రుచించదు. కథను బాగా రక్తి కట్టించే ప్రయత్నంలో దర్శకుడు ఆనంద్ కొన్ని విషయాల్లో అతి ప్రదర్శించాడనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
సినిమాటోగ్రఫీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం లేకపోవడం
కామెడీ లేకపోవడం
అతిగా అనిపించే సన్నివేశాలు
విశ్లేషణ: ఇద్దరు స్నేహితుల కథగా చిన్నతనం నుంచి స్టార్ట్ అయ్యే కథ ఫస్ట్ హాఫ్ వరకు కాస్త సరదాగా సాగినట్టు అనిపించినా, సెకండాఫ్‌కి వచ్చేసరికి సీరియస్‌గారి మారిపోతుంది. కాశీ బ్యాక్‌డ్రాప్‌లోకి వెళ్ళిన తర్వాత కథ రూపే మారిపోతుంది. ఒక దురాచారాన్ని చూపించే ప్రయత్నం జరుగుతుంది. సందీప్‌కిషన్, రాహుల్ రవీంద్రన్‌ల మధ్య నడిచే సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా, సెకండాఫ్‌లో పూర్తిగా తన స్నేహితుడ్ని కాపాడే ప్రాసెస్‌లోనే సినిమా నడుస్తుంది. సినిమాని క్లైమాక్స్‌కి రావడానికి చాలా టైమ్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హాస్పిటల్‌లోనే చాలా సీన్స్ వుండడం, అవి కూడా రిపీటెడ్‌గా అనిపించడం కూడా ఆడియన్స్‌కి బోర్ కొట్టిస్తుంది. ఫైనల్‌గా ప్రేమికులిద్దరినీ కలపడం కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. పేరుకి ఇది కొత్త తరహా సినిమా అని చెప్పొచ్చు కానీ, ఇందులో ఆడియన్స్‌ని థ్రిల్ చేసే అంశాలు ఏమీ లేవు. రొటీన్ కథ, రొటీన్ డైలాగ్స్, రొటీన్ ఫైట్స్..ఇలా ప్రతీది రొటీన్‌గా అనిపించే ఈ సినిమా అందరికీ నచ్చే అవకాశాలు తక్కువ. ఫైనల్‌గా చెప్పాలంటే కామెడీ, మంచి పాటలు, థ్రిల్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు, ట్విస్ట్‌లు కోరుకునే ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చకపోవచ్చు.
ఫినిషింగ్ టచ్: రొటీన్ కథ.. రొటీన్ సినిమా
సినీజోష్ రేటింగ్: 2.5/5