మారుతి టీమ్ వర్క్స్
పాండవుల్లో ఒకడు
నటీనటులు: వైభవ్, సోనమ్ బజ్వా, కరుణాకరన్,
వి.టి.వి.గణేష్, అర్జునన్, వెంకట్ సుందర్,
రోబో శంకర్, కార్తీక్ ప్రియదర్శన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్
సంగీతం: నటరాజన్ శంకరన్
ఎడిటింగ్: ఆంటోని
సమర్పణ: శంకర్
నిర్మాత: మారుతి
రచన, దర్శకత్వం: కార్తీక్ జి. క్రిష్
విడుదల తేదీ: 31.07.2015
ఒక సినిమా ప్రేక్షకాదరణ పొందాలంటే అందులో హంగులు, ఆర్భాటాల కంటే అసలు విషయం వుండాలని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. భారీ బడ్జెట్, భారీ స్టార్ కాస్ట్ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళలేవనడానికి చాలా ఉదాహరణలు వున్నాయి. లో బడ్జెట్‌లో తీసినా, అందులో నటించిన ఆర్టిస్టుల ఫేస్‌లు ఎవరికీ పరిచయం లేకపోయినా ఆ సినిమాలు సూపర్‌హిట్ అయిన సందర్భాలూ వున్నాయి. అలా ఈవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'పాండవుల్లో ఒకడు'. భారీ చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాదు, మంచి కథావస్తువు వున్న సినిమాలను నిర్మించే డైరెక్టర్ శంకర్ తమిళ్‌లో 'కప్పల్' పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తన ఎస్ పిక్చర్స్ బేనర్‌లో రిలీజ్ చేశాడు. తమిళ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి సూపర్‌హిట్ చేశారు. ఈ సినిమాలో హీరో వైభవ్ తప్ప మిగతా ఆర్టిస్టుల్లో ఒక్కరు కూడా మన ఆడియన్స్‌కి తెలియదు. మరి అలాంటి ఈ సినిమా తమిళ్‌లో సూపర్‌హిట్ అయి భారీగా కలెక్ట్ చెయ్యడానికి రీజన్ ఏమిటి? పాండవుల్లో ఒకడు ఆడియన్స్‌ని ఎలా ఎంటర్‌టైన్ చేశాడు? తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతవరకు రీచ్ అయింది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ: అనగనగా ఓ పల్లెటూరు. ఆ ఊళ్ళో వాసు(వైభవ్), కార్తీక్ సుబ్బరాజు, పట్టాభి, కనకరాజు, వెంకీ.. ఈ ఐదుగురు మంచి స్నేహితులు. మన సినిమాలో వీళ్ళే పాండవులు. వీరికి ఇన్‌స్పిరేషన్ శ్రీనన్న అనే లీడర్. అతని చుట్టూ ఎప్పుడూ స్నేహితులు వుంటారు. ఎప్పుడూ వారితో జల్సా చేస్తుంటాడు. అలాంటిది ఒకరోజు మాసిన గడ్డంతో పాండవులకు కనిపిస్తాడు. అప్పటివరకు ఫుల్‌గా ఎంజాయ్ చేసిన శ్రీనన్న తన స్నేహితులకు పెళ్ళిళ్ళు అయిపోవడంతో వారు విడిపోయారు. ఇది తెలుసుకున్న పాండవులు తమకు అలాంటి పరిస్థితి రాకూడదని, జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకోకూడదని చిన్నతనంలోనే అందరూ కలిసి ప్రమాణం చేస్తారు. అమ్మాయిలకు దూరంగా వుంటూ పెరిగిన ఈ ఐదుగురిలో వాసుకి మాత్రం అమ్మాయిలతో మాట్లాడడం, వారిని ట్రై చెయ్యడం అంటే ఇష్టం. తన స్నేహితులతో వుంటే అది కుదరని పని అని గ్రహించిన వాసు స్నేహితులకు ఒక సాకు చెప్పి పట్నం బయల్దేరతాడు. నెల్సన్(వి.టి.వి. గణేష్) అనే జల్సా పురుషుడి ఇంట్లో గెస్ట్‌గా దిగుతాడు. ఇక అక్కడి నుంచి అమ్మాయిల్ని లవ్ చెయ్యడమే పనిగా పెట్టుకుంటాడు. అనుకోకుండా దీపిక(సోనమ్ బజ్వా) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. ఉద్యోగం కోసం సిటీ వెళ్ళిన వాసు గురించి ఎలాంటి సమాచారం తెలియని అతని స్నేహితులు సిటీ వస్తారు. ఇక అప్పటి నుంచి వాసుకి కష్టాలు మొదలవుతాయి. ప్రేమ, పెళ్ళి అంటే ఇష్టం లేని స్నేహితులకు వాసు ప్రేమ విషయం తెలిసిందా? దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? స్నేహితుల కోసం వాసు తన ప్రియురాల్ని వదులుకున్నాడా? చివరికి వీరిద్దరి ప్రేమకథ సుఖాంతం అయిందా? అనేది మిగతా కథ.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్: ఈ సినిమాలో వైభవ్ తప్ప తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఆర్టిస్టులు ఎవ్వరూ లేరు. పాండవుల్లో ఒకడుగా వైభవ్ పెర్‌ఫార్మెన్స్ బాగుంది. స్నేహితులకు భయపడుతూ అమ్మాయిలకు లైన్ వేసే సందర్భాల్లో, తను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న విషయం స్నేహితులకు తెలిసిపోతుందని కంగారు పడే సందర్భాల్లో, ప్రేమని, స్నేహాని వదులుకోలేని పరిస్థితుల్లో వైభవ్ నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. తన క్యారెక్టర్ ద్వారా వచ్చే కామెడీని ప్రేక్షకుల వరకు తీసుకురావడంలో వైభవ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. వాసుకి వెల్‌విషర్‌గా వుండే నెల్సన్ పాత్రలో వి.టి.వి.గణేష్ చక్కని వినోదాన్ని అందించాడు. అతను కనిపించిన అన్ని సీన్స్ ఆడియన్స్‌కి నవ్వు తెప్పించేవిగా వున్నాయి. ఇక వాసు ఫ్రెండ్స్‌గా నటించిన ఆర్టిస్టులంతా తమ తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. దీపికగా సోనమ్ బజ్వా నటన కూడా అందర్నీ అలరిస్తుంది. గ్లామర్ పరంగా, పెర్‌ఫార్మెన్స్ పరంగా సోనమ్ మంచి మార్కులు కొట్టేసింది.
టెక్నీషియన్స్: చాలా నేచురల్‌గా వుండే సీన్స్‌ని సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్ అందంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. పాటల్ని చాలా అందంగా చిత్రీకరించాడు. నటరాజన్ శంకరన్ సంగీతం విషయానికి వస్తే పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో క్యారెక్టర్స్‌లోని ఎమోషన్స్‌ని క్యారీ చెయ్యగలిగాడు. డైరెక్టర్ కార్తీక్ జి. క్రిష్ తను అనుకున్న పాయింట్‌ని ఆడియన్స్ రీచ్ అయ్యేలా చెయ్యడంలో, తను రాసుకున్న సీన్స్ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించడంలో అతని కృషి కనిపిస్తుంది. కామెడీ కోసం సెపరేట్‌గా సీన్స్ అంటూ ఏమీ క్రియేట్ చెయ్యకుండా కథలోనే కామెడీని పండించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అయితే హీరో ప్రేమ వైపు వెళ్ళకుండా, తమ దారిలోకి తెచ్చుకునేందుకు స్నేహితులు చేసే కొన్ని చేష్టలు కాస్త ఇబ్బంది కలిగించేవిగా వున్నాయి. ఆయా సీన్స్‌లో కామెడీ మోతాదు మించిందని చెప్పొచ్చు. చివరి అరగంట వచ్చే సీన్స్‌లో వచ్చే కామెడీ అంత ఆహ్లాదకరంగా లేదు. ఇక క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే హీరో ఫ్రెండ్స్‌ని ఆడియన్స్‌కి పరిచయం చేసేటపుడు ఒక్కొక్కరికి ఒక్కో వీక్‌నెస్ వున్నట్టుగా చెప్పిన డైరెక్టర్ వారు పెద్దవారు అయిన తర్వాత ఆ వీక్‌నెస్‌లను చూపించడం మర్చిపోయినట్టున్నాడు. అన్నీ మర్చిపోయే ఒక ఫ్రెండ్, ఒకటి చెప్తే మరొకటి చేసే మరో ఫ్రెండ్.. ఇలా వారి వారి అలవాట్లను పెద్దయ్యాక చూపించకపోవడం వల్ల వారి క్యారెక్టర్స్ గురించి చిన్నప్పుడు చెప్పడం వృధా అయింది.
విశ్లేషణ: చిన్నప్పటి పాండవుల ఇంట్రడక్షన్, పెద్దయ్యాక పెళ్ళి చేసుకోకూడదని అందరూ కలిసి ప్రమాణం చెయ్యడం, దానికి తగ్గట్టుగానే ఈ ఐదుగురూ అమ్మాయిలకు దూరంగా వుండడం, హీరో మాత్రం అప్పుడప్పుడు అమ్మాయిలకు సైట్ కొట్టడం వంటి సీన్స్, ఫ్రెండ్స్‌కి మస్కా కొట్టి సిటీకి వచ్చిన తర్వాత వాసు ఎదుర్కొనే ఇబ్బందులు, ఆ తర్వాత ఒక అమ్మాయితో లవ్ ఎఫెయిర్ వీటన్నింటితో ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా నడుస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి వాసు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న ఫ్రెండ్స్ అతన్ని, ఆమె ప్రియురాల్ని ఇబ్బంది పెట్టే సీన్స్‌తో సెకండాఫ్ రన్ అవుతుంది. అప్పటివరకు నవ్వు తెప్పించే డైలాగ్స్‌తో, రొమాంటిక్ సీన్స్‌తో నడిచే సినిమా ప్రీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఓవరాక్షన్ వల్ల కాస్త గందరగోళం ఏర్పడుతుంది. ఫస్ట్ హాఫ్‌లో వున్న ఎంటర్‌టైన్‌మెంట్ సెకండాఫ్‌కి వచ్చే సరికి తగ్గింది. క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకునేలా వుండదు. అయితే ఈమధ్యకాలంలో ఇలాంటి నేచురల్ డైలాగ్స్‌తో ఆడియన్స్‌ని నవ్వించిన సినిమా రాలేదని చెప్పాలి. ఫైనల్‌గా చెప్పాలంటే యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. జనరల్‌గా యూత్‌లో జరిగే సంభాషణల్నే ఈ సినిమాలో వాడడం జరిగింది. అందువల్ల సినిమా సరదాగా నడుస్తూ అందరికీ వినోదాన్ని పంచింది. మంచి కామెడీని ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని చూడొచ్చు.
ఫినిషింగ్ టచ్: పాండవుల్లో ఒకడు కాదు అందరూ నవ్విస్తారు
సినీజోష్ రేటింగ్: 2.75/5