గీతా ఆర్ట్స్, యు.వి. క్రియేషన్స్
భలే భలే మగాడివోయ్
తారాగణం: నాని, లావణ్య త్రిపాఠి, మురళీశర్మ,
నరేష్, ప్రవీణ్, వెన్నెల కిషోర్, అజయ్, సితార,
శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫి
సంగీతం: గోపిసుందర్
నిర్మాత: బన్ని వాసు
రచన, దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: 04.09.2015
అష్టాచమ్మాతో హీరోగా పరిచయమై భీమిలీ కబడ్డీ జట్టు, పిల్ల జమిందార్, అలా మొదలైంది వంటి సూపర్‌హిట్ చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నాని ఈగతో ఓ రేంజ్ హీరో అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత చేసిన ఏడెనిమిది సినిమాలు వరసగా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, యు.వి. క్రియేషన్స్ పతాకాలపై బన్ని వాసు నిర్మించిన భలే భలే మగాడివోయ్ చిత్రంతో మరోసారి తన లక్‌ని పరీక్షించుకునేందుకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. మారుతి కాంబినేషన్‌లో ఫస్ట్ టైమ్ నాని చేసిన ఈ సినిమా అతనికి సూపర్‌హిట్‌ని అందించిందా? భలే భలే మగాడివోయ్ అనే డిఫరెంట్ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసింది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ: ప్రతి మనిషికీ మతిమరుపు వుంటుంది. అది కొన్ని సందర్భాల్లో ఎక్కువగా వుండొచ్చు, కొన్ని సందర్భాల్లో తక్కువగా వుండొచ్చు. అస్సలు మతిమరుపు లేని మనిషి భూమ్మీద వుండడు. కానీ, మతిమరుపు తారాస్థాయిలో వున్నవాళ్ళూ మన మధ్య వుంటారు. అలాంటి వారిలో నెంబర్ వన్‌గా చెప్పుకోదగిన వాడు ఈ సినిమాలో హీరో లక్కీ(నాని). ఒక పనిమీద వెళ్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా డిస్ట్రబ్ చేసే అసలు పని మర్చిపోయే విచిత్రమైన క్యారెక్టర్ లక్కీది. అలాంటి లక్కీకి అతని తండ్రి(నరేష్) ఓ పెళ్ళి సంబంధం తీసుకొస్తాడు. అమ్మాయి తండ్రి(మురళీశర్మ) అతని ఆఫీస్‌కి వస్తున్నాడని, కలుసుకోమని లక్కీకి చెప్తాడు లక్కీ తండ్రి. అమ్మాయి తండ్రి లక్కీ కోసం ఆఫీస్‌లో వెయిట్ చేస్తుంటాడు. ఈ విషయం మర్చిపోతాడు లక్కీ. తర్వాత తన తప్పు తెలుసుకొని కలిసే ప్రయత్నం చేస్తాడు. కానీ, అప్పుడూ తన మతిమరుపుతో అతన్ని కలవలేకపోతాడు. దీంతో లక్కీ అంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుంది అమ్మాయి తండ్రికి. లక్కీ లాంటి వేస్ట్ ఫెలోని జీవితంలో చూడలేదని అతని తండ్రితో చెప్తాడు. కట్ చేస్తే డాన్స్ టీచర్‌గా పనిచేసే నందన(లావణ్య త్రిపాఠి)ని రోడ్డు మీద చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు లక్కీ. కొన్ని మంచి పనులు చెయ్యడం ద్వారా లక్కీ అంటే నందనకి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత అది ప్రేమగా మారుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే లక్కీ అంటే ఇష్టపడని మురళీశర్మ కూతురే నందన. ఈ విషయం తెలుసుకున్న లక్కీ ఎలా రియాక్ట్ ఆయ్యాడు? నందన తండ్రికి తనపై వున్న బ్యాడ్ ఇంప్రెషన్ పోగొట్టడానికి ఎలాంటి ట్రిక్స్ ప్లే చేశాడు? చివరికి తమ పెళ్ళికి నందన తండ్రిని ఒప్పించగలిగాడా? అనేది మిగతా కథ.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్: మతిమరుపుతో తాను ఇబ్బంది పడుతూ నలుగురినీ ఇబ్బంది పెట్టే లక్కీ క్యారెక్టర్ నాని పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. నటిస్తున్నట్టు కాకుండా తన నేచురల్ పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. కామెడీ సీన్స్‌లో, లవ్ సీన్స్‌లో, ఎమోషనల్ సీన్స్‌లో తనదైన పెర్‌ఫార్మెన్స్‌తో అలరించాడు. లక్కీ తండ్రిగా నరేష్ చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. చాలా కాలం తర్వాత అతనికి ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా నవ్వించే క్యారెక్టర్ దొరికింది. దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం చేసుకున్నాడు. హీరోయిన్ తండ్రిగా మురళీశర్మ చాలా హుందాగా పెర్‌ఫార్మ్ చేశాడు. ఇప్పటివరకు ఎక్కువగా నెగెటివ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన మురళీశర్మకి ఈ క్యారెక్టర్ చెయ్యడం ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి. తను సీరియస్‌గా నటిస్తూనే కొన్ని సీన్స్‌లో నవ్వు తెప్పించాడు. హీరో ఫ్రెండ్‌గా ప్రవీణ్ రెగ్యులర్‌గా అన్ని సినిమాల్లో చేసే క్యారెక్టరే ఈ సినిమాలోనూ చేశాడు. కాకపోతే ఎక్కువ సీన్స్‌లో కనిపించే పాత్ర అతనిది. ఇక సెకండాఫ్‌లో ఎంటర్ అయ్యే వెన్నెల కిషోర్ కూడా తన కామెడీతో అందర్నీ నవ్వించే ప్రయత్నం చేశాడు. నాని, వెన్నెల కిషోర్ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ ఆడియన్స్‌ని కడుపుబ్బ నవ్వించాయి. హీరోయిన్ పెళ్ళి చేసుకోవాలని ట్రై చేసే పోలీస్ ఆఫీసర్ అజయ్ క్యారెక్టర్‌లో అజయ్ తనదైన పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. మిగతా క్యారెక్టర్లలో సితార, సత్యకృష్ణన్, శ్రీనివాసరెడ్డి ఫర్వాలేదనిపించారు.
టెక్నీషియన్స్: ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కన్నుల పండువగా వుండడమే కాకుండా కలర్‌ఫుల్‌గా కనిపించడానికి కారణం నిజార్ షఫీ ఫోటోగ్రఫీ. ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో కేర్ తీసుకొని చిత్రీకరించినట్టు ఔట్‌పుట్ చూస్తే తెలిసిపోతుంది. లైటింగ్, ఫ్రేమ్స్ అన్నీ పర్‌ఫెక్ట్‌గా వుండడం, కళ్ళకు ఇబ్బంది కలిగించే సీన్స్ ఏవీ లేకపోవడం వల్ల రెండున్నర గంటల సినిమాని ప్రశాంతంగా చూసే అవకాశం ఆడియన్స్‌కి కలిగించాడు నిజార్. గోపీసుందర్ మ్యూజిక్ కూడా సినిమాకి బాగానే ప్లస్ అయింది. పాటలన్నీ వినసొంపుగా వున్నాయి. అలాగే మూడ్‌కి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని కూడా చక్కగా చేశాడు. అయితే అక్కడక్కడా రణగొణ ధ్వనులు వినిపించినప్పటికీ ఓవరాల్‌గా మ్యూజిక్ బాగుంది. డైరెక్టర్ మారుతి గురించి చెప్పాలంటే అతను ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఎక్కువ కష్టపడి రాసుకుంది ఈ సబ్జెక్టే అయి వుంటుంది. హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌ని డిఫరెంట్‌గా డిజైన్ చెయ్యడం, వాళ్ళిద్దరూ మొదటిసారి కలుసుకునే సిట్యుయేషన్ చాలా నేచురల్‌గా చూపించడం, హీరోయిన్ తండ్రి క్యారెక్టర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ క్యారెక్టర్ ద్వారా క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఇవ్వడం, కామెడీ కోసం సెపరేట్‌గా సీన్స్ క్రియేట్ చెయ్యకుండా కథలోనే కామెడీ పుట్టేలా జాగ్రత్తలు తీసుకోవడం.. వంటి విషయాల్లో మారుతి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. చాలా డైలాగ్స్‌కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో మారుతి సినిమాలంటే యూత్‌కి నచ్చే సీన్స్, యూత్ మెచ్చే డైలాగ్స్ వుంటాయన్న పేరు వుంది. ఇప్పుడా పేరుని భలే భలే మగాడివోయ్ చిత్రం చెరిపేసింది. ఎలాంటి వల్గర్ డైలాగ్స్‌గానీ, వల్గర్ సీన్స్ గానీ లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో మారుతి సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్‌ని ఎంటర్‌టైనింగ్ నడిపిస్తూ సెకండాఫ్‌కి వచ్చే సరికి ఎంటర్‌టైన్‌మెంట్ పాలుని పెంచి కథని స్పీడ్‌గా నడిపించాలని ట్రై చేశాడు. కానీ, సెకండాఫ్‌లోని కొన్ని అనవసరమైన సీన్స్, ల్యాగ్ వున్న సీన్స్, కథను ముందుకు వెళ్లనివ్వని సీన్స్‌తో కాస్త బోర్ కొట్టించాడు.
విశ్లేషణ: హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్‌ని హీరో చూడడం, ఆమెతో పరిచయం పెంచుకోవడానికి హీరో చేస్తే ప్రయత్నాలు.. రొటీన్‌గా వుండే ఇలాంటి సీన్స్‌తో, కొంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. కథ స్పీడ్‌గానే వున్నప్పటికీ ఎంతో సేపటికి ఇంటర్వెల్ అయిందనిపిస్తుంది. సెకండాఫ్‌లో కామెడీ పాలు పెంచడంతో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ కామెడీ చెయ్యాలన్న ప్రయత్నంలో కథను పట్టించుకోకపోవడంతో కథ అక్కడక్కడే చక్కర్లు కొట్టినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ తండ్రి చివర్లో ఇచ్చిన ట్విస్ట్‌తో క్లైమాక్స్ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంటుందని ఊహించిన ఆడియన్స్‌కి నిరాశ ఎదురవుతుంది. ఒక కామెడీ ఫైట్‌తో సినిమా ముగుస్తుంది. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కొత్తదే అయినప్పటికీ దానికి అందరూ కనెక్ట్ అవ్వరనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. ఎందుకంటే మతిమరుపు వల్ల హీరో చేసే పొరపాట్లకు చూసే ఆడియన్స్‌కి కూడా ఇరిటేషన్ వస్తుంది. ఇలాంటి మతిమరుపు మనుషులు వుంటారా? అనే డౌట్ కూడా వస్తుంది. నిజంగానే కొన్ని మతిమరుపు సీన్స్‌ని అసహజంగా చూపించారు. మంచి పాయింట్‌తో, ఆసక్తి కలిగించే కథనంతో స్టార్టింగ్ టు ఎండింగ్ కేవలం నవ్వుకోవడానికే చేసిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఫైనల్‌గా చెప్పాలంటే చాలా కాలం తర్వాత నాని చేసిన ఒక మంచి సినిమా ఇది. కమర్షియల్‌గా కూడా ఈ సినిమాకి బాగా వర్కవుట్ అయ్యే అవకాశాలు వున్నాయి. కుటుంబ సమేతంగా అందరూ చూసి ఎంజాయ్ చెయ్యదగిన సినిమా భలే భలే మగాడివోయ్.
ఫినిషింగ్ టచ్: భలే భలే కామెడీరోయ్!
సినీజోష్ రేటింగ్: 3.25/5