Advertisementt

సినీజోష్‌ రివ్యూ: హోరా హోరీ

Fri 11th Sep 2015 07:04 AM
telugu movie hora hori,hora hori movie review,hora hori cinejosh review,hora hori director teja  సినీజోష్‌ రివ్యూ: హోరా హోరీ
సినీజోష్‌ రివ్యూ: హోరా హోరీ
Advertisement
Ads by CJ

శ్రీ రంజిత్‌ మూవీస్‌ 

హోరా హోరీ 

తారాగణం: దిలీప్‌, దక్ష, చస్వా, డి.ఎస్‌.రావు, 

రాఘవ, సీమ తదితరులు 

సినిమాటోగ్రఫీ: దీపక్‌ భగవంత్‌ 

ఎడిటింగ్‌: జునైద్‌ 

సంగీతం: కళ్యాణ్‌ కోడూరి 

సమర్పణ: డి.సురేష్‌బాబు 

నిర్మాత: కె.ఎల్‌.దామోదర ప్రసాద్‌ 

రచన, దర్శకత్వం: తేజ 

విడుదల తేదీ: 11.09.2015 

తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మూవీకి ముందు వచ్చిన ప్రేమకథలు వేరు, చిత్రం తర్వాత వచ్చిన ప్రేమకథలు వేరు. చిత్రంతో ఒక ట్రెండ్‌ని సెట్‌ చేశాడు తేజ. దాన్ని ఫాలో అవుతూ చాలా సినిమాలు వచ్చాయి. చిత్రం తర్వాత తేజ చేసిన సినిమాలు కూడా అదే ఫార్ములాలో వుండేవి. నువ్వునేను, జయం, ధైర్యం, జై వంటి సినిమాలతో యూత్‌ని విశేషంగా ఆకట్టుకున్న తేజ ఆ తర్వాత చేసిన సినిమాలతో పరాజయాల్ని చవిచూశాడు. కొంత గ్యాప్‌ తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన మరో ప్రేమకథా చిత్రం హోరా హోరీ (ఫైట్‌ ఫర్‌ లవ్‌). దిలీప్‌, దక్షలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ డి.సురేష్‌బాబు సమర్పణలో శ్రీరంజిత్‌ మూవీస్‌ పతాకంపై కె.ఎల్‌.దామోదరప్రసాద్‌ నిర్మించిన చిత్రం హోరా హోరీ. గ్యాప్‌ తీసుకొని ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ ఈ చిత్రం ద్వారా ఎలాంటి కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. పదిహేను సంవత్సరాల క్రితం ట్రెండ్‌ సెట్టర్‌గా పేరు తెచ్చుకున్న తేజ ఇప్పటి ఆడియన్స్‌ పల్స్‌ తెలుసుకొని ఈ సినిమా చేశాడా? ఈ ప్రేమకథా చిత్రం యూత్‌ని ఎంతవరకు ఆకట్టుకుంది? సినిమాకి ఎలాంటి టాక్‌ వచ్చింది? అనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

కథ: విలన్‌ బసవేశ్వర్‌(చస్వా) ఎంట్రీతో సినిమా స్టార్ట్‌ అవుతుంది. నడిరోడ్డు మీద భారాభర్తల్ని చంపేసి తాపీగా బైక్‌ మీద వెళ్ళిపోతాడు. ఈ కేసును డీల్‌ చేస్తున్న ఎసిపికి 25 లక్షలు ఇచ్చి తప్పించుకోవాలనుకుంటాడు బసవేశ్వర్‌. తన చెల్లెలు పెళ్ళి కోసం 25 లక్షలు లంచం తీసుకొని బసవేశ్వర్‌ని విదిలేస్తాడు ఎసిపి. ఈ ప్రాసెస్‌లో ఎసిపి చెల్లెలు మైథిలి(దక్ష)ను చూస్తాడు బసవేశ్వర్‌. అప్పటి వరకు పెళ్ళి ఆలోచనలేని బసవ ఆమెను పెళ్ళి చేసుకోవాలని డిసైడ్‌ అవుతాడు. పెళ్ళికొడుకుని చంపయినా మైథిలిని పెళ్ళి చేసుకుంటానంటాడు. ఎసిపి, అతని తండ్రి(డి.ఎస్‌.రావు) దాన్ని వ్యతిరేకిస్తారు. చెప్పినట్టుగానే పెళ్ళి పీటల మీదే పెళ్ళికొడుకుని చంపిస్తాడు బసవ. ఆ తర్వాత మైథిలిని చూసుకోవడానికి వచ్చిన వాడిని కూడా లేపేస్తాడు. ఇవన్నీ చూసిన మైథిలి షాక్‌లోకి వెళ్ళిపోయి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్ళి మాట తీసుకొస్తే వణికిపోతుంది. మైథిలి సాధారణ స్థితికి రావాలంటే స్థల మార్పిడి అవసరమని డాక్టర్‌ చెప్తాడు. దాంతో మైథిలిని కర్ణాటకలోని తమ బంధువుల ఇంటిలో వుంచుతారు. మైథిలి ఎక్కడ వుందో తెలియక టెన్షన్‌ పడుతుంటాడు బసవ. అక్కడ ఊళ్ళో నలుగురితో కలిసినట్టు వుంటుందని మైథిలిని కాలేజీకి పంపిస్తారు. ఆ ఊరిలో ప్రింటింగ్‌ ప్రెస్‌ నడుపుకునే స్కంధ(దిలీప్‌) మైథిలికి పరిచయమవుతాడు. అతని స్నేహం వల్ల ఆమె కోలుకొని మామూలు స్థితికి వస్తుంది. హైదరాబాద్‌లో వున్న బసవ ఒక హత్య చేయడానికి ఆ ఊరికి వస్తాడు. అంతకుముందే స్కంధ వల్ల సాయం పొందిన బసవ అతని ప్రేమకథను తెలుసుకొని ప్రేమికుల్ని కలపడానికి ఏమైనా చేస్తానని స్కంధకి మాట ఇస్తాడు. బసవ ప్రేమించిన అమ్మాయి, స్కంధ ప్రేమిస్తున్న అమ్మాయి ఒక్కరే. ఈ విషయం తెలుసుకున్న బసవ ఏం చేశాడు? బసవ నుంచి మైథిలిని కాపాడటానికి స్కంధ ఏం చేశాడు? మైథిలిని రక్షించుకోవడానికి స్కంధ ఎలాంటి పోరాటం చేశాడు? చివరికి స్కంధ, మైథిలిల వివాహం జరిగిందా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన దిలీప్‌కి సరైన క్యారెక్టర్‌ పడలేదు. దానికి తగ్గట్టుగానే ఆర్టిస్టుగా తనని తాను ప్రూవ్‌ చేసుకునే అవకాశం కూడా ఎక్కడా రాలేదు. హీరోయిన్‌ దక్ష గ్లామరస్‌గా అక్కడక్కడా కనిపించినప్పటికీ కొన్ని యాంగిల్స్‌లో ఆమెను చూడలేం అన్నట్టుగా చూపించారు. అది చాలదన్నట్టు ఆమె వాయిస్‌తోనే డబ్బింగ్‌ చెప్పించడం కూడా సినిమాకి చాలా మైనస్‌ అయింది. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఓకే అనిపించుకుంది దక్ష. ఇక విలన్‌గా నటించిన చస్వా ఆ క్యారెక్టర్‌ని చాలా పెర్‌ఫెక్ట్‌ చెయ్యగలిగాడు. సీరియస్‌గా వుంటూ, అప్పకప్పుడు కామెడీ చేస్తూ తన క్యారెక్టర్‌లోని వేరియేషన్స్‌ చూపించే ప్రయత్నం చేశాడు. మిగతా క్యారెక్టర్లలో సీమ, డి.ఎస్‌.రావు, ఎం.వి.ఎస్‌.హరనాథరావు, ఇతర నటీనటులు తమ అతి నటనతో ప్రేక్షకులకు విసుగు పుట్టించారు. 

విశ్లేషణ: హోరా హోరీ అనేది ఒక పాత చింతకాయ పచ్చడిలా వండాడు తేజ. పదిహేను సంవత్సరాల క్రితం తను చేసిన లవ్‌ స్టోరీలు ఇప్పుడు మళ్ళీ తీసి చూడమంటే అమాయకంగా చూసే ఆడియన్స్‌ ఇప్పుడు లేరని తేజ గ్రహించాలి. సినిమాలోని ప్రతి సీన్‌ కొత్తగా వుంటుందని సినిమా రిలీజ్‌కి ముందు చెప్పాడు తేజ. సినిమా చూసిన తర్వాత ప్రతి సీన్‌ రొటీన్‌గానే వుందనిపిస్తుంది తప్ప ఎక్కడా కొత్తదనం కనిపించదు. కథలోగానీ, కథనంలోగానీ, డైలాగ్స్‌లోగానీ, సిట్యుయేషన్స్‌లోగానీ, బ్యాక్‌డ్రాప్‌లోగానీ ఎలాంటి కొత్తదనం లేని సినిమా ఇది. సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఎండింగ్‌ వరకు ఏ సీన్‌కి, ఆ సీన్‌ అన్నట్టుగా ముక్కలు ముక్కలుగా వుంటుంది. ఆ ముక్కలను ఇష్టమొచ్చినట్టు అతికించడం వల్ల చూసే ఆడియన్స్‌ సహనం కోల్పోతారు. ఈ కథ చాలా చిన్నది సిటీలో విలన్‌ ప్రేమించిన అమ్మాయి ఓ పల్లెటూరికి వచ్చి అక్కడ ఓ అబ్బాయి ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఆ ఊరికి వచ్చిన విలన్‌కి, హీరోకి మధ్య పోరు జరుగుతుంది. దీన్ని రెండు గంటల నలభై నిముషాల సినిమాగా మలిచేందుకు, క్లైమాక్స్‌ వరకు ఆడియన్స్‌ని కూర్చోబెట్టేందుకు పడరాని పాట్లు పడ్డాడు. రొటీన్‌ కథకి పసలేని మాటలు, నవ్వు తెప్పించని కామెడీ ఏ సందర్భంలోనూ వర్కవుట్‌ అవ్వలేదు. 

ఆ పల్లెటూళ్ళో రెండు ఇంటర్నెట్‌ సెంటర్ల మధ్య టైపింగ్‌ పోటీలు పెట్టడం, హీరోయిన్‌ ఒక్క వేలుతోనే టైప్‌ చెయ్యడం, విలన్‌ ఎప్పుడూ సినిమాలు చూస్తూ అనుచరులతో కామెడీ చెయ్యడం, పేరుకి హీరో అయినా ఎక్కడా హీరోయిజం అనేది చూపించకపోవడం వంటి అంశాలు సినిమాకి పెద్ద మైనస్‌లుగా మారాయి. దీపక్‌ భగవంత్‌ అందించిన ఫోటోగ్రఫీ, కళ్యాణ్‌ కోడూరి మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, పెద్దాడమూర్తి పాటలు ఎంత బాగున్నా అవి సినిమాని కాపాడలేకపోయాయి. పేరుకి దిలీప్‌ హీరో అయినా అతని హీరోయిజం క్లైమాక్స్‌లో తప్ప ఎక్కడా కనిపించదు. ఒక విధంగా విలన్‌ బసవేశ్వరే హీరోలా అనిపిస్తాడు. తన ప్రేమను సాధించుకోవడం కోసం ఎంతో మందిని చంపేస్తాడు, తన ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు, తన ప్రేమను ఒప్పుకోకపోతే చంపేస్తాడు. 

జయం లాంటి సినిమా వచ్చి 15 సంవత్సరాలు దాటుతున్నా ఇంకా అక్కడే వున్నాడు తేజ. ఈ పదిహేనేళ్ళలో ప్రేక్షకుల అభిరుచుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కథలోంచి వచ్చే కామెడీనే ఇష్టపడుతున్నారు. సహజత్వానికి దగ్గరగా వుండే కథలకు, కథనాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రతి సినిమా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో వుండాలని కోరుకుంటున్నారు. తేజ 15 సంవత్సరాల క్రితం ఆడియన్స్‌ పల్స్‌ తెలుసుకొని దానికి తగ్గట్టుగానే సినిమాలు తీసి హిట్‌ కొట్టాడు. కానీ, ఇప్పుడు కూడా ఆ పల్స్‌నే నమ్ముకున్న తేజ హోరా హోరీ చిత్రాన్ని కూడా పదిహేను సంవత్సరాల క్రితం ఎలా తీశాడో అలాగే తీశాడు తప్ప ప్రజెంట్‌ జనరేషన్‌ గురించి ఆలోచించలేదు. ఈ చిత్రంలోని మైనస్‌ల గురించి చెప్పుకోవాలంటే చెప్పుకోలేనన్ని వున్నాయి. అలా మొదలైంది, అంతకుముందు ఆ తరువాత లాంటి మంచి సినిమాలు నిర్మించిన దామోదరప్రసాద్‌కి, సమర్పకుడు డి.సురేష్‌బాబుకి ఈ కథలో నచ్చిన అంశాలు ఏమిటో? ఎందుకు ఈ సినిమా తీశారు? అనే ప్రశ్నలు మనల్ని వెంటాడుతుంటాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఇది ఏ క్లాస్‌కీ నచ్చని సినిమా. 

ఫినిషింగ్‌ టచ్‌: పైత్యానికి పరాకాష్ట హోరా హోరీ

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ