Advertisementt

సినీజోష్‌ రివ్యూ: మయూరి

Fri 18th Sep 2015 04:33 AM
telugu movie mayuri,nayanathara movie mayuri,mayuri movie review,mayuri cinejosh review  సినీజోష్‌ రివ్యూ: మయూరి
సినీజోష్‌ రివ్యూ: మయూరి
Advertisement
Ads by CJ

సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ 

మయూరి 

తారాగణం: నయనతార, ఆరి, అంజాద్‌ఖాన్‌, మైమ్‌ గోపీ, 

లక్ష్మీప్రియ, రోబో శంకర్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌ 

ఎడిటింగ్‌: టి.ఎస్‌.సురేష్‌ 

సంగీతం: రాన్‌ ఎథన్‌ యోహాన్‌ 

నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు 

రచన, దర్శకత్వం: అశ్విన్‌ శరవణన్‌ 

విడుదల తేదీ: 17.09.2015 

ప్రస్తుతం హార్రర్‌ సినిమాలకు, హార్రర్‌ కామెడీ సినిమాలకు మినిమం గ్యారెంటీ వుందన్నది నిర్మాతల ఆలోచన. దానికి తగ్గట్టుగానే అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. కొన్ని డబ్బింగ్‌ ద్వారా వచ్చిన సినిమాలు వున్నాయి. నిర్మాత సి.కళ్యాణ్‌కి హార్రర్‌ సినిమాలు బాగా కలిసి వచ్చాయి. చంద్రకళతో హార్రర్‌ సినిమాలను స్టార్ట్‌ చేసి పిశాచి, డిమోంటె కాలని వంటి సినిమాలతో సక్సెస్‌ అయిన సి.కళ్యాణ్‌ లేటెస్ట్‌గా నయనతార ప్రధాన పాత్రలో మాయ పేరుతో తమిళ్‌లో రూపొందిన చిత్రాన్ని తెలుగులో మయూరిగా విడుదల చేశారు. అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో రూపొందిన మయూరి ప్రేక్షకుల్ని ఎంతవరకు భయపెట్టగలిగింది? హార్రర్‌ మూవీస్‌తో వరస విజయాలు సాధిస్తున్న సి.కళ్యాణ్‌కి ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ని అందించింది? నయనతార మయూరిగా ఆడియన్స్‌ని ఎంతమేర అలరించింది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథ: మాయవనం అనే ఒక ఆడవి ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటన నేపథ్యంలో చీకటి అనే ఒక హార్రర్‌ మూవీని నిర్మిస్తారు. ఆ అడవిలో అసైలమ్‌ పేరుతో కొంతమంది మానసిక వైకల్యం కలవారికి వైద్యం చేస్తుంటారు. మాయా మాథ్యూస్‌ అనే ఒక మహిళను అక్కడ చేర్పిస్తారు. ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత మాయ చనిపోతుంది. 24 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. ఈ సంఘటన ఆధారంగా రూపొందిన చీకటి సినిమాకి బిజినెస్‌ అవ్వదు. సినిమా పబ్లిసిటీ కోసం ఒంటరిగా ఈ సినిమాని చూసిన వారికి 5 లక్షలు బహుమానం ఇస్తామని ప్రకటిస్తారు. ఒంటరిగా సినిమా చూడడానికి ప్రయత్నించిన ఒక ప్రొడ్యూసర్‌ చనిపోతాడు. ఇదిలా వుంటే మయూరి ఒక నటి. భర్త నుంచి వేరైన తర్వాత కూతురితో కలిసి వుంటుంది. ఆ ఇంట్లో కొన్ని సంఘటనలు ఆమెను భయపెడతాయి. ఎవరో ఆమెను గమనిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నటిగా మంచి అవకాశాల కోసం ఎదురుచూసే మయూరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. దాంతో చీకటి చిత్రాన్ని ఒంటరిగా చూడడానికి సిద్ధపడుతుంది. చీకటి చిత్రాన్ని మయూరి భయపడకుండా చూడగలిగిందా? మాయవనంలో జరిగిన సంఘటనలకు, మయూరికి ఏదైనా సంబంధం వుందా? అసలు మాయా మాథ్యూస్‌ ఎవరు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌: నయనతార మయూరిగా చక్కని నటనను ప్రదర్శించింది. బిడ్డకు తల్లిగా ఒక కొత్త క్యారెక్టర్‌లో పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయింది. మిగతా పాత్రల్లో ఆరి, అంజాద్‌ఖాన్‌, మైమ్‌ గోపీ, లక్ష్మీప్రియ, రోబో శంకర్‌ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నీషియన్స్‌ విషయానికి వస్తే సత్యన్‌ సూర్యన్‌ ఫోటోగ్రఫీ గురించి ముందుగా చెప్పుకోవాలి. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ ఎక్కడా రిచ్‌నెస్‌ అనేది తగ్గకుండా ప్రతి సీన్‌ని అద్భుతంగా చూపించాడు. సీన్‌లోని మూడ్‌కి తగిన లైటింగ్‌తో ఆకట్టుకునే విధంగా చిత్రీకరించాడు. సంగీత దర్శకుడు రాన్‌ ఎథన్‌ యోహాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగానే చేసినప్పటికీ అక్కడక్కడ శృతి మించడంతో రణగొణ ధ్వనుల్లా వినిపించాయి. ఓవరాల్‌గా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగానే చేశాడు. ఎడిటర్‌ సురేష్‌ ఎడిటింగ్‌ బాగున్నప్పటికీ సెకండాఫ్‌ చాలా లెంగ్తీగా, అనవసరమైన సీన్స్‌తో సినిమాని సాగదీసినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొంత కత్తెర వేసినట్టయితే స్పీడ్‌ వుండేది. డైరెక్టర్‌ అశ్విన్‌ శరవణన్‌ విషయానికి వస్తే టేకింగ్‌, ఆడియన్స్‌ని భయపెట్టే సీన్స్‌, దానికి తగ్గట్టుగా ఎంచుకున్న సౌండ్‌ ఎఫెక్ట్స్‌ అన్నీ బాగానే వున్నాయి. కానీ, మయూరికి, మాయా మాథ్యూస్‌కి వున్న రిలేషన్‌ని ఆకట్టుకునే విధంగా చెప్పలేకపోయాడు. చాలా సాదా సీదాగా మయూరి మాయా మాథ్యూస్‌ కూతురు అని తేల్చేశాడు. ఆ విషయం చెప్పడానికి చాలా టైమ్‌ తీసుకున్నాడు. సెకండాఫ్‌లో దాదాపు అరగంట పాటు మయూరికి, మాయకి వున్న రిలేషన్‌ని రివీల్‌ చెయ్యకుండా కథని అక్కడక్కడే తిప్పుతూ విసిగించాడు. మాయవనం వెళ్ళినవారు ఎందుకు చనిపోతున్నారు? వాళ్ళని ఎందుకు చంపుతున్నారనే విషయంలో సరైన క్లారిటీ లేదు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు చాలా సన్నివేశాలు చాలా స్లోగా వుండడం, డైరెక్టర్‌ తను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పలేకపోవడంతో కొన్నిచోట్ల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్‌ హాఫ్‌ని చాలా గ్రిప్పింగ్‌గా, భయపెట్టే విధంగా తీసిన అశ్విన్‌ సెకండాఫ్‌కి వచ్చేసరికి మాయవనంలో దెయ్యాలు కనిపించే సన్నివేశాలు చాలా కామెడీగా తీసినట్టు అనిపిస్తుంది. ఆడియన్స్‌ భయపడకపోగా నవ్వుతూ ఎంజాయ్‌ చేస్తారు. 

విశ్లేషణ: మయూరి అనే టైటిల్‌ చూసి నయనతార ఆడియన్స్‌ని భయపెడుతుందేమో అని థియేటర్‌కి వెళ్ళే ఆడియన్స్‌కి నిరాశ తప్పదు. ఎందుకంటే ఏ సందర్భంలోనూ నయనతార భయపెట్టదు. మాయగా, మయూరిగా నయనతార రెండు క్యారెక్టర్లు చేసిందని పబ్లిసిటీలో చెప్పినప్పటికీ అది సినిమాలో ఎక్కడా కనిపించదు. మయూరి క్యారెక్టర్‌ మాత్రమే మనకు కనిపిస్తుంది. తమిళ్‌ సినిమా మాయలో అప్సర, మాయ రెండు క్యారెక్టర్లు వుంటాయి. తెలుగు అనువాదానికి వచ్చేసరికి కొన్ని సీన్స్‌లో అప్సర అనే పేరుని అలాగే వుంచేశారు. ఫోన్‌లో అప్సర అనే పేరు కనిపించడం, అప్సర పేరుతో ఒక చెక్‌ని చూపించడం అనేవి తెలుగు వెర్షన్‌లో చేసిన ఘోరమైన తప్పిదాలుగా చెప్పుకోవచ్చు. కథ, కథనాల విషయానికి వస్తే ప్రజెంట్‌ సీన్స్‌ చూపిస్తూ, మధ్య మధ్య చీకటి సినిమాని చూపిస్తూ, మయూరి ఇంట్లో కొన్ని సీన్స్‌తో భయపెడుతూ ఫస్ట్‌ హాఫ్‌ ఓకే అనిపించినా, సెకండాఫ్‌లో మాత్రం కథ ముందుకు వెళ్ళకుండా చూపించిన సీన్స్‌నే మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. చీకటి చిత్రాన్ని ఒంటరిగా చూడడానికి మయూరి సిద్ధపడిన తర్వాత చీకటి కథకి, మయూరికి చాలా పెద్ద లింక్‌ వుంటుందేమోనని ఎదురు చూసిన ఆడియన్స్‌ కొన్ని అర్థం కాని సీన్స్‌ తర్వాత మాయా మాథ్యూస్‌ కూతురు మయూరి అని తెలుస్తుంది. చీకటి చిత్రంలో మాయా మాథ్యూస్‌ గురించి పూర్తిగా చూపించలేదని, అందుకే దానికి సీక్వెల్‌గా చీకటి అడవి అనే సినిమా తీసి రెండూ ఒకేసారి రిలీజ్‌ చేస్తానని డైరెక్టర్‌ చెప్తాడు. అది తీసే క్రమంలోనే డైరెక్టర్‌ చనిపోతాడు. అలా అతను ఎందుకు చనిపోతాడు అనే విషయంలో సరైన క్లారిటీ వుండదు. అక్కడక్కడా భయపెడుతూ, అక్కడక్కడ నసపెడుతూ రెండున్నర గంటల సినిమాని నాలుగు గంటల సేపు చూసిన అనుభూతిని కలిగిస్తుంది మయూరి. ఫైనల్‌గా చెప్పాలంటే ఆడియన్స్‌ థ్రిల్‌ అయ్యే కొన్ని హార్రర్‌ సీన్స్‌తో స్లో నేరేషన్‌తో సాగే ఈ చిత్రం అన్నివర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకోవడం కష్టమనే చెప్పాలి. 

ఫినిషింగ్‌ టచ్‌: ఫస్టాఫ్‌ గ్రిప్పింగ్‌గా, సెకండాఫ్‌ బోరింగ్‌గా! 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ