శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సుబ్రమణ్యం ఫర్ సేల్
తారాగణం: సాయిధరమ్ తేజ్, రెజినా, అదా శర్మ,
బ్రహ్మానందం, రావు రమేష్, నాగబాబు, నరేష్, సుమన్,
అజయ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
సంగీతం: మిక్కీ జె.మేయర్
ఎడిటింగ్: గౌతంరాజు
స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, సతీష్ వేగేశ్న, తోట ప్రసాద్
నిర్మాత: రాజు
కథ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.
విడుదల తేదీ: 24.09.2015
సాయిధరమ్ తేజ్ హీరోగా తన కెరీర్‌ని రేయ్ చిత్రంతో ప్రారంభించినప్పటికీ మొదట విడుదలైన సినిమా పిల్లా నువ్వు లేని జీవితం. ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ సాయిధరమ్‌కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత విడుదలైన అతని తొలి సినిమా రేయ్ డిజాస్టర్ అయింది. అతని మూడో సినిమాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన సుబ్రమణ్యం ఫర్ సేల్ విడుదలైంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సాయిధరమ్‌కి ఎలాంటి రిజల్ట్‌ని అందించింది? దిల్‌రాజు బేనర్‌లో ఎన్టీఆర్ హీరోగా రామయ్యా వస్తావయ్యా వంటి ఫ్లాప్ చిత్రాన్ని తీసిన హరీష్‌శంకర్‌కి మరో అవకాశం ఇచ్చిన దిల్‌రాజుకి ఈ చిత్రం మరో కమర్షియల్ హిట్‌ని అందించిందా? రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ తర్వాత హిట్ కొట్టాలన్న కసితో హరీష్ శంకర్ చేసిన సుమ్రణ్యం ఫర్ సేల్ ఆడియన్స్‌ని, మెగా ఫ్యాన్స్‌ని ఆకట్టుకోగలిగిందా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ: ఓపెన్ చేస్తే అది ఓ సంపన్న కుటుంబంలో జరగబోతున్న పెళ్ళి. కొన్ని గంటల్లో పెళ్ళి చేసుకోవాల్సిన పెళ్ళికూతురు సీత(రెజినా) ఆ పెళ్ళి ఇంట్లో నుంచి జంప్ అవుతుంది. సీత తండ్రి రెడ్డప్ప(సుమన్)కి, బియ్యం బుజ్జి(రావు రమేష్)కి పాత పగలు వున్నాయి. సీత పెళ్ళి నుంచి జంప్ అయిందని తెలుసుకొని రెడ్డప్పను దెబ్బతియ్యాలని ఆమెకు ట్రైన్ టిక్కెట్ తీసి మరీ పంపిస్తాడు. ఆ తర్వాత సీత తను ప్రేమించిన కుర్రాడిని పెళ్ళి చేసుకోవడానికి అమెరికా ఫ్లయిట్ ఎక్కుతుంది. కట్ చేస్తే అమెరికాలో వుంటున్న సుబ్రమణ్యం(సాయిధరమ్‌తేజ్) రేడియో మిర్చిలో జాకీగా పనిచేస్తుంటాడు. ప్రతి నెలా ఇంటికి పెద్ద మొత్తంలో డబ్బు పంపించాల్సిన అవసరం వుండడంతో డబ్బు కోసం ఏ పని చేయడానికైనా సిద్ధ పడతాడు సుబ్రమణ్యం. అందులో భాగంగానే సీత ఎంగేజ్‌మెంట్ ఎరేంజ్‌మెంట్స్ చూసేందుకు ఫంక్షన్‌కి వస్తాడు. ఆ టైమ్‌లోనే తను ప్రేమించిన కుర్రాడు మోసగాడని తెలుసుకుంటుంది సీత. ఫ్రెండ్స్‌తో కలిసి సీతని ఎంజాయ్ చెయ్యాలని చూసిన లవర్ బృందానికి బుద్ధి చెప్పి ఆమెను తన ఇంటికి తీసుకొస్తాడు సుబ్రమణ్యం. తను చదువుకుంటానని, దాని కోసం జాబ్ చేస్తానని చెప్తుంది సీత. అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐ రాజశేఖర్(నాగబాబు) బెస్ట్ కపుల్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాడని, గెలిచిన వారికి 25 వేల డాలర్లు బహుమతిగా ఇస్తారని తెలిసి సుబ్రమణ్యం, సీత భారాభర్తలుగా ఆ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేస్తారు. 25 వేల డాలర్లు గెలుచుకుంటారు. అదే సమయంలో సీత చెల్లెలికి పెళ్ళి నిశ్చయమవుతుంది. తన పెళ్ళికి ఎట్టి పరిస్థితుల్లో రావాలని సీత చెల్లెలు పట్టు పడుతుంది. తనకి జరిగిన మోసం గురించి తెలియకుండా మేనేజ్ చెయ్యడానికి సుబ్రమణ్యం సాయం కోరుతుంది సీత. ఎలాగైనా ఇండియా వచ్చి తమ వాళ్ళకి నచ్చజెప్పమని అడుగుతుంది. ఇద్దరూ కలిసి ఇండియా బయల్దేరతారు. ఎప్పటి నుంచో సుబ్రమణ్యం కోసం వెతుకుతున్న ముకుంద్‌గౌడ్(అజయ్) మనుషులు అతని చూసి వెంబడిస్తారు. సుబ్రమణ్యంని ముకుంద్‌గౌడ్ మనుషులు ఎందుకు వెంబడిస్తారు? వారితో సుబ్రమణ్యానికి ఎలాంటి విరోధం వుంది? సీతను ఇంటికి తీసుకెళ్ళిన సుబ్రమణ్యం ఆమె ఫ్యామిలీ మెంబర్స్‌ని కన్విన్స్ చెయ్యగలిగాడా? ముకుంద్ వల్ల ఎదురైన సమస్యల్ని పరిష్కరించుకోగలిగాడా? అనేది మిగతా కథ.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్: సుబ్రమణ్యం క్యారెక్టర్‌ని పర్‌ఫెక్ట్‌గా చేశాడు సాయిధరమ్. కామెడీ టైమింగ్‌లో, యాక్షన్ పార్ట్‌లో, రొమాంటిక్ సీన్స్‌లో అందర్నీ ఆకట్టుకున్నాడు. అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో పవన్‌కళ్యాణ్‌ని, కొన్ని కామెడీ సీన్స్, రొమాంటిక్ సీన్స్‌లో చిరంజీవిని ఇమిటేట్ చెయ్యడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. డాన్సుల్ని మాత్రం తన స్టైల్‌లోనే చేసి ఆకట్టుకున్నాడు. పిల్లా నువ్వు లేని జీవితంలో ఇలాంటి ఇమిటేషన్ లేదు. ఈ సినిమాలో మాత్రం ప్రత్యేకంగా ఇమిటేషన్ ఎక్కువైందని చెప్పాలి. ఓవరాల్‌గా సుబ్రమణ్యంగా సాయిధరమ్ అందర్నీ ఎంటర్‌టైన్ చేశాడు. సీతగా రెజీనా ఒక పెర్‌ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేసింది. పాటలకు మాత్రమే పరిమితం కాకుండా కథను ముందుకు నడిపించే పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్‌ని క్యారీ చేస్తూ ఆ క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేసింది. యాక్టివ్‌గా పెర్‌ఫార్మ్ చేసింది. గువ్వా గోరింకతో.. పాటలో సాయిధరమ్‌కి ధీటుగా స్టెప్పులేసి ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం తన మార్క్ కామెడీతో ఆకట్టుకున్నాడు. స్పెషల్ క్యారెక్టర్ చేసిన అదా శర్మ ఓకే అనిపించింది. రావు రమేష్, సుమన్, అజయ్ రెగ్యులర్‌గా చేసే క్యారెక్టర్సే ఇందులోనూ చేశారు. ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను చేసిన కామెడీ అందర్నీ నవ్విస్తుంది.
టెక్నీషియన్స్: అమెరికాలోని అందమైన లొకేషన్స్‌ని మరింత అందంగా చూపించడంలో రాంప్రసాద్ సక్సెస్ అయ్యాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రాంప్రసాద్ కెమెరా వర్క్ అందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె.మేయర్ ఈ చిత్రం ద్వారా ఒక కొత్త మార్క్‌ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఫాస్ట్ బీట్ సాంగ్, మాస్ సాంగ్స్ చెయ్యడం మిక్కీ వల్ల కాదు అనుకునే వారికి ఈ సినిమాలోని పాటల ద్వారా మంచి సమాధానం ఇచ్చాడు. పాటలన్నీ డిఫరెంట్‌గా వుండేలా చూసుకున్నాడు మిక్కీ. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని డిఫరెంట్‌గా ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక గౌతంరాజు ఎప్పటిలాగే తన ఎడిటింగ్‌ను బాగా చేశాడు. అయితే సెకండాఫ్‌లో అక్కడక్కడా గ్రిప్ సడలిన సన్నివేశాలు వున్నాయి. వాటిని మరికాస్త కుదించి వుంటే సినిమా ఇంకా స్పీడ్‌గా వెళ్ళివుండేది. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి చెప్పాలంటే కథలోగానీ, కథనంలోగానీ, మాటల్లోగానీ, హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్‌లో గానీ నావెల్టీ వుండాలని బాగా కృషి చేశాడని సినిమా చూస్తే అర్థమవుతుంది. కాకపోతే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంతవరకు నెక్స్‌ట్ సీన్‌లో ఏం జరగబోతోందనేది సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమైపోయేలా వుంది. అయితే ఆర్టిస్టులందరి నుంచి మంచి ఔట్‌పుట్ రాబట్టుకోవడంలో హరీష్ సక్సెస్ అయ్యాడు.
విశ్లేషణ: పెద్దలు కుదిర్చిన పెళ్ళి నచ్చక పెళ్ళి పీటల దాకా వచ్చిన తర్వాత పెళ్ళి కూతురు జంప్ అవ్వడం అనేది మనం చాలా సినిమాల్లో చూశాం. తను ప్రేమించిన అబ్బాయి మోసగాడని హీరోయిన్ తెలుసుకోవడం, ఆ తర్వాత మన హీరోతో జత కట్టడం కూడా చాలా సినిమాల్లో చూశాం. కథగా చెప్పుకోవాలంటే ఇది చాలా రొటీన్ కథ. అయితే ఇందులోని క్యారెక్టరైజేషన్స్, సిట్యుయేషన్స్ కొత్తగా అనిపిస్తాయి. నెక్స్‌ట్ సీన్‌లో ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీ కలిగించలేకపోయినా ఊహించిందే కాస్త ఎంటర్‌టైనింగ్‌గా జరుగుతోందని హ్యాపీగా ఫీల్ అయ్యేలా వుంటుంది. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో నూటికి తొంబై శాతం సినిమాల్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా ఎక్కడో హీరోయిన్‌ని చూసి మనసు పారేసుకొని ఆమె కోసం ఏమైనా చెయ్యడానికి సిద్ధపడేలా హీరో క్యారెక్టర్ వుంటోంది. దానికి భిన్నంగా ఈ సినిమాలో సిట్యుయేషన్ పరంగా పుట్టే ప్రేమనే చూపించడం కాస్త రిలీఫ్ నిస్తుంది. హీరో, హీరోయిన్ మధ్య, హీరో, బ్రహ్మానందం మధ్య కామెడీ సీన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్‌తో ఫస్ట్‌హాఫ్ ఓకే అనిపిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి హీరోయిన్ ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యడానికి ఆమెతో కలిసి హీరో ఇండియా రావడం, అక్కడ తనకో ఫ్లాష్ బ్యాక్ వుండడం, హీరో కోసం విలన్ గ్యాంగ్ వెతకడం, విలన్ గ్యాంగ్‌ని బక్‌రాలను చేసి తన చుట్టూ తిప్పుకోవడం వంటి సీన్స్ చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. అయితే ఆ రొటీన్ సీన్స్ నుంచే కామెడీ చేసే అవకాశం తీసుకున్నాడు డైరెక్టర్. ఈ ప్రాసెస్‌లో సెకండాఫ్ అక్కడక్కడా సినిమా స్లో అవుతుంది. సినిమాలోని ప్రధాన నటీనటుల మధ్యే సీన్స్ నడుస్తుంటాయి. కథ క్లైమాక్స్‌కి తీసుకు రావడానికి టైమ్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి కథతో గతంలోనూ సినిమాలు వచ్చినప్పటికీ, అక్కడక్కడా మనం చూసిన పాత సినిమాలు గుర్తొచ్చినప్పటికీ సీన్స్‌పరంగా, డైలాగ్స్ పరంగా, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ పరంగా ఆడియన్స్ చివరి వరకు థియేటర్‌లో కూర్చో గలుగుతారు. పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత సాయిధరమ్‌కి ఈ సినిమా కమర్షియల్‌గా మరో బిగ్ సక్సెస్ అయ్యే అవకాశం వుంది. రామయ్యా వస్తావయ్యా వంటి ఫ్లాప్ మూవీ తర్వాత హరీష్ శంకర్ చేసిన ఈ సినిమా అతని కెరీర్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే సుబ్రమణ్యం ఫర్ సేల్ అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.
ఫినిషింగ్ టచ్: హోల్‌సేల్‌గా ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
సినీజోష్ రేటింగ్: 3/5