డి.వి. సినీ క్రియేషన్స్
ది ఐస్
తారాగణం: మీరా జాస్మిన్, సూరజ్ వెంజరమూడు, నందు,
బద్రి, గీతా విజయన్, సునీల్ సుఖాడ, శంకర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: చంద్రమౌళి
సంగీతం: రమేష్ నారాయణ్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: కనిష్క
మాటలు: వెన్నెలకంటి
నిర్మాత: డి.వెంకటేష్
దర్శకత్వం: షాజియం
విడుదల తేదీ: 09.10.2015
భాషతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం అన్ని భాషల్లోనూ హార్రర్ మూవీస్, హార్రర్ కామెడీ మూవీస్ చేయడానికి దర్శకనిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రేక్షకులు కూడా ఆయా చిత్రాలను విశేషంగా ఆదరిస్తున్నారు. అయితే రొటీన్‌గా వచ్చే హార్రర్ మూవీస్‌కి భిన్నంగా మలయాళంలో మిస్ లేఖాతరూర్ కానున్నత్తు పేరుతో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ రూపొందింది. మలయాళ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని ది ఐస్ పేరుతో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత డి.వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. అక్టోబర్ 9న విడుదల కానున్న ఈ చిత్రాన్ని మీడియా కోసం కొన్ని రోజుల ముందే ప్రదర్శించడం జరిగింది. ఈ సినిమా కాన్సెప్ట్ మీద వున్న నమ్మకంతోనే రిలీజ్‌కి ముందే ఈ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగిందని నిర్మాత డి.వెంకటేష్ చెప్తున్నారు. రెగ్యులర్ ఫార్మాట్‌కి భిన్నంగా సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ది ఐస్ ఏమేర ఆకట్టుకుంటుంది? ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే అంశాలు ఇందులో ఏమున్నాయి అనేది ఓసారి సమీక్షలోకి తెలుసుకుందాం.
కథ: ఆమె పేరు లేఖ(మీరా జాస్మిన్). చిన్నతనంలోనే చూపును పోగొట్టుకున్న లేఖ తనకున్న మేధస్సుతో గణితంలో ఎంతో ప్రావీణ్యం సాధిస్తుంది. అంధురాలైనప్పటికీ ఆమెకు వున్న టాలెంట్‌తో ఐటివి అనే ఒక ఛానల్‌లో ఓ రియాలిటీ షోను నిర్వహిస్తూ వుంటుంది. ఇరవయ్యేళ్ళుగా అంధురాలుగా వున్న లేఖకు చూపు తెప్పించేందుకు ఆమె అక్క ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో ఓసారి విఫలమవుతుంది కూడా. ఆ తర్వాత రెండో ప్రయత్నంగా ఆత్మహత్య చేసుకున్న ఓ అమ్మాయి కళ్ళను ఆపరేషన్ చేసి అమరుస్తారు. లేఖకు చేసిన కంటి ఆపరేషన్ రెండోసారి సక్సెస్ అవుతుంది. అయితే అందరిలా స్పష్టంగా చూడలేకపోతుంది. ఈ విషయంలో అజయ్(బద్రి) అనే డాక్టర్ ఆమెకు ట్రైనింగ్ ఇవ్వడానికి నియమించబడతాడు. కానీ, చూపు విషయంలో ఆమెకు కొన్ని సమస్యలు తలెత్తుతాయి. మామూలు కంటికి కనపడని ఎన్నో దృశ్యాలు, తను అప్పటి వరకు చూడని ప్రదేశాలు, మనుషులు లేఖ కంటికి కనిపిస్తూ ఆమెకు ఆందోళన కలిగిస్తుంటాయి. చనిపోయిన వారి ఆత్మలే కాకుండా కొంతమంది కాసేపట్లో చనిపోతారన్న విషయం లేఖకు ముందుగానే తెలిసిపోతుంటుంది. వీటన్నింటినీ మించి అద్దంలో చూసుకున్నప్పుడు తన ముఖం కాకుండా వేరెవరిదో కనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనల వల్ల లేఖ మానసికంగా కృంగిపోతుంది. తనకు కళ్ళను దానం చేసిన ఆ అమ్మాయి ఎవరో చెప్పాల్సిందిగా డాక్టర్‌ని కోరుతుంది. అది మెడికల్ ఎథిక్స్‌కి విర్ధుమని ఆ డాక్టర్ చెప్పడానికి నిరాకరిస్తాడు. లేఖ తన పరిస్థితి అతనికి వివరించిన తర్వాత ఆ అమ్మాయి పేరు మీనా(రోసిన్ జాలీ) అని చెప్తాడు. లేఖను మీనా ఊరికి తీసుకెళ్తాడు అజయ్. ఆ ఊరికి వెళ్ళిన లేఖ ఏం తెలుసుకుంది? మీనా బ్రతికి వున్నప్పుడు ఆమె కళ్ళకు కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించేవా? అసలు మీనా ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? మీనా ఊరికి వెళ్ళి ఆమె గురించి తెలుసుకున్న తర్వాత లేఖ సమస్యకు పరిష్కారం దొరికిందా? అనే ప్రశ్నలకు మిగతా సినిమా సమాధానం చెప్తుంది.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్: లేఖ క్యారెక్టర్‌లో మీరా జాస్మిన్ ఒదిగిపోయిందని చెప్పాలి. ఆమె క్యారెక్టర్‌లో ఎన్నో వేరియేషన్స్ వున్నాయి. చూపు లేని అమ్మాయిగా, చూపు వచ్చిన తర్వాత ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్న అమ్మాయిగా, ఎవరికీ కనపించని దృశ్యాలు, ఆత్మలు చూస్తూ మానసిక వ్యధకు లోనయ్యే అమ్మాయిగా.. ఇలా ఎన్నో వేరియేషన్స్ వున్న లేఖ క్యారెక్టర్‌ని మీరా జాస్మిన్ చాలా అద్భుతంగా పోషించింది. దాదాపు కథ అంతా లేఖ చుట్టూనే తిరుగుతుండడం వల్ల సినిమాలో ఎక్కువ భాగం మీరా జాస్మినే కనిపిస్తుంది. అన్ని రకాల ఎమోషన్స్ చూపించడంలో మీరా జాస్మిన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది. ఆమెకు ట్రైనింగ్ ఇచ్చే డాక్టర్ అజయ్‌గా బద్రి ఓకే అనిపించాడు. మీనాగా రోసిన్ జాలీ పెర్‌ఫార్మెన్స్ కూడా బాగుంది.
టెక్నీషియన్స్: టెక్నీషియన్స్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ చంద్రమౌళి గురించి. ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. మీరా జాస్మిన్‌ని అందంగా చూపించడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. ప్రతి సీన్ ఎంతో రిచ్‌గా కనిపించేలా అతని ఫోటోగ్రఫీ వుంది. మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నారాయణ్ చేసిన ఒకే ఒక పాటను సునీత పాడింది. మలయాళంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని అంతగా ఎలివేట్ చేయలేదు. తెలుగుకి వచ్చేసరికి కనిష్కతో ప్రత్యేకంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయించారు. అయితే అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లోని లౌడ్‌నెస్ వల్ల అక్కడక్కడా డైలాగ్స్‌ని ఆ సౌండ్ డామినేట్ చేసిందని చెప్పాలి. వెన్నెలకంటి రాసిన మాటలు ఆకట్టుకునేలా వున్నాయి. డైరెక్టర్ షాజియం గురించి చెప్పుకోవాలంటే ఒక కొత్త కథతో ఆడియన్స్‌ని థ్రిల్ చెయ్యాలని అతను చేసిన ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. కథలో విషయం వున్నా, కథనం చాలా స్లోగా వుండడం వల్ల అక్కడక్కడ ఆడియన్స్‌కి బోర్ కొట్టే అవకాశం వుంది. మలయాళంలో 2 గంటల 17 నిముషాలు వున్న నిడివిని తెలుగులో 1 గంట 45 నిముషాలకు కుదించడం వల్ల సినిమా కాస్త స్పీడ్ అయింది. సెకండాఫ్‌లో హీరోయిన్ ఎదుర్కొంటున్న సమస్యకి కన్‌క్లూజన్ ఇవ్వడంలో చేసిన జాప్యం వల్ల అప్పటివరకు థ్రిల్ ఫీల్ అయిన ఆడియన్స్‌కి క్లైమాక్స్ కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆడియన్స్ ఊహించని క్లైమాక్స్‌తో సినిమాని ఎండ్ చెయ్యడంలో డైరెక్టర్ షాజియం సక్సెస్ అయ్యాడు.
విశ్లేషణ: ఇప్పటివరకు ఓ తరహా హార్రర్ మూవీస్‌కి అలవాటు పడిపోయిన ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే సినిమా ది ఐస్. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌లో వుండే యాక్షన్, కామెడీ వంటి అంశాలు ఈ సినిమాలో లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. వాస్తవానికి వాటిని జోడించే ఆస్కారం ఈ కథకు లేకపోవడం వల్ల తను అనుకున్న కాన్సెప్ట్‌ని తెరమీద వుంచే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. సగటు ప్రేక్షకుడు ఆశించే అంశాలు ఇందులో లేవు. అయితే కొత్తదనం కోరుకునేవారు, థ్రిల్స్‌ని వుండాలనుకునేవారికి ఈ సినిమా నచ్చుతుంది. మీరా జాస్మిన్ గ్లామర్, ఆమె పెర్‌ఫార్మెన్స్, ఆహ్లాదంగా అనిపించే ఫోటోగ్రఫీ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పాలి. స్లో నేరేషన్, అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు లేకపోవడం ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. అయితే స్ట్రెయిట్ సినిమాకి ఎలాంటి పోస్ట్ ప్రొడక్షన్ చేశారో ఒక డబ్బింగ్ సినిమాకి అలాంటి పోస్ట్ ప్రొడక్షన్ చేసి మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యబోతున్నారు నిర్మాత వెంకటేష్. మరి ఒక కొత్త జోనర్‌లో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఆడియన్స్‌ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఫినిషింగ్ టచ్: ఓకే అనిపించుకునే సైంటిఫిక్ థ్రిల్లర్
సినీజోష్ రేటింగ్: 2.5/5