జె.జి. సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్‌స్టార్స్ మోషన్ పిక్చర్స్, మోహన్ రూపా ఫిలింస్
అబ్బాయితో అమ్మాయి
తారాగణం: నాగశౌర్య, పలక్ లల్వాని, మోహన్, రావు రమేష్,
తులసి, ప్రగతి, తేజస్వి, షకలక శంకర్, మధునందన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు
సంగీతం: ఇళయరాజా
ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్
నిర్మాతలు: వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని,
సమ్మెట శ్రీనివాస్
రచన, దర్శకత్వం: రమేష్‌వర్మ
విడుదల తేదీ: 01.01.2016
ప్రస్తుతం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే ఆ సినిమాలో హార్రర్ వుండాలి, హార్రర్‌తో పాటు కామెడీ మిక్స్ అయి వుండాలి లేదా యూత్‌కి నచ్చే డైలాగ్స్‌తో, సీన్స్‌తో తీసిన సినిమా అయి వుండాలి. అలా యూత్‌ని టార్గెట్ చేస్తూ అందులోనే ఫ్యామిలీని కూడా టచ్ చేస్తూ రమేష్‌వర్మ రూపొందించిన చిత్రం అబ్బాయితో అమ్మాయి. నాగశౌర్య, కొత్త హీరోయిన్ పలక్ లల్వాని జంటగా వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, సమ్మెట శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక క్యూట్ పెయిర్‌తో రూపొందిన ఈ సినిమాలో యూత్‌ని ఎట్రాక్ట్ చేసే అంశాలు ఏం వున్నాయి? దర్శకుడుగా ఇప్పటివరకు పెద్ద సక్సెస్ సాధించని రమేష్‌వర్మకి ఈ సినిమా ఎలాంటి పేరు తెచ్చింది? ఊహలు గుసగుసలాడే చిత్రం తర్వాత సక్సెస్‌ని చూడని నాగశౌర్యకి ఈ సినిమా హెల్ప్ అయ్యిందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.
యూత్‌ని టార్గెట్ చేస్తూ తీసే సినిమాలంటే ఆ సినిమాలో హీరో ఎప్పుడూ అమ్మాయిల్ని పడేసే పనిలోనే వుంటాడు, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటాడు. లైఫ్‌లో ఒక ఎయిమ్ అనేది లేకుండా బ్రతుకుతుంటాడు. అలాంటి కామెంట్ ఈ సినిమాలోని హీరోకి రాకూడదన్న ఉద్దేశంతో హీరో బీటెక్ కంప్లీట్ చేసి ఆటోమోటివ్స్‌లో కొత్త రకం కార్లను, బైక్స్‌ను డిజైన్ చేస్తూ వుంటాడని చూపించారు. అంతవరకు బాగానే వుంది. అసలు కథ విషయానికి వస్తే హీరో అభి(నాగశౌర్య)కి ఫేస్‌బుక్ ద్వారా సమంత అనే అమ్మాయి ఫ్రెండ్ అవుతుంది. ఫేస్‌బుక్ చాటింగ్, వాయిస్ చాటింగ్ ద్వారా వారి ఫ్రెండ్‌షిప్ కొనసాగుతుండగానే ప్రార్థన(పలక్ లల్వాని) అనే అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు హీరో. ఆమె లవ్‌ని పొందడానికి కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తాడు. తన లవర్‌కి సంబంధించిన విషయాల్ని కూడా సమంతతో షేర్ చేసుకుంటూ వుంటాడు. అభి, ప్రార్థన బాగా దగ్గరవుతారు. ఎంత దగ్గరంటే ప్రార్థన పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు ఇద్దరూ ఒక నైట్ అంతా ఆమె ఇంట్లో గడిపేంత దగ్గరవుతారు. మరుసటి రోజు ప్రార్థన పేరెంట్స్ వచ్చి విషయం తెలుసుకుంటారు. ఆమెను ఇంటి నుంచి గెంటేస్తాడు తండ్రి(రావు రమేష్). ట్రిక్స్ ప్లే చేసి అభి తనకు దగ్గరయ్యాడని తెలుసుకున్న ప్రార్థన అప్పటి నుంచి అతన్ని దూరం పెడుతుంది. అదే టైమ్‌లో తన ఫేస్‌బుక్ ఫ్రెండ్ అయిన పవన్‌కి చాటింగ్ ద్వారా బాగా దగ్గరవుతుంది. అభిని కలుసుకోవడానికి ఇష్టపడదు. ప్రార్థనని ఎంతగానో ప్రేమిస్తున్న అభి దానికి ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇంటి నుంచి గెంటివేయబడ్డ ప్రార్థన తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకుంది? అభి ఫేస్‌బుక్ ఫ్రెండ్ సమంత ఎవరు? ప్రార్థన ఫేస్‌బుక్ ఫ్రెండ్ పవన్ ఎవరు? అభి, ప్రార్థన వ్యహారంపై ఇద్దరి పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? చివరికి ఈ ఇద్దరు ప్రేమికులు కలుసుకున్నారా? అనేది మిగతా కథ.
హీరో ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడని తెలిసిన తల్లిదండ్రులు అతన్ని మరింత ఎంకరేజ్ చేస్తారు. ఆ అమ్మాయిని త్వరగా లైన్‌లో పెట్టి ఇంటికి తీసుకురమ్మని నానా హడావిడి చేస్తారు. ఆ అమ్మాయికి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ వుంటారు. ఈమధ్య వచ్చిన ఒక సినిమాలో హీరోయిన్‌ని కూడా ఆమె తల్లి అలాగే ఎంకరేజ్ చేస్తుంది, అబ్బాయిని లైన్‌లో పెట్టమంటుంది... ఇలా సినిమాల్లో మాత్రమే మనం చూస్తుంటాం. ముఖ్యంగా ఈమధ్య వచ్చే తెలుగు సినిమాల్లో పేరెంట్స్, పిల్లల మధ్య ఇలాంటి టాపిక్స్‌ని ఎక్కువగా చూపిస్తున్నారు. ఈ సినిమాలో కూడా హీరోని అతని తండ్రి ఎంకరేజ్ చేస్తూ వుంటాడు. అలా అమ్మాయిల్ని లైన్‌లో పెట్టే క్యారెక్టర్‌లో నాగశౌర్య పెర్‌ఫార్మెన్స్ బాగుంది. లుక్స్ పరంగా కూడా శౌర్య బాగున్నాడు. ప్రార్థనగా పలక్ లల్వాని బాగానే చేసింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆమె ఒక్కో సీన్‌లో ఒక్కోలా కనిపించడం విచిత్రంగా అనిపిస్తుంది. అయితే పలక్ లల్వాని తన శక్తి మేరకు ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నం చేసింది. ఇక కొడుకుని ఎంకరేజ్ చేసే తండ్రి పాత్రలో ఒకప్పటి హీరో మోహన్, కొడుకు విషయంలో అతన్ని మందలించే తల్లిగా తులసి తమ లిమిట్స్‌లో చేశారు. చిన్నప్పటి నుంచి హీరోయిన్‌ని అసహ్యించుకొనే తండ్రిగా రావు రమేష్, సవతి తల్లిగా ప్రగతి లిమిట్స్ దాటి పెర్‌ఫార్మ్ చేశారు. సినిమాలోని మిగతా పాత్రలకు అంతగా ప్రాముఖ్యత లేదు.
శ్యామ్ కె.నాయుడు అందించిన ఫోటోగ్రఫీతో ఒక విజువల్ వండర్‌గా అబ్బాయితో అమ్మాయి రూపొందింది. ప్రతి ఫ్రేమ్‌ని, ప్రతి సీన్‌ని చాలా కేర్ తీసుకొని ఎంతో రిచ్‌గా చూపించడంలో శ్యామ్ కె.నాయుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. సీన్సే కాకుండా పాటల్ని కూడా ఎంతో కలర్‌ఫుల్‌గా చూపించాడు. ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఇళయరాజా చేసిన పాటల్లో ఒకటి రెండు పాటలు మినహా ఆడియోపరంగా ఆకట్టుకునేవి ఏమీ లేవు. కాకపోతే కథకు తగ్గట్టుగా, మూడ్‌కి తగ్గట్టుగా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఇళయరాజా. ఎడిటర్ ఎస్.ఆర్. శేఖర్ తన పని తాను చేసుకునేలా కాకుండా సినిమాని ట్రిమ్ చేయడంలో అతనికి హెల్ప్ చేసినట్టయితే సినిమా ఇంకా స్పీడ్‌గా వుండేది. డైరెక్టర్ రమేష్‌వర్మ గురించి చెప్పుకోవాల్సి వస్తే చాలా పాత కథతో కొత్త సినిమా తియ్యాలని ట్రై చేశాడు. అతను ఎంచుకున్న పాయింట్ కొత్తగా లేకపోగా కథనం కూడా అలాగే వుండడంతో తను చెప్పాలనుకున్న దాన్ని చెప్పడంలో సక్సెస్ అవ్వలేకపోయాడు. అలాగే రావు రమేష్ లాంటి క్యారెక్టర్ విషయంలో క్లారిటీ లేకపోవడం, ఆ క్యారెక్టర్ ఎందుకలా బిహేవ్ చేస్తుందో చెప్పలేకపోవడం.. ఇలా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా మైనస్‌లు వున్నాయి.
ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. సినిమాలో ఫేస్‌బుక్ చాటింగ్‌కి సంబంధించిన సీన్స్ చాలా లెంగ్తీగా వుండడంతో ఆడియన్స్ రెస్ట్‌లెస్‌గా ఫీలవుతుంటారు. స్లోగానే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. తనని అసహ్యించుకునే హీరోయిన్‌ని ఉద్ధరించే పనిలో పడిన హీరో ఆమెకు అన్నిరకాలుగా సాయపడుతుంటాడు. సెకండాఫ్ దాదాపు ఈ సీన్స్‌తోనే సరిపోతుంది. సినిమా క్లైమాక్స్‌కి వస్తున్నా కథ ఒక కొలిక్కి రాదు. హీరో వెళ్ళి హీరోయిన్‌ని ప్రాధేయ పడడం, హీరో పేరెంట్స్ హీరోయిన్‌కి సర్ది చెప్పడం వంటి సీన్స్‌తో మొత్తానికి సినిమా క్లైమాక్స్ వస్తుంది. అయితే అర్థాంతరంగా రెండు సంవత్సరాల తర్వాత అంటూ ఇద్దరినీ ఒకటి చేశాడు డైరెక్టర్. సినిమా చూస్తున్న ఆడియన్స్‌కి ఈ సినిమా విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఒక పట్టాన అర్థం కాదు. ఎందుకంటే కన్నుల పండువగా వుండే విజువల్స్, చక్కని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. టెక్నికల్‌గా సినిమా ఎంత బాగున్నా కథ, కథనాలు ఆకట్టుకునేలా లేకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం చాలా కష్టమని అబ్బాయితో అమ్మాయి ప్రూవ్ చేసింది. అలాగే సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మచ్చుకైనా కనపడదు. హీరో, హీరోయిన్, వారి పేరెంట్స్ మధ్య కథ నడపడానికే డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపించాడు తప్ప ఎంటర్‌టైన్‌మెంట్ అనే పదాన్ని పూర్తిగా మర్చిపోయాడు. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం, క్లైమాక్స్ ఆకట్టుకునేలా లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్ అయింది. ఫైనల్‌గా చెప్పాలంటే ఫేస్‌బుక్ చాటింగ్, హీరో నాగశౌర్య పెర్‌ఫార్మెన్స్, హీరోయిన్ పలక్ లల్వాన్ని గ్లామర్, శ్యామ్ కె.నాయుడు ఫోటోగ్రఫీ, ఇళయరాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం చూడాలనుకునేవారు ఈ సినిమా చూడొచ్చు.
ఫినిషింగ్ టచ్: అబ్బాయితో అమ్మాయికి వర్కవుట్ అవ్వలేదు
సినీజోష్ రేటింగ్: 2.5/5