కల్పన చిత్ర, స్నేహ మూవీస్
నేనూ రౌడీనే
తారాగణం: విజయ్ సేతుపతి, నయనతార, రాధిక,
పార్తీబన్, ఆర్.జె.బాలాజీ తదితరులు
సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్
సంగీతం: అనిరుధ్
మాటలు: సాహితి, కోనేరు కల్పన
ఎడిటింగ్: ఎ.శ్రీకరప్రసాద్
నిర్మాతలు: కోనేరు కల్పన, రమేష్ అన్నంరెడ్డి
రచన, దర్శకత్వం: విఘ్నేష్ శివన్
విడుదల తేదీ: 29.01.2016
విజయ్ సేతుపతి, నయనతార, రాధిక, పార్తీబన్ ప్రధాన పాత్రల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తమిళ్‌లో సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన నానుమ్ రౌడీ తాన్ చిత్రాన్ని కల్పన చిత్ర, స్నేహ మూవీస్ పతాకాలపై నేనూ రౌడీనే పేరుతో తెలుగులోకి అనువదించారు నిర్మాతలు కోనేరు కల్పన, రమేష్ అన్నంరెడ్డి. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? తమిళ్‌లో మంచి కలెక్షన్లు సాధించిన ఈ చిత్రానికి తెలుగులో ఎలాంటి ఫలితం వచ్చింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
చిన్నతనంలో తమని ఆకట్టుకున్న, తమని ఇంప్రెస్ చేసిన విషయాల వల్లే పెద్దయ్యాక ఫలానా అవుతాను అని పిల్లలు చెప్తుంటారు. అలా ఈ సినిమాలో పండు(విజయ్ సేతుపతి) అనే కుర్రాడు తన తల్లి మీనాకుమారి(రాధిక) కూడా పోలీస్ ఆఫీసరే కావడంతో తను కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు. పోలీస్ గొప్పవాడా, రౌడీ గొప్పవాడా అంటూ ఒక రౌడీ చెప్పిన కథ పండుని బాగా ఇంప్రెస్ చెయ్యడంతో పెద్దయ్యాక తను కూడా పెద్ద రౌడీ అవ్వాలని డిసైడ్ అవుతాడు. కానీ, తల్లి బలవంతం మీద పెద్దయ్యాక పోలీస్ సెలెక్షన్స్ వెళ్తాడు. అయినా ఎవరికీ తెలియకుండా చిన్న చిన్న సెటిల్‌మెంట్స్ చేస్తుంటాడు. ఇక హీరోయిన్ కాదంబరి(నయనతార) తండ్రి రవికుమార్(అజగమ్ పెరుమాళ్) ఒక పోలీస్ ఆఫీసర్. అతనికి, కిల్లి బాబ్జీ(పార్తీబన్)కి వృత్తి పరమైన పగ వుంటుంది. రవికుమార్‌ని చంపేందుకు బాబ్జీ పెట్టిన బాంబు వల్ల అతని భార్య చనిపోతుంది. కూతురు కాదంబరి వినికిడి శక్తిని కోల్పోతుంది. అప్పటి నుంచి తండ్రీ కూతుళ్ళు బాబ్జీపై పగ పెంచుకుంటారు. ఓరోజు బాబ్జీని చంపడానికి వెళ్ళిన రవికుమార్ కనిపించకుండా పోతాడు. ఓ సందర్భంలో పండుకి, కాదంబరికి పరిచయం ఏర్పడుతుంది. పండు ఆమెను ప్రేమిస్తాడు. కిల్లి బాబ్జీని తన చేతుల్తో చంపేలా చేస్తేనే అతన్ని ప్రేమిస్తానని చెప్తుంది కాదంబరి. మరి తన ప్రేమ కోసం కాదంబరి చెప్పిన పని పండు చేశాడా? బాబ్జీని చంపడానికి వెళ్ళిన రవికుమార్ ఏమైపోయాడు? బాబ్జీని చంపడానికి పండు, కాదంబరి ఎలాంటి ప్లాన్స్ వేశారు? చివరికి బాబ్జీని కాదంబరి చంపిందా? అనేది మిగతా కథ.
ఈ కథలో పండు క్యారెక్టరైజేషన్ అంతా కన్‌ఫ్యూజన్స్‌తో నిండి వుంటుంది. రౌడీ అవ్వాలన్న లక్ష్యంతో వున్న పండు పెద్దయ్యాక తల్లి చెప్పినట్టు పోలీస్ సెలక్షన్స్‌కి వెళ్తాడు, చాటు మాటుగా సెటిల్‌మెంట్స్ చేస్తుంటాడు తప్ప అతని ఎయిమ్ ఏమిటనేది మనకు అర్థం కాదు. పైగా పండు చాలా సాఫ్ట్‌గా వుండడమే కాకుండా ప్రతి చిన్న విషయానికి భయపడుతూ వుంటాడు. కాదంబరి తన కోరిక చెప్పిన తర్వాత కూడా అతను బాబ్జీని చంపే విషయంలో ఏం చెయ్యాలనుకుంటున్నాడు అనేదానిపై అతనికి క్లారిటీ రాదు. అయినా తనకు ఇచ్చిన ఈ క్యారెక్టర్‌ని బాగానే చేశాడు విజయ్ సేతుపతి. చిన్నప్పటి పండుగా విజయ్ సేతుపతి తనయుడు సూర్య విజయ్ సేతుపతి నటించడం విశేషం. వినికిడి శక్తిలేని అమ్మాయిగా, పగ తీర్చుకోవాలనుకునే అమ్మాయిగా నయనతార పెర్‌ఫార్మెన్స్ కూడా బాగుంది. కిల్లి బాబ్జీగా నటించిన పార్తీబన్ తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. తన క్యారెక్టర్ ద్వారా వచ్చే కామెడీని కూడా మంచి టైమింగ్‌తో చేశాడు. పండు తల్లిగా రాధిక ఏమాత్రం ప్రాధాన్యతలేని క్యారెక్టర్ చేసింది. నిజానికి ఆ క్యారెక్టర్ ఎవరు చేసినా ఈ కథకి ఓకే.
కథకు, సిట్యుయేషన్‌కి, లొకేషన్‌కి తగ్గట్టు పర్‌ఫెక్ట్ లైటింగ్‌తో చాలా నేచురల్‌గా సినిమా మొత్తాన్ని చూపించాడు సినిమాటోగ్రాఫర్ జార్జి సి. విలియమ్స్. 2 గంటల 20 నిముషాల సినిమాలో ల్యాగ్ వున్న సీన్స్, అవసరం లేని సీన్స్ చాలా వున్నాయి. వాటిని ఎడిట్ చేసే అవకాశం శ్రీకరప్రసాద్‌కి ఇచ్చినట్టయితే సినిమా ఇంకా స్పీడ్‌గా వుండేది. ఇక అనిరుధ్ సంగీతం గురించి చెప్పాలంటే పాటలన్నీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా చేశాడు. తనకి అన్యాయం చేసిన విలన్‌ని హీరోయిన్ చంపాలనుకోవడం ఈ సినిమా మెయిన్ కథ. ఒక విధంగా ఇది హీరోయిన్‌కి మాత్రమే సంబంధించిన కథ. దానికి హీరో కథని కూడా మ్యాచ్ చెయ్యడం అనేది సినిమా లెంగ్త్ పెంచడానికే అనిపిస్తుంది. హీరో వల్ల హీరోయిన్ లక్ష్యం చివరి వరకూ నెరవేరదు. ఫస్ట్ హాఫ్ అసలు కథలోకి రాకుండా హీరో, హీరోయిన్ మధ్య సీన్స్‌తోనే సరిపుచ్చాడు డైరెక్టర్. సెకండాఫ్‌లో కూడా బాబ్జీని చంపడానికి వేసే ప్లాన్స్ కామెడీని క్రియేట్ చెయ్యడానికే అన్నట్టు వుంటాయి తప్ప సీరియస్‌గా బాబ్జీని చంపడానికి అన్నట్టుగా వుండవు.
సినిమా చాలా స్లో నేరేషన్‌తో స్టార్ట్ అయి ఫస్ట్ హాఫ్ అంతా అలాగే కంటిన్యూ అవుతుంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సెకండాఫ్‌లో ఏం జరుగబోతోందోనన్న క్యూరియాసిటీ కూడా కలిగించదు. అయితే ఫస్ట్ హాఫ్‌ని స్లోగా రన్ చేసిన డైరెక్టర్ సెకండాఫ్‌లో సిట్యుయేషన్ పరంగా వచ్చే కామెడీ సీన్స్‌తో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యగలిగాడు. విజయ్ సేతుపతి, నయనతార, పార్తీబన్‌ల పెర్‌ఫార్మెన్స్ సెకండాఫ్‌లో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని తెలుగుకి అనువాదం చెయ్యడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. సినిమా మొత్తంలో ఒక్కచోట కూడా తమిళ్ పేర్లు కనిపించకుండా తెలుగు పేర్లు మాత్రమే కనిపించడం కోసం చాలా కష్టపడ్డారనేది అర్థమవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ తరహా సినిమాలు ఎంత స్పీడ్‌గా వుంటే అంతగా ఆడియన్స్‌ని ఆకట్టుకోగలుగుతాయి. కథ, నేరేషన్ పరంగా మైనస్ పాయింట్‌లు వున్నప్పటికీ టేకింగ్‌లోగానీ, కామెడీలోగానీ, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌లోగానీ మైనస్‌లు ఎక్కువగా లేకపోవడం వల్ల ఇది ఓకే సినిమా అనిపిస్తుంది.
ఫినిషింగ్ టచ్: ఓకే... అనిపించే సినిమా
సినీజోష్ రేటింగ్: 2.5/5