విజన్ ఫిలిం మేకర్స్
సావిత్రి
తారాగణం: నారా రోహిత్, నందిత, మురళీశర్మ, అజయ్,
సత్య, శ్రీముఖి, ధన్య బాలకృష్ణ, ప్రభాస్ శ్రీను, పోసాని తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎ.వసంత్
సంగీతం: శ్రవణ్
ఎడిటింగ్: గౌతమ్ నెరుసు
మాటలు: కృష్ణచైతన్య
నిర్మాత: డా|| వి.బి.రాజేంద్రప్రసాద్
రచన, దర్శకత్వం: పవన్ సాదినేని
విడుదల తేదీ: 01.04.2016
బాణం చిత్రంతో హీరోగా పరిచయమైన నారా రోహిత్‌కి ఆ తర్వాత 'సోలో' తప్ప చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదు. జయాపజయాల మాట ఎలా వున్నా వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆ సినిమాల వరసలో ఈరోజు సావిత్రి విడుదలైంది. నందిత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహించగా, డా|| వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మించారు. 'ప్రేమ ఇష్క్ కాదల్' వంటి డిఫరెంట్ చిత్రాన్ని రూపొందించిన పవన్ సాదినేని ఈ చిత్రం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు? 'సావిత్రి' అనే లేడీ ఓరియంటెడ్ టైటిల్ పెట్టడానికి రీజన్? ఈ సినిమా నారా రోహిత్ కెరీర్‌కి ఎలాంటి సినిమా అవుతుంది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
ఈ కథలో సావిత్రి(నందిత)కి చిన్నప్పటి నుంచి పెళ్ళి అంటే విపరీతమైన పిచ్చి. తనకి పెళ్ళెప్పుడు అవుతుందా అని కలలు కంటూ వుంటుంది. సావిత్రికి ఓ సంబంధం చూస్తారు ఆమె తల్లిదండ్రులు. సావిత్రి కుటుంబ సభ్యులంతా కలిసి షిరిడీ వెళ్తుండగా ట్రైన్‌లో ఆమెను చూస్తాడు రిషి(నారా రోహిత్). ఎప్పటిలాగే తొలిచూపులోనే హీరోయిన్‌ని ప్రేమించేస్తాడు. ఇక అప్పటి నుంచి ఆమెను ఒప్పించడానికి నానా తంటాలు పడుతుంటాడు హీరో. తనకి వచ్చిన పెళ్ళి సంబంధాన్ని కూడా రిజెక్ట్ చేస్తాడు రిషి. అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా సావిత్రి అతన్ని ఇష్టపడదు. ఒక ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. రిషి పెళ్ళికి సంబంధించి ఏమిటా ట్విస్ట్? రిషీ.. సావిత్రి ప్రేమను పొందగలిగాడా? ఆమెను పెళ్ళి చేసుకోగలిగాడా? సావిత్రి ప్రేమను గెలుచుకునే ప్రయత్నంలో రిషీకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
తెలుగు ప్రేక్షకులకు కావాల్సింది కొత్తదనం. నువ్వు పాత కథ చెప్పినా ఫర్వాలేదు. కానీ, దాన్ని కొత్తగా చెప్తే చూస్తాం అని ఘంటాపథంగా చెప్తున్న ఆడియన్స్ మాటల్ని మన దర్శకనిర్మాతలు, హీరోలు పెద్దగా పట్టించుకోవడంలేదు. అందుకే ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తియ్యడంలో, నిర్మించడంలో ఫెయిల్ అవుతున్నారు. పవన్ సాదినేని రాసుకున్న కథలో కొత్తదనం ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కథగా చెప్పుకోవడానికి బలమైన పాయింట్ లేదు. పెళ్ళంటే విపరీతమైన పిచ్చి వున్న అమ్మాయి సావిత్రి. అంతవరకు బాగానే అనిపిస్తుంది. ఆమె పెళ్ళి ఓ డాక్టర్‌తో ఫిక్స్ అయిందనుకున్న టైమ్‌లో హీరో ఆమెను కలవడం, ప్రేమించమని వెంటపడడం వంటి సీన్స్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కామెడీ పేరుతో అనవసరమైన సీన్స్ చాలా వచ్చి చేరడంతో అంతా కలగా పులగం అయిపోయింది. ట్రైన్‌లో కామెడీ సీన్స్, హీరోయిన్ ఇంట్లో హీరో, విలన్ గ్యాంగ్ చేసే కామెడీ చిరాకు తెప్పిస్తాయి.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే నారా రోహిత్ లుక్‌గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ ఆకట్టుకునేలా లేదు. అతని పర్సనాలిటీకి, హీరోయిన్ వెంటపడుతూ ప్రేమ కోసం తపించే క్యారెక్టర్‌కి ఎక్కడా సెట్ అవ్వలేదు. సావిత్రిగా నందిత తన లిమిట్స్‌లో బాగానే పెర్‌ఫార్మ్ చేసింది. సావిత్రి తండ్రిగా మురళీశర్మ ఒక మూస పాత్ర చేసినట్టుగా అనిపిస్తుంది. అతను డైలాగ్ చెప్పే విధానం కూడా మూస ధోరణిలోనే కనిపించింది. హీరోకి మామగా ప్రభాస్ శ్రీను ఆడియన్స్‌ని నవ్వించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. మిగతా పాత్రల్లో అజయ్, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, సత్య, రవిబాబు ఫర్వాలేదు అనిపించారు.
టెక్నికల్‌గా ఈ సినిమాకి ఎస్సెట్స్ తక్కువ. సినిమాటోగ్రఫీ నార్మల్‌గానే అనిపిస్తుంది. శ్రవణ్ చేసిన పాటలుగానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గానీ ఆకట్టుకునేలా లేవు. డైరెక్టర్ పవన్ సాదినేని గురించి చెప్పాలంటే పెళ్ళంటే బాగా ఇష్టపడే ఒక క్యారెక్టర్‌ని తీసుకొని దాని చుట్టూ కథ అల్లుకొని ఒక ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చెయ్యాలన్న అతని ప్రయత్నం ఫలించలేదు. ఫస్ట్‌హాఫ్‌లో కొన్ని సీన్స్, సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు అన్నట్టు తీశాడు. కథకు సంబంధం లేని కొన్ని సీన్స్ పెట్టడం, ఏదో విధంగా ఆడియన్స్‌ని నవ్వించాలన్న ప్రయత్నంలో నాసిరకం కామెడీని జొప్పించడం సినిమాలో ఏమీ లేదు అని చెప్పుకునేలా చేస్తున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే క్లాస్‌కి, మాస్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఏమాత్రం రుచించని కథ, కథనాలతో వచ్చిన సావిత్రి చిత్రానికి కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యే అవకాశాలు తక్కువ.
ఫినిషింగ్ టచ్: ఫీల్ బ్యాడ్ మూవీ
సినీజోష్ రేటింగ్: 2.25/5