Advertisementt

సినీజోష్‌ రివ్యూ: అఆ

Thu 02nd Jun 2016 08:19 PM
telugu movie a aa review,a aa movie review in cinejosh,a aa movie cinejosh review,trivikram new movie a aa,nitin new movie a aa  సినీజోష్‌ రివ్యూ: అఆ
సినీజోష్‌ రివ్యూ: అఆ
Advertisement
Ads by CJ

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ 

అఆ(అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి) 

తారాగణం: నితిన్‌, సమంత, అనుపమ పరమేశ్వరన్‌, 

నరేష్‌, నదియ, రావు రమేష్‌, అనన్య, ఈశ్వరీరావు, 

శ్రీనివాస్‌ అవసరాల తదితరులు 

సినిమాటోగ్రఫీ: నటరాజన్‌ సుబ్రహ్మణ్యం 

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 

సంగీతం: మిక్కీ జె.మేయర్‌ 

నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ 

రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌ 

విడుదల తేదీ: 02.06.2016 

త్రివిక్రమ్‌ సినిమాల్లో కథ కంటే అతని పంచ్‌ డైలాగ్స్‌ని ఇష్టపడేవారే ఎక్కువ. త్రివిక్రమ్‌ సినిమాల్లో కథ గొప్పగా వుండాలని, స్క్రీన్‌ప్లే అద్భుతంగా వుండాలని కాకుండా అతను ఆడియన్స్‌ని ఎంతవరకు ఎంటర్‌టైన్‌ చేశాడు అనేది ప్రధానంగా అందరూ ఆలోచించే అంశం. రచయితగా అతను పనిచేసిన సినిమాలు, డైరెక్టర్‌గా అతని నుంచి వచ్చిన సినిమాలు అదే విషయాన్ని ప్రూవ్‌ చేస్తాయి. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ని కాస్త పక్కన పెట్టి సెంటిమెంట్‌ వైపు అతను మొగ్గు చూపిస్తున్నట్టు ఈమధ్యకాలంలో అతను చేసిన సినిమాలు చూస్తే తెలుస్తుంది. బంధాలు, బాంధవ్యాలపైనే ఎక్కువ దృష్టి పెట్టి కథలు రెడీ చేసుకుంటున్న త్రివిక్రమ్‌ మరోసారి అదే బాటలో వెళ్ళి చేసిన సినిమా అ ఆ. అల్లు అర్జున్‌తో వరసగా రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్‌ ఈసారి నితిన్‌ను తన సినిమాలో హీరోగా పెట్టుకున్నాడు. త్రివిక్రమ్‌తో జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలను నిర్మించిన ఎస్‌.రాధాకృష్ణతో అతినికి ఇది మూడో సినిమా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయింది? ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు సెంటిమెంట్‌ని కూడా అందించడంలో త్రివిక్రమ్‌ ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథగా చెప్పుకోవాలంటే ఇది చాలా సాధారణమైన కథ. ఎన్నో సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులు చూస్తున్న కథ. జయప్రకాష్‌, మహాలక్ష్మి(నదియా) అన్నా చెల్లెళ్ళు. చెల్లెలికి వ్యాపార నిమిత్తం డబ్బు అవసరం కావడంతో తన ఆస్తిని తాకట్టుపెట్టి ఆమెకు డబ్బు ఇస్తాడు. బ్యాంకుకు కట్టాల్సిన టైమ్‌లో డబ్బు కట్టకపోవడంవల్ల అతని ఆస్తిని జప్తు చేస్తారు. దాంతో మనస్తాపం చెందిన అన్నయ్య ఆత్మహత్య చేసుకుంటాడు. అతను చనిపోయిన తర్వాత డబ్బు ఇచ్చేందుకు వస్తుంది మహాలక్ష్మి. ఆ డబ్బు తీసుకోకపోగా ఆమెతో తెగతెంపులు చేసుకుంటుంది జయప్రకాష్‌ భార్య. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. 

మహాలక్ష్మీ, రామలింగం(నరేష్‌)ల కూతురు అనసూయ(సమంత). తన ఇష్టాయిష్టాలే కూతురి ఇష్టాలు కావాలని కోరుకునే మహాలక్ష్మి దానికి తగ్గట్టుగానే కూతుర్ని భయభక్తులతో పెంచుతుంది. తను చూసిన అబ్బాయినే పెళ్ళి చేసుకోవాలని శాసిస్తుంది. ఇది నచ్చని అనసూయ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. డిప్రెషన్‌లో వున్న కూతురికి గాలి మార్పు కావాలన్న ఉద్దేశంతో భార్య పదిరోజులు సిటీలో లేని టైమ్‌ చూసి అనసూయ మేనత్త ఊరైన కలువపూడి పంపిస్తాడు రామలింగం. కలువపూడి వెళ్ళిన అనసూయ తన బావ ఆనంద్‌ విహారి(నితిన్‌)ని ప్రేమిస్తుంది. అతన్నే పెళ్ళి చేసుకోవాలని డిసైడ్‌ అవుతుంది. తన అన్నయ్య కుటుంబ సభ్యులంటే మండి పడే మహాలక్ష్మీకి ఈ విషయం తెలిసిందా? అన్నయ్య కుటుంబానికి, మహాలక్ష్మీకి మధ్య ఏర్పడిన అపార్థాలు ఏమిటి? చివరికి ఈ రెండు కుటుంబాలు ఎలా కలిశాయి? అనేది మిగతా కథ. 

ఆనంద్‌ విహారిగా నితిన్‌ సెటిల్డ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చినప్పటికీ అతని క్యారెక్టర్‌కి అంతగా ప్రాధాన్య వున్నట్టు కనిపించదు. సినిమా ఎక్కువ శాతం సమంత, నదియ, నరేష్‌, రావు రమేష్‌, నితిన్‌ కుటుంబ సభ్యుల మధ్యే నడుస్తుంది. ఆనంద్‌ విహారి క్యారెక్టర్‌ చాలా సాధారణంగా వుండడమే కాకుండా హీరో అనే ఫీలింగ్‌ మనకు కలిగించదు. త్రివిక్రమ్‌ సినిమాలో హీరోకి వుండే స్పెషల్‌ క్వాలిటీస్‌ ఆనంద్‌ విహారిలో కనిపించవు. అయితే పెర్‌ఫార్మెన్స్‌ పరంగా నితిన్‌ ఓకే అనిపించుకున్నాడు. హీరోయిన్‌ సమంత తన కెరీర్‌లో ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేసిందని చెప్పాలి. ఫస్ట్‌ టైమ్‌ ఈ సినిమాలో కామెడీ ట్రై చేశానని సమంత తన ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ వస్తోంది. సినిమా చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తుంది. మంచి కామెడీ టైమింగ్‌తో అందర్నీ నవ్వించింది. ఇక మహాలక్ష్మీగా నదియా క్యారెక్టర్‌ని చూస్తే మనకు అత్తారింటికి దారేదిలో ఆమె చేసిన క్యారెక్టర్‌ గుర్తొస్తుంది. దానికి ఈ సినిమా కొనసాగింపుగా కూడా అనిపిస్తుంది. ఎప్పటిలాగే రావు రమేష్‌ మరో ఎటకారం క్యారెక్టర్‌ ఈ సినిమాలో చేశాడు, తన డైలాగ్స్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరో చెల్లెలు భానుగా అనన్య, హీరోని పెళ్ళి చేసుకోవాలని కలలుగనే నాగవల్లిగా అనుపమ పరమేశ్వరన్‌ ఓకే అనిపించారు. రామలింగంగా నరేష్‌ తన క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు. 

ఎక్కువ శాతం విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే సినిమా వుండడంతో సినిమా అంతా పచ్చదనంతో నిండిపోయింది. కళ్ళకింపైన ఫోటోగ్రఫీ అందించడంలో నటరాజన్‌ సుబ్రహ్మణ్యం హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. ప్రతి సీన్‌ని అద్భుతంగా చిత్రీకరించాడు. అలాగే రెండు పాటలు కూడా విజువల్‌గా బాగా అనిపిస్తాయి. మిక్కీ జె.మేయర్‌ మ్యూజిక్‌ విషయానికి వస్తే పాత పాటలు వింటున్న ఫీలింగే కలుగుతుంది. అయితే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు అనిపించాడు. త్రివిక్రమ్‌ గురించి చెప్పాల్సి వస్తే గతంలో అతని డైలాగులకు వున్న పదును, డెప్త్‌ ఇందులో కనిపించకపోయినా సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు అక్కడక్కడా కొన్ని పంచ్‌ డైలాగులు పేల్చడంలో సక్సెస్‌ అయ్యాడు. ఒక సాదా సీదా కథని తీసుకొని దానికి తన స్టైల్‌లో ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దడంలో అతని మార్క్‌ కనిపించింది. అయితే సినిమాలో కొన్ని సీన్స్‌ లెంగ్తీగా, బోరింగ్‌గా అనిపించినా టోటల్‌గా ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్‌ కలుగుతుంది. 

చాలా నార్మల్‌గా స్టార్ట్‌ అయ్యే సినిమాలో ఎలాంటి హడావిడి, ట్విస్ట్‌లు లేకుండా అంతే నార్మల్‌గా ఫస్ట్‌ హాఫ్‌ కంప్లీట్‌ అవుతుంది. ఫస్ట్‌ హాఫ్‌ చూసిన వారికి అసలు సినిమాలో మేటర్‌ ఏదైనా వుందా? సినిమా అంతా ఇలాగే వుంటుందా అనే డౌట్‌ కూడా వస్తుంది. సెకండాఫ్‌లో అసలు కథ వుంటుందని అందరూ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. అయితే సెకండాఫ్‌లో కూడా ఒక సాధారణమైన కథని ఫ్లాష్‌ బ్యాక్‌లో చెప్పడంతో అసలు కథ ఇదేనా అనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌ని కూడా కాస్త ఎంటర్‌టైనింగ్‌గానే నడిపించడంతో ప్రేక్షులు ఆ విషయాన్ని మర్చిపోయి సినిమాలో ఇన్‌వాల్వ్‌ అవుతారు. ఆనంద్‌ విహారి, అనసూయ పెళ్ళి చేసుకోవడానికి అస్సలు ఇష్టపడని మహాలక్ష్మీని భర్త రామలింగం కన్విన్స్‌ చెయ్యడంతో వాళ్ళిద్దరి పెళ్ళికి గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తుంది. ఫ్యామిలీ సెంటిమెంట్‌ ప్రధానంగా రూపొందిన ఈ సినిమాలో గుండెలు పిండేసే సెంటిమెంట్‌గానీ, బరువైన డైలాగ్స్‌గానీ, భారమైన సీన్స్‌గానీ లేకుండా చాలా లైట్‌గా క్లైమాక్స్‌ని తేల్చెయ్యడంతో సినిమా ఫర్వాలేదు, సినిమా ఓకే అనే ఫీలింగ్‌తో ఆడియన్స్‌ బయటికి వస్తారు. ఫైనల్‌గా చెప్పాలంటే రొటీన్‌ కమర్షియల్‌ సినిమాలతో విసిగి వేసారిన ప్రేక్షకులకు మంచి రిలీఫ్‌నిచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అఆ చిత్రం నిలుస్తుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: అఆ.. అంతా ఆహ్లాదమే 

సినీజోష్‌ రేటింగ్‌: 3/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ