Advertisementt

సినీజోష్‌ రివ్యూ: ఒక మనసు

Fri 24th Jun 2016 09:17 PM
telugu movie oka manasu,oka manasu movie review,oka manasu movie review in cinejosh,oka manasu cinejosh review,nikarika konidela in oka manasu,naga shourya in oka manasu  సినీజోష్‌ రివ్యూ: ఒక మనసు
సినీజోష్‌ రివ్యూ: ఒక మనసు
Advertisement
Ads by CJ

మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌ 

ఒక మనసు 

తారాగణం: నాగశౌర్య, నిహారిక కొణిదెల, రావు రమేష్‌, 

అవసరాల శ్రీనివాస్‌, ప్రగతి, నాగినీడు, వెన్నెల కిశోర్‌ 

తదితరులు 

సినిమాటోగ్రఫీ: రామ్‌రెడ్డి 

ఎడిటింగ్‌: ధర్మేంద్ర కాకరాల 

సంగీతం: సునీల్‌ కశ్యప్‌ 

సమర్పణ: టివి9 

నిర్మాత: మధుర శ్రీధర్‌రెడ్డి 

రచన, దర్శకత్వం: రామరాజు 

విడుదల తేదీ: 24.06.2016 

యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్స్‌, కమర్షియల్‌ మూవీస్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌, హార్రర్‌ థ్రిల్లర్స్‌ రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ప్యూర్‌ లవ్‌స్టోరీ, ఒక మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీని పేక్షకులకు నచ్చేలా తియ్యాలనుకోవడం సాహసంతో కూడుకున్న విషయం. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు వంటి హార్ట్‌ టచ్చింగ్‌ మూవీని ప్రేక్షకులకు అందించిన రామరాజు ఈ సాహసానికి పూనుకున్నారు. ఒక మనసు పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని టివి9 సమర్పణలో మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మించారు. మల్లెల తీరంలో.. తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో భారీ అంచనాలే వున్నాయి. అయితే ఆ అంచనాలు మరింత పెరగడానికి నిహారిక కొణిదెల మరో కారణమైంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు చాలా మంది హీరోలు వచ్చారు. మొదటిసారి ఆ ఫ్యామిలీ నుంచి నిహారిక హీరోయిన్‌గా పరిచయం అవ్వడంతో ఈ సినిమా ఎలా వుండబోతుందనే క్యూరియాసిటీ ఆడియన్స్‌లో పెరిగింది. నాగశౌర్యతో కలిసి నిహారిక నటించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక ప్యూర్‌ లవ్‌స్టోరీ చెయ్యాలన్న రామరాజు ఎంతవరకు సక్సెస్‌ అయ్యారు? నిహారిక కొణిదెల నటిగా తనను తాను ప్రూవ్‌ చేసుకోగలిగిందా? నాగశౌర్య కెరీర్‌కి ఈ సినిమా ప్లస్‌ అవుతుందా? ఈ లవ్‌స్టోరీని ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ప్రేమకథా చిత్రాలు చెయ్యాలనుకునే ప్రతి డైరెక్టర్‌ ఒక మరోచరిత్ర, ఒక గీతాంజలి లాంటి దృశ్య కావ్యాలను చెయ్యడానికి ట్రై చేస్తాడు. రామరాజు కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు. హీరో, హీరోయిన్‌ల మధ్య ఓ ఫ్లాష్‌బ్యాక్‌ వుందనే విషయం ఓపెనింగ్‌ సీన్‌లోనే రివీల్‌ అవుతుంది. హీరోయిన్‌ సంధ్య(నిహారిక కొణిదెల)ని చూసుకోవడానికి పెళ్ళి వారు వస్తున్నారని తల్లి చెప్తుంది. కట్‌ చేస్తే మూడు సంవత్సరాలు జైలులో వున్న సూర్య(నాగశౌర్య) బెయిల్‌పై రిలీజ్‌ అవుతాడు. హౌస్‌ సర్జన్‌గా పనిచేసే సంధ్యను హాస్పిటల్‌కి వచ్చి కలుసుకుంటాడు సూర్య. మూడు సంవత్సరాలుగా అతని కోసం ఎదురుచూస్తున్న సంధ్య ఒక్కసారిగా ఆనందం, దు:ఖంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్తే సూర్య, సంధ్య మధ్య ప్రేమ చిగురించడం, చిన్న చిన్న సెటిల్‌మెంట్స్‌ చేస్తూ జనంలో కాస్తో కూస్తో గుర్తింపు తెచ్చుకోవడం, అతన్ని ఎలాగైనా మంచి పొలిటీషియన్‌ని చెయ్యాలని అతని తండ్రి(రావు రమేష్‌) కలలు కనడం, ఓ సెటిల్‌మెంట్‌ కేసులో సూర్యని అరెస్ట్‌ అవ్వడం అన్నీ జరిగిపోతాయి. సూర్యపై చాలా కేసులు వున్నాయని, అతన్ని పెళ్ళి చేసుకుంటే సుఖపడలేవని తల్లి చెప్పిన మాటలు పట్టించుకోని సంధ్య.. సూర్యకి మరింత దగ్గరవుతుంది. సూర్య పొలిటికల్‌గా ఎదగడానికి అతని తండ్రి ఆస్తులు అమ్ముతాడు. అతను జైలుకు వెళ్ళడంతో ఆర్థికంగా కుంగిపోతాడు. సూర్య కేసుని కాంప్రమైజ్‌ చెయ్యడానికి తన బావ అయిన ఎమ్మెల్యేని ఆశ్రయిస్తాడు సూర్య తండ్రి. సూర్యని కేసు నుంచి బయటికి తీసుకు రావడానికి ప్రతిఫలంగా తన కూతుర్ని పెళ్ళి చేసుకోవాలని కండీషన్‌ పెడతాడు. దానికి ఓకే అంటాడు సూర్య తండ్రి. అప్పుడు సూర్య తన లవ్‌స్టోరీ గురించి, ఇప్పుడు సంధ్య తనతోనే వుందన్న విషయాన్ని తండ్రికి చెప్తాడు. కొడుకు రాజకీయంగా ఎదగాలని కోరుకున్న ఆ తండ్రి సూర్య చెప్పింది విని షాక్‌ అవుతాడు. ఇప్పుడు సూర్య ముందు రెండు ప్రశ్నలు. తండ్రి చెప్పినట్టు ఎమ్మెల్యే కూతుర్ని పెళ్ళి చేసుకోవాలా? తండ్రిని కాదని సంధ్యతో వుండాలా? ఎంతో ఆలోచించిన సూర్య తనకి బెయిల్‌ క్యాన్సిల్‌ అయిందని, సంధ్యని వాళ్ళ తల్లి దగ్గరకు వెళ్ళిపొమ్మని చెప్తాడు. సూర్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సంధ్య అతను చెప్పిన దానికి ఒప్పుకుందా? తిరిగి తన తల్లి దగ్గరకు వెళ్లిపోయిందా? సంధ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది? తండ్రి, సంధ్య మధ్య నలిగిపోతున్న సూర్య ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

సంధ్యగా నిహారిక పెర్‌ఫార్మెన్స్‌ చాలా బాగుందని చెప్పాలి. కొత్త అనేది లేకుండా ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ వున్న ఆర్టిస్టులా పెర్‌ఫార్మ్‌ చేసింది. లుక్‌వైజ్‌ కూడా అందర్నీ ఆకట్టుకుంది. తండ్రిని అమితంగా ప్రేమించే కొడుకుగా, సంధ్య ప్రేమను వదులుకోలేని ప్రేమికుడుగా నాగశౌర్య పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. తండ్రిగా రావు రమేష్‌ మరో మంచి క్యారెక్టర్‌ చేశాడు. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్‌ ఇవే. అవసరాల శ్రీనివాస్‌, నాగినీడు, ప్రగతి, వెన్నెల కిశోర్‌ క్యారెక్టర్లకు అంతగా ప్రాధ్యానత లేదు. చాలా సీన్స్‌లో సంధ్యకి ప్రగతి ఇచ్చే క్లాసులు ఆడియన్స్‌కి విసుగు పుట్టించాయి. కొన్ని సీన్స్‌లో ప్రగతి చేసిన ఓవర్‌ యాక్షన్‌ కూడా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. వెన్నెల కిషోర్‌ కనిపించిన రెండు సీన్స్‌లో నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. 

టెక్నికల్‌గా ఈ సినిమాకి ప్లస్‌ అయిన వారు ఇద్దరే ఇద్దరు. సినిమాటోగ్రాఫర్‌ రామ్‌రెడ్డి, సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌. వైజాగ్‌, అరకు అందాల్ని ఒక పెయింటింగ్‌లా చూపించడంలో రామ్‌రెడ్డి హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. ప్రతి సీన్‌ని ఎంతో అందంగా, ఆహ్లాదాన్ని కలిగించేలా చిత్రీకరించాడు. సునీల్‌ కశ్యప్‌ ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నమైన మ్యూజిక్‌ ఈ సినిమాకి చేశాడు. మెలోడియస్‌ పాటలతో ఆకట్టుకున్నాడు. పాటలను సెపరేట్‌ చెయ్యకుండా స్టోరీతోనే పాటల్ని కూడా తీసుకెళ్ళడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. సునీల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సినిమాలో చాలా ఎఫెక్టివ్‌గా అనిపించింది. డైరెక్టర్‌ రామరాజు విషయానికి వస్తే స్లో నేరేషన్‌ వల్ల సినిమా స్టార్టింగ్‌లోనే ఆడియన్స్‌కి నీరసం వచ్చేస్తుంది. రెండుంపావు గంటల సినిమాలో దాదాపు రెండు గంటలు హీరో, హీరోయిన్‌ మధ్య సీన్సే వుండడం, చెప్పిన డైలాగ్సే రిపీటెడ్‌గా చెప్పించడం బోర్‌ కొట్టిస్తుంది. ఒక చిన్న పాయింట్‌ని రెండుంపావు గంటలు చూపించాలన్న తాపత్రయంలో హీరో, హీరోయిన్‌ల మధ్య వచ్చే సీన్స్‌ పైనే రామరాజు కాన్‌సన్‌ట్రేట్‌ చేసారు తప్ప ఆడియన్స్‌కి రిలీఫ్‌ ఇవ్వాలన్న ఆలోచన చెయ్యలేకపోయారు. సూర్య, సంధ్య ప్రేమించుకున్నారు. సూర్య జైలుకి వెళ్ళి మూడు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు, సంధ్యను కలుసుకున్నాడు. ఎప్పటిలాగే వారి ప్రేమకథ నడుస్తుంటుంది. ఫస్ట్‌ హాఫ్‌ ఎండ్‌ అయినపుడే సినిమా కంప్లీట్‌ అయిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. సెకండాఫ్‌లో కూడా సూర్య, సంధ్య మధ్య రిపీటెడ్‌ సీన్స్‌ క్లైమాక్స్‌ కోసం ఎదురుచూసేలా చేస్తాయి. సినిమాలోని చాలా సీన్స్‌కి లాజిక్స్‌ మిస్‌ అయ్యాయి. హీరో దగ్గరికి వచ్చి అతని ఇంట్లోనే హీరోయిన్‌ వుంటుంది. అయితే వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారా? లేక సహజీవనమా? అనేది క్లారిటీ వుండదు. సినిమా మొత్తంలో ఆకట్టుకునేవి ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌. ప్రీ క్లైమాక్స్‌ నుంచే ఆడియన్స్‌ కథలో బాగా ఇన్‌వాల్వ్‌ అయిపోతారు. ఎవరూ ఊహించని క్లైమాక్స్‌తో ఆడియన్స్‌ ఒక్కసారిగా షాక్‌ అవుతారు. 

ఇప్పటివరకు తెలుగులో ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. కొన్ని ప్రేమకథలు ఎప్పటికీ గుర్తుండిపోయేవి అయితే మరికొన్ని గుర్తు తెచ్చుకొని ఫీల్‌ అయ్యేవి. ఏ ప్రేమకథ అయినా సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఆడియన్స్‌ని ఇబ్బంది పెట్టకపోతే ఆ డైరెక్టర్‌ సక్సెస్‌ అయినట్టే. ఈ సినిమా విషయానికి వస్తే స్లో నేరేషన్‌, స్క్రీన్‌ మీద ఎప్పుడూ హీరో, హీరోయిన్‌ మాత్రమే కనిపించడం వల్ల రెండు గంటల సీన్‌ని కాస్ట్యూమ్స్‌ మార్చి సెపరేట్‌ సీన్స్‌లా చూపించినట్టు ఆడియన్స్‌ ఫీల్‌ అయ్యేలా వుంటుంది. రెండు గంటలు ఇలాంటి ఇబ్బందులు పడినా చివరి పావు గంట సినిమా మాత్రం హార్ట్‌ టచ్చింగ్‌గా వుండడం వల్ల సినిమా ఫర్వాలేదు అని ఆడియన్స్‌ సర్ది చెప్పుకుంటారు. ఫైనల్‌గా చెప్పాలంటే నిహారిక కొణిదెలకి ఈ సినిమా ఒక గొప్ప ఎంట్రీ అని మాత్రం చెప్పొచ్చు. ఎ సెంటర్స్‌ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. కమర్షియల్‌గా ఈ సినిమాకి ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందీ, బి, సి సెంటర్స్‌ ఆడియన్స్‌ని ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే. 

ఫినిషింగ్‌ టచ్‌: ప్యూర్‌ లవ్‌స్టోరీయే. కానీ,.. 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ