Advertisementt

సినీజోష్‌ రివ్యూ: సెల్ఫీ రాజా

Fri 15th Jul 2016 09:13 PM
allari naresh new movie selfie raja,selfie raja movie review,telugu movie selfie raja,selfie raja review in cinejosh,selfie raja cinejosh review  సినీజోష్‌ రివ్యూ: సెల్ఫీ రాజా
సినీజోష్‌ రివ్యూ: సెల్ఫీ రాజా
Advertisement
Ads by CJ

ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌ 

గోపి ఆర్ట్స్‌ 

సెల్ఫీ రాజా 

తారాగణం: అల్లరి నరేష్‌, కామ్నాసింగ్‌, సాక్షి చౌదరి, సప్తగిరి, 

తాగుబోతు రమేష్‌, షకలక శంకర్‌, రవిబాబు, కృష్ణభగవాన్‌, 

పృథ్వీ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఎస్‌.లోకనాథన్‌ 

సంగీతం: సాయికార్తీక్‌ 

ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ 

కథ: శ్రీధర్‌ సీపాన 

మాటలు: డైమండ్‌ రత్నబాబు 

సమర్పణ: సుంకర రామబ్రహ్మం 

నిర్మాత: చలసాని రామబ్రహ్మం చౌదరి 

దర్శకత్వం: జి.ఈశ్వర్‌రెడ్డి 

విడుదల తేదీ: 15.07.2016 

అల్లరి నరేష్‌ అంటే కామెడీకి కేరాఫ్‌ అడ్రస్‌. రాజేంద్రప్రసాద్‌ తర్వాత కామెడీ హీరోగా అంతటి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న నరేష్‌కి ఈమధ్యకాలంలో అన్నీ అపజయాలే ఎదురవుతున్నాయి. ఎలాంటి సినిమా చేసినా అది బెడిసి కొడుతోంది. ఒకప్పుడు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన గోపి ఆర్ట్స్‌ సంస్థ చాలా గ్యాప్‌ తర్వాత ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఓ సినిమా చేస్తోంది, అదీ అల్లరి నరేష్‌ హీరోగా అంటే ఆ సినిమా ఎలా వుండాలి? అల్లరి నరేష్‌ ఇమేజ్‌కి, ఆయా బేనర్ల ప్రతిష్టకు తగ్గట్టు వుంటుందని ఆడియన్స్‌ కూడా అనుకోవడంలో తప్పులేదు. అల్లరి నరేష్‌తో సిద్ధు ఫ్రమ్‌ సికాకుళం అనే విజయవంతమైన సినిమాని రూపొందించిన జి.ఈశ్వర్‌రెడ్డి కాంబినేషన్‌లో ఈ రెండు పెద్ద సంస్థలు కలిసి చేసిన సినిమా సెల్ఫీరాజా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో నరేష్‌ ఏ రేంజ్‌లో అల్లరి చేశాడు? అసలే ఫ్లాపుల్లో వున్న నరేష్‌కి ఈశ్వర్‌రెడ్డి హిట్‌ సినిమా ఇవ్వగలిగాడా? ఆడియన్స్‌ ఈ సినిమాని ఎలా రిసీవ్‌ చేసుకుంటున్నారు? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కామెడీ అంటే స్పూఫ్‌ కాదు. నాలుగు సినిమాల్లోని డైలాగ్స్‌ని తిప్పి తిప్పి మనకే చెప్పి నవ్వించాలనుకోవడం అవివేకమే అవుతుంది. అలా చెప్పిన డైలాగ్స్‌ గతంలో ఆడియన్స్‌ పడీ పడీ మరీ నవ్వారు. అయితే దానికీ లిమిట్‌ వుంది. దాన్ని మించి వెళితే అది అపహాస్యం అవ్వడం ఖాయం. ఈరోజు రిలీజ్‌ అయిన సెల్ఫీరాజా చిత్రానికి కూడా అదే జరిగింది. సెల్ఫీరాజా అనే టైటిల్‌ ఎనౌన్స్‌ చెయ్యగానే ఈసారి డెఫినెట్‌గా అల్లరి నరేష్‌ హిట్‌ కొట్టేస్తాడని అందరూ భావించారు. కానీ, సీన్‌ రివర్స్‌ అయిందని సినిమా స్టార్ట్‌ అయిన కొద్ది సేపటికే అర్థమైపోతుంది. కథ లేకుండా, ఒక సీన్‌కి మరో సీన్‌కి సంబంధం లేకుండా, ఏ క్యారెక్టర్‌ ఎందుకు ఎంటర్‌ అవుతుందో అర్థంకాక అయోమయంలో పడిపోతున్న ప్రేక్షకుడ్ని మరింత అయోమయంలో పడెయ్యడానికా అన్నట్టు హీరో డబుల్‌ రోల్‌ ఎంటర్‌ అవ్వడం.. ఈ రెండు క్యారెక్టర్లు ఆడియన్స్‌తో ఆడేసుకోవడం, మధ్య మధ్యలో కమెడియన్స్‌ తమ శక్తి మేర ప్రేక్షకులకు సహన పరీక్ష చెయ్యడం చకచకా జరిగిపోతాయి. ఫస్ట్‌ హాఫ్‌ ఎప్పుడు కంప్లీట్‌ అవుతుందా? ఎప్పుడు బయటికెళ్ళి ఓ టీ తాగి శక్తి తెచ్చుకుందామా అని ఆలోచించే ఆడియన్స్‌కి కాస్తయినా రిలీఫ్‌ ఇవ్వకుండా దంచడంతో చచ్చీ చెడి ఫస్ట్‌ హాఫ్‌ కంప్లీట్‌ అయిందనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో మోతాదు కాస్త పెరిగి ఆడియన్స్‌కి పిచ్చెక్కే పరిస్థితికి చేరుతుంది. ఇదీ సెల్ఫీరాజాలో హీరో, కమెడియన్స్‌, డైరెక్టర్‌ చేసిన విన్యాసాలు. 

కథగా చెప్పుకోవడానికి సినిమాలో ఏమీ లేదు. సెల్ఫీరాజా అనే టైటిల్‌కి, సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. సినిమా స్టార్ట్‌ అయిన కాసేపటికి పొరపాటున మనం వేరే సినిమాకి వచ్చామా అనే అనుమానం కూడా మనకు కలుగుతుంది. ఈ మాత్రం సినిమాకి మళ్ళీ శర్వానంద్‌ వాయిస్‌ ఓవర్‌ కూడా వుంది. హీరో రాజాకి సెల్ఫీల పిచ్చి అనీ, దాంతో పాటు నోటి దురద కూడా చాలా వుందని, తత్ఫలితంగా లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ వుంటాడని శర్వానంద్‌ హీరో గురించి తెగ బిల్డప్‌లు ఇస్తూ ఈ సెల్ఫీల పిచ్చితో ఇంకా ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో మీరే చూడండి అని సెల్ఫీరాజాని మనమీదకు వదుల్తాడు శర్వానంద్‌. అక్కడ కట్‌ చేస్తే సినిమా ఎండ్‌ అయ్యే వరకు కూడా సెల్ఫీల ప్రస్తావన వుండదు. అసలు డైరెక్టర్‌ అనుకున్న కథ ఏమిటో, ఏ పాయింట్‌తో ఆడియన్స్‌ని నవ్వించాలనుకున్నాడో, అసలు ఏ కథ చెప్పి అల్లరి నరేష్‌ని ఈ సినిమా చెయ్యడానికి ఒప్పించాడో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. 

ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే హీరో నుంచి మొదలు పెడితే కమెడియన్స్‌, జూనియర్‌ ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరూ ఓవర్‌ యాక్షన్‌ చేశారు. హీరోయిన్‌ కామ్నా సింగ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టులా కనిపిస్తుందే తప్ప హీరోయిన్‌లా అనిపించదు. పృథ్వీ మరోసారి తన సినిమా డైలాగులతో ఆడియన్స్‌ని ఆకట్టుకోవాలని ట్రై చేశాడు. అది కూడా మోతాదు మించడంతో మొహం మొత్తుతుంది. మిగతా క్యారెక్టర్స్‌లో కృష్ణభగవాన్‌, షకలక శంకర్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, రవిబాబు ఆడియన్స్‌ సహనాన్ని పరీక్షించేందుకు తమ వంతు కృషి చేశారు. అయితే ఆ క్రెడిట్‌ అంతా డైరెక్టర్‌కే దక్కుతుంది అనడంలో సందేహం లేదు. ఇంకా ఈ సినిమాలో మరో సుదీర్ఘమైన ఎపిసోడ్‌ వుంటుంది. అదేమిటంటే హీరో సూసైడ్‌ చేసుకోవాలనుకుంటాడు. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి చావు రాదు. ఈ ఎపిసోడ్‌ కంప్లీట్‌ అయ్యే సరికి మన చావుకొచ్చినంత పనవుతుంది. ఈ సినిమాకి ఎందుకొచ్చామురా నాయనా అని మనల్ని మనం తిట్టుకునే సందర్భం కూడా ఎదురవుతుంది. 

ఇక టెక్నికల్‌గా ఈ సినిమాకి ఎలాంటి ఎస్సెట్స్‌ లేవు. ఫోటోగ్రఫీ, మ్యూజిక్‌, పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ఎడిటింగ్‌..ఇలా ఏ విభాగం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కథ లేకుండా, కేవలం ముక్కలు ముక్కలుగా తీసిన సీన్స్‌ని ఒక దగ్గర చేర్చి ఆడియన్స్‌ నవ్వించాలనుకున్న ఈశ్వర్‌రెడ్డి ప్రయత్నం ఫలించలేదు. అసలే ఫ్లాపుల్లో వున్న నరేష్‌ని పీకల్లోతు ఫ్లాపుల్లో ముంచేశాడు. ఇక రెండు పెద్ద సంస్థలు కలిసి చేసిన ఈ సినిమాలో ప్రొడక్షన్‌ వేల్యూస్‌ అనేవి ఇసుమంత కూడా కనిపించవు. దీనికంటే చిన్న హీరోలతో, చిన్న బడ్జెట్‌తో తీసే సినిమాలు ఎంతో క్వాలిటీగా వుంటున్నాయనేది నిజం. ఫైనల్‌గా చెప్పాలంటే రకరకాల సమస్యలతో సతమతమయ్యే ప్రేక్షకులు కాసేపు రిలాక్స్‌డ్‌గా నవ్వుకుందామని ఈ సినిమాకి వెళితే మరో కొత్త సమస్య ఎదురవుతుంది అనడంలో ఎలాంటి డౌటూ లేదు. సెల్ఫీరాజాతో తెగ నవ్విస్తాడని ఆశపడ్డ ప్రేక్షకుల్ని మరోసారి డిజప్పాయింట్‌ చేశాడు అల్లరి నరేష్‌. 

ఫినిషింగ్‌ టచ్‌: ఇది సూసైడ్‌ రాజా 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ