Advertisementt

సినీజోష్‌ రివ్యూ: నాయకి

Sat 16th Jul 2016 03:09 PM
telugu movie nayaki,trisha latest movie nayaki,nayaki movie review,nayaki movie review in cinejosh,nayaki cinejosh review  సినీజోష్‌ రివ్యూ: నాయకి
సినీజోష్‌ రివ్యూ: నాయకి
Advertisement
Ads by CJ

గిరిధర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ 

నాయకి 

తారాగణం: త్రిష, సుష్మారాజ్‌, సత్యం రాజేష్‌, జయప్రకాష్‌, 

గణేష్‌ వెంకట్రామన్‌, బ్రహ్మానందం తదితరులు 

సినిమాటోగ్రఫీ: జగదీష్‌ చీకటి 

సంగీతం: రఘు కుంచె 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: సాయికార్తీక్‌ 

ఎడిటింగ్‌: గౌతంరాజు 

సమర్పణ: రాజ్‌ కందుకూరి 

నిర్మాతలు: గిరిధర్‌ మామిడిపల్లి 

శ్రీమతి పద్మజ మామిడిపల్లి 

రచన, దర్శకత్వం: గోవి 

విడుదల తేదీ: 15.07.2016 

ఈమధ్య కాలంలో హార్రర్‌ మూవీస్‌కి విపరీతమైన ఆదర పెరిగింది. హార్రర్‌కి తోడు కామెడీ కూడా వుంటే ఆడియన్స్‌కి అది అడ్వాంటేజే. కొన్ని కథల్లో దెయ్యాలు లేకపోయినా వున్నాయని ఆయా క్యారెక్టర్లు భ్రమ పడుతూ తద్వారా మనల్ని భయపెడుతూ వుంటాయి. కొన్ని కథల్లో నిజంగానే దెయ్యాలు కాస్ట్యూమ్స్‌ వేసుకొని తిరుగుతూ భయపెడుతుంటాయి. సాధారణంగా ప్రేతాత్మ కథలు అనగానే తనకు జరిగిన అన్యాయానికి ప్రేతాత్మగా మారి పగ తీర్చుకోవడం అనే కాన్సెప్ట్‌తోనే వుంటాయి. ఈమధ్యకాలంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చినా వాటిలోనే ఒక డిఫరెంట్‌ హార్రర్‌ మూవీగా ఈరోజు రిలీజ్‌ అయిన నాయకి చిత్రం గురించి తమ ప్రమోషన్‌లో చెప్తూ వస్తున్నారు దర్శకనిర్మాతలు. అంత స్పెషాలిటీ నాయకి చిత్రంలో ఏం వుంది? ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో నాయకికి జరిగిన అన్యాయం ఏమిటి? ఫస్ట్‌ టైమ్‌ ఒక ఘోస్ట్‌ క్యారెక్టర్‌ చేసిన త్రిష తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ని భయపెట్టగలిగిందా? డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌ గోవి ఆడియన్స్‌ని థ్రిల్‌ చెయ్యగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

అది దుండిగల్‌. అక్కడ పాతిక సంవత్సరాలుగా మనుషులు అదృశ్యమైపోతున్నారు. దాంతో ఊరంతా ఖాళీ అయిపోయింది. కానీ, మిస్సింగ్‌ కేసులు మాత్రం పెరుగుతూనే వున్నాయి. రెండు రాష్ట్రాల్లోని చాలా మంది దుండిగల్‌కి వెళ్ళి మాయమైపోతున్నారు. ఈ మిస్టరీని ఛేదించడం పోలీసుల వల్ల కూడా కాలేదు. కట్‌ చేస్తే దుండిగల్‌లోని ఓ పాత భవనం గురువారం రాత్రి 12 గంటలు దాటగానే అక్కడ లైట్లు వెలుగుతాయి. ఆ వెంటనే ఒక హత్య జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది అదే. ఆ భవనంలో గాయత్రి(త్రిష) ప్రేతాత్మగా తిరుగుతుంటుంది. ప్రతిరోజూ రాత్రి ఎవరి కోసమో ఎదురుచూస్తూ వుంటుంది. మళ్ళీ కట్‌ చేస్తే సంజయ్‌(సత్యం రాజేష్‌) అనే వెధవ. సిటీలోని వెధవల్ని లిస్ట్‌ ఔట్‌ చేస్తే అందులో వచ్చే మొదటి పేరు సంజయ్‌దే. అతనికి, కోటీశ్వరురాలైన అమ్మాయికి పెళ్ళి చూపులు. అది ఒక కాఫీ షాప్‌లో జరుగుతాయి. అమ్మాయికి సంజయ్‌ బాగా నచ్చేశాడు. అదే టైమ్‌లో ఊరి నుంచి సంజయ్‌ స్నేహితురాలు సంధ్య(సుష్మారాజ్‌) వస్తుంది. తనతో రాత్రి 12 గంటల వరకూ వుంటే సర్‌ప్రైజ్‌ ఇస్తానని చెప్పి షామీర్‌పేటలోని తన ఫ్రెండ్‌ గెస్ట్‌ హౌస్‌కి బయల్దేరతాడు సంజయ్‌. కానీ, ట్రాప్‌ చేసి సంజయ్‌, సంధ్య దుండిగల్‌లోని తన ఇంటికి వచ్చేలా చేస్తుంది గాయత్రి. ఇక అక్కడి నుంచి రకరకాల విన్యాసాలతో వాళ్ళిద్దర్నీ ఆడుకోవడం మొదలు పెడుతుంది. అక్కడి రప్పించే ప్రతి ఒక్కరినీ చంపే గాయత్రి సంజయ్‌ని మాత్రం చంపదు. అప్పటి వరకు కొన్ని వందల మందిని చంపిన గాయత్రి సంజయ్‌ని ఎందుకు చంపకుండా ఆడుకుంటుంది? అసలు గాయత్రి ఎందుకీ హత్యలు చేస్తోంది? గాయత్రికి జరిగిన అన్యాయం ఏమిటి? గాయత్రి తీరని కోరిక ఏమిటి? చివరికి ఆమె కోరిక తీరిందా? అనేది మిగతా కథ. 

ఈ సినిమా చూసిన వారికి ఇది కూడా ఒక కథేనా? అనిపిస్తుంది. ఇలాంటి కథలు తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచీ వస్తూనే వున్నాయి, ఇందులో కొత్తదనం ఏం వుంది? అనుకోవడంలో తప్పు లేదు. కానీ, నాయకి మాత్రం అలాంటి కథతోనే తీశారు. హార్రర్‌ సినిమా అనగానే రకరకాల సౌండ్స్‌తో, అదరగొట్టే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ప్రేక్షకుల్ని భయపెట్టాలని ట్రై చేస్తారు డైరెక్టర్స్‌. ఈ సినిమా విషయానికి వస్తే ఒక బలమైన కథ, కథనాలు లేకుండా కేవలం సినిమా అంతా త్రిషనే చూపిస్తూ టైమ్‌ పాస్‌ చెయ్యాలనుకున్నాడు డైరెక్టర్‌. కథ ఎలాగూ పాతదే. కథనం అయినా కొత్తగా వుంటుందేమో అనుకుంటే ప్రతి సీన్‌ టీవీ సీరియల్‌ కంటే దారుణంగా అనిపిస్తుంది. ఒక ప్రాంతంలో మనుషులు అదృశ్యమైపోతున్నారు అనే సీరియస్‌ టాపిక్‌ తీసుకొని త్రిష రూపంలో వున్న ఆత్మని చూపిస్తూ సత్యం రాజేష్‌, సుష్మరాజ్‌లతో కలిసి కామెడీ చెయ్యడం చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. గాయత్రి ఆత్మతోపాటు ఆమె తండ్రి కూడా ఆమెతోనే తిరుగుతుంటాడు. అమ్మాయిలకు అన్యాయం చేసేవారిని సెలెక్ట్‌ చేసుకొని వాళ్ళు దుండిగల్‌లోని బంగాళాకు వచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత గాయత్రి వాళ్ళని చంపుతుంది. గాయత్రి, ఆమె తండ్రి ఎందుకిలా చేస్తున్నారంటే దానికి ఓ ఫ్లాష్‌ బ్యాక్‌ వుంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌ స్టార్ట్‌ అవ్వగానే గాయత్రికి ఎలాంటి అన్యాయం జరిగి వుంటుందో అందరూ ఇట్టే ఊహించేస్తారు. దాంతో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎప్పుడు కంప్లీట్‌ అవుతుందా? సినిమా క్లైమాక్స్‌కి ఎప్పుడొస్తుందా? అని ఆడియన్స్‌ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని సినిమాల్లోని ప్రేతాత్మలా కాకుండా ఈ సినిమాలో ప్రేతాత్మకి ఒక స్పెషాలిటీ వుంటుంది. మామూలు మనిషికి కెమెరా నుంచి చూస్తేనే కనిపిస్తుంది తప్ప మామూలుగా కనిపించదు. తెరమీద నాయకిగా కనిపించాలనుకున్న గాయత్రి కోరిక తీరకుండానే చనిపోవడంతో ఆమె కోరిక తీర్చేందుకు సంజయ్‌ ముందుకొస్తాడు. ఒక ఆత్మతో సినిమా తియ్యాలని డిసైడ్‌ అవుతాడు. కథగా చెప్పుకుంటే రెండు ముక్కల్లో అయిపోతుంది. కానీ, దీన్ని రెండు గంటల సేపు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేందుకే అన్నట్టుగా డైరెక్టర్‌ సాగదీశాడు. హార్రర్‌ మూవీ కావడంతో సాయికార్తీక్‌ తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో భయపెట్టే ప్రయత్నం చేశాడు కానీ అది వర్కవుట్‌ అవ్వలేదు. జగదీష్‌ చీకటి ఫోటోగ్రఫీ బాగానే వున్నా కథ, కథనాలు బలహీనం కావడంతో అది సినిమాకి ఉపయోగపడలేదు. గాయత్రిగా నటించిన త్రిష పెర్‌ఫార్మెన్స్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఏమీ లేదు కాబట్టి ఆమెకు సాధారణమైన మార్కులే లభిస్తాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఈమధ్య కాలంలో వచ్చిన హార్రర్‌ సినిమాల్లో హార్రర్‌తోపాటు ఎంతో కొంత కామెడీని జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో కూడా అక్కడక్కడా కామెడీ వున్నా అది ఎవ్వరికీ నవ్వు రాకపోవడం విశేషం. హార్రర్‌ సినిమాలను ఇష్టపడే వారిని కూడా నాయకి నిరాశ పరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఫినిషింగ్‌ టచ్‌: సీరియల్‌కి ఎక్కువ సినిమాకి తక్కువ 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ