గీతా ఆర్ట్స్
శ్రీరస్తు శుభమస్తు
తారాగణం: అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్‌రాజ్,
తనికెళ్ళ భరణి, రావు రమేష్, ఆలీ, సుమలత, ప్రగతి,
రవిప్రకాష్, హంసానందిని తదితరులు
సినిమాటోగ్రఫీ: మణికందన్
సంగీతం: ఎస్.ఎస్.థమన్
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాత: అల్లు అరవింద్
రచన, దర్శకత్వం: పరశురామ్
విడుదల తేదీ: 05.08.2016
మధ్య తరగతి కుటుంబంలోని ఆడపిల్లకు పెళ్ళి చెయ్యాలంటే వారి తాహతుకి మించిన సంబంధాన్నే వెతుకుతారు తల్లిదండ్రులు. ఎందుకంటే తమ ఇంట్లో కంటే అత్తగారింట్లో కూతురు ఇంకా సంతోషంగా వుంటుందని... ఇది ఓ ఆడపిల్ల తండ్రి ఆలోచన. ఓ మధ్యతరగతి అమ్మాయి కోటీశ్వరుడైన అబ్బాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుందంటే అది ఆ అబ్బాయి ఆస్తిని చూసి మాత్రమే. రాత్రికి రాత్రే తన కూతురు కోటీశ్వరురాలు అయిపోయిందని ఆమె తండ్రి ఆశ. ఉన్నంతలో కూతుర్ని బాగానే పెంచిన తండ్రి ఉన్నంతలోనే సంబంధం చూసుకోవాలి... ఇది మల్టీ మిలియనీర్ అయిన ఓ అబ్బాయి తండ్రి అభిప్రాయం. ఈ తరహా కథలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. మళ్ళీ అలాంటి కథనే తీసుకొని కొత్తగా చూపించడానికి చేసిన ప్రయత్నమే శ్రీరస్తు శుభమస్తు. అల్లు శిరీష్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా పరశురామ్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ పాతకథ ప్రేక్షకుల్ని ఏ మేర ఆకట్టుకుంది? ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అయింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
పైన చెప్పుకున్న ఆ మిలియనీర్(ప్రకాష్‌రాజ్) పెద్ద కొడుకు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకొస్తాడు. మధ్య తరగతి వాళ్ళంటే చిన్న చూపు వున్న ఆ తండ్రి తన అక్కసును వెళ్ళగక్కుతూనే కొడుకు పెళ్ళిని ఒప్పుకుంటాడు. అయితే కోడల్ని ఎప్పుడూ తన ఎదురు పడొద్దని ఆర్డర్ పాస్ చేస్తాడు. కట్ చేస్తే అతని చిన్న కొడుకు శిరీష్(అల్లు శిరీష్) బిజినెస్ వ్యవహారంపై ఓ హిల్ స్టేషన్‌కి వెళ్తాడు. అక్కడ అనన్య(లావణ్య త్రిపాఠి)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అనన్య హైదరాబాద్ అమ్మాయే అని తెలుసుకుంటాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అనన్య అడ్రస్ కనుక్కుంటాడు. ఆమె వల్ల తన పర్స్, ఐడెంటిటీ పోయేలా ప్లాన్ చేస్తాడు. అనన్య వల్లే తన ఐడెంటిటీ పోయిందని, కాబట్టి తనకు షెల్టర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో శిరీష్‌ను తన ఇంట్లోనే వుండమంటుంది. అలా శిరీష్ వచ్చి అనన్య ఇంట్లోనే వుండడానికి రీజన్ ఏమిటి? ఫ్లాష్‌బ్యాక్‌కి వెళ్తే... తన ప్రేమ విషయాన్ని తండ్రికి చెప్పడం, ఆయన ఎప్పటిలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి క్లాస్ పీకడం జరిగిపోతాయి. తను ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిలా వెళ్ళి ఆమె ప్రేమను గెలుచుకుంటానని తండ్రితో ఛాలెంజ్ చేసి అనన్య ఇంట్లో చేరతాడు శిరీష్. కొన్ని రోజుల తర్వాత శిరీష్ అంటే అనన్య ఇష్టపడుతుంది. అతనికి ఐ లవ్ యూ చెప్పడానికి ఓరోజు గుడికి రమ్మని చెప్తుంది. అదే టైమ్‌లో అనన్య తండ్రి జగన్నాథం(రావు రమేష్) చిరకాల మిత్రుడు, అతన్ని అన్నివిధాలుగా ఆదుకునే మిత్రుడు కోటేశ్వరరావు(తనికెళ్ళ భరణి) కొడుకు అరుణ్‌తో పెళ్ళి ఫిక్స్ అవుతుంది. తండ్రి మాటను కాదనలేక ఆ పెళ్ళికి ఒప్పుకుంటుంది అనన్య. శిరీష్‌ని ప్రేమిస్తున్న విషయం అనన్య తండ్రికి ఎందుకు చెప్పలేకపోయింది? తన కోసం గుడి దగ్గర వెయిట్ చేస్తున్న శిరీష్‌కి ఏం సమాధానం చెప్పింది? అనన్య తన ప్రేమ విషయాన్ని మనసులోనే దాచుకొని అరుణ్‌ని పెళ్ళి చేసుకుందా? ఈ విషయం తెలిసిన శిరీష్ ఎలా రియాక్ట్ అయ్యాడు? అనేది మిగతా కథ.
తండ్రిని గౌరవిస్తూనే తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతో మధనపడే అబ్బాయిగా అల్లు శిరీష్ పెర్‌ఫార్మెన్స్ ఫర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని సెంటిమెంట్ సీన్స్‌లో అందర్నీ ఆకట్టుకున్నాడు. తండ్రి మాటకు ఎదురు చెప్పలేని కూతురుగా, తనూ ప్రేమించినా ఆ విషయం శిరీష్‌కి చెప్పలేని నిస్సహాయురాలిగా లావణ్య త్రిపాఠి తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేసింది. ప్రేమ పెళ్ళిళ్ళను వ్యతిరేకించే తండ్రిగా ప్రకాష్‌రాజ్ క్యారెక్టర్ రొటీన్‌గా వుంది. ఆ క్యారెక్టర్‌లో అతని పెర్‌ఫార్మెన్స్ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. తల్లి లేని కూతుర్ని అల్లారు ముద్దుగా చూసుకునే ఓ బాధ్యత గల తండ్రిగా రావు రమేష్ నటన అందర్నీ మెప్పిస్తుంది. హీరో తల్లిగా సుమలత చేసిన క్యారెక్టర్‌లో ఎలాంటి వైవిధ్యం లేదు. దానికి తగ్గట్టుగానే ప్రతి సీన్‌లో ఆ క్యారెక్టర్‌ని అలా నిలబెట్టారే తప్ప ఆమెకు సరైన డైలాగ్స్ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్‌లో ప్రభాస్ శ్రీను ప్రేక్షకుల్ని నవ్వించేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ, కొంతవరకే సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌లో ఎంటర్ అయ్యే ఆలీ క్యారెక్టర్ ఆడియన్స్‌ని ఫుల్ ప్లెడ్జ్‌డ్‌గా ఎంటర్‌టైన్ చేసింది.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి మణికందన్ ఫోటోగ్రఫీ మంచి ప్లస్ అయింది. అయితే తన స్కిల్స్‌ని చూపించే అవకాశం ఎక్కువ రాలేదు. థమన్ చేసిన పాటలు ఫర్వాలేదు అనిపించాయి. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకునేలా వుంది. డైరెక్టర్ విషయానికి వస్తే పరశురామ్ రాసుకున్న కథ, కథనాలు చాలా పాతవే. ఇలాంటి సినిమాలు గతంలో మనం ఎన్నో చూశాం. కోటీశ్వరుడైన అబ్బాయి ఓ మధ్య తరగతి అమ్మాయిని ప్రేమించడం, ఆమె ప్రేమను దక్కించుకోవడం కోసం ఎంత రిస్క్ అయినా చెయ్యడం అనేది మన సినిమాల్లో రొటీనే. తండ్రితో ఛాలెంజ్ చేసి అబ్బాయి.. అమ్మాయి ఇంటికి చేరడం, వాళ్ళ మధ్య కొట్లాటలు, సూటి పోటి మాటలు.. ఎట్టకేలకు అబ్బాయిని అమ్మాయి యాక్సెప్ట్ చెయ్యడం, పెద్ద వాళ్ళ సమస్య వల్ల ఎవరి ప్రేమను వాళ్ళు మనసులోనే దాచేసుకోవడం.. ఇవన్నీ ఈ సినిమాలో వున్నాయి. హీరో హీరోయిన్ ఇంటికి వెళ్ళడం, ఆమెను రకరకాల ఇబ్బందులు పెట్టడం వంటి సీన్స్ చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యే వరకు కథ ఓ దారికి వచ్చినట్టుగా అనిపించదు. సెకండాఫ్‌లో హీరోయిన్ పెళ్ళి చేయడానికి హీరో ఆమె ఇంటికి రావడం, పెళ్ళి పెద్దలా అన్నీ దగ్గరుండి చూసుకోవడం, క్లైమాక్స్‌లో ప్రకాష్‌రాజ్ రియలైజ్ అవ్వడం, పీటల మీద పెళ్ళి ఆపేసి హీరో, హీరోయిన్‌లను కలపడం.. ఇదంతా రొటీన్‌గానే అనిపిస్తుంది. ఓ పాత కథని తీసుకున్నా దాన్ని కొత్తగా చెప్పలేకపోయాడు డైరెక్టర్. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా, క్లైమాక్స్ బొమ్మరిల్లు చిత్రాలను గుర్తు తెస్తాయి. అయితే సెకండాఫ్‌లో కొన్ని సెంటిమెంట్ సీన్స్, క్లైమాక్స్‌లో హీరో చెప్పే డైలాగ్స్ మనసుకు హత్తుకునేలా వుంటాయి. వాటికి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఫస్ట్ హాఫ్ అంతా సిల్లీగా అనిపించినా, సెకండాఫ్ ఫర్వాలేదు అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. పరశురామ్ చాలా అర్థవంతమైన డైలాగ్స్ రాశాడు. సోసోగా వున్న కథతో స్టార్ట్ అయ్యే సినిమా ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోకపోయినా సెకండాఫ్ నుంచి కాస్త స్పీడ్ అవుతుంది. మధ్య మధ్యలో ఆలీ చేసే కామెడీ ఆడియన్స్‌కి రిలీఫ్‌నిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే అల్లు శిరీష్ గతంలోనే చేసిన రెండు సినిమాల కంటే ఇది అతనికి కొంచెం బెటర్ మూవీ అని చెప్పొచ్చు. మరో ప్రత్యేకత ఏమిటంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్ అనేది లేదు. కుట్ర, కుతంత్రాలు అస్సలు లేవు. పాత కథనే మళ్ళీ చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.
ఫినిషింగ్ టచ్: పాత కథతో కొత్త సినిమా
సినీజోష్ రేటింగ్: 2.75/5