శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీజి ఫిలింస్
ఆటాడుకుందాం.. రా
తారాగణం: సుశాంత్, సోనమ్ ప్రీత్ బజ్వా, మురళీశర్మ, పోసాని,
పృథ్వీ, రఘుబాబు, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటింగ్: గౌతంరాజు
కథ: జి.నాగేశ్వరరెడ్డి, డైమండ్ రత్నబాబు
మాటలు: శ్రీధర్ సీపాన
నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి
విడుదల తేదీ: 19.08.2016
కాళిదాసుతో హీరోగా పరిచయమైన సుశాంత్ ఆ తర్వాత కరెంట్, అడ్డా వంటి సినిమాలు చేసినా హీరోగా అతనికి అనుకున్న గుర్తింపు రాలేదు. తన మొదటి మూడు సినిమాలు కొత్త డైరెక్టర్స్‌తోనే చేసిన సుశాంత్ నాలుగో సినిమాతోనైనా హిట్ కొట్టాలని డిసైడ్ అయినట్టున్నాడు. అందుకే కొంత గ్యాప్ తీసుకొని, స్టైలింగ్ పరంగా కొంత మేకోవర్ అయి ఈసారి హిట్ పర్సెంటేజ్ ఎక్కువ వున్న జి.నాగేశ్వరరెడ్డి డైరెక్షన్‌లో ఆటాడుకుందాం..రా టైటిల్‌తో సినిమా స్టార్ట్ చేశాడు. శ్రీనాగ్ కార్పొరేషన్ బేనర్‌లో వరసగా సుశాంత్‌తో నాలుగో సినిమా నిర్మించిన చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల కూడా ఈసారి కన్‌ఫర్మ్‌గా హిట్ సినిమా చేస్తున్నామనే కాన్ఫిడెన్స్‌తో వున్నారు. నాగేశ్వరరెడ్డిపై నిర్మాతలు పెట్టుకున్న నమ్మకాన్ని అతను ఎంతవరకు నిలబెట్టుకున్నాడు? సుశాంత్ చేసిన ఈ నాలుగో సినిమాకైనా కమర్షియల్ హిట్ టాక్ వచ్చిందా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
ఆటాడుకుందాం.. రా సినిమాకి వున్న ఒకే ఒక ప్లస్ పాయింట్ నాగేశ్వరరెడ్డి. గతంలో అతని డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌గా పేరు తెచ్చుకోవడమే కాకుండా కమర్షియల్ హిట్స్‌గా కూడా నిలిచాయి. ఇక ఈ సినిమా విషయానికి అసలు ఇది నాగేశ్వరరెడ్డి డైరెక్ట్ చేసిన సినిమాయేనా? అనే డౌట్ అతని సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. సినిమాలో అతని ఫ్లేవర్ ఎక్కడా కనిపించదు. పాత కథ, కథనాలతో నవ్వడానికి మనస్కరించని కామెడీతో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల సహనంతో ఆడుకున్నాడు నాగేశ్వరరెడ్డి. జనం చూసీ చూసీ వున్న కథలను అటు మార్చి, ఇటు మార్చి మళ్ళీ వాళ్లపైనే రుద్దే ప్రయత్నంలో మాత్రం అతను సక్సెస్ అయ్యాడు.
కథగా చెప్పుకోవాలంటే విజయ్‌రామ్(మురళీశర్మ), ఆనంద్‌ప్రసాద్(ఆనంద్) అనే ఇద్దరు స్నేహితుల మధ్య విలన్ శాంతారామ్ పెట్టిన చిచ్చు వల్ల వారి మధ్య అపార్థాలు చోటు చేసుకోవడం, ఇద్దరూ విడిపోవడం, 20 సంవత్సరాల తర్వాత తన తండ్రి ఆనంద్ ప్రసాద్‌పై మోపబడిన నింద నిజం కాదని, తన తండ్రి నిజాయితీ పరుడని నిరూపించేందుకు అమెరికా నుంచి ఊడిపడ్డ అతని కొడుకు కార్తీక్(సుశాంత్) విలన్, అతని మనుషులతో రకరకాల ఆటలు ఆడి ఫైనల్‌గా స్నేహితులిద్దరినీ కలపడమే కథ.
క్లుప్తంగా చెప్పిన ఈ కథలో మనకు కొత్తదనం అనేది ఎలాగూ కనిపించదు. కానీ, దాన్ని స్క్రీన్ మీద చూపించేటప్పుడు ఏదైనా మ్యాజిక్ చేసి పాత కథనైనా కొత్తగా చెప్పాడు, ఆడియన్స్‌కి బోర్ కొట్టకుండా ఆద్యంతం వినోదాన్ని పంచాడు అనిపించుకోగల దర్శకుడుగా నాగేశ్వరరెడ్డికి పేరు వుంది. కానీ, ఈ కథ విషయంలోగానీ, కథనం విషయంలో గానీ అతని మార్క్ కనిపించలేదు. ఫక్తు ఫార్ములా సినిమాలా ఒక ఇంట్రడక్షన్ సాంగ్, ఆ తర్వాత కొన్ని కామెడీ సీన్స్, వెంటనే ఫైట్... ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొనసాగుతుంది. ఈ సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే మనకు వెంకటేష్ కలిసుందాం..రా సినిమా గుర్తొస్తుంది. విజయ్‌రామ్ తన చెల్లెలు ఎవరితోనో లేచిపోయి పెళ్ళి చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళు ఫారిన్‌లో సెటిల్ అవ్వడం జరిగిపోతాయి. విజయ్‌రామ్ మేనల్లుడుగా ఎంటర్ అయిన హీరోకి మేనమామ నుంచి చాలా అవమానాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ సహిస్తూ, మరదల్ని ఏడిపిస్తూ కలిసుందాం..రా సినిమాని గుర్తు చేస్తాడు. ఇక సెకండాఫ్‌లో విలన్‌కి బుద్ధి చెప్పే ప్రాసెస్‌లో దూకుడులో రియాలిటీ షో పేరుతో బ్రహ్మానందంతో శ్రీను వైట్ల చేసిన కామెడీని ఇందులో టైమ్ మెషీన్ ద్వారా అతనితోనే చేయించాడు డైరెక్టర్. వీటన్నింటిని బట్టి చూస్తే మనం చూసిన కొన్ని సినిమాలనే నాగేశ్వరరెడ్డి తిప్పి తిప్పి కొత్త సినిమాగా చూపించాడని అర్థమవుతుంది.
సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడక్కడ, అడపా దడపా తప్ప ఎక్కడా కామెడీ పండలేదు. కొన్ని కామెడీ సీన్స్ ఆడియన్స్‌కి చిరాకును కూడా తెప్పించాయి. కామెడీ విషయంలో చాలా మంది డైరెక్టర్లు పృథ్వీని నమ్ముకున్నట్టుగానే నాగేశ్వరరెడ్డి కూడా అతన్నే నమ్ముకున్నాడు. కానీ, అతను ఊహించినంత ఔట్‌పుట్ రాలేదు. పెర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే సుశాంత్ స్టైలింగ్ పరంగా కొంత మేకోవర్ అయినా నటనపరంగా ఎలాంటి మార్పూ లేదనేది అర్థమవుతుంది. డాన్సులు, ఫైట్స్‌లు యధావిధిగా బాగానే చేసినా నటన పరంగా ఆకట్టుకోలేకపోయాడు. అలాగే కామెడీ టైమింగ్ కూడా సెట్ కాకపోవడంతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యడంలో కూడా అతను సక్సెస్ అవ్వలేకపోయాడు. హీరోయిన్ సోనమ్ బజ్వా ఫేస్‌ని చూడడం ఆడియన్స్‌కి కష్టమైన పనే. ఆమె డైలాగ్స్ చెప్తుంటే చూసి భరించడం మరింత కష్టం. మిగతా క్యారెక్టర్స్‌లో మురళీశర్మ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ఆనంద్ తదితర ఆర్టిస్టులు ఓకే అనిపించారు.
ఈ సినిమాకి టెక్నికల్‌గా కొన్ని ఎస్సెట్స్ వున్నాయి. దాశరథి శివేంద్ర ఫోటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించాడు. అలాగే నిర్మాతలు పెట్టిన ప్రతి రూపాయి మనకు స్క్రీన్ మీద కనిపించేలా చెయ్యడంలో అతను సక్సెస్ అయ్యాడు. అనూప్ రూబెన్స్ విషయానికి వస్తే ఇంట్రడక్షన్ సాంగ్, పల్లెకు పోదాం పాటలు కాస్త వినేలా వున్నాయి. మిగతా పాటలు సోసోగా వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. గౌతంరాజు ఎడిటింగ్‌లో తప్పు పట్టేందుకు ఏమీ లేదు. రెండు గంటల 13 నిముషాలకు సినిమాని ఎడిట్ చెయ్యడంలో అతను కూడా సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి విషయానికి వస్తే కొత్తదనం లేని కథను తీసుకొని ఫస్ట్ హాఫ్‌లో కలిసుందాం..రా, సెకండాఫ్‌లో దూకుడు సినిమాలు చూపించాడు. మధ్యలో కథను నడిపించేందుకు కొన్ని అనవసరమైన సీన్స్‌తో కాలయాపన చేశాడు. ఒక రొటీన్ క్లైమాక్స్‌తో ఎండ్ చేసి సినిమా చాలా చప్పగా వుంది అని అందరూ చెప్పుకునేలా చేశాడు. సెకండాఫ్‌లో బ్రహ్మానందం కోసం వేసిన టైమ్ మెషీన్ సెట్‌లో అతనితో చేయించిన కామెడీ ఏమాత్రం పండలేదు. ఈమధ్యకాలంలో బ్రహ్మానందం చేసే కామెడీని ఎంజాయ్ చెయ్యలేకపోతున్న ప్రేక్షకులకు టైమ్ మెషీన్ కామెడీ మరింత విసుగును పుట్టించింది. కథలో కొత్తదనం లేదు, కథనంలో నావెల్టీ లేదు. కామెడీ అయినా బాగుందా అంటే అదీ లేదు. ఇవేవీ లేవు కనుక నాగచైతన్య, అఖిల్ స్పెషల్ అప్పియరెన్స్ సినిమాకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని భావించిన దర్శకనిర్మాతలు ఆ ఇద్దరూ స్క్రీన్‌పై కనిపించేలా చేశారు. కానీ, అది కూడా ఏమాత్రం వర్కవుట్ అవ్వలేదు. మేకింగ్ పరంగా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ప్రాజెక్ట్‌ని రిచ్‌గానే చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే నాగేశ్వరరెడ్డి సినిమా అంటే ఎంతో కొంత కామెడీ వుంటుందన్న ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని అతను రీచ్ అవ్వలేకపోయాడు. తన మార్కు కాని సినిమా చేసి సుశాంత్‌కి మరో సాధారణమైన సినిమాని అందించాడు నాగేశ్వరరెడ్డి.
ఫినిషింగ్ టచ్: ఆటలు సాగలేదు
సినీజోష్ రేటింగ్: 1.75/5