మైత్రి మూవీ మేకర్స్
జనతా గ్యారేజ్
తారాగణం: మోహన్‌లాల్, ఎన్టీఆర్, సమంత, నిత్యమీనన్, సాయికుమార్, సచిన్ ఖేడ్కర్, అజయ్, సురేష్, ఉన్ని ముకుందన్, బ్రహ్మాజీ, దేవయాని, సితార తదితరులు
సినిమాటోగ్రఫీ: తిరు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.మోహన్(సి.వి.ఎం.)
రచన, దర్శకత్వం: కొరటాల శివ
విడుదల తేదీ: 01.09.2016
ఎన్టీఆర్ సినిమా వస్తోందంటే అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారు? ఎన్టీఆర్ నుంచి ప్రేక్షకులైనా, అభిమానులైనా ఆశించేది ఏమిటి? ఎన్టీఆర్‌ని ఎలాంటి క్యారెక్టర్‌లో చూడాలనుకుంటారు? అందరికీ కావాల్సిన అంశాలు జనతా గ్యారేజ్‌లో వున్నాయా? ఇది మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న... మిర్చి, శ్రీమంతుడు వంటి యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ని రూపొందించి ఓ స్పెషాలిటీ వున్న డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడంటే ఈ కాంబినేషన్‌పై ఆడియన్స్‌లో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ వుంటాయి. కథగానీ, కథనంగానీ, యాక్షన్‌గానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌గానీ ఓ రేంజ్‌లో వుంటుందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పేరు జనతా గ్యారేజ్ అని ఎనౌన్స్ చెయ్యగానే టైటిల్ చూసి అభిమానులు కాస్త నిరాశకు లోనైనా కొరటాల శివ చెప్పే కథ మీద నమ్మకంతో సినిమాలో ఏదో వుంటుందని ఆశించారు. మరి ఇన్ని రకాల ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈరోజు రిలీజైన జనతా గ్యారేజ్ వాటిని రీచ్ అయ్యిందా? వరసగా రెండు సూపర్‌హిట్స్ ఇచ్చిన కొరటాల శివ జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కి కూడా సూపర్‌హిట్ ఇవ్వగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కష్టాల్లో వున్న కుటుంబాల కన్నీళ్ళు తుడిచే ఓ కుటుంబం కథ జనతా గ్యారేజ్. అతని పేరు సత్యం(మోహన్‌లాల్). తన కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ప్రారంభించిన జనతా గ్యారేజ్‌లో వాహనాల రిపేర్లే కాకుండా, తప్పుడు మార్గాల్లో వెళ్ళే మనుషుల్ని కూడా రిపేరు చేస్తుంటారు. కొంతమంది అసాంఘిక శక్తులకు సత్యం చేసిన రిపేర్ల ఫలితంగా తమ్ముడు, మరదలు హత్య చేయబడతారు. తన వల్లే ఒక కొడుక్కి తల్లి, తండ్రి లేకుండా పోయారన్న బాధతో ఆ కొడుకుని తన కుటుంబం నీడలు కూడా పడకుండా పెంచమని బావకి ఇచ్చి పంపిస్తాడు. తల్లిదండ్రులు ఎలా వుంటారో కూడా తెలియకుండా ముంబాయిలో ఆ కుర్రాడు పెరిగి పెద్దవాడవుతాడు. అతని పేరు ఆనంద్(ఎన్టీఆర్). ఎన్విరాన్‌మెంట్ రీసెర్చ్ చేస్తుంటాడు. ప్రకృతిని ప్రేమిస్తుంటాడు. వాతావరణాన్ని కాలుష్యం చేసేవారిని చూస్తే సహించలేడు. వారికి తగిన విధంగా రిపేర్లు చేస్తుంటాడు. ఇలా సత్యం కుటుంబానికి దూరంగా పెరిగిన ఆనంద్ ఆలోచనలు కూడా సత్యంని పోలి వుంటాయి. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఆనంద్ హైదరాబాద్ వస్తాడు. అనుకోకుండానే జనతా గ్యారేజ్‌కి వచ్చి సత్యంని కలుసుకుంటాడు. అప్పటివరకు జనతా గ్యారేజ్‌ని రన్ చేసిన సత్యం ఆ బాధ్యతని ఆనంద్‌కి అప్పగిస్తాడు. ఆనంద్‌ని జనతా గ్యారేజ్‌ని రన్ చేయమని సత్యం ఎందుకు అడగాల్సి వచ్చింది? సత్యం కుటుంబ సభ్యులు తనవారేనని ఆనంద్ తెలుసుకోగలిగాడా? తనకు దూరంగా పెరిగిన ఆనంద్ మళ్ళీ తన దగ్గరికే రావడంపై సత్యం ఎలా రియాక్ట్ అయ్యాడు? జనతా గ్యారేజ్ ద్వారా ఆనంద్ ఎలాంటి రిపేర్లు చేశాడు? ఆ తర్వాత కథ ఎన్ని మలుపులు తిరిగింది అనేది తెరపై చూడాల్సిందే.
ఈ కథలో చెప్పుకోదగిన విషయంగానీ, విశేషం గానీ ఏమీ లేదు. ఒక సాధారణమైన కథ. ఎవరు కష్టాల్లో వున్నా స్పందించి వారికి న్యాయం చేసే ఓ మంచి మనిషి సత్యం. జనతా గ్యారేజ్ పేరుతో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని దుష్టులను శిక్షిస్తుంటాడు. దాని ఫలితంగా తన తమ్ముడు, మరదల్ని కోల్పోయిన సత్యం తన కుటుంబం నీడ పడకూడదని వారి కొడుకుని తన బావకిచ్చి పంపించేస్తాడు. ఇదే ఫార్ములాని ప్రభాస్‌తో చేసిన మిర్చిలో కూడా వాడాడు కొరటాల. నిత్యం పగ, ప్రతీకారాలతో రగిలిపోయే తన ఊరికి దూరంగా కొడుకుని వుంచుతాడు హీరో తండ్రి. దాన్నే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశాడు. ఊరికి వచ్చిన కొడుకు కూడా పగతో రగిలిపోయే క్యారెక్టర్ మిర్చిలో వుంటుంది. జనతా గ్యారేజ్ విషయానికి వస్తే ఇందులో కూడా తమ్ముడు కొడుకుని దూరంగా పంపించినా పెద్దయిన తర్వాత తన గ్యారేజ్‌కే వచ్చి అందరికీ రిపేర్లు చేస్తుంటాడు. కొరటాల ఎంచుకున్న కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోగా, ప్రేక్షకుల్ని విసిగించే సన్నివేశాలు చాలా వున్నాయి. స్లో నేరేషన్‌తో మొదలయ్యే సినిమా ఇకనైనా స్పీడందుకుంటుందేమోనని ఎదురు చూసే ఆడియన్స్‌కి నీరసం వస్తుంది తప్ప కథనంలో ఎలాంటి మార్పూ వుండదు. సినిమా స్టార్ట్ అయిన 20 నిముషాలకు హీరో ఎంటర్ అవుతాడు. ఫస్ట్ హాఫ్ అంతా ప్రకృతిని కాపాడండి, కాలుష్యాన్ని పెంచకండి అని హీరోయిన్‌తో సహా అందరికీ క్లాసులు పీకుతుంటాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ పవర్‌ఫుల్‌గా అనిపించదు. అతను చెప్పే డైలాగులు ఆడియన్స్‌కి నీరసం తెప్పిస్తాయి. క్యారెక్టర్‌కి తగ్గట్టు పెర్‌ఫార్మ్ చేసినా అది సినిమాకి ఏమాత్రం ఉపయోగపడేలా లేదు. డాన్సుల్లో, ఫైట్స్‌లో ఎప్పటిలాగే స్పీడ్ వుంది. సత్యంగా మోహన్‌లాల్ పెర్‌ఫార్మెన్స్ చాలా నేచురల్‌గా అనిపించింది. అందర్నీ ఆకట్టుకునే సత్యం క్యారెక్టర్‌లో మోహన్‌లాల్ ఒదిగిపోయారని చెప్పాలి. ఇక హీరోయిన్లలో ఒకరైన బుజ్జి(సమంత) క్యారెక్టర్‌కి ఏమాత్రం ప్రాధాన్యత లేదు. కేవలం పాటలకే పరిమితమైన క్యారెక్టర్. ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని హీరోయిన్‌గా నిత్యమీనన్ ఈ సినిమా ఎందుకు చేసిందో ఆమెకే తెలియాలి. మిగతా క్యారెక్టర్లలో సాయికుమార్, సచిన్ ఖేడ్కర్, అజయ్, ఉన్ని ముకుందన్, దేవయాని, సితార, సురేష్ ఫర్వాలేదు అనిపించారు. ప్రీ క్లైమాక్స్ ముందు ఐటమ్ సాంగ్‌లో కనిపించిన కాజల్ ఆకట్టుకోలేకపోయింది. ఈ పాట స్టార్ట్ అవ్వగానే ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని ఆడియన్స్ ఎదురు చూసేలా చేసింది. శ్రీమంతుడులో ఓ మంచి క్యారెక్టర్ చేసిన జగపతిబాబుతో సినిమా స్టార్టింగ్‌లో వాయిస్ ఓవర్ చెప్పించారు. అది కూడా ఏమంత ఎఫెక్టివ్‌గా లేదు.
టెక్నికల్‌గా చూస్తే తిరు ఫోటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. దేవిశ్రీప్రసాద్ చేసిన మ్యూజిక్ ఎఫెక్టివ్‌గా లేదు. ఇప్పటివరకు ఎన్టీఆర్ కాంబినేషన్‌లో దేవి చేసిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా హిట్ అయ్యాయి. కానీ, ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా లేదు. దానికి తగ్గట్టుగానే పిక్చరైజేషన్‌లో కూడా ఎలాంటి ప్రత్యేకత లేదు. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం దేవి కేర్ చాలా కేర్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్‌లోగానీ, సెకండాఫ్‌లోగానీ చాలా సీన్స్ స్టార్ట్ అయిన కొన్ని సెకన్స్‌లోనే ఎండ్ అయిపోయి వెంటనే వేరే సీన్‌లోకి వెళ్ళిపోవడం వల్ల జర్క్‌లు ఎక్కువగా వున్నట్టు అనిపిస్తుంది. డైరెక్టర్ కొరటాల శివ గురించి చెప్పాలంటే అతను సెలెక్ట్ చేసుకున్న కథలో ఆడియన్స్‌ని రెండున్నర గంటల సేపు సీట్లలో కూర్చోబెట్టే సత్తా లేదు. దానికి తగ్గట్టుగానే కథనం కూడా వుండడంతో ఆకట్టుకోలేకపోయింది. హీరోతో పర్యావరణాన్ని గురించి చాలా డైలాగులు చెప్పించడంతో ఆడియన్స్ చాలా బోర్ ఫీల్ అవుతారు. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఇసుమంత కూడా లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్ అయింది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర్నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్‌కి ఎక్కడా రిలీఫ్ ఇవ్వలేకపోయాడు కొరటాల. గవర్నమెంట్ ఆఫీస్‌లో సీన్, ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌కి వచ్చే సీన్ మాత్రమే ఎఫెక్టివ్‌గా అనిపించాయి. తన గ్యారేజ్‌కి వచ్చిన ఆనందే తన తమ్ముడి కొడుకు అని రివీల్ చేసే సన్నివేశం చాలా సాదా సీదాగా అనిపిస్తుంది. సినిమా మొత్తంలో ఎమోషన్ అనేది ఏ సీన్‌లోనూ సరిగ్గా క్యారీ అవ్వలేదు. సిటీలో బాంబ్ బ్లాస్ట్స్ చేసింది ఎవరో కనిపెట్టమని పోలీస్ కమిషనర్ జనతా గ్యారేజ్‌కి వచ్చి సాయం అడిగితే వారిని కనిపెట్టి పోలీసులకు అప్పగించకుండా, ఆ కుట్రలో తన కొడుకే వున్నాడని, తన కొడుకే తన మనిషిని చంపాడని తెలుసుకొని కొడుకునే చంపడానికి సిద్ధపడతాడు సత్యం. దానికి హీరో కూడా మద్దతు తెలుపుతాడు. అది ఎంతవరకు సమంజసమో డైరెక్టర్‌కే తెలియాలి. క్లైమాక్స్ లేకుండానే సినిమా కంప్లీట్ అయిపోయిందా అన్నట్టు సడన్‌గా ఎండ్ టైటిల్స్ స్టార్ట్ అవుతాయి. మరి ఈ సినిమా ద్వారా కొరటాల శివ ఏం చెప్పదలుచుకున్నాడు? ఇలాంటి కథతో ఆడియన్స్‌ని ఎలా ఎంటర్‌టైన్ చేద్దామనుకున్నాడు? అని ఆలోచించుకుంటూ థియేటర్ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫైనల్‌గా చెప్పాలంటే కొరటాల శివ సెలెక్ట్ చేసుకున్న కథకి చాలా రిపేర్లు చెయ్యాల్సిన అవసరం వుంది. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే కొన్ని పార్టులు కూడా వెయ్యాల్సిన అవసరం వుంది. కథ ఎంత బాగా చెప్పినా, కథనం ఎంత బాగున్నా సగటు ప్రేక్షకులు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ లోపిస్తే ఆ సినిమాని ఎవరూ కాపాడ లేరనే విషయాన్ని జనతా గ్యారేజ్ ప్రూవ్ చేస్తుంది.
ఫినిషింగ్ టచ్: ఈ గ్యారేజ్‌కి రిపేర్లు అవసరం
సినీజోష్ రేటింగ్: 2.5/5