చన్నాంబిక ఫిలింస్
జాగ్వార్
తారాగణం: నిఖిల్ కుమార్, దీప్తి సతీ, జగపతిబాబు, రమ్యకృష్ణ, సంపత్,
ఆదిత్య మీనన్, ఆదర్శ్, రావు రమేష్, బ్రహ్మానందం తదితరులు
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
సంగీతం: ఎస్.ఎస్.థమన్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా
ఎడిటింగ్: రూబెన్
కథ: వి.విజయేంద్రప్రసాద్
సమర్పణ: హెచ్.డి.కుమారస్వామి
నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి
స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఎ.మహదేవ్
విడుదల తేదీ: 06.10.2016
తండ్రికి జరిగిన అన్యాయం, ప్రజల దృష్టిలో తండ్రికి జరిగిన అవమానం, దానికి కారణమైన వారిని కొడుకు వరసపెట్టి చంపి పగ తీర్చుకోవడం...ఈ తరహా కథలు సినిమా పుట్టినప్పటి నుంచి మనం చూస్తున్నవే. అయితే ఒక్కో కథకి ఒక్కో బ్యాక్‌డ్రాప్ ఎంచుకుంటూ రకరకాల పేర్లతో డైరెక్టర్లు ఆయా సినిమాలను ప్రేక్షకులపైకి వదులుతుంటారు. అలాంటి మరో రివెంజ్ డ్రామానే ఈరోజు విడుదలైన జాగ్వార్. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఎస్.ఎస్.రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్ రూపొందించిన ఈ చిత్రానికి వి.విజయేంద్రప్రసాద్ కథను అందించాడు. 70 కోట్ల భారీ వ్యయంతో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో రొటీన్ రివెంజ్ డ్రామాకి డైరెక్టర్ తీసుకున్న బ్యాక్‌డ్రాప్ ఏమిటి? బాలకృష్ణతో మిత్రుడు చిత్రానికి దర్శకత్వం వహించిన మహదేవ్ జాగ్వార్‌తో చేసిన రెండో ప్రయత్నం సత్ఫలితాన్నిచ్చిందా? ఈ చిత్రంతో పరిచయమైన నిఖిల్‌కుమార్ హీరోగా ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
అతని పేరు శౌర్యప్రసాద్(సంపత్‌రాజ్). పెద్ద బిజినెస్ మాగ్నెట్. అతను చేస్తున్న బిజినెస్‌లన్నీ టాప్ పొజిషన్‌లో వున్నాయి. కానీ, ఎస్‌ఎస్ టివి పేరుతో అతను నడుపుతున్న ఛానెల్ మాత్రం టిఆర్‌పి రేటింగ్‌లో వెనకబడిపోయింది. అడ్డ దారుల్లో అయినా సరే తన ఛానెల్ రేటింగ్ పెంచుకోవాలని స్టాఫ్‌తో ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. అదే టైమ్‌లో వారి ఛానల్‌లోనే మరో 5 నిముషాల్లో మర్డర్‌ని లైవ్‌లో చూడండి అంటూ డిస్‌ప్లే అవుతుంది. అది ఎలా వచ్చిందో అర్థం కాక స్టాఫ్ అంతా జుట్టు పీక్కుంటారు. అయితే ఛానెల్ రేటింగ్ పెరుగుతుందన్న ఉద్దేశంతో దాన్ని ఆపే ప్రయత్నం చెయ్యడు శౌర్య. ఓ జడ్జిని అతని ఇంట్లోనే మాస్క్ వేసుకున్న వ్యక్తి హత్య చేస్తాడు. అది ఎస్‌ఎస్ ఛానెల్‌లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఇది పెద్ద సెన్సేషన్‌గా మారుతుంది. ఈ కేస్‌ని సిబిఐ అధికారి జగపతిబాబుకి అప్పగిస్తారు. ఆ హత్య చేసిన వ్యక్తి స్పీడ్‌ని చూసి అతనికి జాగ్వార్ అని పేరు పెడతాడు జగపతిబాబు. ఆ తర్వాత అదే పద్ధతిలో రెండో హత్య కూడా జరుగుతుంది. ఈ హత్యలు చేస్తున్నదెవరు? హంతకుడు ఎవరిని టార్గెట్ చేశాడు? ఈ వరస హత్యల వెనుక అసలు కారణం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ సినిమాతో హీరోగా పరిచయమైన నిఖిల్‌కుమార్ మొదటి సినిమాలోనే తన పెర్‌ఫార్మెన్స్‌తో మంచి మార్కులు కొట్టేశాడు. నటన, డాన్స్, ఫైట్స్ ఎంతో అనుభవం వున్న ఆర్టిస్ట్‌లా చేశాడు. బాడీ లాంగ్వేజ్ బాగున్నా స్క్రీన్ మీద అతన్ని చూడడం కొంచెం కష్టమైన పనే. అయితే లుక్ వైజ్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్‌లో మంచి హీరోగా పేరు తెచ్చుకునే అవకాశం వుంది. ఇక హీరోయిన్ దీప్తి సతీ కేవలం పాటలకే పరిమితమైపోయింది తప్ప పెర్‌ఫార్మెన్స్‌కి ఆమెకు అవకాశం రాలేదు. రామచంద్రయ్యగా ఓ మంచి పాత్రతో రావు రమేష్ మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. సిబిఐ ఆఫీసర్‌గా నటించిన జగపతిబాబుకి అద్భుతంగా పెర్‌ఫార్మ్ చేసే అవకాశం లభించలేదు. తన క్యారెక్టర్‌కి వున్న పరిధిలో ఓకే అనిపించాడు. హీరో తల్లి క్యారెక్టర్‌లో రమ్యకృష్ణ కనిపించిన కాసేపు తన పెర్‌ఫార్మెన్స్‌తో అలరించింది. ఆర్యగా ఆదర్శ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. రొటీన్ క్యారెక్టర్లు చేసిన సంపత్‌రాజ్, ఆదిత్య మీనన్‌ల పెర్‌ఫార్మెన్స్ కూడా రొటీన్‌గానే వుంది. ఈ సినిమాకి ఓ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది తమన్నా స్సెషల్ సాంగ్. పాట పరంగా, డాన్స్ పరంగా కొత్తగా ఏమీ అనిపించకపోయినా తమన్నా వల్ల ఈ పాట బాగుంది అనిపిస్తుంది.
కథ, కథనాలు, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ పక్కన పెడితే ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్స్‌గా నిలిచారు టెక్నీషియన్స్. సినిమా అందంగా, రిచ్‌గా రావడంలో మొదట చెప్పుకోవాల్సింది మనోజ్ పరమహంస గురించి. ప్రతి ఫ్రేమ్‌ని అద్భుతంగా తీర్చిదిద్దాడు మనోజ్. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఫైట్స్ గురించి. రవివర్మ, రామ్-లక్ష్మణ్, కలోయాన్ (బల్గేరియా) కంపోజ్ చేసిన ఫైట్స్ చాలా ఎఫెక్టివ్‌గా వున్నాయి. థమన్ మ్యూజిక్ విషయానికి వస్తే పాత పాటలే మళ్ళీ వింటున్నట్టుగా వుంది తప్ప ఒక్క పాట కూడా కొత్తగా అనిపించలేదు. అయితే విజువల్‌గా మాత్రం పాటలు బాగా తీశారు. చిన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సినిమాకి ఇవన్నీ బాగానే వున్నా కథ, కథనాల్లో బలం లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. కథగా చెప్పుకుంటే రెండు నిముషాల్లో కంప్లీట్ అయిపోయే ఈ కథని రెండున్నర గంటల సేపు సాగదీసే ప్రాసెస్‌లో ఎన్నో అనవసరమైన సీన్స్, మరెన్నో అసహనానికి గురి చేసే సీన్స్ సినిమాలో జొప్పించారు. దీంతో సినిమా ఎంత రిచ్‌గా వున్నా, కన్నులకింపుగా అనిపించినా కథాబలం లేకపోవడంతో ఓ సాధారణ సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. కార్పొరేట్ హాస్పిటల్‌లో జరుగుతున్న అన్యాయాలు, వాటికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలు మన సినిమాల్లో కొత్తేమీ కాదు. అలాగే తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు పగ తీర్చుకోవడం అనేది కూడా మనకు పాతదే. సినిమాలో సాంకేతిక విలువలు ఎన్ని వున్నా మెయిన్ కథలోనే లోపాలు, సహజత్వానికి దూరంగా వుండే సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. విజయేంద్రప్రసాద్‌లాంటి సీనియర్ రైటర్ నుంచి ఇలాంటి పాత కథని ప్రేక్షకులు ఆశించలేదు. దానికి తగ్గట్టుగానే మహదేవ్ రాసుకున్న స్క్రీన్‌ప్లే, మాటలు కూడా ఎఫెక్టివ్‌గా లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌గా మారాయి. అద్భుతమైన ఫోటోగ్రఫీ, థ్రిల్ చేసే ఫైట్స్, సీన్స్ తగ్గట్టుగా వుండే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని ఎంజాయ్ చెయ్యాలనుకునే వారు ఈ సినిమాని చూడొచ్చు. కథ, కథనాల పరంగా కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు మాత్రం జాగ్వార్ నిరాశే మిగులుస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే పాత కథ, రొటీన్ కథనంతో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిన జాగ్వార్ అందరికీ నచ్చకపోయినా మంచి విజువల్స్‌ని, థ్రిల్ చేసే ఫైట్స్‌ని ఇష్టపడే వారికి నచ్చే అవకాశం వుంది.
ఫినిషింగ్ టచ్: రొటీన్ రివెంజ్ డ్రామా
సినీజోష్ రేటింగ్: 2.5/5