Advertisementt

సినీజోష్‌ రివ్యూ: ఇంట్లో దెయ్యం నాకేం భయం

Sat 31st Dec 2016 04:55 PM
allari naresh new movie intlo deyyam nakem bhayam,intlo deyyam nakem bhayam movie review,intlo deyyam nakem bhayam movie review in cinejosh,intlo deyyam nakem bhayam movie cinejosh review  సినీజోష్‌ రివ్యూ: ఇంట్లో దెయ్యం నాకేం భయం
సినీజోష్‌ రివ్యూ: ఇంట్లో దెయ్యం నాకేం భయం
Advertisement
Ads by CJ

శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర 

ఇంట్లో దెయ్యం నాకేం భయం 

తారాగణం: అల్లరి నరేష్‌, కృతిక, మౌర్యాని, రాజేంద్రప్రసాద్‌, 

చలపతిరావు, బ్రహ్మానందం, ప్రభాస్‌ శ్రీను, జె.పి., షకలక శంకర్‌, 

చమ్మక్‌ చంద్ర, ప్రభాకర్‌, ప్రగతి, సన తదితరులు 

సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర 

సంగీతం: సాయికార్తీక్‌ 

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 

సమర్పణ: భోగవల్లి బాపినీడు 

నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ 

రచన, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి 

విడుదల తేదీ: 30.12.2016 

ఈమధ్యకాలంలో హిట్‌ అనేది లేని అల్లరి నరేష్‌ హిట్‌ కొట్టడం కోసం ఇప్పుడు దెయ్యం బారిన పడ్డాడు. ఇంట్లో దెయ్యం నాకేం భయంతో హిట్‌ కొట్టాలని ఆరాటపడ్డాడు. భారీ చిత్రాలు చేసి బ్లాక్‌ బస్టర్స్‌ ఇచ్చిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ కూడా హార్రర్‌ కామెడీతో తన బేనర్‌లో మరో హిట్‌ వేసుకోవచ్చు అనుకున్నాడు. అల్లరి నరేష్‌తో సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ వంటి హిట్‌ సినిమాలు చేసిన జి.నాగేశ్వరరెడ్డి... అల్లరి నరేష్‌తో హ్యాట్రిక్‌ సాధించాలనుకున్నాడు. ఇన్ని ఆశలతో రూపొందిన ఇంట్లో దెయ్యం నాకేం భయం ప్రేక్షకుల్ని నవ్వించేందుకు, భయపెట్టేందుకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ముగ్గురు ఆశ పడినట్టు ఈ హార్రర్‌ కామెడీ ప్రేక్షకుల్ని ఎంతవరకు ఎంటర్‌టైన్‌ చెయ్యగలిగింది? హార్రర్‌ కామెడీ సినిమాలు చూసి చూసి వున్న ఆడియన్స్‌కి ఈ సినిమా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌ నిచ్చింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే టైటిల్‌లోనే కథ అంతా వుంది. ఒక ఇంట్లో దెయ్యం వుంటుంది, దాని బారిన పడిన హీరో, మిగతా క్యారెక్టర్స్‌ ఇబ్బందులు పడతారు. తద్వారా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసే ప్రయత్నం చేస్తారు. హార్రర్‌ కామెడీ అనేది స్టార్ట్‌ అయిన తర్వాత ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాల్లోనూ క్యారెక్టర్స్‌ భయపడడం ద్వారా మనల్ని నవ్విస్తారు. ముఖ్యంగా దెయ్యం వున్న సినిమాలైతే దాదాపు అన్నీ ఒకేలా వుంటాయి. ఒక లక్ష్యంతో దెయ్యంగా మారిన అమ్మాయి అమాయకుల్ని ఎందుకు చితక బాదుతుంది అనేది అర్థం కాని విషయం. అయినా ప్రతి సినిమాలోనూ అవే సీన్లు రిపీట్‌ అవుతుంటాయి. ఈ సినిమా కూడా దానికి మినహాయింపు కాదు. టైటిల్‌లోనే అంతా వుంది కాబట్టి ఈ సినిమా కథ, కథనాల గురించి క్లుప్తంగా చెప్పుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరికీ కోరికలు వుంటాయి. అవి తీరకుండా చనిపోతే కొందరు ఆత్మలుగా మారతారు. అలా కోరికలు తీరకుండా ఆత్మగా మారి ఓ అమ్మాయి కథే ఈ సినిమా అంటూ ప్రారంభమైన పది నిముషాలకే మనం ఎలాంటి క్లైమాక్స్‌ చూడబోతున్నామనే ఐడియా సగటు ప్రేక్షకుడికి వచ్చేస్తుంది. దీంతో సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్‌ కూడా తగ్గిపోతుంది. దెయ్యం తిష్ట వేసిన ఓ పెద్ద భవనం, దాన్ని కొనుక్కొని అందులోకి దిగిన గోపాల్‌(రాజేంద్రప్రసాద్‌), అతని కుటుంబ సభ్యులు. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అక్కడికి చేరుకున్న నరేష్‌(అల్లరి నరేష్‌), అతని బృందం. ఇలా అందరూ కలిసి ఓ బిల్డింగ్‌లో వుంటూ దెయ్యంతో ఇన్‌స్టాల్‌మెంట్‌ పద్ధతిలో తన్నులు తింటూ వుంటారు. ఇదీ కథ. ఇందులో కొత్త పాయింట్‌ అంటూ ఏమీ లేదు. కాకపోతే అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్‌ నవ్వు తెప్పించేలా వున్నాయి. ఈ సినిమాకి ఏదైనా ప్లస్‌ పాయింట్‌ వుందీ అంటే అది కామెడీనే. అంతకు ముందు అల్లరి నరేష్‌, నాగేశ్వరరెడ్డి సినిమాల స్థాయిలో ఇందులో కామెడీ లేకపోయినా వున్నంతలో ఫర్వాలేదు అనిపిస్తుంది. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ గురించి చెప్పాలీ అంటే అల్లరి నరేష్‌ ఈ సినిమాలో కొత్తగా ట్రై చేసిందేమీ లేదు. రొటీన్‌ క్యారెక్టర్‌ కావడంతో అతని పెర్‌ఫార్మెన్స్‌ కూడా దానికి తగ్గట్టుగానే వుంది. పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ వున్న క్యారెక్టరే అయినా హీరోయిన్‌ క్యారెక్టర్‌ అంతగా ఎలివేట్‌ అవ్వకపోవడంతో కృతిక ఎక్కువగా నటించాల్సిన అవసరం లేకుండా పోయింది. దెయ్యంగా నటించిన మౌర్యాని తన ఫ్లాష్‌ బ్యాక్‌లో ఎలా చంపబడిందో చెప్పినా మనకు ఎలాంటి ఫీలింగ్‌ కలగదు. ఆమె చేసిన క్యారెక్టర్‌ ఆకట్టుకునేలా లేదు. ఆమె పెర్‌ఫార్మెన్స్‌ కూడా అంతే వుంది. రాజేంద్రప్రసాద్‌ తన క్యారెక్టర్‌కి వున్న లిమిట్స్‌లో ఓకే అనిపించాడు. షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర తమ కామెడీతో అక్కడక్కడ నవ్వించారు. క్లైమాక్స్‌కి ముందు ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం ఎవ్వర్నీ నవ్వించలేకపోయాడు. 

సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందుగా సినిమాటోగ్రాఫర్‌ దాశరథి శివేంద్ర గురించి చెప్పుకోవాలి. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు విజువల్‌గా చాలా రిచ్‌గా చూపించాడు. ముఖ్యంగా పాటల్ని చాలా అందంగా తీశాడు. ఇక సాయికార్తీక్‌ సంగీతం విషయానికి వస్తే అతను చేసిన పాటలు ఎప్పుడో విన్నట్టుగానే వున్నాయి తప్ప కొత్త పాటల్లా అనిపించలేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం ఫర్వాలేదు అనిపించాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ కూడా బాగుంది. డైరెక్టర్‌ జి.నాగేశ్వరరెడ్డి గురించి చెప్పాలంటే తను రెగ్యులర్‌గా చేసే కామెడీ సినిమాలను వదిలి దెయ్యాన్ని పట్టుకొని హిట్‌ కొట్టాలనుకున్న అతని ప్రయత్నం ఫలించలేదు సరికదా ఆడియన్స్‌కి కావాల్సినంత బోరును ప్రసాదించింది. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు పాటలతో సహా ఏ ఒక్కటీ కొత్తగా అనిపించకపోవడం ఈ సినిమాలోని ప్రత్యేకత. దాంట్లో నాగేశ్వరరెడ్డి హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. ఇక నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. నిర్మాత అన్‌ కాంప్రమైజ్‌ మేకింగ్‌ వల్ల ప్రతి సీన్‌ రిచ్‌గా కనిపించింది. ఫైనల్‌గా చెప్పాలంటే ఏమాత్రం కొత్తదనం లేని ఇంట్లో దెయ్యం నాకేం భయం అల్లరి నరేష్‌కి, జి.నాగేశ్వరరెడ్డికి, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌కి అపజయాన్ని అందించిందనే చెప్పాలి. 

ఫినిషింగ్‌ టచ్‌: భయం, కామెడీ.. రెండూ తక్కువే 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ