మద్రాస్ టాకీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
చెలియా
తారాగణం: కార్తీ, అదితిరావు హైదరీ, ఆర్.జె.బాలాజీ, ఢిల్లీ గణేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎస్.రవివర్మన్
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్
మాటలు: కిరణ్
సమర్పణ: దిల్‌రాజు
నిర్మాతలు: మణిరత్నం, శిరీష్
రచన, దర్శకత్వం: మణిరత్నం
విడుదల తేదీ: 07.04.2017
విభిన్న ప్రేమ కథా చిత్రాలకు, భిన్నమైన మనస్తత్వాలను ఆవిష్కరించే చిత్రాలకు పెట్టింది పేరు మణిరత్నం. ఆయన డైరెక్షన్‌లో సినిమా వస్తోందంటే ఒక వర్గం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. రెండు సంవత్సరాల క్రితం మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ఓకే బంగారం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి హిట్ చేసారు. ఇప్పుడు కార్తీ, అదితిరావు జంటగా కాట్రు వెలియిదై పేరుతో మణిరత్నం తమిళ్‌లో రూపొందించిన చిత్రాన్ని చెలియా పేరుతో తెలుగులో విడుదల చేశారు. దిల్‌రాజు బేనర్ ద్వారా ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? ఈ ప్రేమకథలో మణిరత్నం చూపించిన కొత్తదనం ఏమిటి? కార్తీ, అదితిరావుల పెర్‌ఫార్మెన్స్ ఎలా వుంది? ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ ఏ రేంజ్‌లో వుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
వరుణ్ అలియాస్ విసి(కార్తీ) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ పైలట్. 1999లో ఇండియా, పాకిస్తాన్‌కి జరిగిన కార్గిల్ యుద్ధ నేపథ్యంలో కథ మొదలవుతుంది. యుద్ధంలో భాగంగా వరుణ్ ప్రయాణిస్తున్న ఫ్లైట్‌ను శత్రువులు నేల కూల్చుతారు. పార్యాచూట్ ద్వారా ప్రాణాలు దక్కించుకున్న వరుణ్‌ని పాకిస్తాన్ సైన్యం బంధిస్తుంది. కొన్ని సంవత్సరాల పాటు జైల్‌లోనే వుంటాడు. వరుణ్ జైల్‌లో వుండి ఫ్లాష్‌బ్యాక్‌లో తన లవ్‌స్టోరీని మనకు నేరేట్ చేయడం మొదలు పెడతాడు. ప్రేమ, అనుబంధాలు వంటి విషయాల గురించి అంతగా పట్టించుకోని వరుణ్ అమ్మాయిలతో సరదాగా గడిపేస్తుంటాడు. ఓ యాక్సిడెంట్‌లో దెబ్బలు తగిలించుకొని హాస్పిటల్‌లో చేరిన వరుణ్‌కి అక్కడి డ్యూటీ డాక్టర్ లీల పరిచయమవుతుంది. మనం ఊహించలేనంత తొందరగానే ఇద్దరూ ప్రేమలో మునిగిపోతారు. ఫలితంగా ఆమె గర్భవతి అవుతుంది. రిలేషన్ షిప్ అంటేనే పడని వరుణ్... లీలని పెళ్ళి చేసుకోవడానికి కూడా వెనకాడతాడు. దీంతో లీల అతని నుంచి విడిపోయి దూరంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కార్గిల్ యుద్ధంలో వరుణ్ పాకిస్తాన్ సైన్యానికి బందీ అవుతాడు. జైల్లో అతనికి జ్ఞానోదయం అవుతుంది. ప్రేమ ముఖ్యం, తన ప్రియురాలు ముఖ్యం అనే విషయాన్ని తెలుసుకుంటాడు. స్నేహితుల సాయంతో జైలు నుంచి తప్పించుకొని ఇండియా చేరుకున్న వరుణ్... లీల ఎక్కడ వుందో కనిపెట్టగలిగాడా? ఆమెను, తన కూతుర్ని కలుసుకోగలిగాడా? లీల ఇప్పటికీ వరుణ్‌ని లవ్ చేస్తోందా? చివరికి ఈ కథ ఎలా ముగిసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఇది చాలా పాత కథ. ఒక విధంగా చెప్పాలంటే ఔట్ డేటెడ్ స్టోరీ. దానికి తగ్గట్టుగానే కథనం కూడా చాలా స్లోగా వుంటుంది. ప్రేక్షకులకు నీరసం తెప్పించే సన్నివేశాలు సినిమాలో కోకొల్లలు. ప్రారంభమైన కొద్ది సేపటికే సినిమాలో విషయం లేదన్న విషయం సగటు ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. నెక్స్‌ట్ ఏం జరగబోతోంది? కథ ఎన్ని మలుపులు తిరుగుతుందీ అనే విషయంలో ఆడియన్స్‌లో ఎలాంటి క్యూరియాసిటీ కలగదు. స్లో నేరేషన్, ఆకట్టుకోని డైలాగ్స్, కొన్ని సందర్భాల్లో అర్థంకాని డైలాగ్స్ కూడా వున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్‌లో క్లారిటీ లేదు. అతను ఎలాంటి వాడు అనేది అర్థం చేసుకోవడం హీరోయిన్ వల్ల కాలేదు, మన వల్ల కూడా కాదు. హీరో ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్నిసార్లు అవమానించినా హీరోయిన్ అతన్ని విపరీతంగా ప్రేమిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత తనని, కూతుర్ని చూడడానికి వచ్చిన హీరోపై ఎప్పటిలాగే ప్రేమ కురిపిస్తుంది. అలా హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌లో కూడా క్లారిటీ వుండదు. పెర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే వరుణ్‌గా కార్తీ, లీలగా అతిదిరావు ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. ప్రతి సీన్‌లో తమ నటనతో ఆకట్టుకున్నారిద్దరూ. కథ లేదు అనే విషయం పక్కన పెడితే నటన పరంగా ఇద్దరికీ నూటికి నూరు మార్కులు ఇవ్వొచ్చు. పైలట్‌గా కార్తీ లుక్ బాగుంది. అలాగే హీరోయిన్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. సినిమా మొత్తంలో మనకు తెలిసిన మొహాలు, స్క్రీన్‌పై ఎప్పుడూ కనిపించే మొహాలు ఈ ఇద్దరివే. మిగతా ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
సాంకేతిక పరంగా చూస్తే రవివర్మన్ ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా వుంది. రవివర్మ పెయింటింగ్‌లాగ ప్రతి సీన్‌ని ఎంతో అందంగా చూపించడంలో రవివర్మ టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. విజువల్స్ చూస్తే ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఎక్స్‌ట్రార్డినరీ లొకేషన్స్‌లో చిత్రాన్ని షూట్ చెయ్యడంతో సినిమాకి మంచి రిచ్ లుక్ వచ్చింది. మ్యూజిక్ విషయానికి వస్తే జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయిన రెహమాన్ మన మ్యూజిక్‌ని మర్చిపోయినట్టున్నాడు. హంసరో.. అనే పాట తప్ప మిగతా పాటలన్నీ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతంగా చేశాడు. కథ, కథనాలకు అనుగుణంగా ఎడిటింగ్ చేస్తూ వెళ్ళిన శ్రీకర్‌ప్రసాద్‌కి సినిమాని స్పీడ్ చేసే అవకాశం కలగలేదు. కిరణ్ రాసిన మాటలు ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. కొన్నిసార్లు డైలాగ్స్ వింటుంటే నీరసం కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ అర్థం కాకుండా కూడా వున్నాయి. ఇక డైరెక్టర్ మణిరత్నం గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమా కోసం అతను రాసుకున్న కథ రాంగ్ అనేది అర్థమవుతుంది. ప్రజెంట్ ట్రెండ్‌కి తగ్గ కథ కాదు. యూత్‌ని ఆకట్టుకునే కథ కాదు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి రుచించని కథ. గతంలో మణిరత్నం చేసిన ఓకే బంగారం ప్రజెంట్ యూత్‌కి బాగా కనెక్ట్ అయింది. అందుకే ఆ చిత్రానికి విజయాన్ని అందించారు. కథ, కథనాల విషయంలో ఎక్కడా కొత్తదనం లేని ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చే అవకాశాలు తక్కువ. మణిరత్నం సినిమాలంటే ఇష్టపడే ప్రేక్షకులు సైతం చెలియా చిత్రాన్ని చూడడానికి కష్టపడతారు. ఇలాంటి సినిమా చూడాలంటే ప్రేక్షకులు ఎంత కష్టపడాల్సి వస్తుందో చెలియా రుజువు చేస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ, కార్తీ, అతిది రావు నటన, రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అందమైన విజువల్స్ తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలేవీ లేవు. కాబట్టి చెలియా సినిమా చూడాలంటే చాలా ఓపిక అవసరం.
ఫినిషింగ్ టచ్: కష్టపడి చూడాల్సిన సినిమా!
సినీజోష్ రేటింగ్: 2.25/5