>అమీ తుమీ
గ్రీన్ ట్రీ ప్రొడక్షన్
తారాగణం: అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, వెన్నెల కిశోర్, ఈషా రెబ్బ, అదితి, శ్యామలాదేవి, తనికెళ్ళ భరణి, వేణుగోపాల్, కేదార్ శంకర్, తడివేలు తదితరులు
సినిమాటోగ్రఫీ: పి.జి.విందా
సంగీతం: మణిశర్మ
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాత: కె.సి.నరసింహారావు
రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
విడుదల తేదీ: 09.06.2017
సినిమాల్లో ఎన్ని జోనర్స్ వున్నా ప్రేక్షకులు కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. అది సెంటిమెంట్‌తో మనసుని కదిలించేది కావచ్చు, భయపెడుతూ థ్రిల్ చేసేది కావచ్చు, మెస్మరైజ్ చేసే యాక్షన్ కావచ్చు. అన్నింటినీ మించి ఎక్కువ శాతం ప్రేక్షకులు ఇష్టపడేది కామెడీనే. గతంలో రేలంగి నరసింహారావు, జంధ్యాల, వంశీ, ఇ.వి.వి.సత్యనారాయణ వంటి డైరెక్టర్స్ కేవలం కామెడీనే బేస్ చేసుకొని కథలు రాసుకునేవారు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఆడియన్స్‌ని నవ్వించడమే ధ్యేయంగా సినిమాలు తీసేవారు. ఈమధ్యకాలంలో అలాంటి ఆరోగ్యకరమైన కామెడీ కరువైపోయింది. అడపా దడపా కొంతమంది డైరెక్టర్లు అలాంటి సినిమాలు తియ్యాలని ప్రయత్నించినా ఫలితం మాత్రం అరకొరగానే వుంటోంది. ఆమధ్య మోహనకృష్ణ ఇంద్రగంటి.. సూపర్‌స్టార్ మహేష్ సెంటర్ పాయింట్‌గా తీసిన అష్టాచమ్మా మంచి వినోదాత్మక చిత్రంగా అందర్నీ ఆకట్టుకుంది. మళ్ళీ అదే కోవలో మోహనకృష్ణ చేసిన మరో ప్రయత్నం అమీ తుమీ. శ్రీనివాస్ అవసరాల, అడివి శేష్, వెన్నెల కిశోర్, ఈషా రెబ్బ ప్రధాన తారాగణంగా ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీగా రూపొందిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అమీ తుమీ ప్రేక్షకుల్ని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసిందా? ఆడియన్స్‌ని నవ్వించేందుకు మోహనకృష్ణ ఈసారి ఎంచుకున్న కథాంశమేమిటి? ఈ సినిమా ఆడియన్స్‌కి ఎంతవరకు రీచ్ అవుతుంది? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
అది ఒక తెలంగాణ ఫ్యామిలీ. అతని పేరు జనార్థన్(తనికెళ్ళ భరణి). కొడుకు విజయ్(అవసరాల శ్రీనివాస్), కూతురు దీపిక(ఈషా రెబ్బ). కొడుకు, కూతురు తమ పెళ్ళిళ్ళ విషయంలో తండ్రితో విభేదిస్తారు. తన శత్రువు కూతుర్ని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడని జనార్థన్ కొడుకుని ఇంట్లోంచి వెళ్ళిపొమ్మంటాడు. దీపిక ప్రేమించిన అనంత్(అడివి శేష్) అంటే ఇష్టంలేని జనార్థన్ కూతుర్ని హౌస్ అరెస్ట్ చేస్తాడు. మరోపక్క ఆస్తిపరుడైన శ్రీచిలిపి(వెన్నెల కిషోర్)తో దీపికకు సంబంధం ఫిక్స్ చేస్తాడు జనార్థన్. ఆ ఇంట్లోనే పనిమనిషిగా వుంటున్న కుమారి(శ్యామలాదేవి)కి పెళ్ళి వయసు దాటిపోయినా ఏ సంబంధం కుదరదు. తండ్రి ఫిక్స్ చేసిన పెళ్ళి నుంచి తప్పించుకొని తన ప్రియుడిని పెళ్ళి చేసుకోవడానికి కుమారి సహాయంతో దీపిక ఓ ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ వల్ల మూడు జంటల పెళ్ళిళ్ళు ఎన్నో మలుపుల తర్వాత జరుగుతాయి. దీపిక వేసిన ప్లాన్ ఏమిటి? దాని వల్ల ఎవరెవరికి ఎలాంటి కన్‌ఫ్యూజన్స్ వచ్చాయి? ఈ కథ ఎన్ని మలుపులు తిరిగింది? అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే.
ఈ కథలో పేరుకి ముగ్గురు ప్రధాన పాత్రలు పోషించినా వెన్నెల కిశోర్ సినిమాకి హైలైట్ అయ్యాడు. తన పంచ్ డైలాగ్స్‌తో, డిఫరెంట్ ఇంగ్లీష్‌తో, తన మేనరిజమ్‌తో, బాడీ లాంగ్వేజ్‌తో విపరీతంగా నవ్వించాడు. అవసరాల శ్రీనివాస్, అడివి శేష్‌ల క్యారెక్టర్స్ కూడా సినిమాలో ప్రధానమే అయినా వారి క్యారెక్టర్స్ నిడివి తక్కువగా వుంది. పెర్‌ఫార్మెన్స్ పరంగా ఇద్దరూ ఓకే అనిపించారు. హీరోయిన్ ఈషా తెలంగాణ స్లాంగ్‌తో ఎంతో ఈజ్ కనబరచింది. పనిమనిషి కుమారిగా శ్యామలాదేవి కామెడీ కూడా అందర్నీ నవ్విస్తుంది. తనికెళ్ళ భరణి డైలాగ్స్ ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్ చేశాయి.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ గురించి చెప్పాలంటే పి.జి. విందా ఫోటోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. ప్రతి సీన్ ఎంతో బ్రైట్‌గా చూపించడంలో విందా సక్సెస్ అయ్యాడు. ఇప్పటివరకు మణిశర్మ చేసిన సినిమాలకు భిన్నమైన మ్యూజిక్ ఈ సినిమాకి అందించాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకున్నాడు. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ కూడా చాలా స్పీడ్‌గా వుంది. అయితే సినిమా స్టార్టింగ్‌లో మాత్రం చాలా స్లో అనిపించింది. కథ, కథనాలకు అనుగుణంగా వున్నంతలో సినిమాని రిచ్‌గా తీసే ప్రయత్నం చేశాడు నిర్మాత. డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి గురించి చెప్పాలంటే అష్టాచమ్మా తరహాలోనే కన్‌ఫ్యూజ్ కామెడీతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేద్దామనుకున్నాడు. అయితే ఆ సినిమా స్థాయిని అమీ తుమీ చేరుకోలేదనే చెప్పాలి. అయితే సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్టు నుంచి హండ్రెడ్ పర్సెంట్ పెర్‌ఫార్మెన్స్‌ని తీసుకోవడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ మనం వినని కొత్త డైలాగ్స్ ఈ సినిమాలో రాశాడు మోహనకృష్ణ. ఆ డైలాగ్స్‌ని వెన్నెల కిషోర్ తన స్టైల్‌లో చెప్పి నవ్వులు పూయించాడు. ఇంతవరకు బాగానే వుంది. ఫస్ట్ హాఫ్ చూసి థియేటర్ బయటికి వచ్చిన ప్రేక్షకుడు సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా వుందని, పంచ్ డైలాగ్స్ అదిరిపోయాయని, డిఫరెంట్ కామెడీ అనీ.. ఇలా రకరకాలుగా అనుకుంటాడు. సెకండాఫ్‌లో కూడా ఆ రేంజ్ కామెడీని మెయిన్‌టెయిన్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. కానీ, ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో పంచ్ డైలాగ్స్‌గానీ, ఆడియన్స్‌ని విపరీతంగా నవ్వించిన సందర్భాలుగానీ చాలా తక్కువ. ఒక దశలో సినిమా కంప్లీట్ అయిపోతే ఇంటికెళ్ళిపోవచ్చు అనుకునేలా సీన్స్‌ని పెంచుకుంటూ వెళ్ళారు. దాంతో వినోదాన్ని ఆస్వాదించే స్థాయి దాటిపోయి ఆ స్థానంలో విసుగు వచ్చి చేరింది. ఆరోగ్యకరమైన కామెడీని అందించాలన్న డైరెక్టర్ ఆలోచన గొప్పదే అయినా దాన్ని అర్థ భాగం మాత్రమే ఆచరణలో పెట్టగలిగాడన్నది వాస్తవం. ఫైనల్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఎంత హిలేరియస్‌గా వుంటుందో, సెకండాఫ్ అంత నార్మల్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఆశించిన స్థాయిలో కామెడీ లేకపోవడం వల్ల సినిమా ఓకే అనుకుంటూ థియేటర్ బయటికి రావాల్సి వస్తుంది. అయితే ఇందులో ఉపయోగించిన కొన్ని డైలాగ్స్ కేవలం ఎ సెంటర్స్ మాత్రమే అర్థం చేసుకునేలా వుండడం కూడా దానికి కారణం కావచ్చు. బి, సి సెంటర్స్‌లో ఈ కామెడీని ఎలా ఎంజాయ్ చేస్తారో, ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో వెయిట్ అండ్ సీ.
ఫినిషింగ్ టచ్: ఫస్ట్ హాఫ్ జోరుగా.. సెకండాఫ్ డల్‌గా!
ashta chamma director mohana krishna indraganti new movie ami tumi. this film made with out and out comedy.