డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి, కోన ఫిలిం కార్పొరేషన్
నిన్నుకోరి
తారాగణం: నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి, మురళీశర్మ, తనికెళ్ళ భరణి, సుదర్శన్, పృథ్వీ, కేదార్ శంకర్, రాజశ్రీనాయర్, నీతు, భూపాల్‌రాజ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: గోపీసుందర్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్
నిర్మాత: డి.వి.వి.దానయ్య
కథ, దర్శకత్వం: శివ నిర్వాణ
విడుదల తేదీ: 07.07.2017
ప్రేమ విఫలమైతే జీవితం ముగిసిపోయినట్టు కాదు.. జీవితం మనకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది. మనం దానికి ఒక్క అవకాశం ఇద్దాం.. ఈ కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా నిన్నుకోరి. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరస విజయాలతో దూసుకెళ్తున్న నానికి నిన్నుకోరి ఎలాంటి ఫలితాన్నిచ్చింది. మెచ్యూర్డ్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అయ్యింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
అతని పేరు ఉమామహేశ్వరరావు(నాని). వైజాగ్‌లో స్టాటిస్టిక్స్‌పై పి.హెచ్.డి. చేస్తున్న యువకుడు. అతను పల్లవి(నివేదా థామస్) ప్రేమలో పడతాడు. యధావిధిగా పల్లవి కూడా అతన్ని ప్రేమిస్తుంది. పల్లవి తండ్రి(మురళీశర్మ) సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి. తన కూతురు పెళ్ళి గురించి అతనికి కొన్ని ఆలోచనలు వుంటాయి. తన కూతుర్ని చేసుకోబోయేవాడు ఆర్థికంగా స్థిరపడినవాడు, తన కూతురికి ఏ లోటూ రాకుండా చూసుకునేవాడు అయి వుండాలన్నది అతని అభిప్రాయం. ఈ విషయం తెలుసుకున్న ఉమా తను చెయ్యాలనుకున్న పి.హెచ్.డి.ని పూర్తి చేసి ఆర్థికంగా స్థిరపడాలనుకుంటాడు. ఈలోగా పల్లవికి పెళ్ళి సంబంధాలు చూస్తుంటాడు ఆమె తండ్రి. ఈ విషయం ఉమాతో చెప్పి ఇద్దరం లేచిపోయి పెళ్ళి చేసుకుందాం అని చెప్తుంది. దానికి అంగీకరించని ఉమా తను పి.హెచ్.డి. చెయ్యడం ముఖ్యం అంటాడు. అందులో భాగంగానే ఢిల్లీ వెళ్ళిపోతాడు. చేసేది లేక తండ్రి చూసిన అబ్బాయి అరుణ్(ఆది పినిశెట్టి)ని పెళ్ళి చేసుకుంటుంది పల్లవి. ఈ విషయం తెలుసుకున్న ఉమా తాగుడికి బానిసవుతాడు. తన కెరీర్‌ని కూడా పట్టించుకోడు. తన కోసం అతని కెరీర్ పాడవడం ఇష్టం లేని పల్లవి ఓ నిర్ణయానికి వస్తుంది. ఉమా కోసం పల్లవి తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఆ తర్వాత ఉమా, పల్లవి, అరుణ్‌ల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయి? తన నిర్ణయంతో ఉమాని పల్లవి మార్చగలిగిందా? చివరికి ఉమా ఏమయ్యాడు? అనేది మిగతా కథ.
ప్రేమలో విఫలమైన యువకుడిగా నాని పెర్‌ఫార్మెన్స్ బాగుంది. తన ప్రియురాలి ప్రేమకోసం తపించే ప్రేమికుడిగా ఆకట్టుకున్నాడు. మధ్య, మధ్య తన మార్క్ కామెడీతో నవ్వించాడు. పల్లవి పాత్రలో నివేదా థామస్ పెర్‌ఫార్మెన్స్ చాలా బాగుంది. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతూ వుంటుంది కాబట్టి సినిమాలో ఆమెదే కీలక పాత్ర అని చెప్పాలి. మాజీ ప్రియుడు కొత్త జీవితం ప్రారంభించాలని కోరుకునే అమ్మాయిగా, తన భర్తను అమితంగా ప్రేమించే భార్యగా నివేదా నటన అందర్నీ ఆకట్టుకుంది. కూతురి జీవితం బాగుండాలని తపన పడే తండ్రిగా మురళీశర్మ నటన అందర్నీ ఆలోచింపజేస్తుంది. పల్లవి భర్తగా ఆది పినిశెట్టి తన పాత్ర పరిధి మేరకు బాగానే చేశాడు. మిగతా పాత్రధారులు కూడా వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ప్రకృతి అందాలను, అమెరికాలోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌ని అంతే బ్యూటిఫుల్‌గా తెరకెక్కించాడు. గోపీసుందర్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయింది. పాటలన్నీ వినసొంపుగా వున్నాయి. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. సినిమా మూడ్‌కి తగ్గట్టు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే చేశాడు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగానే వుంది కానీ సినిమాలో బోర్ కొట్టే సన్నివేశాలు చాలా వున్నాయి. వాటిని కట్ చేస్తే సినిమా మరికాస్త స్పీడ్‌గా వుండేది. కోన వెంకట్ స్క్రీన్‌ప్లే, మాటల్లో కొత్తదనం ఏమీ కనిపించలేదు. చాలా రొటీన్‌గా అనిపించాయి. డైరెక్టర్ శివ నిర్వాణ గురించి చెప్పాలంటే తను రాసుకున్న కథ పరమ రొటీన్. ఏ ఒక్క సందర్భంకానీ, సీన్‌గానీ కొత్తగా అనిపించదు. ఇలాంటి కథలతో తెలుగులో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. సినిమా ఓపెనింగ్ సీన్‌లోనే కథ మొత్తం అర్థమైపోతుంది. ఆ తర్వాత వచ్చే సీన్స్‌లో ఏం జరగబోతోంది అనేది సగటు ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నో సినిమాల కలయిక నిన్నుకోరి. కేవలం నాని, నివేదా, ఆది కోసం తెలిసిన కథైనా ఆడియన్స్ సీట్లలో కూర్చుంటారు. స్లో నేరేషన్‌తో స్టార్ట్ అయ్యే సినిమా ఏ దశలోనూ స్పీడ్‌గా అనిపించదు. అదే స్లోని చివరి వరకు కంటిన్యూ చేశాడు డైరెక్టర్. చిత్రీకరణ బాగానే వున్నప్పటికీ మధ్య మధ్యలో వచ్చే పాటలు కూడా ఆడియన్స్ మూడ్‌ని డిస్ట్రబ్ చేస్తాయి. అయితే అక్కడక్కడ నాని, మురళీశర్మ, పృథ్వీ డైలాగ్స్ నవ్వు తెప్పిస్తాయి. ప్రొడక్షన్ వేల్యూస్ బాగానే వున్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ రిచ్‌గానే అనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఇది వరకు చూసిన సినిమాలనే మళ్ళీ చూడాలనిపిస్తే నిన్నుకోరి చూడొచ్చు. ఈ సినిమా కేవలం మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ని మాత్రమే ఆకట్టుకునే అవకాశం వుంది. బి, సి సెంటర్స్ ఆడియన్స్‌కి ఈ కథ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ.
ఫినిషింగ్ టచ్: అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు
Nani, Nivetha Thomas, Aadhi Pinisetty Starring Ninnu Kori Movie Review