Advertisementt

సినీజోష్‌ రివ్యూ: 2 కంట్రీస్‌

Fri 29th Dec 2017 08:42 PM
telugu movie 2 countries,2 countries movie reveiw,sunil movie 2 countries review in cinejosh,n shankar movie 2 countries review,2 countries cinejosh review  సినీజోష్‌ రివ్యూ: 2 కంట్రీస్‌
2 countries movie review సినీజోష్‌ రివ్యూ: 2 కంట్రీస్‌
సినీజోష్‌ రివ్యూ: 2 కంట్రీస్‌ Rating: 1.75 / 5
Advertisement
Ads by CJ

మహాలక్ష్మి ఆర్ట్స్‌ 

2 కంట్రీస్‌ 

తారాగణం: సునీల్‌, మనీషా రాజ్‌, నరేష్‌, పృథ్వీ, సితార, సిజ్జు, సంజన, రాజా రవీంద్ర, షాయాజీ షిండే, శ్రీనివాసరెడ్డి, ఝాన్సీ, దేవ్‌ గిల్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌ 

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 

సంగీతం: గోపీసుందర్‌ 

కథ: రఫీ 

మాటలు: శ్రీధర్‌ సీపాన 

స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: ఎన్‌.శంకర్‌ 

విడుదల తేదీ: 29.12.2017 

కమెడియన్‌ నుంచి హీరోగా టర్న్‌ తీసుకున్న సునీల్‌కి అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు మినహా చెప్పుకోవడానికి సినిమాలు లేవు. హీరోగా చేసిన ప్రతి సినిమా పరాజయం పాలవుతోంది. డైరెక్టర్‌ ఎన్‌.శంకర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్‌కౌంటర్‌, శ్రీరాములయ్య, భద్రాచలం, జయం మనదేరా, జై బోలో తెలంగాణ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలు చేసి దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. అలాంటి దర్శకుడి కాంబినేషన్‌లో సునీల్‌ సినిమా చేస్తున్నాడంటే ప్రేక్షకుల్లో ఆ సినిమాపై అంచనాలు ఉండడం సహజమే. దాదాపు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ మెగా ఫోన్‌ పట్టుకున్న శంకర్‌ నుంచి ఒక మంచి సినిమా వస్తుందని ఆశించడంలోనూ తప్పులేదు. అయితే మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన 2 కంట్రీస్‌ చిత్రాన్ని శంకర్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నాడని తెలిసి పరాజయాల్లో ఉన్న సునీల్‌కి శంకర్‌ మరో సూపర్‌హిట్‌ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఓ బిలో ఏవరేజ్‌ సినిమాని చేశాడు శంకర్‌. శుక్రవారం విడుదలైన ఈ సినిమా కథ, కథనాలు ఏమిటి? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

అతని పేరు ఉల్లాస్‌కుమార్‌(సునీల్‌) ఏదో ఒకటి చేసి కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఆ ఊళ్ళో పటేల్‌(షాయాజీ షిండే) దగ్గర పది లక్షలు అప్పు చేస్తాడు. అవి ఏం చేస్తాడో తెలీదు. ఆ తర్వాత ఓ ఫారినర్‌ 50 లక్షల డాలర్లను 30 లక్షలకే ఇచ్చేస్తున్నాడని నమ్మించి పటేల్‌తో 30 లక్షలు కట్టిస్తాడు. అవి నకిలీ నోట్లని తెలియడంతో పటేల్‌ని జైల్లో పెడతారు. జైల్‌ నుంచి వచ్చిన పటేల్‌ని కూల్‌ చెయ్యడానికి పటేల్‌ చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటానంటాడు. పెళ్ళి ఏర్పాట్లు జరుగుతుండగానే ఉల్లాస్‌కి అమెరికా సంబంధం వస్తుంది. ఆ అమ్మాయి పేరు లయ(మనీషారాజ్‌). ఆమె తన చిన్ననాటి స్నేహితురాలే కాక బాగా డబ్బున్న వాళ్ళని తెలుసుకొని ఆ పెళ్ళికి ఓకే చెప్తాడు. అయితే ఆ అమ్మాయి మద్యానికి ఎడిక్ట్‌ అయిందని పెళ్ళిరోజే తెలుసుకుంటాడు. చేసేది లేక ఆమెతో కలిసి అమెరికా వెళ్తాడు. మందు లేనిదే లయకు రోజు గడవదు. కొన్ని ఘటనల తర్వాత లయ.. ఉల్లాస్‌కి విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతుంది. లయ ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది? డబ్బు కోసమే లయని పెళ్ళి చేసుకున్న ఉల్లాస్‌ దానికి ఎలా రియాక్ట్‌ అయ్యాడు? ఈ ఇద్దరి కథ ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ. 

పూర్తి స్థాయి కామెడీ చిత్రంగా 2 కంట్రీస్‌ని తీర్చి దిద్దాలని శంకర్‌ చేసిన ప్రయత్నంలో ఎన్నో లోపాలు కనిపించాయి. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు సునీల్‌ క్యారెక్టరైజేషన్‌గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ, డైలాగ్‌ డెలివరీగానీ ఎలా ఉండేవో అదే ప్యాట్రన్‌లో సునీల్‌ క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశాడు శంకర్‌. ప్రేక్షకుల్ని నవ్వించాలన్న తపన ప్రతి డైలాగ్‌లో కనిపిస్తుంది. సునీల్‌కి ఇలాంటి క్యారెక్టర్‌ చెయ్యడం వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఏమాత్రం కష్టపడకుండానే క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయి నటించాడు. కొన్ని సీన్స్‌లో అతని ఓవర్‌ యాక్షన్‌ని కూడా చూడొచ్చు. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన మనీషారాజ్‌ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. నటన పరంగా కాస్తో కూస్తో తన క్యారెక్టర్‌కి న్యాయం చేసింది. హీరో ఫ్రెండ్‌గా నటించిన శ్రీనివాసరెడ్డి భరించలేని ఓవర్‌ యాక్షన్‌ చేశాడు. తెలుగుని ఇరిటేటింగ్‌ స్లాంగ్‌లో మాట్లాడుతూ మరింత ఇరిటేట్‌ చేశాడు నరేష్‌. కారు ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌గా నటించిన పృథ్వీ క్యారెక్టర్‌ కేవలం నవ్వించడానికే అన్నట్టు అప్పుడప్పుడు కనిపిస్తాడు. కనిపించిన ప్రతిసారీ పంచ్‌ డైలాగ్స్‌ చెప్తూ నవ్వించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ, ఒక్క డైలాగ్‌ కూడా వర్కవుట్‌ అవ్వలేదు. సినిమాలోని ఒక్కో క్యారెక్టర్‌ ఒక్కోలా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ కూడా ఉంది. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ గురించి చెప్పాలంటే సినిమాకి కొంతవరకు ప్లస్‌ అయింది రాంప్రసాద్‌ ఫోటోగ్రఫీ. సినిమాకి రిచ్‌ లుక్‌ తీసుకు రావడంలో రాంప్రసాద్‌ కృషి ఎంతో ఉంది. గోపీసుందర్‌ ఈమధ్య చేసిన బ్యాడ్‌ ఆల్బమ్‌ అంటే ఇదేనని చెప్పుకోవాలి. కథ, కథనాలకు తగ్గట్టుగానే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఎంతో లౌడ్‌గా అనిపిస్తుంది. ఏ ఒక్క సీన్‌లోనూ మ్యూజిక్‌ ఆకట్టుకునేలా ఉండదు. అన్నింటి కంటే ముఖ్యంగా ఎడిటింగ్‌ సినిమాకి పెద్ద మైనస్‌ అయింది. ఏ షాట్‌కి ఆ షాట్‌ అన్నట్టు సినిమా నడుస్తుంది తప్ప ఒక ఫ్లోలో కథ వెళ్తున్న ఫీలింగ్‌ కలగదు. సినిమాలో అనవసరమైన సీన్స్‌కి కొదవలేదు. అలాంటి అనవసరమైన సీన్స్‌తోనే సినిమాని రెండు గంటల 40 నిమిషాల వరకు సాగదీశారు. శ్రీధర్‌ సీపాన రాసిన డైలాగ్స్‌ గురించి చెప్పాలంటే.. నాసిరకం డైలాగ్స్‌, ఔట్‌ డేటెడ్‌ పంచెస్‌తో నవ్వించాలని చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. ప్రతి డైలాగ్‌లో ప్రాస కోసం పాకులాడడం చూస్తే శ్రీధర్‌ సీపానపై జాలి కలుగుతుంది. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు నిర్మాణ పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదని తెలుస్తుంది. ఇక డైరెక్టర్‌ శంకర్‌ గురించి చెప్పాలంటే అతని నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. తన ప్రతి సినిమాలో ఏదో సందేశం ఉండేలా చూసుకునే శంకర్‌ ఆరేళ్ళ తర్వాత చేసిన ఈ సినిమాలో ఎలాంటి ప్రత్యేకత లేదు. కేవలం మలయాళంలో సూపర్‌హిట్‌ అయ్యిందన్న ఒకే కారణంతో ఈ సినిమా చేశాడు. సినిమాలో ఎక్కడా శంకర్‌ మార్క్‌ కనిపించదు. మలయాళంలో ఈ సినిమా ఎలా హిట్‌ అయ్యిందో తెలీదుగానీ కథ నిండా లూప్‌హోల్సే కనిపిస్తాయి. ఏ ఒక్క సీన్‌ కూడా నేచురల్‌గా అనిపించదు. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఫలానా సీన్‌ బాగుంది అని చెప్పుకోవడానికి లేదు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ సాధారణంగా, క్లైమాక్స్‌ పరమ రొటీన్‌గా అనిపిస్తాయి. శంకర్‌ కెరీర్‌లో ఇలాంటి సినిమా చేసి ఉండడు. అలాగే సునీల్‌ కెరీర్‌లో కూడా ఇంత బ్యాడ్‌ మూవీ లేదంటే అతిశయోక్తి కాదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఒక రొటీన్‌ కథని తీసుకొని దానికి సునీల్‌ కామెడీని, కొంత సెంటిమెంట్‌ని జోడించి చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాలన్న శంకర్‌ ప్రయత్నం బెడిసి కొట్టింది. ప్రతి క్షణం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే ఈ సినిమా సునీల్‌కి మరో బ్యాడ్‌ మూవీ అని చెప్పక తప్పదు. చాలా గ్యాప్‌ తర్వాత ఎన్‌.శంకర్‌ చేసిన ఈ సినిమా ఎ, బి, సి... ఇలా ఏ సెంటర్‌ ఆడియన్స్‌నీ ఆకట్టుకోదని ఘంటాపథంగా చెప్పొచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: 2 కంట్రీస్‌.. టూ బ్యాడ్‌ 

2 countries movie review:

telugu movie 2 countries review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ