అన్నపూర్ణ స్టూడియోస్
రంగుల రాట్నం
తారాగణం: రాజ్ తరుణ్, చిత్ర శుక్లా, సితార, ప్రియదర్శి, రవిపక్రాష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎల్.కె.విజయ్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్
రచన, దర్శకత్వం: శ్రీరంజని
విడుదల తేదీ: 14.01.2018
మనకు సంక్రాంతి పెద్ద పండుగ. అలాగే సినిమాలకు కూడా సంక్రాంతి పెద్ద పండుగే. పెద్ద హీరోలు తమ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వాలని, సూపర్‌హిట్ అవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడున్న టాప్ హీరోలంతా సంక్రాంతి విజయాలు అందుకున్నవారే. సాధారణంగా సంక్రాంతికి పెద్ద సినిమాలే రిలీజ్ అయ్యేవి. చిన్న సినిమాలు ఆ దరిదాపుల్లో కూడా ఉండేవి కాదు. కానీ, ట్రెండ్ మారింది. చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో టాప్ హీరోల సినిమాలతో పోటీ పడే స్థాయికి చిన్న సినిమాలు వచ్చాయి. ఈమధ్య ప్రతి సంక్రాంతికి పెద్ద సినిమాలతోపాటు చిన్న సినిమాలు కూడా విడుదలై సూపర్‌హిట్ అవుతున్నాయి. అదే సెంటిమెంట్‌తో విడుదలైంది రంగుల రాట్నం చిత్రం. రాజ్‌తరుణ్, చిత్ర శుక్లా జంటగా శ్రీరంజని రూపొందించిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది. రాజ్ తరుణ్ హీరోగా పరిచయమైన ఉయ్యాలా జంపాలా చిత్రాన్ని కూడా ఈ సంస్థే నిర్మించింది. మరి ఈ సినిమా రాజ్ తరుణ్‌కి ఎలాంటి రిజల్ట్ నిచ్చింది? డైరెక్టర్‌గా పరిచయమైన శ్రీరంజని ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సినిమా తియ్యగలిగిందా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
అతని పేరు విష్ణు(రాజ్ తరుణ్). సొంతంగా ఓ కంపెనీ రన్ చేస్తుంటాడు. తండ్రి లేడు. తల్లే సర్వస్వం. ఆ తల్లి(సితార)కి కూడా కొడుకే పంచ ప్రాణాలు. పొద్దున లేచిన దగ్గర నుంచి కొడుకుని పెళ్లి చేసుకోమని వేధిస్తుంటుంది. విష్ణుకి ఇష్టం లేకపోయినా పెళ్ళి చూపులకు తీసుకెళ్తుంది. కానీ, అతనికి ఎవరూ నచ్చరు. అలాంటి సమయంలో విష్ణుకి కీర్తి(చిత్ర శుక్లా) పరిచయమవుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లా ఆ అమ్మాయిని ఇష్టపడతాడు. మెల్లగా స్నేహం పెంచుకుంటాడు. కానీ, తను ఆమెను ప్రేమిస్తున్న విషయం చెప్పడు. అలా రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. హఠాత్తుగా విష్ణు జీవితంలో అనుకోని ఘటన జరుగుతుంది. దాంతో అతను డిప్రెషన్‌లోకి వెళ్ళి పోతాడు. ఆ సమయంలో కీర్తి అతనికి ప్రేమను పంచుతుంది. కొన్నాళ్ళకు విష్ణు, కీర్తిల మధ్య దూరం పెరుగుతుంది. విష్ణు జీవితాన్ని మార్చేసిన ఆ ఘటన ఏమిటి? ఒకరినొరు ఎంతగానో ఇష్టపడ్డ విష్ణు, కీర్తి ఎందుకు దూరమయ్యారు? చివరికి వారిద్దరూ ఎలా కలుసుకున్నారు? అనేది మిగతా కథ.
ఇప్పటివరకు రాజ్ తరుణ్ చేసిన సినిమాలన్నీ ఫుల్ లెంగ్ ఎంటర్‌టైనర్సే. ప్రతి సినిమాలో అతని క్యారెక్టర్ ఎంతో ఎనర్జిటిక్‌గా యూత్‌కి హుషారు పుట్టించేలా ఉంటుంది. కానీ, ఈ సినిమాలో దానికి భిన్నంగా సెంటిమెంట్, ఎమోషన్.. వంటి అంశాలతో అతని క్యారెక్టర్‌ని డిజైన్ చేశారు. తన లిమిట్స్ మేరకు తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు రాజ్ తరుణ్. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్‌లో అతని నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. రూల్స్‌ని వ్యతిరేకించేవారు, పరిశుభ్రమైన తిండి తినని వారంటే అసహ్యించుకునే క్యారెక్టర్‌లో చిత్ర శుక్లా పెర్‌ఫార్మెన్స్ ఫర్వాలేదనిపిస్తుంది. గ్లామర్ పరంగా కూడా చిత్ర ఓకే అని చెప్పొచ్చు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశం వుంది. తల్లి పాత్రలో సితార నటన కూడా ఆకట్టుకుంటుంది. ఈమధ్యకాలంలో సితార ఎక్కువ నిడివి ఉన్న క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలోనే. కొడుకుపై అమితమైన ప్రేమను పంచే తల్లిగా ఆమె నటన అక్కడక్కడ కంటతడి పెట్టిస్తుంది. హీరో ఫ్రెండ్ శివ క్యారెక్టర్‌లో నటించిన ప్రియదర్శి తనదైన నటనను ప్రదర్శించాడు. అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం కూడా చేశాడు.
సాంకేతిక విభాగాల గురించి చెప్పాలంటే ఎల్.కె.విజయ్ ఫొటోగ్రఫీ బాగుంది. కళ్ళకి ఇబ్బంది కలిగించని సెటప్‌తో ప్రతి సీన్‌ని అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. శ్రీచరణ్ చేసిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఫర్వాలేదు. శ్రీకర్‌ప్రసాద్ ఎడిటింగ్ బాగానే ఉన్నా సెకండాఫ్‌లో కథని కదలకుండా చేసే కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే సినిమా స్పీడ్‌గా ఉండేది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. ఈ కథకు తగ్గ బడ్జెట్‌లో సినిమాని నిర్మించారు. డైరెక్టర్ శ్రీరంజని గురించి చెప్పాలంటే.. మొదటి సినిమా రాజ్ తరుణ్ వంటి ఎనర్జిటిక్ హీరోతో చేస్తున్నప్పుడు అతని గత చిత్రాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఉంటే బాగుండేది. రాజ్ తరుణ్ సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్‌గా ఉంటుందని థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌కి నిరాశే ఎదురవుతుంది. సినిమా స్టార్ట్ అవ్వడమే స్లో నేరేషన్‌తో స్టార్ట్ అవుతుంది. సినిమా నడుస్తుందే తప్ప ఎక్కడా ఎలాంటి ట్విస్ట్ కనిపించదు. దాని కోసం ఇంటర్వెల్ వరకు వెయిట్ చెయ్యాల్సి వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత ఎక్కడి కథ అక్కడే ఉంటుంది. ఒక్క ఇంచ్ కూడా ముందుకెళ్ళదు. దానికోసం క్లైమాక్స్ వరకు వెయిట్ చెయ్యాల్సి వస్తుంది. ఇలా వెయిట్ చేసి వెయిట్ చేసి ఆడియన్స్‌కి నీరసం వస్తుందే తప్ప సినిమా కంప్లీట్ అవ్వదు. హీరోపై హీరోయిన్‌కి వున్న అమితమైన ప్రేమ వల్ల అతని సేఫ్టీ కోసం ఆమె చెప్పే జాగ్రత్తలు హీరోకే కాదు ఆడియన్స్‌కి కూడా చిరాకు పుట్టిస్తాయి. సినిమాలో ఉన్న మరో మైనస్ పాయింట్ ఏమిటంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు మందు తాగే సీన్లు సినిమాలో కోకొల్లలు. కథకు అంత అవసరం లేకపోయినా బాటిల్స్ బాటిల్స్ మందు తాగేస్తుంటారు. దీని వల్ల సినిమా కథనానికి ఒరిగిందేమీ లేదు. ఏ డైరెక్టర్ అయినా తమ మొదటి సినిమా కథను ఎంతో కన్‌స్ట్రక్టివ్‌గా రాసుకుంటారు. ఎంతో జాగ్రత్తగా డీల్ చేస్తారు. ఔట్‌పుట్ అద్భుతంగా వచ్చేలా కష్టపడతారు. కానీ, ఈ సినిమాలో శ్రీరంజని కష్టం ఎక్కడా కనిపించదు. ఓ సాదా సీదా సినిమాలా తీసారు తప్ప స్పెషల్‌గా ఎఫర్ట్ పెట్టి తీసిన సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. ఫైనల్‌గా చెప్పాలంటే అసలు కథలోకి వెళ్ళడానికి ఫస్ట్‌హాఫ్‌లో కాలయాపన చేసి ఇంటర్వెల్‌లో ఓ ట్విస్ట్ ఇచ్చి, సెకండాఫ్‌లో ఎక్కడి కథను అక్కడే నిలిపివేసి మళ్ళీ క్లైమాక్స్‌లో కథను సుఖాంతం చేసిన వైనం ఆకట్టుకునేలా ఉండదు. పైగా సినిమాలో ఎక్కడా పండగ వాతావరణంగానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌గానీ పూర్తి స్థాయిలో లేకపోవడం, కథ, కథనాలు నీరసంగా ఉండడం వల్ల ప్రేక్షకులు ఏ దశలోనూ ఎంజాయ్ చెయ్యలేకపోతారు. మరి పండగ సెలవులు ఈ సినిమాకి ఏ స్థాయి విజయాన్ని అందిస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
ఫినిషింగ్ టచ్: రంగులు మిస్ అయ్యాయి
raj tarun movie rangula ratnam