Advertisementt

సినీజోష్‌ రివ్యూ: టచ్‌ చేసి చూడు

Fri 02nd Feb 2018 07:32 PM
raviteja new movie touch chesi choodu,touch chesi choodu movie review,touch chesi choodu review in cinejosh,touch chesi choodu cinejosh review  సినీజోష్‌ రివ్యూ: టచ్‌ చేసి చూడు
touch chesi choodu review సినీజోష్‌ రివ్యూ: టచ్‌ చేసి చూడు
సినీజోష్‌ రివ్యూ: టచ్‌ చేసి చూడు Rating: 2.25 / 5
Advertisement
Ads by CJ

శ్రీలక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ 

టచ్‌ చేసి చూడు 

తారాగణం: రవితేజ, రాశిఖన్నా, సీరత్‌కపూర్‌, మురళీశర్మ, ఫ్రెడీ దారూవాలా, జయప్రకాష్‌, వెన్నెల కిశోర్‌, సత్యం రాజేష్‌, సుహాసిని, పూజా ఝవేరి, జీవా, సుదర్శన్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు 

ఎడిటింగ్‌: గౌతంరాజు 

సంగీతం: జామ్‌ 8 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: మణిశర్మ 

కథ: వక్కంతం వంశీ 

స్క్రీన్‌ప్లే: దీపక్‌రాజ్‌ 

సమర్పణ: బేబీ భవ్య 

నిర్మాతలు: వల్లభనేని వంశీమోహన్‌, నల్లమలుపు శ్రీనివాస్‌ 

దర్శకత్వం: విక్రమ్‌ సిరికొండ 

విడుదల తేదీ: 02.02.2018 

రవితేజ సినిమా అంటే మెయిన్‌గా మనకు కనిపించేది ఎంటర్‌టైన్‌మెంట్‌. దానికి ఓ బలమైన కథ కూడా తోడైతే మాస్‌, యూత్‌, ఫ్యామిలీ... ఇలా అన్నివర్గాల ప్రేక్షకులు కనెక్ట్‌ అయిపోతారు. కథ ఏదైనా రవితేజ క్యారెక్టరైజేషన్‌లో, బాడీ లాంగ్వేజ్‌లో ఎలాంటి మార్పూ ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే దర్శకులు కథలు ఎంపిక చేసుకుంటారు. అలా పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిక్స్‌ చేసి రూపొందించిన యాక్షన్‌ సినిమా టచ్‌ చేసి చూడు. విక్రమ్‌ సిరికొండను దర్శకుడిగా పరిచయం చేస్తూ వల్లభనేని వంశీ మోహన్‌, నల్లమలుపు శ్రీనివాస్‌ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజా ది గ్రేట్‌ చిత్రంలో అంధుడి పాత్రలో నటించి అందర్నీ మెప్పించిన రవితేజకి ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఎలాంటి పేరు తెచ్చింది? విక్రమ్‌ సిరికొండ డైరెక్టర్‌గా తనను తాను ప్రూవ్‌ చేసుకోగలిగాడా? రవితేజ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో ఉన్నాయా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

అతని పేరు కార్తికేయ(రవితేజ). అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌. తను చేసే వృత్తి కోసం ఫ్యామిలీని కూడా పట్టించుకోని స్ట్రిక్ట్‌ ఆఫీసర్‌. అలాంటి వాడు సస్పెండ్‌ అయ్యాడు. జాబ్‌ని, ఫ్యామిలీని బ్యాలెన్స్‌ చేస్తూ జీవితం గడపాలని తెలుసుకున్నాడు. హైదరాబాద్‌కి దూరంగా పాండిచ్చేరిలో సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాడు. అలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది. ఓ హత్య కేసులో నిందితుడైన ఇర్ఫాన్‌ లాలా(ఫ్రెడ్డీ దారూవాలా)ని షూట్‌ చేసి చంపడం వల్ల కార్తికేయ సస్పెండ్‌ అయ్యాడు. ఇప్పుడా ఇర్ఫాన్‌ బ్రతికే ఉన్నాడని అతనికి తెలుస్తుంది. ఇర్పాన్‌ని చంపడమే ధ్యేయంగా మళ్ళీ వచ్చి డ్యూటీలో జాయిన్‌ అవుతాడు. కార్తికేయకు, ఇర్ఫాన్‌కు ఉన్న వైరం ఏమిటి? డ్యూటీలో ఉంటే ఫ్యామిలీని, ఆఖరికి పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిని కూడా పట్టించుకోని కార్తికేయ ఫ్యామిలీ మ్యాన్‌గా మారిపోవడానికి కారణం ఏమిటి? అసలు నాలుగు సంవత్సరాల క్రితం కార్తికేయ జీవితంలో ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

తన ఎనర్జీకి, బాడీ లాంగ్వేజ్‌కి తగిన క్యారెక్టర్స్‌నే ఎంపిక చేసుకునే రవితేజ టచ్‌ చేసి చూడు సినిమా విషయంలో కూడా అదే చేశాడు. మొహంలో వయసు తెలిసి పోతున్నా పైట్స్‌లో, డాన్సుల్లో అతని స్పీడు ఏమాత్రం తగ్గలేదు. అదే ఎనర్జీతో తన క్యారెక్టర్‌కి న్యాయం చెయ్యడానికి ప్రయత్నించాడు. అయితే అతని క్యారెక్టర్‌లో, డైలాగ్స్‌లో ఏమాత్రం కొత్తదనం లేదు. ఇంతకుముందు చేసిన సినిమాల్లోని క్యారెక్టర్‌నే మళ్ళీ చేసినట్టుగా అనిపించింది. తన డైలాగ్స్‌తో నవ్వించే ప్రయత్నం చేసినా అది కొన్నిసార్లే సక్సెస్‌ అయ్యింది. ప్రజెంట్‌లో హీరోయిన్‌గా కనిపించిన రాశి ఖన్నా గ్లామర్‌ పరంగా కనువిందు చేసింది. కొన్ని సీన్స్‌లో నవ్వించింది. కథపరంగా చూస్తే ఆమె క్యారెక్టర్‌కి అంత ఇంపార్టెన్స్‌ లేదు. ఫ్లాష్‌బ్యాక్‌లో హీరోయిన్‌గా కనిపించిన సీరత్‌కపూర్‌ క్యారెక్టర్‌కి కూడా ప్రాధాన్యం లేదు. ఆమె పెర్‌ఫార్మెన్స్‌ కూడా సోసోగానే ఉంది. పోలీస్‌ కమిషనర్‌గా నటించిన మురళీశర్మ ఫర్వాలేదు అనిపించాడు. ఇక సినిమాలో చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్‌ ఏమీ లేవు. 

సాంకేతిక విభాగాల గురించి చెప్పాల్సి వస్తే ఛోటా కె.నాయుడు ఫోటోగ్రఫీ బాగుంది. విజువల్‌గా సినిమా అంతా రిచ్‌గానే కనిపించింది. ఫస్ట్‌హాఫ్‌లో, సెకండాఫ్‌లో సినిమాని సాగదీసే సీన్స్‌ చాలా ఉన్నాయి. వాటిని కట్‌ చేసి ఉంటే సినిమా మరో పావుగంట తగ్గి ఉండేది. మిగతా సీన్స్‌లో గౌతంరాజు ఎడిటింగ్‌ ఫర్వాలేదు. జామ్‌ 8 చేసిన పాటల్లో ఆకట్టుకునేవి, వినదగ్గవి ఒక్క పాట కూడా లేదు. విజువల్‌గా కూడా పాటలు ఆకట్టుకోవు. మణిశర్మ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అక్కడక్కడా బాగుంది అనిపిస్తుంది. విక్రమ్‌ సిరికొండకు ఇదే మొదటి సినిమా అయినా వక్కంతం వంశీ నుంచి కథ తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఈ కథలో కొత్తదనం అనేది ఇసుమంతైనా కనిపించదు. అదే పాత కథ, అవే క్యారెక్టర్లు. అసలు కథకి సంబంధం లేని సీన్స్‌ సినిమా కోకొల్లలు. దానికి దీపక్‌రాజ్‌ చేసిన సాదా సీదా స్క్రీన్‌ప్లేతో ఓ పాత సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. కథ, కథనాలు పాతవే అయినప్పుడు విక్రమ్‌ తను సొంతంగా కథ రాసుకుని చేసి ఉంటే కొంతలో కొంత కొత్తగా అనిపించేది. ఇక విక్రమ్‌ సిరికొండ దర్శకత్వం గురించి చెప్పుకోవాల్సి వస్తే.. కథను కొత్తగా చూపించడంగానీ, టేకింగ్‌లో మెరుపులు గానీ మనకు కనిపించవు. సినిమా చూస్తున్నామంటే చూస్తున్నాం అనే ఫీలింగే కలుగుతుంది తప్ప ఫ్రెష్‌నెస్‌ అనేది ఏ సీన్‌లోనూ ఉండదు. ఒక ఫ్లోలో కథను తీసుకెళ్ళే ప్రయత్నంలో హీరో కంటిన్యుటీని కూడా దర్శకుడు పట్టించుకోలేదు. ఒక సీన్‌లో లైట్‌గా ఉన్న గడ్డంతో కనిపించే హీరో... అదే సీన్‌లో ఫుల్‌గా పెరిగిన గడ్డంతో కనిపిస్తాడు. ఇలా సినిమా మొత్తంలో దాన్ని చాలా సార్లు గమనించవచ్చు. రెగ్యులర్‌గా రవితేజ సినిమాల్లో ఉండే కామెడీని సినిమా మొత్తం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న విక్రమ్‌ దాన్ని పండించడంలో మాత్రం సక్సెస్‌ కాలేకపోయాడు. తను సస్పెండ్‌ అవ్వడానికి, కొందరి హత్యకు కారకుడైన ఇర్ఫాన్‌ని చంపడంతో అర్థాంతరంగా సినిమా ఎండ్‌ అవుతుంది. సినిమా రెండున్నర గంటలకు చేరుకుంది ఇక ఆపేద్దాం అన్నట్టు ఒక్కసారిగా ఎండ్‌ టైటిల్స్‌ స్టార్ట్‌ అవుతాయి. సినిమాలో కథ కంటే బిల్డప్‌ షాట్స్‌కి, హీరోయిజానికి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇవ్వడం వల్ల కథ పక్కదారి పట్టింది. ఫస్ట్‌హాఫ్‌లో కుటుంబ సభ్యులతో ఎంజాయ్‌ చేసే కొడుకుగా కనిపించిన హీరోకి ఏదో బలమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఉంటుందని ఊహించిన ప్రేక్షకులు ఓ నాసిరకం ఫ్లాష్‌బ్యాక్‌ చూడాల్సి వస్తుంది. ఓల్డ్‌ సిటీలో సి.ఎం. ర్యాలీ నిర్వహించేందుకు హీరో వేసిన పథకం పరమ బోర్‌ కొట్టిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌లో కాస్తో కూస్తో ఫ్యామిలీ ఎమోషన్స్‌, కామెడీ ఉంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి రొటీన్‌ కథనే మళ్ళీ చూపించడంతో ప్రేక్షకులకు నీరసం వచ్చేస్తుంది. సినిమా ఎప్పుడు కంప్లీట్‌ అవుతుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే టచ్‌ చేసి చూడు సినిమాలో ఎలాంటి కొత్తదనం లేదు. కథ, కథనం, హీరో క్యారెక్టరైజేషన్‌, లవ్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లు.. ఇలా అన్నీ రొటీన్‌గానే అనిపిస్తాయి. కమర్షియల్‌గా ఈ సినిమా వర్కవుట్‌ అవుతుందా? అంటే సందేహమనే చెప్పాలి. 

ఫినిషింగ్‌ టచ్‌: టచ్‌ చేస్తే.. అంతే!

touch chesi choodu review:

raviteja movie touch chesi choodu review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ