సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్
ఇంటిలిజెంట్
తారాగణం: సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, నాజర్, దేవ్‌గిల్, రాహుల్‌దేవ్, బ్రహ్మానందం, సప్తగిరి, పృథ్వీ, పోసాని తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎస్.వి.విశ్వేశ్వర్
ఎడిటింగ్: గౌతంరాజు
సంగీతం: ఎస్.ఎస్.థమన్
కథ: శివ ఆకుల
నిర్మాత: సి.కళ్యాణ్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్
విడుదల తేదీ: 09.02.2018
వరసగా మూడు హిట్ సినిమాలు చేసిన సాయిధరమ్‌తేజ్‌కి ఆ తర్వాత చేసిన నాలుగు సినిమాలు నిరాశ పరిచాయి. తాజాగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ఇంటిలిజెంట్ చిత్రంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి రావొచ్చని ఆశ పడ్డాడు. ఈ శుక్రవారం విడుదలైన ఇంటిలిజెంట్ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? వినాయక్‌తో చేసిన తొలి సినిమా అతనికి హీరోగా ఎలాంటి పేరు తెచ్చింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
అతని పేరు తేజ(సాయిధరమ్‌తేజ్). చదువులో టాప్. తేజ టాలెంట్‌ని గుర్తించిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేత నందకిశోర్(నాజర్) అతని చదువు బాధ్యతను తీసుకుంటాడు. తేజ పెరిగి పెద్దయ్యాక నందకిశోర్ కంపెనీలోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుంటాడు. తన అభివృద్ధికి కారకుడైన యజమానికి విధేయుడుగా ఉంటాడు తేజ. ఇండియాలో నందకిశోర్ కంపెనీ టాప్ లెవల్‌కి వెళ్ళిపోవడంతో ఆ కంపెనీపై మాఫియా కన్ను పడుతుంది. మాఫియా డాన్ విక్కీభాయ్(రాహుల్ దేవ్) నందకిశోర్ కంపెనీని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో నందకిశోర్ చనిపోతాడు. తన యజమానికి జరిగిన అన్యాయానికి రగిలిపోయిన తేజ విక్కీభాయ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధపడతాడు. కంపెనీని తిరిగి వెనక్కి తెచ్చేందుకు, విక్కీ భాయ్ ఆగడాలను అరికట్టేందుకు తేజ ధర్మాభాయ్‌గా అవతరిస్తాడు. ధర్మాభాయ్ ఏం చేశాడు? విక్కీభాయ్ ఆట ఎలా కట్టించాడు? అనేది మిగతా కథ.
ఇంతకుముందు సాయిధరమ్ చేసిన సినిమాల్లో కంటే పెర్‌ఫార్మెన్స్ పరంగా ఈ సినిమాలో ఎక్కువ మార్కులు పడతాయి. డాన్సుల్లో, ఫైట్స్‌లో ఎంతో ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది. లావణ్య త్రిపాఠి కేవలం పాటలకే పరిమితమైంది తప్ప ఆమె క్యారెక్టర్‌కి ఎలాంటి ప్రాధాన్యం లేదు. విలన్స్‌గా రాహుల్‌దేవ్, దేవ్‌గిల్‌లను పాత సినిమాల్లో చూస్తున్నట్టుగా ఉంది తప్ప ఫ్రెష్‌గా అనిపించలేదు. కథ, కథనాల్లో విషయం లేకపోవడంతో అక్కడక్కడ సప్తగిరి, బ్రహ్మానందం, పృథ్వీ వంటి కమెడియన్స్‌తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. మిగతా ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ గురించి చెప్పుకోవాలంటే ఎస్.వి.విశ్వేశ్వర్ ఫోటోగ్రఫీ ఫర్వాలేదు అనిపిస్తుంది. థమన్ చేసిన పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. చమకు చమకు రీమక్స్ సాంగ్ చాలా బ్యాడ్‌గా అనిపించింది. ఈ పాటను రణగొణ ధ్వనులతో నింపేశాడు థమన్. రీరికార్డింగ్ కూడా ఎఫెక్టివ్‌గా లేదు. చమకు చమకు పాటకు చేసిన డాన్స్ కంపోజింగ్ మరీ నాసిరకంగా ఉంది. నిడివి తగ్గించడంలో గౌతంరాజు చాలా కృషి చేసినప్పటికీ లెంగ్తీ సీన్స్ సినిమాలో చాలా కనిపిస్తాయి. ఆకుల శివ రాసుకున్న కథలోగానీ, మాటల్లోగానీ ఏమాత్రం కొత్తదనం లేదు. 20 సంవత్సరాల క్రితం చెయ్యాల్సిన కథతో ఇప్పుడు సినిమా చేసినట్టుగా అనిపిస్తుంది. సినిమాలో కాస్తో కూస్తో చెప్పుకోదగ్గవి వెంకట్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు. ఇక డైరెక్టర్ వినాయక్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వినాయక్ మార్క్ సినిమా కాదు. జనరల్‌గా వినాయక్ సినిమాల్లో ఉండే ఎమోషనల్ డైలాగ్స్‌గానీ, ఎమోషనల్ సీన్స్‌గానీ సినిమాలో ఎక్కడా కనిపించవు. ప్రతి క్యారెక్టర్ చాలా సిల్లీగా రాసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. కథలో బలం లేకపోవడం, కథనం మరీ బలహీనంగా ఉండడంతో సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా? ఎప్పుడెప్పుడు బయట పడదామా అనే ఆతృతను ఆడియన్స్‌లో పెంచేశాడు వినాయక్. ఒకప్పుడు పవర్‌ఫుల్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వినాయక్ ఇంటిలిజెంట్ అనే ఓ సాదా సీదా సినిమా తీసి డైరెక్టర్‌గా తన సత్తా తగ్గిందని చెప్పకనే చెప్పాడు. ప్రారంభం నుండి చివరికి వరకు సిల్లీగా అనిపించే సీన్స్, సిల్లీగా అనిపించే సిట్యుయేషన్స్ సినిమాల్లో కోకొల్లలు. ఇంతకుముందు వినాయక్ చేసిన సినిమాల్లో కథ ఎలా ఉన్నా దాన్ని తన మార్కు సినిమాలా మలుచుకోవడానికి ప్రయత్నించేవాడు. కానీ, ఈ సినిమాలో అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదని సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. వరస ఫ్లాపులతో సతమతమవుతున్న తేజు ఖాతాలో మరో ఫ్లాప్ చేర్చి చేతులు దులుపుకున్నాడు వినాయక్. ఫైనల్‌గా చెప్పాలంటే ప్రతి సినిమాకి ఫస్ట్‌హాఫ్ ఇలా ఉంది, సెకండాఫ్ అలా ఉంది అనుకుంటాం. కానీ, ఈ సినిమా విషయానికి వస్తే మొదటి నుంచి చివరి వరకు ఇది అద్భుతం అని చెప్పుకోవడానికి, ఒక స్టేజ్‌లో సినిమా బాగుంది అనుకోవడానికి ఆస్కారమే లేదు. ఈ సినిమాకి ఇంటిలిజెంట్ అనే టైటిల్ పెట్టడం ఎంత వరకు సబబో ఎవరికీ అర్థం కాదు. రొటీన్ కథ, రొటీన్ కథనం, రొటీన్ ఫైట్స్... ఇలా సినిమాలోని ప్రతి అంశం మనకు రొటీన్‌గానే అనిపిస్తుంది. మరి ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎంత వరకు కనెక్ట్ అవుతారో అనేది సందేహమే.
ఫినిషింగ్ టచ్: రొటీన్ కమర్షియల్ మూవీ!
saidharam tej new movie intelligent