శ్రీవెంకటేశ్వర సినీచిత్ర
తొలిప్రేమ
తారాగణం: వరుణ్‌తేజ్, రాశిఖన్నా, ప్రియదర్శి, సుహాసిని, సప్న పబ్బి, నరేష్, విద్యుల్లేఖా రామన్, హైపర్ ఆది తదితరులు
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: ఎస్.ఎస్.థమన్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
విడుదల తేదీ: 10.02.2018
ఒక అబ్బాయి.. ఓ అమ్మాయిని చూస్తాడు.. తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. ఆ అమ్మాయి కూడా తనని ప్రేమించేలా ఇంప్రెస్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా అతని ప్రేమను అంగీకరిస్తుంది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోతారు. ఓ ఫైన్ మార్నింగ్ ఇద్దరిలోనూ అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. దాంతో ఇద్దరూ విడిపోతారు. చివరికి ఎవరి తప్పు వారు తెలుసుకొని ఒక్కటవుతారు... ఇదీ సాధారణంగా సినిమాల్లో మనకు కనిపించే ప్రేమకథ. ఏ సినిమా తీసుకున్నా కాస్త అటూ ఇటూగా ఇదే స్టోరీ ఉంటుంది. అయితే ఒక్కో డైరెక్టర్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే విధానం వల్ల ప్రేమకథలతో తీసిన సినిమాలు చాలా వరకు సూపర్‌హిట్ అవుతాయి. ఈ శనివారం విడుదలైన తొలిప్రేమ చితం కూడా ఆ తరహాదే. టైటిల్ కింద ఎ జర్నీ ఆఫ్ లవ్ అనే ట్యాగ్‌లైన్ కూడా ఉంది. దీన్నిబట్టే సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకుడు అంచనా వేసుకోగలడు. జ్ఞాపకాలు మంచివైనా, చెడ్డవైనా మనతోనే ఉంటాయి. మోయక తప్పదు... ఇది తొలిప్రేమలో హీరో చెప్పే డైలాగ్. పైన చెప్పుకున్న తరహాలో హీరో, హీరోయిన్ కలుసుకోవడం, ప్రేమించుకోవడం, అపార్థాల వల్ల విడిపోవడం జరుగుతుంది. మళ్ళీ అనుకోకుండా ఇద్దరూ కలుసుకున్న సందర్భంలో హీరో చెప్పే డైలాగ్ అది. ఈ డైలాగ్ వెనుక జరిగిన కథ ఏమిటి? ఫిదాతో మంచి హిట్ కొట్టిన వరుణ్‌తేజ్ మళ్ళీ అదే తరహాలో వచ్చిన తొలిప్రేమ అతనికి ఎంతవరకు ప్లస్ అయింది? కొత్త డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ప్రేమకథని ఎలా డీల్ చేశాడు? ఈ ప్రేమకథకి ఆడియన్స్ ఎంతవరకు కనెక్ట్ అవుతున్నారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
అతని పేరు ఆదిత్య(వరుణ్‌తేజ్). వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్‌లో అనుకోకుండా వర్ష(రాశిఖన్నా) పరిచయం అవుతుంది. తొలిచూపులోనే ఆమె ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత అనుకోకుండానే మధ్యలో ట్రైన్ దిగిపోవాల్సి వస్తుంది. మరో స్టేషన్‌లో దిగిన వర్ష ఆ ట్రైన్ మిస్ అవుతుంది. అనుకోకుండానే మళ్ళీ ఇద్దరూ కలుస్తారు. కొన్ని గంటలపాటు ఇద్దరూ రైల్వే స్టేషన్‌లోనే ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో ఇద్దరూ కాస్త దగ్గరవుతారు. మరో ట్రైన్‌లో హైదరాబాద్ బయల్దేరతారు. తెల్లవారిన తర్వాత చూస్తే వర్ష కనిపించదు. అలా మిస్ అయిన వర్ష... ఆదిత్య చేరిన ఇంజనీరింగ్ కాలేజ్‌లో కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ వారి ప్రేమ వికసిస్తుంది. మనసులు ఇచ్చి పుచ్చుకుంటారు. కాలేజ్‌లో సీనియర్స్‌తో జరిగిన గొడవ వల్ల ఆదిత్య, వర్ష మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. వర్షకు బ్రేకప్ చెప్పేస్తాడు ఆదిత్య. అలా విడిపోయిన ఇద్దరూ 6 సంవత్సరాల తర్వాత అనుకోకుండా లండన్‌లో కలుసుకుంటారు. అప్పుడు వారి మానసిక స్థితి ఏమిటి? మళ్ళీ ఇద్దరూ కలుసుకున్నారా? వారి ప్రేమను సఫలం చేసుకున్నారా? అనేది మిగతా కథ.
పెర్‌ఫార్మెన్స్ పరంగా వరుణ్‌తేజ్‌కి మంచి మార్కులు పడతాయి. డాన్సుల్లో ఈజ్ సంపాదించాడు, ఫైట్స్‌ని ఫోర్స్‌గా చెయ్యగలిగాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో మంచి నటనను ప్రదర్శించాడు. ఇప్పటివరకు వరుణ్ చేసిన సినిమాల్లో ది బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇదేనని చెప్పొచ్చు. ఇక రాశిఖన్నా నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు పాటలకు మాత్రమే పరిమితమై, గ్లామర్ డాల్‌గా కనిపించిన రాశిఖన్నా ఈ చిత్రంలో తనలోని నటిని వెలికి తీసింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు వివిధ దశల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఫస్ట్‌హాఫ్‌లో గ్లామర్‌గా కాకుండా అందంగా కనిపించే ప్రయత్నం చేసింది. స్లిమ్‌గా తయారైన ఆమె వర్ష క్యారెక్టర్‌లో మరింత అందంగా కనిపించింది. ఆదిత్య స్నేహితులుగా ప్రియదర్శి, హైపర్ ఆది అప్పుడు నవ్వించే ప్రయత్నం చేశారు. ఆదిత్య తల్లిగా నటించిన సుహాసిని పాత్ర నిడివి తక్కువే అయినా కీలక సన్నివేశాల్లో అలరించింది. మనవాళ్ళే అంటూ తన కులం వారిని ఎత్తేసే క్యారెక్టర్‌లో నరేష్ ఎంటర్‌టైన్ చేశాడు. సెకండాఫ్‌లో కనిపించే సప్న పబ్బి... వరుణ్‌తో ఒక పాటలో కనిపిస్తుంది.
టెక్నికల్‌గా ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది. జార్జ్ సి. విలియమ్స్ ఫోటోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ప్రతి సీన్‌ను, ప్రతి పాటను ఎంతో అందంగా చూపించడంలో జార్జ్ టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్ ఆలోచనని తెరపై అందంగా చూపించడంలో అతని కృషి కనిపిస్తుంది. లండన్‌లోని అందమైన ప్రదేశాల్ని అంతకంటే అందంగా చూపించాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి చెప్పాలంటే... ఇప్పటివరకు అతను చేసిన సినిమాల్లో ది బెస్ట్ మ్యూజిక్ ఈ సినిమాకే ఇచ్చాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. థమన్ లవ్‌స్టోరీస్‌కి మ్యూజిక్ చేసిన సందర్భాలు తక్కువ. ఈ సినిమా విషయానికి వస్తే తను రెగ్యులర్‌గా చేసే పాటలకు భిన్నమైన పాటలతో, ఆహ్లాదకరమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో వీనుల విందు చేశాడు. ఎడిటర్ నవీన్ నూలి సినిమాను రెండుంపావు గంటలకి కుదించి ఎక్కడా బోర్ లేకుండా చెయ్యగలిగాడు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా రిచ్‌గా కనిపించడంలో ఎక్కడా రాజీ పడలేదనేది అర్థమవుతుంది. ఇక డైరెక్టర్ వెంకీ అట్లూరి గురించి చెప్పాల్సి వస్తే... ఒక కొత్త డైరెక్టర్ ఒక అందమైన ప్రేమకథని ఇంత అందంగా తియ్యగలిగాడా? అని అందరూ ఆశ్చర్యపోయేలా తీశాడు. పాత కథే అయినా కొత్తగా చెప్పేందుకు అతను ఎంచుకున్న విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఫస్ట్‌హాఫ్ అంతా కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో.. సెకండాఫ్ అంతా లండన్‌లో చేయడంతో ఈ ప్రేమకథ కొత్తగా అనిపిస్తుంది. మూడు దశల్లో సాగే ఈ ప్రేమకథని ఎంతో జాగ్రత్తగా రాసుకున్నట్టు తెలుస్తుంది. అతిగా అనిపించని డైలాగులు, సహజంగా అనిపించే నటీనటుల నటన, సున్నితంగా ఉండే కామెడీ, శృతి మించని సెంటిమెంట్... వీటన్నింటినీ సమపాళ్ళలో మేళవించి వెంకీ చేసిన ఈ వంటకం అందర్నీ సంతృప్తి పరుస్తుంది. ఈ కథ, కథనం చాలా సినిమాలను పోలి ఉన్నప్పటికీ తనదైన శైలిలో కొత్తగా చెప్పేందుకు, చూపించేందుకు వెంకీ చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. అయితే ఫస్ట్‌హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కథనం కాస్త నెమ్మదించింది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే తొలిప్రేమ వరుణ్ కెరీర్‌లో, రాశిఖన్నా కెరీర్‌లో, ఎస్.ఎస్.థమన్ కెరీర్‌లో ఓ గొప్ప సినిమాగా నిలిచిపోతుంది. డైరెక్టర్‌గా వెంకీకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది. ఓ అందమైన ప్రేమ కావ్యాన్ని నిర్మించారని నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌కి మంచి పేరు వస్తుంది. ఈ ప్రేమకథ యూత్‌నే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటుంది. తమ తొలిప్రేమను గుర్తు చేస్తుంది.
ఫినిషింగ్ టచ్: ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ
varun tej new movie tholiprema