క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్
తేజ్ ఐ లవ్ యు
తారాగణం: సాయిధరమ్‌తేజ్, అనుపమ పరమేశ్వరన్, జయప్రకాష్, పవిత్రా లోకేష్, పృథ్వీ, జోష్ రవి, వైవా హర్ష, సురేఖా వాణి తదితరులు
సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ
ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్
సంగీతం: గోపీసుందర్
మాటలు: డార్లింగ్ స్వామి
నిర్మాత: కె.ఎస్.రామారావు
రచన, దర్శకత్వం: ఎ.కరుణాకరన్
విడుదల తేదీ: 06.07.2018
మంచి ఫీల్‌తో కూడిన ప్రేమకథా చిత్రాల గురించి చెప్పుకోవాల్సి వచ్చినపుడు డైరెక్టర్ రుణాకరన్ పేరుని తప్పకుండా ప్రస్తావిస్తారు. ఎందుకంటే తొలిప్రేమ వంటి కంప్లీట్ లవ్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించి ప్రేమకథా చిత్రాల్లో ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చాడు కాబట్టి. ఆ తర్వాత కరుణాకరన్ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అతని పేరు చెబితే తొలిప్రేమ చిత్రమే గుర్తొస్తుంది. ఎన్ని సినిమాలు చేసినా తొలి సినిమా ఫ్లేవర్‌ని మాత్రం వదిలి పెట్టలేకపోతున్నాడు కరుణాకరన్. అలాగే అతను గతంలో చేసిన సినిమాల తాలూకు ప్రభావం కూడా ఇప్పుడు కనిపిస్తోంది. ఈ శుక్రవారం విడుదలైన తేజ్ ఐ లవ్ యు చిత్రం కూడా ఆ కోవకు చెందిందే. అయితే ప్రేక్షకుల అభిరుచి మారింది, వారి అంచనాలు మారాయి. వాటిని అందుకోవడంలో కరుణాకరణ్ ఫెయిలవుతున్నాడు. సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు లేవు. ఎందుకంటే తేజ్ ఇటీవలి కాలంలో చేసిన సినిమాలేవీ సక్సెస్ సాధించలేదు. అలాగే కరుణాకరన్ చేసిన ఎందుకంటే ప్రేమంట, చినదాన నీ కోసం చిత్రాలు నిరాశ పరచడమే దానికి కారణం.
తేజ్ ఐ లవ్‌యు గురించి చెప్పాలంటే ఇంతకుముందు కరుణాకరన్ చేసిన హిట్ సినిమాల్లోని కొంత కంటెంట్‌ని ఈ సినిమాలో రిపీట్ చేస్తూ ఓ సాదా సీదా ప్రేమకథను రాసుకున్నాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏ దశలోనూ ఓ కొత్త సినిమా చూస్తున్న ఫీల్ కలగదు. కథగా చెప్పాలంటే తల్లిదండ్రులు చిన్నతనంలోనే దూరమైపోవడంతో పెదనాన్న(జయప్రకాష్) దగ్గర పెరుగుతుంటాడు తేజ్(సాయిధరమ్ తేజ్). ఒక యువతిని కొందరు దుండగుల నుంచి కాపాడే ప్రయత్నంలో ఒకడిని హత్య చేస్తాడు తేజ్. అలా చిన్నతనంలోనే జైలుకి వెళ్తాడు. దాంతో పెదనాన్న దృష్టిలో తేజ్ చెడ్డవాడు అనే ముద్ర పడిపోతుంది. జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత అతని చెల్లెలి పెళ్ళి విషయంపెళ్లి విషయంలో పెదనాన్న ఆగ్రహానికి గురవుతాడు. అలా హైదరాబాద్ వచ్చి అతని బాబాయ్ దగ్గరకి వస్తాడు. బాబాయ్ రన్ చేసే క్రేజీ బాయ్స్ మ్యూజిక్ ట్రూప్‌లో జాయిన్ అవుతాడు. కట్ చేస్తే లండన్‌లో ఓ కోటీశ్వరుడి కూతురైన నందిని(అనుపమ పరమేశ్వరన్) ఓ ముఖ్యమైన పనిమీద హైదరాబాద్ వస్తుంది. తొలిచూపులోనే నందిని ప్రేమలో పడిపోతాడు తేజ్. ఆమె ప్రేమను పొందేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. చివరికి నందిని కూడా తేజ్‌ని లవ్ చేస్తుంది. ఆ విషయం తేజ్‌కి చెప్పే సమయంలో ఆమెకు యాక్సిడెంట్ అయి ఇండియా వచ్చిన తర్వాత జరిగినవన్నీ మర్చిపోతుంది. తేజ్‌ని కూడా కొత్తవాడిలా చూస్తుంది. ఆ పరిస్థితి నుంచి నందినిని మామూలు స్థితికి తెచ్చేందుకు తేజ్ ఏం చేశాడు? నందిని ఇండియా ఎందుకు వచ్చింది? తేజ్, నందినిల ప్రేమకథ చివరికి ఎలా ముగిసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఇప్పటివరకు మాస్ ఎంటర్‌టైనర్స్ చేస్తూ వచ్చిన తేజ్ ఈ సినిమాలో లవర్‌బోయ్‌గా కనిపించే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో తేజ్ సక్సెస్ అవ్వలేదనే చెప్పాలి. ఏ కోణంలో చూసినా అతనిలో ఓ ప్రేమికుడిని చూడడం కష్టంగానే అనిపిస్తుంది. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో అతని పెర్‌ఫార్మెన్స్ గొప్పగా లేదని చెప్పుకోవాలి. లవ్ సీన్స్‌లోనూ, కామెడీలోనూ, ఫ్యామిలీ సీన్స్‌లోనూ అతని నటన ఆకట్టుకునేలా లేదు. ఇక అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌కి తక్కువ, ఛైల్డ్ ఆర్టిస్ట్‌కి ఎక్కువ అనిపించేలా ఉంది తప్ప ఒక లవ్‌స్టోరీలో ఉండే హీరోయిన్‌లా ఎక్కడా కనిపించదు. సినిమాలో ఎక్కువ భాగం హీరో, హీరోయిన్‌తోపాటు హీరో ఫ్రెండ్స్ కనిపిస్తారు. మిగతా క్యారెక్టర్లు చేసిన నటీనటుల నటన కూడా అంతంత మాత్రంగానే ఉంది. పృథ్వీ, సురేఖావాణి మధ్య వచ్చే కామెడీ సీన్స్ చూసి బలవంతంగా నవ్వుకోవాలే తప్ప నేచురల్‌గా లేవు.
సాంకేతిక పరంగా చూస్తే ఆండ్రూ ఫోటోగ్రఫీ బాగుంది. విజువల్‌గా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. గోపీసుందర్ చేసిన పాటలు ఒకటి రెండు మినహా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరిస్థితి కూడా అంతే. ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. డార్లింగ్ సినిమాలో మంచి డైలాగ్స్, పంచ్ డైలాగ్స్‌తో ఆ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న స్వామి ఈ సినిమాకు సరైన మాటలు రాయలేకపోయాడు. అలాగే తన డైలాగ్స్‌తో నవ్వించలేకపోయాడు. సినిమాని ఆద్యంతం రిచ్‌గా కనిపించడం కోసం నిర్మాత ఎక్కడా ఖర్చుకి వెనకాడలేదనేది అర్థమవుతుంది. ఇక డైరెక్టర్ కరుణాకరన్ గురించి చెప్పాలంటే హీరో చిన్నతనంలోనే ఓ హత్య చేసి జైలు కెళ్ళడం, ఆ హత్య చేసింది తన తల్లి కోసమేనని హీరోయిన్ వెతుక్కుంటూ రావడం వరకు కాస్త కొత్తగానే అనిపించినా దానిచుట్టూ అల్లుకున్న కథ మాత్రం పరమ రొటీన్‌గా ఉంది. హీరోయిన్‌కి యాక్సిడెంట్ అయి మెమరీ లాస్ అవ్వడం, ఆమెకు గతాన్ని గుర్తు తెచ్చే ప్రాసెస్.. ఇదంతా చాలా బోర్ కొడుతుంది. డార్లింగ్ సినిమాలో వాడిన మ్యూజిక్ ట్రూప్ కాన్సెప్ట్‌ని ఈ సినిమాలో కూడా కొనసాగించడం చాలా రొటీన్‌గా అనిపించింది. నవ్వించేందుకు అతి కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించేందుకు అతి అప్యాయతలూ, అతి అనుబంధాలు, అతి అపార్థాలు.. ఇలా సినిమాలో అతి పాలు కాస్త ఎక్కువగానే ఉంది. కరుణాకరన్ చేసిన గత రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కొత్తగా ఆలోచించేందుకు, కొత్త కథను తయారు చేసుకునేందుకు ప్రయత్నించలేదనేది అర్థమవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తన పాత సినిమాల్లోని కొన్ని ఎలిమెంట్స్‌తో కొత్త కథ చేసుకున్నాడా అనిపిస్తుంది. ఇప్పటివరకు అతను చేసిన సినిమాల్లోని కథ, కథనాలు ఎలా ఉన్నా కామెడీ పరంగా మంచి మార్కులే వేయించుకున్నాడు. కానీ, ఈ సినిమాలో అన్నింటితోపాటు కామెడీ కూడా మైనస్ అయింది. ఫస్ట్‌హాఫ్ అటూ ఇటూగా ఫర్వాలేదు అనిపించినా, హీరోయిన్‌కి యాక్సిడెంట్ జరిగి మెమరీ లాస్ అయిపోయింది అనగానే ప్రేక్షకులకు కూడా మెమరీ లాస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ప్రేమకథగా కానీ, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా కానీ తేజ్ ఐ లవ్ యు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఫినిషింగ్ టచ్: తేజ్.. ఆకట్టుకోలేకపోయాడు
saidharam tej new movie tej i love you