హిట్ మూవీ రివ్యూ
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
నటీనటులు: విశ్వక్ సేన్, రుహాని శర్మ, భాను చందర్, మురళి శర్మ, బ్రహ్మాజీ, హరితేజ తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్: వివేక్ సాగర్
సినిమాటోగ్రాఫర్: మణికందన్
ఎడిటింగ్: బియహ్ గొర్రి
నిర్మాత: నాని, ప్రశాంతి
దర్శకత్వం: శైలేష్ కొలను
క్రైమ్, థ్రిల్లింగ్, సస్పెన్స్ కథలకు ఏ భాషలోనైనా మంచి డిమాండ్ ఉంటుంది. ఈమధ్యన ఇలాంటి క్రైమ్ థ్రిల్లింగ్ కథలతో తెరకెక్కిన సినిమాలు ఖచ్చితంగా హిట్ అవుతున్నాయి. తాజాగా అలాంటి క్రైమ్ కథతో.. ప్రస్తుతం వరసబెట్టి.. హీరోగా సినిమాల మీద సినిమాలు చేస్తున్న హీరో నాని.. అభిరుచి గల నిర్మాతగా కూడా మారాడు. వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థ ను స్తాపించి ఆభిరుచి గల కథలతో సినిమాలు నిర్మిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ తో ‘అ..’ సినిమాని నిర్మించిన నాని ఇప్పుడు శైలేష్ కొలను అనే కొత్త దర్శకుడితో... ‘హిట్’ సినిమాని నిర్మించాడు. ఫలక్‌నుమాదాస్ అనే సినిమాతో హీరోగా మారిన విశ్వక్ సేన్ తో ‘హిట్’ సినిమాని నిర్మించాడు. ‘హిట్’ సినిమా ట్రైలర్ చూడగానే సినిమాలో విషయముంది అనిపించింది. ‘హిట్’ నిజంగానే హిట్ అవుతుంది అని అనిపించడమే కాదు.. సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు ఏర్పడ్డాయి. మరి ప్రేక్షకులు ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ని ‘హిట్’ చేస్తారా? లేదా? అనేది సమీక్షలో చూద్దాం.
కథ:
ప్యానిక్ అటాక్ డిజార్డర్ తో బాధపడే విక్రమ్ రుద్రరాజు(విశ్వక్ సేన్) ఓ క్రైమ్ పోలీస్ ఆఫీసర్. విక్రమ్ రుద్రరాజు ప్రేమించిన అమ్మాయి నేహా (రుహాని శర్మ) అనుకోకుండా కనబడకుండా పోతుంది. అలాగే మరోపక్క ప్రీతీ అనే అమ్మాయి కూడా మిస్సవుతుంది. రెండు రెండే ఛాలెంజింగ్ కేసులు. అయితే ఈ రెండు మిస్సింగ్ కేసులో విక్రమ్ డీప్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లో విక్రమ్ కి కొన్ని దిగ్బ్రాంతికర విషయాలు తెలుస్తాయి. అసలు ప్రీతీ, నేహాల మిస్సింగ్ మిస్టరీ ఏమిటి? వారి కిడ్నాప్ ల వెనుక ఉన్నది ఎవరు? విక్రమ్ రుద్రరాజు రెండు కేసులను ఛేదించాడా లేదా..? అనేది తెలియాలంటే హిట్ సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
ఫలక్‌నుమాదాస్ తోనే తానేంటో నిరూపించుకున్న విశ్వక్ సేన్ ఈ చిత్రం ద్వారా తన నటనలోని ఈజ్ ను మరోసారి చూపించాడు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో కానీ కొన్ని అగ్రెసివ్ సీన్స్ లో కానీ విశ్వక్ పెర్ఫామెన్స్ చాలా బాగుంది. ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్న పోలీస్ అధికారిగా చక్కని నటన కనబరిచారు. ఎప్పటిలానే తనలోని రఫ్‌నెస్‌ను కూడా రుచి చూపించారు. విశ్వక్ సేన్ నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్. హీరోయిన్ రుహాని శర్మ కూడా ఫోరెన్సిక్ ఆఫీసర్‌గా ఓకేగా ఉంది. ఆమె పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. ఇతర పాత్రలలో కన్పించిన వారిలో హరితేజ పాత్ర కొత్తగా ఉంది. మురళీ శర్మ, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రలను పర్ఫెక్ట్ గా పోషించారు.
సాంకేతికంగా...
వివేక్ సాగర్ అందించిన పాటలు పర్వాలేదు. నేపధ్య సంగీతం విషయంలో మాత్రం వివేక్ కి మంచి మార్కులు పడ్డాయి. సస్పెన్స్, థ్రిల్లింగ్ సీన్స్‌లో తన సౌండ్స్‌తో మెప్పించాడు. మణికందన్ సినిమాటోగ్రఫీ మరో హైలెట్. ఔటర్ రింగ్ రోడ్ డ్రోన్ షాట్స్, వర్షంలో ఫారెస్ట్ ఫైట్ వంటి చాలా సన్నివేశాలు నేచురల్‌గా చిత్రీకరించారు. ఎడిటింగ్ పై ఇంకా కొంచెం శ్రద్ద పెట్టాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారంగా ఉన్నాయి.
విశ్లేషణ:
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు ట్విస్ట్ లే ప్రధాన బలం. అయితే హిట్ కథ ఓ సాధారణ క్రైమ్ స్టోరీనే. అయితే ఆ క్రైమ్ ని ఎలా ఛేదించారో అనేది దర్శకుడు శైలేష్ కొలను కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు. ఈ సినిమాలో కిల్లర్‌ను కనిపెట్టిన విధానం, ఆ కిల్లర్ ఫ్లాష్‌బ్యాక్ ఆసక్తికరం. సింపుల్‌గా చెప్పాలంటే స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రాణం. అలాంటి ప్రాణాన్ని దర్శకుడు శైలేష్ కొలను నిలబెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పాలి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది. ఎడ్జింగ్ లో కూర్చోబెట్టే ఆసక్తికర సన్నివేశాలు ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇలాంటి థ్రిల్లింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ కి గురు చేస్తాయి. క్లైమాక్స్ వరకు కిల్లర్ ఎవరు అనేది మనం అస్సలు ఊహించలేం. అంత బాగా సస్పెన్స్‌ను క్యారీ చేశారు. ఇన్వెస్టిగేషన్ చివరి వరకు ఆసక్తికరంగా సాగినా సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అస్సలు లేకపోవడం మైనస్. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు మంచి థ్రిల్‌ను ఇస్తాయి. సినిమాకు ఎమోషనల్ టచ్ అస్సలు లేదు. చాలా సీరియస్‌గా సాగుతుంది. కేవలం పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఇంటరాగేషన్ మాత్రమే చూపించారు. కాబట్టి సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్లు ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది.
సినీజోష్ రేటింగ్: 2.5 / 5