నటినటులు: నవీన్ చంద్ర, సలోని లూత్రా, హర్ష చెముడు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్
ఎడిటర్: రవికాంత్ పేరెపు
నిర్మాత: యశ్వంత్ ములుకుట్ల
దర్శకత్వం: శ్రీకాంత్ నగోటి
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ హవా యమా జోరుగా ఉంది. కరోనాతో సినిమా థియేటర్స్ మూతబడడంతో ఓటీటీ వారు చిన్న, మీడియం సినిమాలను కొనెయ్యడమే కాదు వాటిని ఓటీటీలో విడుదల చేస్తూ ప్రతి వారం ప్రేక్షకుల ముందుకు ఏదో ఓ సినిమాని తీసుకువస్తున్నాయి. ఇంతకుముందు అమృత రామన్, కీర్తి సురేష్ పెంగ్విన్, గత వారం విడుదలైన కృష్ణ అండ్ హిజ్ లీల తాజాగా నవీన్ చంద్ర భానుమతి అండ్ రామకృష్ణ సినిమాలు ఈ ఓటీటీ నుండి నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. ఇక ఇప్పటివరకు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్‌ల హవా కొనసాగితే.. టాలీవుడ్‌లో కొత్తగా ఆహా అంటూ ఓ డిజిటల్ ప్లాట్ ఫామ్‌ని మొదలు పెట్టారు అల్లు అరవింద్ అండ్ టీమ్. ప్రస్తుతం నవీన్ చంద్ర హీరోగా నటించిన భానుమతి అండ్ రామకృష్ణ ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ నుండే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత వారం రోజులుగా మంచి పబ్లిసిటీతో సినిమాపై అంచనాలు పెరిగితే.. తాజాగా విడుదలైన భానుమతి అండ్ రామకృష్ణ ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తి పెంచింది. మరి భానుమతి అండ్ రామకృష్ణ సినిమా ప్రేక్షకులకు ఏ మేర నచ్చిందో.. మన సమీక్షలో తెలుసుకుందామా....
కథ:
భానుమతి (సలోని లూత్రా) 30 ఏళ్లు దాటినా పెళ్లవ్వలేదనే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న అమ్మాయి. అందులోనూ భానుమతి లైఫ్‌లో ఓ బ్రేకప్ కూడా ఉండడంతో.. దాన్ని మరిచిపోయేందుకు పబ్‌లూ, సినిమాలు అంటూ తిరిగే అమ్మాయి. ఇక రామకృష్ణ (నవీన్ చంద్ర).. పాత చంటి సినిమాలో వెంకటేష్ ఎలా ఉండేవాడో.. అలాంటి టైప్ అబ్బాయి. నుదుట బొట్టు, పక్క పాపిటి తీసుకున్న పక్కా పల్లెటూరి బైతు టైపన్నమాట. ఇక భానుమతి మాత్రం లైఫ్ అంతా తన ఛాయిస్ ప్రకారమే సాగాలి అనుకుంటుంది. మొండితనం ఎక్కువ ఉన్న అమ్మాయి. స్వతంత్రంగా బ్రతకాలని కోరుకునే అమ్మాయి. అలాంటి భానుమతి దగ్గరకు హెల్పర్‌గా వస్తాడు రామకృష్ణ. ముందు రామకృష్ణ మీద సదాభిప్రాయం లేకపోయినా.. తర్వాత రామకృష్ణ మంచితనంతో అతనిపై ప్రేమ పెంచుకుంటుంది. అలాగే రామకృష్ణ కూడా భానుమతిలోని మొండితనం కాకుండా.. ఆమెలోని మరో కోణం చూసి ఇష్టపడతాడు. ఇద్దరు దగ్గరవుతున్నా తరుణంలో ఏమైందో ఏమో.. విడిపోతారు. అసలు రామకృష్ణ అలా అన్నేళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం ఏమిటి? భానుమతి - రామకృష్ణల ప్రేమ మధ్యలో ఎందుకు బ్రేకప్ అయ్యింది? మళ్లీ వాళ్లిద్దరూ కలిసారా? పెళ్లి చేసుకున్నారా? అనేది తెలియాలి అంటే.. ఆహా ఓటీటీలో ఈ సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
నవీన్ చంద్ర హీరోగా సక్సెస్ కాకపోయినా.. విలన్ పాత్రలతోనూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా భానుమతి అండ్ రామకృష్ణలో పెళ్లికాని కుర్రాడిగా.. రామకృష్ణ పాత్రకి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు. చిన్న టౌన్ నుంచి వచ్చిన ఓ మామూలు కుర్రాడిగా నవీన్ చంద్ర నూరు శాతం సెట్ అయ్యాడు. నవీన్ చంద్ర డైలాగ్ డెలివరీతోనూ, మేనరిజంతో ఆకట్టుకున్నాడు. ఎమోషన్స్ పరంగా నవీన్ చంద్ర నూటికి నూరు శాతం మార్కులు సంపాదించుకున్నాడు. ఇక హీరోయిన్ సలోని గురించి చెప్పాలంటే... భానుమతి పాత్రకు తగ్గట్టు అమ్మాయి ముదురుగా ఉంది. హావభావాలు, ఎమోషనల్ గాను ఆకట్టుకుంది. వైవా హర్ష మాత్రం అదరగొట్టేసాడు. ఇక భానుమతి మాజీ లవర్.. ఇలా మిగతా నటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
దర్శకుడు భానుమతి అండ్ రామకృష్ణ సినిమాని ఎలా తెరకెక్కించాడో అనేది తప్ప ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. అయితే దర్శకుడు సినిమాని ఓటీటీలో విడుదల చేద్దామని ముందు అనుకుని కూడా ఉండడు. అందుకే మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి సరిపోయే కథతో ఈ భానుమతి రామకృష్ణని తెరకెక్కించాడు. చాలా సింపుల్ కథని, ఏజెడ్ లవ్ స్టోరీని ఎమోషనల్‌గా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాని తక్కువ బడ్జెట్‌తో దర్శకుడు మలిచాడు. రామకృష్ణ అండ్ భానుమతి పాత్రలు నటనలోనూ, ప్రేమలోనూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించేలా కథను అల్లాడు. చిన్న చిన్న ఎమోషన్స్, ఆకట్టుకునే డైలాగ్స్, పట్టుసడలని కథనం భానుమతి అండ్ రామకృష్ణని నిలబెట్టాయి అనే చెప్పాలి. ఏజెడ్ లవ్ స్టోరీని మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా మార్చి.. దర్శకుడు ఈ సినిమాని అందరికి కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఇక సినిమాలో వైవా హర్ష చెప్పిన కామెడీ డైలాగ్స్ ఆదిరిపోయాయి. అలాగే అక్కడక్కడా పేలిన డైలాగ్స్ సినిమాకే హైలెట్ అనేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఎడా పెడా డ్యూయెట్స్ పెట్టి బోర్ కొట్టించకుండా బ్యాగ్రౌండ్‌కే పాటలను పరిమితం చేయడం బాగుంది. కాకపోతే స్క్రీన్‌ప్లే చాలా స్లోగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఈ సినిమా ప్రధాన హైలెట్స్‌లో ఒకటి. ఓవరాల్‌గా ఈ సినిమా ఇప్పటి వరకు ఓటీటీలో తెలుగులో విడుదలైన సినిమాలలో మంచి కంటెంట్ ఉన్న చిత్రంగా చెప్పుకోవచ్చు. అలాగే ఫ్యామిలీ అంతా హాయిగా చూసే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి.
>సినీజోష్ రేటింగ్: 2.75/5