నటీనటులు: అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్, అనిశ్ కురువిల్ల, మోనికారెడ్డి, వైవా హర్ష తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: గుణ బాలసుబ్రమణియన్
సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతు
ఎడిటింగ్: ఉదయ్, వెంకట్
నిర్మాత: మాగుంట శరత్‌చంద్రారెడ్డి, తారకనాథ్ బొమ్మిరెడ్డి
దర్శకత్వం: రమేశ్ రాపర్తి
కరోనా క్రైసిస్ తో ఒకసారి థియేటర్స్ క్లోజ్ అయ్యి ఓటిటీల హవా పెరిగినా.. మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయ్యి బాక్సాఫీసు పుంజుకుంటున్న టైం లో మరోసారి కరోనా వలన థియేటర్స్ మూతబడిన తర్వాత మొదటగా ఆహా ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అనసూయ థాంక్యూ బ్రదర్. థాంక్యూ బ్రదర్ కథ ఏమిటో ఆ సినిమా ట్రైలర్ లోనే ఓ అవగాహనకు వచ్చేసిన ప్రేక్షకుడు సినిమా మొత్తం ఏం చూపిస్తారో అనే ఆసక్తి లో ఉన్నాడు. అందులోనూ థాంక్యూ బ్రదర్ ఓ నైజీరియన్ మూవీకి కాపీ అనే వార్తలు నేపథ్యంలో.. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుందో? గ్లామర్ యాంకర్ అనసూయ నటనకు పాధాన్యమున్న పాత్రలో ఎలాంటి పెరఫార్మెన్స్ చేసిందో సమీక్షలో చూసేద్దాం.
కథ:
అభి(విరాజ్ అశ్విన్) ఆకతాయి అబ్బాయి. లైఫ్ ని ఈజీగా ఎంజాయ్ చెయ్యాలనే మనస్తత్వం కల కుర్రాడు. అభికి అహంకారం మాత్రమే కాదు ఆటిట్యూడ్ కూడా ఎక్కువే. అయితే అభి తన తండ్రి పార్టనర్ తో కలిసి బిజినెస్ చెయ్యాలని ఓ అపార్ట్మెంట్ కి వస్తాడు. మరోవైపు ప్రియా (అనసూయ) పెళ్లయిన కొన్ని రోజులకే ఆమె భర్త(ఆదర్శ్ బాలకృష్ణ) చనిపోతాడు. ప్రియ కూడా భర్త ఉద్యోగం చేసే ఆఫీస్ కి వస్తుంది. ప్రియా నిండు గర్భిణి. ప్రియా, అభి తమ తమ పని ముగించుకుని తిరిగి వెళ్లిపోవడానికి లిఫ్ట్ ఎక్కుతారు. సడెన్‌గా లిఫ్ట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి లిఫ్ట్ ఆగిపోతుంది. లిఫ్ట్ ఆగిపోయిన భయంతో ప్రియకు నొప్పులు మొదలవుతాయి. అదే సమయంలో లిఫ్ట్ లో ఉన్న అభి ఏం చేస్తాడు? లైఫ్ అంటే సీరియస్ నెస్ లేని అభి ప్రియని ఎలా కాపాడాడు? దాని నుంచి అభి - ప్రియా ఎలా బయటపడ్డారు? అనేది మిగతా కథ.
పెరఫార్మెన్స్:
బుల్లితెర మీద అదిరిపోయే గ్లామర్ తో యాంకరింగ్ చేసే అనసూయ మరోవైపు ఐటెం సాంగ్స్ లోనూ అదరగొట్టేస్తుంది. ఇంకోపక్క హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి ప్రాధాన్యత ఇస్తూ వెండితెర మీద వెలిగిపోతుంది. థాంక్యూ బ్రదర్ సినిమాలో ప్రియా పాత్రలో అనసూయ బాగా నటించింది. నిండు గర్భిణిగా అనసూయ ఒదిగిపోయింది. లిఫ్ట్‌లో పురుటినొప్పులతో బాధపడే సన్నివేశాలు ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి. యంగ్ హీరో విరాజ్ పర్వాలేదు. మిగిలిన పాత్రల పెరఫార్మెన్స్ కి పెద్దగా స్కోప్ ఉన్నట్లుగా కనిపించదు.
విశ్లేషణ:
నైజీరియన్ మూవీ ఎలివేటర్ బేబీ థాంక్యూ బ్రదర్ కథకు ప్రేరణ. థాంక్యూ బ్రదర్ టైటిల్ కార్డులో.. మాతృక రైటర్స్ కి క్రెడిట్ ఇచ్చి వాళ్ళ పేర్లు వేసింది చిత్ర బృందం. అయితే దర్శకుడు థాంక్యూ బ్రదర్ ట్రైలర్ లోనే సినిమా ఎలా ఉండబోతుంది అనేది దాదాపుగా రివీల్ చేసేసాడు. ఫస్ట్ హాఫ్ అంతా అభి ఆటిట్యూడ్ చూపించడానికి సరిపోయింది. అభి, ప్రియల నేపథ్యం చూపించేందుకు సమయం తీసుకున్నాడు. ఆ సన్నివేశాలు ఆకట్టుకోక పోగా.. కాస్త విసుగు తెప్పిస్తాయి. అభి నేపథ్యం ఉన్న కథ చాలా సినిమాల్లో చూసిన ఫీలింగ్ కనిపిస్తుంది. బాగా డబ్బున్న యువకుడికి.. లైఫ్ ని ఈజీగా ఎంజాయ్ చెయ్యడం తప్ప.. జీవితం మీది అవగాహనే ఉండదు. డబ్బుందన్న అహంకారం. డబ్బుని చూసి చుట్టూ చేరిన స్నేహితులు, అమ్మాయిలతో కాలక్షేపం చెయ్యడం.. ఇవన్నీ గతంలో శర్వానంద్ - అల్లరి నరేష్ కాంబోలో వచ్చిన గమ్యం సినిమాని గుర్తు చేసేవిలా ఉన్నాయి. ఇక థాంక్యూ బ్రదర్ అసలు కథ లిఫ్టులో చిక్కుకోవడం నుంచి మొదలవుతుంది. సెకండ్ హాఫ్ అంతా లిఫ్ట్ నేపథ్యంలోనే నడుస్తుంది. డాక్టరు సలహాతో…అభి.. ప్రియని కాపాడడం చూపించారు. బాధ్యతలేని కుర్రాడికి జీవితం అంటే ఏమిటో చూపించారు. ఇలాంటి కథలు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి. కానీ థ్యాంక్యూ బ్రదర్‌లో ఆ ఎమోషన్స్ మిస్ అయ్యాయి. సినిమా క్లయిమాక్స్ లో ఆ హీరో లో వచ్చే మార్పు అన్ని ఆర్టిఫీషియల్ గా అనిపిస్తాయి. అలాగే అనసూయ నేపథ్యం కూడా అంతగా కనెక్ట్ అవదు. ఎమోషన్ ని బలంగా పండించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు.
లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి పెద్దగా లొకేషన్స్ అవసరం లేదు.. సెకండ్ హాఫ్ మొత్తం ఓ లిఫ్ట్ లోనే చూపించేసారు కాబట్టి.. ఈ సినిమా నిర్మాతలు ఈ సినిమాని థియేటర్స్ కోసం వేచి చూడకుండా ఓటిటిలో వదిలెయ్యడం కరెక్ట్ అనిపించేలా ఉంది.
పంచ్ లైన్: భరించలేం బ్రదర్.!