బ్యానర్: ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయికుమార్, తులసి, అరుణ్ కుమార్, అనిల్ జీలా, తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: చేతన్ భరద్వాజ్
ఎడిటింగ్:విశ్వాస్ డేనియల్
నిర్మాతలు: ప్రమోద్, రాజు
దర్శకుడు: శ్రీధర్ గాదే
రాజా వారు రాణి గారు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు నాలుగైదు ప్రాజెక్ట్స్ తో బిజీ హీరో అయ్యాడు. కిరణ్ అబ్బవరం రీసెంట్ గా శ్రీధర్ దర్శకత్వంలో ఎస్ ఆర్ కల్యాణమండపం మూవీలో నటించాడు. ఈ సినిమాకి కథ, కథనం, డైలాగ్స్ కూడా హీరో కిరణ్ అబ్బవరమే అందించాడు. ఇక ప్రమోషన్స్ తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచి లాక్ డౌన్ సెకండ్ వేవ్ పూర్తి కాగానే ప్రేక్షకుల మీద భారం వేసి ఈ సినిమాని నేడు థియేటర్స్ లో రిలీజ్ చేసారు మేకర్స్. కిరణ్ అబ్బవరం - సాయి కుమార్ కలయికలో ప్రమోషన్స్ తో అందరిలో క్యూరియాసిటీ పెంచిన ఎస్ ఆర్ కల్యాణమండపం ఏమేర ప్రేక్షకులను ఆకట్టుకుందో సమీక్షలో చూసేద్దాం.
కథ:
రాయచోటిలోని ఎస్.ఆర్.కళ్యాణమండపానిది ఓ చరిత్ర. ఎప్పుడూ పెళ్లిళ్లు, ఫంక్షన్స్ తో కళకళలాడే ఆ కల్యాణ మండపం బాధ్యతలను తండ్రి మరణం తర్వాత ఆయన కొడుకు ధర్మ (సాయికుమార్) తీసుకుంటాడు. అయితే తండ్రి అనంతరం ఆ బాధ్యతలను తీసుకున్న ధర్మ కల్యాణమండపం బాధ్యతలను పక్కనబెట్టి తాగుడుకు బానిసవుతాడు. అందుకు కారణం ధర్మ భార్య శాంతి(తులసి)తో ఎప్పుడూ తగువులు పడుతుంటాడు. ఆఖరికి ధర్మ కొడుకు కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) కూడా తన తండ్రితో మాట్లాడటం మానేస్తాడు. తాగుడుకు బానిసైన ధర్మ ఆ కల్యాణ మండపాన్ని తాకట్టు పెట్టెయ్యాలనుకుంటాడు. తాకట్టు వరకు వెళ్లిన ఎస్.ఆర్.కళ్యాణమండపానికి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత కళ్యాణ్‌పై పడుతుంది. మరి కల్యాణ మండపం బాధ్యతలను కళ్యాణ్ ఎలా నిర్వర్తించాడు? అసలు తాకట్టుకు వెళ్లకుండా కళ్యాణ్ కల్యాణ మండపాన్ని ఎలా కాపాడాడు? అనేది మిగతా కథ.
పెరఫార్మెన్స్:
కిరణ్ అబ్బవరంకి ఇది రెండో సినిమా. అయినా ఎక్కడా తడబడలేదు, కళ్యాణ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక కళ్యాణ్ పాత్రలో ఒదిగిపోయారు. కిరణ్ రాయలసీమ యాస కూడా బాగుంది. ఇక సాయి కుమార్ ధర్మ గా జీవించారు. బాగా బ్రతికి, బిజినెస్ లో నష్టాలూ వచ్చి, తాగుడుకు బానిసవడం, భార్య తో గొడవలు పడే వ్యక్తిగా సాయి కుమార్ పెరఫార్మెన్స్ హైలెట్. తులసి, శ్రీకాంత్ అయ్యంగార్ చిన్న పాత్రల్లో కనిపిస్తారు. మిగతా నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
కల్యాణ మండపం అంటే..గుమ్మానికి పచ్చని తోరణాలు, పూల డెకరేషన్స్, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వారి బంధువులతో కళకళలాడుతూ ఉంటుంది. అలాంటి కల్యాణ మండపం కథతో శ్రీధర్ గాదె.. కిరణ్ అబ్బవరం హీరోగా సినిమా తెరకెక్కించారు. ప్రమోషన్స్ తోనే సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసారు. సాయి కుమర్, కిరణ్ అబ్బవరం ట్రెడిషన్ వేర్ తో సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ లోని ఆసక్తిని అయితే పెంచగలిగారు కానీ.. సినిమాలోనే విషయం లేదనిపించేసారు. అంటే యూత్ కి సింక్ అయ్యేలా కథ అయితే రాసుకున్నారు కానీ.. స్క్రీన్ ప్లే నే వదిలేసారు. స్టోరీ, డైలాగ్స్ వరకైతే ఓకె... ఫస్ట్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీ, ట్విస్ట్ లు పర్వాలేదనిపిస్తాయి కానీ.. సెకండ్ హాఫ్ లో చెప్పాల్సిన కథేమీ లేక, లవ్ స్టోరీలో పట్టు లేక సాగదీత వ్యవహారంలా మారిపోయింది సినిమా. ఇక హీరో - హీరోయిన్స్ మధ్యన లవ్ ట్రాక్ తేలిపోయింది. అంతేకాదు.. తండ్రీ కొడుకుల బంధం అంటే బలంగాను, ఎమోషనల్ గాను చూపిస్తే కాస్త ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవారు…అందులోనూ ఫలితం రాబట్టలేకపోయారు. ఒక కొడుకు పదేళ్లుగా తండ్రితో మాట్లాడటం లేదంటే, దాని వెనక ఏదో బలమైన కారణం ఉంటుందని అందరూ ఊహిస్తాఋ. కానీ ఇక్కడ కారణం వింటే అసలు ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. మొత్తానికి కల్యాణమండపంలో ఉండాల్సిన కలర్స్ అంటే ఎమోషన్స్ లాంటివి మిస్ అయ్యాయన్నమాట.
సాంకేతికంగా:
చేతన్ భరద్వాజ్ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్ చిత్రీకరణ బావున్నాయి. డేనియర్ కెమెరా పనితనం మెయిన్ హైలెట్ లా నిలిచింది. నిర్మాణ విలువలు మరీ నాసిరకంగా ఉన్నాయి. కళ్యాణమండపం అంటే బోర్డ్ తప్ప అసలైన కళ్యాణమండపాన్ని చూపించలేని నిర్మాణ విలువలన్నమాట.
రేటింగ్: 2.5/5