Advertisementt

సినీజోష్ రివ్యూ : రాధే శ్యామ్

Fri 11th Mar 2022 09:57 AM
rdhe shyam review,radhe shyam rating,radhe shyam revenue,radhe shyam records  సినీజోష్ రివ్యూ : రాధే శ్యామ్
Radhe Shyam Movie Telugu Review సినీజోష్ రివ్యూ : రాధే శ్యామ్
Advertisement
Ads by CJ

సినీ జోష్ రేటింగ్ : 2.25/5

రివ్యూ : రాధే శ్యామ్ 

రిలీజ్ డేట్ : 11-03-2022

బేనర్ : యు.వి.క్రియేషన్స్ 

నటీ నటులు : ప్రభాస్, పూజ హెగ్డే, భాగ్యశ్రీ, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, జయరామ్, ప్రియదర్శి  మరియు కృష్ణంరాజు (ప్రత్యేక పాత్రలో)

ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు 

ఆర్ట్ డైరెక్టర్ : రవీందర్

సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస 

సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ 

నేపథ్య సంగీతం : ఎస్.తమన్

నిర్మాతలు : వంశీ - ప్రమోద్ - ప్రసీద 

దర్శకత్వం : రాధా కృష్ణ కుమార్ 


ఎట్టకేలకు కోవిడ్ కోలాటం తగ్గుముఖం పట్టింది.

ఆంధ్రాలో టికెట్ రేట్ల సమస్య సద్దుమణిగింది.

మరిక భారీ సినిమాలన్నీ స్థాయికి తగ్గ రాబడి రాబట్టేనా.?

మన ప్రేక్షకులు మళ్ళీ థియేటర్ల వైపు పరుగులు పెట్టేనా.?

అదిగో ఆ సందేహం తీర్చడానికి, స్పష్టమైన సమాధానం ఇవ్వడానికి నేడు విడుదలైంది రాధే శ్యామ్ చిత్రం. 

తెలుగు సినిమా పతాకాన్ని పట్టుకెళ్లి ప్రపంచ పటం మధ్యలో పాతిన బాహుబలి ప్రభాస్ ఈసారి ప్రేమ కథతో వచ్చాడు. తన క్రేజ్ అండ్ ఇమేజ్ తో అడ్వాన్స్ బుకింగులతోనే బాక్సాఫీసుకి కళకళలు తెచ్చాడు.

అంతవరకూ ఓకే కానీ.. మూడేళ్ళుగా వర్క్ చేసిన 300 కోట్ల పాన్ ఇండియా ప్రాజెక్టు రాధే శ్యామ్ ఫైనల్ గా వీక్షకులని ఇంప్రెస్ చేసిందో.. ఇరిటేట్ చేసిందో సంగతేంటో కనుక్కుందాం సమీక్షలో..!

కథ : సాక్ష్యాత్తూ భారతదేశ ప్రధాని భవిష్యత్ లో తీసుకునే నిర్ణయాలేంటో కూడా జోస్యం చెప్పగలిగేంత హస్త సాముద్రికా నిపుణుడు విక్రమాదిత్య (ప్రభాస్).

డాక్టర్ లా కనిపించే పేషంట్ - పేషంట్ అయినప్పటికీ డాక్టర్ ప్రేరణ (పూజ హెగ్డే). వీరిద్దరి ప్రేమ కథే రాధే శ్యామ్.

ప్రేమ కథ అన్నామని పెద్ద పెద్ద ఆశలేం పెట్టుకోకండి.

ప్రేమ - కథ రెండూ లేని కంగాళీ వ్యవహారం ఇది.

ఇందులో జ్యోతిష్యం ఉంటుంది. ఎందుకో అర్ధం కాదు.

సైన్స్ ఉంటుంది. దానికీ అర్ధం లేదు.

వైద్యం ఉంటుంది. వ్యర్థం అనిపిస్తుంది.

ఖర్చు కనిపిస్తుంది. వృధా అయిపోయింది.

అంతకుమించి స్టోరీ పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ కథని పక్కనెట్టి కథనంలోకి వెళదాం పదండి.

కామెంట్లకీ - కంప్లయింట్లకీ కావాల్సినంత ఛాన్స్ దొరుకుద్ది.

కథనం : అందిన లక్షణమో - పొందిన విద్యో ఏదైతేనేం హీరోగారు చెయ్యి చూసి జాతకాలు - జీవితాలు ఇట్టే చెప్పేస్తుంటారు. దేశం వదిలి వచ్చి దాక్కున్నాడో.. దేశాలు పట్టుకు తిరుగుతున్నాడో  మీకు అనవసరం అన్నట్టు ఒక్కో సందర్భంలో ఒక్కో డైలాగ్ వేసుకుంటూ వెళ్లిపోయారు. ఇక ఆ జోస్యం చెప్పడం అనేది హాబీనా ప్రొఫెషనా అని అడిగామంటే సినిమా డైరెక్టర్ సీరియస్ అవుతారేమో. తనకి కూడా క్లారిటీ లేని క్వశ్చన్స్ వేస్తే కోపం రావడం సహజమే కదా. సరే.. హీరోయిన్ గారి విషయానికి వస్తే కనిపించిన ప్రతి ఒక్కడిని నా బరువు మోస్తావా అని అడిగేసి అదేదో గొప్ప ఫీట్ చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది. గీతాంజలి సినిమాలోని గీత పాత్రే ప్రేరణగా మౌల్డ్ అయినప్పటికీ ఆ అద్భుత కావ్యంలోని అమలిన ప్రేమని ఇక్కడ కామ క్రీడతో కకావికలం చేసేసింది. చావుకి చేరువ అవుతున్న దశలో శారీరక సుఖం కోరుకోవడం, పంచుకోవడం పైత్యానికి - పర్వర్షన్ కి పరాకాష్ఠగానే చెప్పుకోవాలి. ఇంటర్వెల్ దగ్గర ఒకే ఒక్క షాట్ తప్ప మరేదీ ప్రభాస్ కటౌట్ ని జస్టిఫై చెయ్యలేని ఈ సినిమాలో మెచ్చదగ్గ అంశం ఏదైనా ఉందీ అంటే.. ప్రీ క్లైమాక్స్ లో చెయ్యి చూసి భవిష్యత్ చెప్పే నువ్వు.. చెయ్యే లేని నాకు భవిష్యత్ లేదంటావా- నా భవిష్యత్ నేనే రాసుకోవచ్చంటావా అంటూ ప్రభాస్ ని ఓ అమ్మాయి ప్రశ్నించే సీన్ ప్రస్తావించాలి. నిజానికి అదే కథ. అదే విధి. అదే బలం. అదే సత్యం. కానీ అంత స్ట్రాంగ్ టాపిక్ ని కేవలం ఒక సీన్ లో సరిపెట్టేసి క్లయిమాక్సుకి వెళ్లిపోయిన దర్శకుడు ఆ షిప్పు ఎపిసోడ్ తో తుప్పు వదిలించేసి ప్రతి ఒక్క ప్రేక్షకుడిని తిక్క తిక్కగా పంపించాడు బయటికి. ఇలా చెప్పాలంటే రాధే శ్యామ్ కథనంలో రాధా కృష్ణ కుమార్ చూపిన చాకచక్యం ఇంకా చాలా ఉంది. ఆయన పని తీరుపై ఓ ప్రత్యేక వాక్యం రాసే తీరాలి కనుక బ్యాలన్స్ పార్ట్ ఆ చాప్టర్ లో పెట్టుకుందాం. ఇప్పుడిక నెక్స్ట్ థింగ్ ఏంటంటే....

నటీనటులు : విక్రమాదిత్యగా ప్రభాస్ అద్భుతంగా నటించాడు అంటే...

డౌటే లేదు  ఆ ప్రశంసని అంగీకరించడానికి డార్లింగే మొహమాటపడతాడు.

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డ దశలో బాధ్యత పెరగాలి కానీ బద్ధకం పెరక్కూడదు.

తన సినిమాలు గ్రాండ్ గా తీసుకోవచ్చు కానీ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు.

సాహోతో వేకప్ కాల్ వచ్చింది. రాధే శ్యామ్ తో డేంజర్ బెల్ మోగింది.

కనుక ప్రభాస్ ఇకపై ఎక్కువ ఎలెర్ట్ గా ఉంటారని ఆశిద్దాం.

మార్కెట్ ఉంది కదా అని కోట్లు డిమాండ్ చేసే పూజ హెగ్డే అపుడపుడు నటనపై, ఎప్పటికపుడు తన లుక్స్ పై కూడా కాన్సంట్రేట్ చేస్తే బాగుంటుంది. సినిమాలో వీళ్లిద్దరి తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర దొరికింది సచిన్ ఖేడేఖర్ కి. డాక్టర్ గా కనిపించాల్సిన పాత్రలో కూడా యాక్టర్ మాత్రమే కనిపించేలా కానిచ్చేశారు. ప్రభాస్ మదర్ గా భాగ్యశ్రీని ఎందుకు తీసుకున్నారో, ఆవిడ డాన్స్ ప్రోగ్రాం ప్రహసనం ఏమిటో రోల్ రాసిన డైరెక్టర్ కి, పే చేసిన ప్రొడ్యూసర్స్ కే తెలియాలి. ప్రభాస్ ఫ్యామిలీ ఫ్రెండ్ గా కనిపించిన వ్యక్తి అయితే లేని పోని అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాడు. మురళి శర్మ - ప్రియదర్శి వంటి కొందరు ఆర్టిస్టులు వేస్టయ్యారు. సీనియర్ నటుడు జగపతిబాబుకి రెండు సీన్స్ ఉన్నాయి. అవి ఉన్నా లేకపోయినా సినిమా గమనంలో పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదులే అనిపిస్తాయి.

సినిమా మొత్తమ్మీద సర్ ప్రైజింగ్ ప్యాకేజ్ ఏంటంటే రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఇతర భాషలకు సత్యరాజ్ ని వాడుకున్నా తెలుగు రాష్ట్రాల వరకు ప్రభాస్ గురువు పరమహంసగా తెరపై కనిపించిన కృష్ణంరాజు అభిమానులే ఆశ్చర్యపోయేంత సెటిల్డ్ గా పర్ ఫార్మ్ చేసారు. ఆయనతో కాంబినేషన్ సీన్స్ అయినా ప్రభాస్ సిగ్గు పడకుండా అన్నీ చేసేసి ఉంటే రెబెల్ ఫాన్స్ కి ఇంకాస్త కిక్కు దక్కేది. 

ఇక సాంకేతిక విభాగంలోకి వెళితే...

టెక్నీషియన్స్ : బాక్సాఫీస్ దగ్గర మార్నింగ్ షో కే బలహీనపడ్డ ఈ చిత్రానికి ఎంతో కొంత స్ట్రెంగ్త్  టెక్నీషియన్సే. మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ మంచి ట్యూన్స్ ఇచ్చినప్పటికీ లిరిక్స్ వల్ల అవి మనకి డబ్బింగ్ పాటల్లా అనిపిస్తాయి. మనోజ్ పరమహంస ఎంత కష్టపడినప్పటికీ చాలాచోట్ల సరిగా సెట్ కాని సీజీ వర్క్ తన పనితనానికి మచ్చ తెచ్చింది. అత్యంత అనుభవజ్ఞుడైన కోటగిరి ఎడిటింగ్ ని తప్పు పట్టలేం. అక్కడేం జరిగి ఉంటుందో అర్ధం చేసుకోవాలంతే. రవీందర్ - రసూల్ పూకుట్టి సామర్ధ్యం రాధే శ్యామ్ లో అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. ఇక తమన్ అయితే తాండవం ఆడేసాడు. రాధే శ్యామ్ యూనిట్ తమ అవుట్ ఫుట్ తో తమన్ దగ్గరికి వెళితే దానికి అవుట్ స్టాండింగ్ ఆర్ ఆర్ ఇచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నాడు తమన్. ముఖ్యంగా రాధే శ్యామ్ టైటిల్ జస్టిఫై అయ్యేలా తమన్ చేసిన థీమ్ ని మెచ్చుకుని తీరాలి. ఇక నిర్మాతలు ప్రభాస్ సొంత వ్యక్తులు. ప్రభాస్ రేంజ్ ని పెంచేలా ఎంతైనా ఖర్చు పెట్టేసే ప్రమోద్ - వంశీలు ప్రభాస్ ఇమేజ్ ని ఇంకా ఇంకా పెంచే కథలని ఎందుకు ఎంచుకోలేక పోతున్నారో పక్కన పెడితే కనీసం డార్లింగ్ రేంజ్ ని మ్యాచ్ చేసే స్క్రిప్ట్ కూడా సెట్ చేయలేకపోవడం విడ్డూరం. ఫైనల్ గా డైరెక్టర్ విషయానికి వస్తే... రాధే శ్యామ్ రిజల్ట్ రెస్పాన్సిబిలిటీ పూర్తిగా రాధా కృష్ణ కుమార్ దే. ముచ్చటైన హీరో - మూడేళ్ళ సమయం - మూడొందల కోట్ల బడ్జెట్.. ఇన్ని కుదిరినా.. యువి క్రియేషన్స్ వంటి బ్యానర్ దొరికినా యుటిలైజ్ చేసుకోలేకపోతే ఏం అనగలం. అసలు తనకి ఇంకేం చెప్పగలం. చాలా మంచి సినిమా అవ్వగలిగే ఒక కాన్సెప్ట్ ని బోరింగ్ ఫిలింగా మలిచి అందివచ్చిన గోల్డెన్ ఆపర్చ్యునిటీని తన సినిమా సునామీ క్లయిమాక్స్ లో కలిపేసుకున్నారు రాధా కృష్ణ. 

విశ్లేషణ : ఓ క్యారెక్టర్ కి చనిపోయే ప్రాబ్లెమ్. ఆ క్యారెక్టర్ ని బ్రతికించడానికి ప్రాణ త్యాగానికి సిద్దపడిపోయే మరో క్యారెక్టర్. అసలీ త్యాగానికి లెక్కేంటో సగటు ప్రేక్షకుడి బక్క చిక్కిన బ్రెయిన్ కి అర్ధమే కాదు. ఛత్రపతి లాంటి పెర్సనాలిటీ తో మిర్చిలా ఉన్న ప్రభాస్ బాహుబలి వంటి ధీరోదాత్తమైన పాత్ర చేసేశాక ఇలాంటి కథలో... ఇంత నిస్తేజమైన పాత్రలో పాన్ ఇండియా స్టార్ ని ప్రెజెంట్ చేసారంటే అది అమాయకత్వమో లేక చేజేతులా చేసిన తప్పిదమో వాళ్ళే రియలైజ్ అవ్వాలి. ఆఫ్ కోర్స్ అభిమానుల మనోభావాలను గుర్తించి ప్రభాస్ కూడా జాగ్రత్త పడాలి. టాలెంటెడ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడాన్ని ఎవరూ తప్పని చెప్పరు... కానీ ప్రపంచ సినీ ప్రేక్షకులకు చేరువైన హీరో తనని సరిగా హేండిల్ చేసే దర్శకుడిని ఏరి కోరి ఎంచుకోవాలి. రానున్న ప్రభాస్ సినిమాలన్నీ ఆ భరోసాని ఇస్తున్నాయి కానీ తాను తీసుకునే కామెడీ నిర్ణయాలే ఫ్యాన్స్ ని కంగారు పెడుతున్నాయి. సర్లెండి.. ఇంతకీ సినిమా గురించి విశ్లేషణ ఏదీ అంటారా.. విశేషమే లేని బోరింగ్ సఫరింగ్ మీతో పంచుకోవడం ఎందుకు.!

కొందరికి అది రాధే శ్యామ్ అట... ఇంకొందరికి అది రాడ్డే శ్యామ్ అట.!

ఫినిషింగ్ టచ్ : రాత - చేత.. మాత్రమే కాకుండా తీత కూడా తెలిసుంటే బాగుండేది 

Radhe Shyam Movie Telugu Review:

Radhe Shyam Telugu Movie Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ