సినీజోష్ రివ్యూ : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
బేనర్ : బెంచ్ మార్క్ స్టూడియోస్ & మైత్రి మూవీ మేకర్స్
నటీనటులు : సుధీర్ బాబు, కృతి శెట్టి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, అవసరాల శ్రీనివాస్ తదితరులు
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ : పి జి విందా
ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాతలు : బి. మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి
రచన, దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ
విడుదల తేదీ : 16-09-2022
సినిమా ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ తోనే కథ రాసి సినిమా తీసే ప్రయత్నాలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. అయితే షార్ట్ గ్యాప్ లోనే అదే ఎటెంప్ట్ రెండోసారి చేసేసారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆమధ్య సినిమా నేపథ్యంలోనే సమ్మోహనం చిత్రం చేసిన ఇంద్రగంటి ఇపుడు మళ్ళీ అదే హీరో సుధీర్ బాబుతో.. మరోసారి అదే తరహా కథాంశంతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ వచ్చారు. మరి ఇంట్రెస్టింగ్ గా ఏమైనా చెప్పారా.. ఇంప్రెసివ్ గా ఏదైనా చూపించారా అనే విశ్లేషణ లోకి వెళితే...
బేసిక్ పాయింట్ : దర్శకుడిగా తిరుగులేని విజయాలతో స్టార్ డైరెక్టర్ అనిపించుకుంటాడు నవీన్ (సుధీర్ బాబు). అతన్ని ఓ పర్టిక్యులర్ అంశం ఆకర్షించడం, ఆసక్తిగా అనిపించడంతో అదే తన తదుపరి సినిమాగా చేయాలి అనుకుంటాడు. ఆ సినిమాలో కథానాయిక పాత్ర కోసమై డాక్టర్ అలేఖ్య (కృతి శెట్టి) వెంట పడతాడు. కానీ బేసిక్ గానే సినిమాల్ని ద్వేషించే అలేఖ్య అస్సలు నవీన్ ఆఫర్ ని కేర్ చెయ్యదు. మరి నవీన్ ఆమెని ఒప్పించగలిగాడా, అలేఖ్యకు సినిమాలపై హేట్ రావడానికి కారణాలేంటి, ఈ కథలోని ఎమోషనల్ పార్ట్ ద్వారా దర్శకుడు చెప్పాలి అనుకున్నదేంటి అన్నదే మిగిలిన తతంగం.
ప్లస్ పాయింట్ : స్టార్ డైరెక్టర్ నవీన్ రోల్ ని తనదైన శైలిలో చేసేసాడు సుధీర్ బాబు. కానీ నటుడిగా తన స్థాయినో, హీరోగా తన ఇమేజ్ నో పెంచేసే క్యారెక్టర్ ఏమీ కాదిది. జస్ట్ సుధీర్ బాబు సినిమాల జాబితాలో మరొకటి చేరిందంతే. కృతి శెట్టికి అభినయానికి ఆస్కారమున్న మంచి పాత్ర దొరికింది. తగిన న్యాయం చేసేందుకై తను కూడా సిన్సియర్ గా ప్రయత్నించింది. అలాగే లుక్స్ వైజ్ క్యూట్ గా కనిపిస్తూనే పెర్ ఫార్మర్ గాను తనలోని ఇంప్రూవ్ మెంటుని చూపించింది. వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణలు సపోర్టింగ్ రోల్స్ లో కనిపించగా అవసరాల శ్రీనివాస్ డాక్టర్ గా మెరిశాడు. ఓవరాల్ గా సుధీర్ - కీర్తిల పెర్ ఫార్మెన్స్, పి జి విందా విజువల్స్, కాస్త ఓకే అనిపించే ఎమోషనల్ ఎపిసోడ్స్ మాత్రమే ఈ చిత్రానికి సేవింగ్ గ్రేస్.!
మైనస్ పాయింట్ : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే టైటిల్ పెట్టారంటే ఆ అమ్మాయిలో ఏదైనా విశేషం ఉండాలి. లేదా చెప్పాలి అనుకున్న మేటర్ లో విషయం ఉండాలి. కానీ ఆ రెండు లేకుండా అతి సాదా సీదా సినిమాని మనముందుకు తెచ్చారు ఇంద్రగంటి. వీక్ స్టోరీ లైన్ తో ప్రథమార్ధం నుంచే ప్రేక్షకులకి నీరసాన్ని తెప్పిస్తూ స్లోగా సాగే స్క్రీన్ ప్లే తో నిద్రలోకి పంపేశారు ఇంద్రగంటి. ఆపై ఆ నిద్ర కళ్ళకు ద్వితీయార్ధం కాస్త పర్లేదులే అనిపించేలా చెయ్యగలిగారు. మొత్తానికి టీజర్ తో, ట్రైలర్ తో ఆకట్టుకున్నా థియేటర్ లో మాత్రం ఓ రేంజ్ లో డిజప్పాయింట్ చేసి ఓటిటి సినిమాగా మిగిలిపోయింది ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఒక పాట మినహా మ్యూజిక్ లో మ్యాజిక్ లేదు. ఒక్క సీన్ మినహా మాటల్లో మెరుపులేం లేవు. సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మొహమాటానికి ఈ సినిమా చేసాడో, ఎడిటింగ్ లో మొహమాటానికి పోయాడో తెలియదు కానీ తన కత్తెరకి కరెక్ట్ గా పనిచెప్పుంటే బావుండేది.
ఫైనల్ పాయింట్: సినిమా నేపథ్యంలో సాగే కథాంశాన్నే తీసుకున్నప్పటికీ.. సరదా సరదా సన్నివేశాలతో సమ్మోహనం సక్సెస్ కొట్టారు ఇంద్రగంటి. కానీ ఈసారి అదే బ్యాక్ డ్రాప్ తో ఓ సీరియస్ టాపిక్ ని ఎమోషనల్ గా చెప్పాలనుకున్న ఇంద్రగంటి ఆ ప్రాసెస్ లో కామెడీనే కాదు కంప్లీట్ గా కమర్షియల్ ఎలిమియెంట్స్ అన్నిటినీ మిస్ అయ్యారు. అదే తరహా కథాంశం తానే మళ్ళీ చేస్తున్నారు కనుక పూర్తి వైవిధ్యాన్ని చూపించాలనుకున్నారు కానీ.. ప్యాట్రన్ రివర్స్ అయినప్పుడు రిజల్ట్ కూడా అదే రీతిలో ఉంటుందని ఊహించలేకపోయారు. బహుశా ఈ చిత్రం డిజిటల్ టెలికాస్ట్ లో డీసెంట్ గా పెర్ ఫామ్ చేస్తుందేమో కానీ థియేటర్స్ లో మాత్రం కష్టమేనండోయ్.!
పంచ్ లైన్: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి - వినాలంటే చాలా ఓపిక కావాలి
రేటింగ్: 2/5