సినీజోష్ రివ్యూ: వారసుడు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: విజయ్, రష్మిక మందన్న, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సంగీత, జయసుధ తదితరులు
సంగీతం: థమన్
సినిమాటోగ్రఫి: కార్తీక్ పళని
ఎడిటర్: ప్రవీణ్ KL
నిర్మాత: దిల్ రాజు, శిరీష్
కథ, దర్శకత్శం: వంశీ పైడిపల్లి
రిలీజ్ డేట్: 14-01-2023
రెబల్ స్టార్ ప్రభాస్ తో మున్నా సినిమా చేసి డైరెక్టర్ గా లాంచ్ అయిన వంశీ పైడిపల్లి ఆపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బృందావనం, మెగా హీరోస్ రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో ఎవడు, సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి చేసి స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. మన తెలుగు స్టార్స్ అందరూ బిజీగా ఉండడంతో ఈసారి తమిళ్ స్టార్ హీరో విజయ్ వైపు వెళ్లిన వంశీ వారిసు అనే పేరుతొ తమిళ్ లోను, వారసుడు అనే పేరుతొ తెలుగులోనూ తన శైలి సినిమా చూపించే ప్రయత్నం చేసాడు. ఈ ప్రయత్నానికి ఎప్పటిలానే దిల్ రాజు వంటి నిష్ణాతుడైన నిర్మాత అండగా నిలబడ్డాడు. తమిళ్ లో 11 నే రిలీజ్ అయిన వారిసు దిల్ రాజు నిర్ణయం మేరకు నేడు జనవరి 14 న తెలుగులో వారసుడు పేరుతో ప్రదర్శనకు దిగింది. మరి వారసుడు తాలూకు వాడి ఎంతో, వాటమి ఏమిటో.. విశ్లేషిద్దాం.
వారసుడు స్టోరీ రివ్యూ: రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రాజేంద్ర పర్వతనేని (శరత్ కుమార్) కి ముగ్గురు కుమారులు. జయ్(శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్). జయ్, అజయ్ ఇద్దరు తండ్రి రాజేంద్ర పర్వతనేని మాటను జవదాటరు. కానీ విజయ్ మాత్రం తండ్రి మాటను లెక్కచేయడు. సొంత అభిప్రాయాలు, సొంత కాళ్ళ మీద ఎదగాలనే ఆలోచన ఉన్న విజయ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు. కొన్ని కారణాల వలన ఏడేళ్ల పాటు ఇంటికి దూరమైన విజయ్ తల్లిదండ్రుల షష్టిపూర్తికి వస్తాడు. తండ్రికి ఆఫీస్ లో అలాగే ఆరోగ్యం విషయంతో పాటుగా ఫ్యామిలీ సమస్యలను తెలుసుకుని విజయ్ సమస్యలతో పోరాటానికి సిద్దమవుతాడు. అసలు విజయ్ ఫ్యామిలీకి ఉన్న సమస్యలేమిటి, విజయ్ అన్నదమ్ములిద్దరూ ఏం చేస్తారు, తండ్రి రాజేంద్ర అనారోగ్యం ఏమిటి, రాజేంద్ర కంపెనీ విషయంలో జయప్రకాష్(ప్రకాష్ రాజ్) పాత్రేమిటి.. అనేది తెలియాలంటే వారసుడుని సిల్వర్ స్క్రీన్ పై చూసెయ్యాల్సిందే.
వారసుడు ఎఫర్ట్స్: విజయ్ క్లాస్ లుక్ లో కనిపించాడు. విజయ్ బాడీ లాంగ్వేజ్‌కు, యాటిట్యూడ్‌కు చక్కగా సరిపోయే విధంగా పాత్రను డిజైన్ చేయడంతో పాత్రలో ఒదిగిపోవడానికి పెద్ద కష్టపడలేదనిపిస్తుంది. రెగ్యులర్ మేకోవర్, కొత్తగా స్టైల్స్ లేకపోవడంతో ఆ పాత్రలో విజయ్ జీవించేసాడు. ఎలివేషన్ సీన్స్ లో, ఎమోషనల్ గా విజయ్ ఆకట్టుకొన్నాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు విజయ్ పాత్ర ఒక ఎమోషనల్ రైడ్ అని చెప్పాలి. హీరోయిన్ రష్మిక మాత్రం జస్ట్ సాంగ్స్ కి పరిమితమైనా.. గ్లామర్ గా కనిపించింది. అప్పుడప్పుడు డైలాగ్స్ చెప్పి ఉనికిని చాటుకుంది. తల్లితండ్రులుగా జయసుధ, శరత్ కుమార్ లుక్స్ వైజ్ గా ఫెర్ఫార్మెన్స్ వైజ్ గా అద్భుతంగా కనిపించారు. ప్రకాశ్ రాజ్‌పాత్రని ఎన్నో సినిమాల్లో చూసేసిన విలన్ పాత్రలా డిజైన్ చేసి దర్శకుడు ప్రేక్షకులని నిరాశ పరిచాడు. అదే రొటీన్ డైలాగ్స్, అదే పాత వాసనలున్న పాత్రలో ప్రకాష్ రాజ్ ని చూడడానికి ఆడియన్స్ ఇబ్బంది పడ్డారు. శ్రీకాంత్ కేరెక్టర్ బావుంది. శ్యామ్ సెకండ్ హాఫ్ లో మెరిశాడు. మిగితా నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
థమన్ తనదైన శైలిలో డబ్బులతో మోత మోగించాడు తప్ప పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. కార్తీక పళని సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాలో ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ ని నెంబర్ అఫ్ ఆర్టిస్ట్ లని స్క్రీన్ పై బాగా ప్రెజెంట్ చేసింది. ఎడిటర్ ప్రవీణ్ తాను చెయ్యగలిగింది చేసాడో, దర్శకుడు తనని చెయ్యనిచ్చింది చేసాడో అతనికే తెలియాలి. ఇతర సాంకేతిక నిపుణులంతా తమ పరిధిమేరకు, పారితోషకం మేరకు పనితనం చూపించారు.
వారసుడు స్క్రీన్ ప్లే రివ్యూ: కుటుంబానికి దూరంగా ఉండే వారసుడు.. ఎట్ ది సేమ్ టైమ్ తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చే వారసుడు. ఈ రెండు ముక్కలు చెప్పగానే మనకు లెక్కకు మించి సినిమాలు అలవోకగా గుర్తొచ్చేస్తాయి. మరి ఇదే కథని తమిళ తలపతి విజయ్ అంగీకరించడానికి కారణం దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్, సంక్రాంతి రిలీజ్, తన తెలుగు మార్కెట్ పెంచుకోవడానికి పనికొస్తుందని ఉద్దేశ్యం అనేది ఆయన అభిమానుల వాదన. అయితే ఈ తరహా కథలని చాలాసార్లు చూసేసి ఉన్న తెలుగు ప్రేక్షకులు మరో తమిళ హీరోని ఇప్పుడిక రిసీవ్ చేసుకునే స్టాండర్డ్స్ లో లేరు. కథ మొత్తం తెలిసినట్టే కనిపిస్తూ ఉంటే, కథనం మొత్తం చూసేసినట్టే అనిపిస్తూ ఉంటే, పెట్టిన టికెట్ గుర్తొచ్చే ప్రేక్షకులు నిర్మొహమాటంగా సినిమాపై పెదవి విరిచేస్తున్నారు.
వారసుడు ఎనాలసిస్: వారసుడు సినిమా పట్ల విజయ్ ఫాన్స్, సినిమా మేకర్స్ డిస్పాయింట్ అవుతారేమో కానీ.. తెలుగు ఆడియన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతారు. బికాజ్ ఈకథకి ముందు మహేష్ బాబుని అనుకున్నాం, తర్వాత ఇంకో హీరోని అనుకున్నామంటూ దిల్ రాజు చేసిన కామెంట్స్ ఈతరహా రొడ్డకొట్టుడు, రొటీన్ తరహా సినిమా మా హీరోలకి పడకుండాపోయింది అని ఫాన్స్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థియేటర్ ఆక్యుపెన్సీ కాలిక్యులేటెడ్ గా చూసుకున్న దిల్ రాజు కలెక్షన్స్ ని మాత్రం కమాండ్ చెయ్యలేడు, డిమాండ్ చెయ్యలేడు కనుక వచ్చిందాంతో సరిపెట్టుకోవాల్సిందే వారసుడికి..!
పంచ్ లైన్: వారసుడు - నీరసుడు
రేటింగ్: 1.5/5