సినీజోష్ రివ్యూ: సార్
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్
నటీనటులు: ధనుష్, సంయుక్త, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, సముథిరఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీనివాస్, పమ్మి సాయి, హైపర్ ఆది తదితరులు
మ్యూజిక్ : GV.ప్రకాష్ కుమార్
ఎడిటింగ్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: J.యువరాజ్
ప్రొడ్యూసర్స్: సూర్యదేవర నాగ వంశి, సాయి సౌజన్య
డైరెక్టర్ : వెంకీ అట్లూరి
రిలీజ్ డేట్: 17-02-2023
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అంటే మాస్ ప్రేక్షకులకి మంచి క్రేజ్. ధనుష్ అంటే మాస్, మాస్ అంటే ధనుష్ అన్న రేంజ్ లో ఆయన సినిమాలు ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేస్తాయి. అలాంటి ధనుష్ మొదటిసారి ఓ తెలుగు దర్శకుడితో అది కూడా టాలీవుడ్ నిర్మాణ సంస్థతో పని చెయ్యడం అంటే తెలుగు ఆడియన్స్ కి మాత్రమే కాదు, తమిళ ప్రేక్షకులకి ఆసక్తే. ధనుష్ కి తెలుగులోనూ మంచి పేరుంది. రఘువరన్ బీటెక్, మారి లాంటి చిత్రాలతో ధనుష్ ఇక్కడి ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. తెలుగులో క్లాస్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో క్రేజీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లో నాగ వంశీ ధనుష్ తో సార్ మూవీ చేసారు. తెలుగులో సార్, తమిళంలో వాతి పేరుతో విద్యా వ్యవస్థ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ధనుష్ లుక్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని ఆసక్తికరంగా అనిపించడం, ప్రమోషన్స్ పరంగా ధనుష్ తెలుగు మీడియాకి దగ్గరవడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. మరి నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సార్ ప్రేక్షకుల అంచనాలని రీచ్ అయ్యాడో.. లేదో.. సమీక్షలో చూసేద్దాం.
సార్ స్టోరీ రివ్యూ:
ఈ సినిమా కథ 1990-2000 మధ్యకాలంలో జరుగుతుంది. విద్యని వ్యాపారంగా మార్చుకుని కోట్లు గడించే త్రిపాఠి విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాస్ త్రిపాఠి ప్రవేట్ విద్యా సంస్థలు ముందు ప్రభుత్వ కాలేజీలు ఎందుకు పనికిరావంటూ క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరుతో ప్రభుత్వ విద్యా సంస్థలు మూతబడేలా చెయ్యడంతో.. ప్రజల నుండి ఈ విషయంలో తీవ్ర వ్యతిరేఖత మొదలవుతుంది. బాలగంగాధర్ తిలక్ (ధనుష్).. సిరిపురం గవర్నమెంట్ కాలేజీలో లెక్కల మాస్టర్. విద్యావ్యవస్థ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లడంతో.. ప్రతి విద్యార్ధికి విద్య కరెక్ట్ గా అందించాలని తాపత్రయపడుతుంటాడు. అటు ప్రజలు గాట్టిగా నినదించడంతో ప్రభుత్వం విద్యాసంస్థలపై ప్రవేట్ యాజమాన్యాల దోపిడికి అడ్డుకట్ట వేస్తూ జీవో జారీ చేస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో శ్రీనివాస్ త్రిపాఠి ఏం చేసాడు? శ్రీనివాస్ త్రిపార్టీ వేసిన ప్లాన్స్ ని బాలు ఎలా తిప్పికొట్టాడు? బాలు లెక్చరర్ గా విద్యావ్యవస్థలో ఎలాంటి మార్పులు తెచ్చాడు? అనేది సార్ స్టోరీ.
సార్ ఎఫర్ట్స్:
ధనుష్ సార్ గా, బాలు కేరెక్టర్ లో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధనుష్ క్లాస్ లుక్స్ లో కూడా బావున్నాడు. యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ సీన్స్ అన్నిటిలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసాడు. కథ మొత్తం ధనుష్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ధనుష్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు.
హీరోయిన్ సంయుక్త మీనన్.. ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది. ఆమె పాత్ర నిడివి తక్కువ. ఇక త్రిపాఠి విద్యా సంస్థల చైర్మన్ గా సముద్రఖని.. తన విలనిజాన్ని చూపించారు. ప్రెసిడెంట్ గా సాయి కుమార్, కామెడీగా హైపర్ ఆది, మిగతా నటులు తమ పరిధిమేర మెప్పించారు. ముఖ్యంగా స్టూడెంట్స్ ఆకట్టుకుంటారు.
సాంకేతికంగా సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ లో జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఒకటి. సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా కుదిరింది. మాస్టారు మాస్టారు సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. యువరాజ్ కెమెరా వర్క్.. డైరెక్టర్ టేకింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. నవీన్ నూలి ఎడిటింగ్ లో కత్తిరించాల్సిన సీన్స్ చాలా ఉన్నాయి.. నిర్మాణ విలువలు కథకి సరిపోయేలా ప్లెజెంట్ గా ఉన్నాయి.
దర్శకుడు వెంకీ అట్లూరి తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి లవ్ స్టోరీస్ తో ఆకట్టుకుని.. సార్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేసాడు. తెలిసిన కథే అయినా.. ధనుష్ ఇచ్చిన పెరఫామెన్స్ కి వెంకీ అట్లూరి మేకింగ్ తోడైంది. వెంకీ అట్లూరి స్పెషల్ గా సార్ ని ప్రెజెంట్ చెయ్యకపోయినా.. క్లాస్ ఆడియన్స్ ని మాత్రం ఇంప్రెస్స్ చేయగలిగాడు.
సార్ స్క్రీన్ ప్లే రివ్యూ:
లెక్చరర్ గా విద్యా వ్యవస్థలో జరుగుతున్న దారుణాలు ఎత్తి చూపించడమే కాదు, ఆ దారుణాలని సమూలంగా నాశనం చేసే కథలతో ఇప్పటికే బోలెడన్ని సినిమాలు వచ్చేసాయి. అంతెందుకు తమిళంలో విజయ్ హీరోగా ఇలాంటి సినిమా వచ్చింది. విజయ్ ఓ ఏజెంట్ గా విద్యా సంస్థలో జరుగుతున్న తప్పులని నాశనం చేస్తాడు. అది తెలుగులోనూ డబ్ అయ్యింది. ఇక తెలుగులోనూ ఈ నేపథ్యంలో లెక్కకు మించిన కథలతో సినిమాలు వచ్చేసాయి. అలాంటి స్టోరీనే ధనుష్ ఒప్పుకున్నాడు. మాస్ ఎలివేషన్స్ లేవు, క్లాస్ స్టోరీ. కోలీవుడ్ సినిమాల్నితెలుగులో డబ్ చేసే ధనుష్ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. కథ మొత్తం తెలిసిందే అయినా.. యాక్టర్ మారడంతో.. ఆడియన్స్ కాస్త ఆసక్తి కనబరిచారు. కథ మొత్తం స్లోగా కదులుతున్న కుర్చీల్లో కూలబడి మరీ చూసారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో గవర్నమెంట్ అందించే విద్య, ప్రవైట్ విద్యకి నిజంగానే పెద్ద యుద్ధమే జరుగుతుంది. ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలకు ప్రయారిటీ ఇస్తున్నట్లే కనిపించినా.. ప్రవేట్ విద్యా సంస్థలకి కొమ్ము కాస్తుంది. అదే సార్ లో చూపించాడు వెంకీ అట్లూరి. హీరో ఎంటర్ అయ్యాక విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను ఎత్తి చూపించే ఓ బలమైన టాపిక్ తో సార్ సినిమా మొదలైంది. సార్ అనే టైటిల్ కి తగ్గట్టుగా.. సినిమాని సీరియస్ సబ్జెక్టుతో స్టార్ట్ చేశారు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఓవైపు సరదాగా సాగుతూనే.. మధ్యలో సీరియస్ నెస్, ఎమోషన్స్ తో పాటు కొన్ని ట్విస్టులతో ఇంటర్వెల్ బ్లాక్ బావుంది. ముఖ్యంగా సరదాగా సాగుతున్న బాలు క్యారెక్టర్ కి బిగ్ టార్గెట్ ని సెట్ చేయడం ఇంటర్వెల్ కి ప్లస్ అయ్యింది. అన్ని విధాలుగా ఆడియన్స్ ని కథలో హుక్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు వెంకీ.
సార్ ఎనాలసిస్
కోలీవుడ్ లో ధనుష్ సినిమా అంటే ప్రేక్షకులలో మినిమమ్ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే తన సబ్జెక్టు సెలక్షన్ తో టైటిల్ కార్డు ఇచ్చినప్పటినుండి పోస్టర్స్ తోనే క్రేజ్ అలా క్రియేట్ చేసుకుంటాడు. ధనుష్ రఘువరన్ బీటెక్ ఇప్పటికి బుల్లితెర మీద వస్తే.. ఫ్యామిలీ ఆడియన్స్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారు. అందులో యువకుడిగా, ఉద్యోగం కోసం తిరుగుతూ అమ్మ సెంటిమెంట్, తర్వాత ఉద్యోగంలో సమస్యలు అంటూ ధనుష్ నటనని ప్రేక్షకులు మెచ్చారు. ఇప్పుడు సార్ కూడా రఘువరన్ అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా.. తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యే కేరెక్టర్ తో ధనుష్ ఇంప్రెస్స్ చేసాడు. మనకు కొన్ని సినిమాలలో.. కొన్ని క్యారెక్టర్స్ లో కొంతమందిని మాత్రమే చూడాలని అనిపిస్తుంది. సార్.. సినిమాలో ధనుష్ మరోసారి అలాంటి క్యారెక్టరే చేశాడు. దర్శకుడు వెంకీ అట్లూరి విద్యావ్యవస్థలో జరుగుతున్న అరాచకాలు.. స్టూడెంట్స్, ముఖ్యంగా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలు చక్కగా క్యారీ చేశారు. డైలాగ్స్ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. సినిమా కథ గొప్పగా.. కొత్తగా ఏం లేదు. కానీ.. ఇందులో డ్రామా మనకు దగ్గరగా అనిపిస్తుంది. కాబట్టి.. సార్ కి ఓసారి కనెక్ట్ అవ్వొచ్చు.
పంచ్ లైన్ : ఫర్లేదనిపించేసార్..!
రేటింగ్ : 2.5/5