Advertisementt

సినీజోష్ రివ్యూ: బలగం

Mon 13th Mar 2023 09:55 AM
balagam telugu review  సినీజోష్ రివ్యూ: బలగం
Cinejosh Review : Balagam సినీజోష్ రివ్యూ: బలగం
Advertisement
Ads by CJ

బ్యానర్: దిల్ రాజు ప్రొడక్షన్

నటీనటులు: ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, వేణు టిల్లు, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: భీమ్స్ సిసిరోలియో  

సాంగ్స్: కాసర్ల శ్యామ్

సినిమాటోగ్రాఫర్: ఆచార్య వేణు

నిర్మాతలు: హర్షిత్ రెడ్డి - హన్షిత

దర్శకుడు: వేణు యెల్దండి

రిలీజ్ డేట్: 03-03-2023

పలు సినిమాల్లో స్టార్ హీరోలకి ఫ్రెండ్ కేరెక్టర్స్ తోనూ, జబర్దస్త్ స్టేజ్ పై టీమ్ లీడర్ గానూ కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన వేణు.. టాలీవుడ్ లో బిగ్ ప్రొడక్షన్ హౌస్ నుండి దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. బడా నిర్మాత దిల్ రాజు అండతో బలగం చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. కంటెంట్ ఉన్న కథలని ఎంకరేజ్ చేసే దిల్ రాజు వేణుని నమ్మి ఈ సినిమాని నిర్మించారు. కమెడియన్ గా పాపులర్ అయిన వేణు మరో స్టార్ కమెడియన్ ప్రియదర్శి ని హీరోగా పెట్టి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. విడుదలకు ముందే ప్రమోషన్స్ తోనూ, ప్రీమియర్స్ తోను సినిమాపై అంచనాలు, ఆసక్తి కలిగేలా చేసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల రిజల్ట్ ఎలా ఉందో సమీక్షలో చూసేద్దాం.

బలగం స్టోరీ రివ్యూ :

తెలంగాణలోని ఓ ప‌ల్లెటూర్లో ఉండే సాయిలు (ప్రియ‌ద‌ర్శి) ఉద్యోగం లేకపోవడంతో.. రకరకాల ప్రయత్నాలు చేసి లక్షల్లో అప్పు చేసి ఓ బిజినెస్ పెడతాడు. అది కలిసిరాకపోగా.. సాయిలు మరింత అప్పులు పాలవుతాడు. పెళ్లి చేసుకుని వరకట్నంతో వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చే ప్లాన్ చేసుకున్న సాయిలు కి తాత‌య్య కొముర‌య్య (సుధాక‌ర్ రెడ్డి) చనిపోవడం మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతుంది. ఎప్పుడో విడిపోయి కొముర‌య్య‌ మరణంతో మళ్లీ  కలిసిన కొడుకు-అల్లుడు మధ్యన మళ్ళీ గొడవలవలవుతాయి. సాయిలు పెళ్లి ఆగిపోతుంది. సాయిలు తాత చిన్న కర్మ, పెద్ద కర్మ స‌మ‌యంలో కాకుల‌కు పెట్టే పిండాలని కాకి ముట్ట‌నే ముట్ట‌దు. కొముర‌య్య‌కు పెట్టే ముద్ద‌ను కాకులు ఎందుకు ముట్ట‌వు? సాయిలు అప్పులు తీరే మార్గం దొరికిందా? సాయిలు తండ్రి-మేనత్త మళ్ళీ కలిసారా? మేనత్త కూతురితో సాయిలు పెళ్లి జరుగుతుందా? అనేది సింపుల్ గా బలగం కథ.

బలగం స్క్రీన్ ప్లే రివ్యూ :

ప్రతి ఇంట్లో జరిగే, జరుగుతున్న గొడవలు, బంధాలు-బాంధవ్యాలు, రిలేషన్స్, అలకలు, ఎమోషన్స్, నవ్వులు అన్ని కలబోసి బలగం కథగా ప్రెజెంట్ చేసాడు దర్శకుడు వేణు. ఆస్తి తగాదాలతో విడిపోయే అన్నదమ్ముల కథ, మాట పట్టింపుతో దూరమయ్యే అన్న చెల్లెళ్ళ బంధాలు, తండ్రి అన్నాడని అలిగి పుట్టింటికి దూరమయ్యే కూతురు కథ.. ఇలా ప్రతి నిత్యం చూసేది, మన ఇంట్లో జరిగే కథే బలగం. కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లుంటాయి. వాటిని హీరో సాల్వ్ చేసి అంద‌రినీ క‌లిపే క‌థాంశంతో చాలా సినిమాలు వ‌చ్చాయి. అయితే బలగం సినిమాను పూర్తి భిన్నంగా నడిపించాడు వేణు. అందులోను తెలంగాణ నేపథ్యం ఉన్న ఇంట్లో జరిగే కథాగా  బలగంని చూపించారు. బలగం చిత్రానికి పని చేసిన బృందమంతా తెలంగాణ బిడ్డలే కావడం ఒక ప్లస్ పాయింట్. సినిమాలో తెలంగాణ యాస వినిపించినా  భావోద్వేగాలు మాత్రం అందరి హృదయాలు తాకే విధంగా ఉంటాయి.

బలగం ఎఫర్ట్స్ :

ఈ చిత్రంలో హీరో-హీరోయిన్-కీలక పాత్రలు అని చెప్పుకోవడానికి లేదు. అందరూ బలమైన పాత్రలతో మెప్పించారు. అందులో ప్రియదర్శిని ఎప్పుడూ కమెడియన్ గానే చూసే ప్రేక్షకులు మల్లేశం చిత్రంతో నటుడిగా ఇష్టపడ్డారు. ఇప్పుడు బలగంలోను ప్రియదర్శి అంతే అద్భుతంగా ఆకట్టుకున్నాడు. తన ఫ్రెండ్స్ తో కలిసి సాయిలు కేరెక్టర్ లో నవ్వించాడు, ఎమోషనల్ సన్నివేశాల్లో కంటతడి పెట్టించాడు. తాత పాత్రధారి కొముర‌య్య‌గా న‌టించిన సుధాక‌ర్ రెడ్డి త‌న పాత్ర చిన్న‌దే, కనిపించేది కొన్ని సన్నివేశాలే అయినప్పటికీ కథపై ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. కావ్యా క‌ళ్యాణ్ రామ్ తన పాత్రకి న్యాయం చేసింది. ప్రియ‌ద‌ర్శి తండ్రి పాత్ర‌లో న‌టించిన జ‌యరాం, మామ‌య్య పాత్ర‌లో న‌టించిన ముర‌ళీ ధ‌ర్ ఇలా ఒక‌రేటిమిటి సినిమాలో ప్ర‌తీ పాత్ర‌లో కనిపించిన నటులు అద్భుతంగా ఆకట్టుకున్నారు.కాసర్ల శ్యామ్ పాటలు సినిమా అంతా వినిపిస్తాయి.. ఆడియన్స్ ని అలరిస్తాయి. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, నేప‌థ్య సంగీతం బావున్నాయి. ఆచార్య వేణు  సినిమాటోగ్ర‌ఫీ బావుంది. పల్లెటూరి నేపధ్యాన్ని అందంగా చిత్రీకరించారు. తెలంగాణ యాస‌లో రాసిన డైలాగ్స్ బావున్నాయి. డైరెక్ట‌ర్‌గా తొలి సినిమానే అయిన‌ప్ప‌టికీ వేణు సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డాడ‌నేది స్క్రీన్‌పై క‌నిపిస్తుంది. కమర్షియల్, మాస్ హంగులతో ఉన్న కథలని ఇష్టపడుతున్న ప్రేక్షకులకి.. క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌కు పోకుండా ఎమోష‌న్స్‌తో సినిమాను చూపించడం చాలా కష్టం. ఆ పనిలో వేణు స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. అలాగే ఇటువంటి మట్టి వాసనల మంచి కథని, మనసుని కదిలించే భావోద్వేగభరిత కథనాన్ని నమ్మి నిర్మాణానికి పూనుకున్న నిర్మాత దిల్ రాజు వారసులు హర్షిత్ రెడ్డి, హన్షితలను అభినందించి తీరాలి. 

బలగం ఎనాలసిస్ :

చావు ఇంట్లో, మరణించిన మనిషి ముందు కొందరి ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. నలుగురు నాలుగు మాటలు, అయినవాళ్ల దెప్పిపొడుపులు.. ఇవన్నీ మన జీవితంలో ఓ భాగమే. అదే సన్నివేశాలను చక్కగా రాసుకున్నాడు వేణు. బలగంలో ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ చాలా పెక్యులర్ గా ఉంటుంది. కొత్త ఎమోషన్స్ చూపించలేదు. కానీ, కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాడు. అన్నాచెల్లెళ్ళ మధ్య బాండింగ్ చెప్పే సీన్, పొలం దగ్గర తాతయ్యకు ఇష్టమైన ప్రదేశంలో ప్రియదర్శి ఎమోషనల్ అయ్యే సీన్, ప్రింటింగ్ ప్రెస్‌లో హీరోయిన్ సీన్.. చెబుతూ వెళితే ఇటువంటి కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కదిలిస్తాయి. ఏ చిన్న విష‌యాన్ని అయినా ప‌ల్లెటూర్ల‌లో ఎలా చ‌ర్చించుకుంటారు అనే అంశాల‌ను రియ‌లిస్టిక్‌గా చూపిస్తూనే  ప‌రిస్థితుల‌ను బ‌ట్టి దూర‌మైన మ‌నుషులు.. అదే ప‌రిస్థితుల కార‌ణంగా ఎలా ఒక‌ట‌య్యారనే విష‌యాన్ని చక్కగా ప్రెజెంట్ చేసాడు వేణు. స్వతహాగా తాను కమెడియన్ కాబట్టి జనం తననుంచి ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే ఎక్స్ పెక్ట్ చేస్తారని లేనిపోని భ్రమలు పెట్టుకోకుండా, ఎలాగోలా ప్రేక్షకులని మాయ చేసి పబ్బం గడిపేసుకుందామనే ప్రయత్నం చెయ్యకుండా బలమైన భావోద్వేగాలే దర్శకుడిగా తన బలగం అని భావించిన వేణుకి అందరి అభినందనలు అందడం తధ్యం. తెలంగాణ మట్టి సుగంధంతో తను మలిచిన ఈ చిత్రం ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారందరినీ మెప్పించగలదు అన్నది స్పష్టం.!

పంచ్ లైన్ : బలగం - భావోద్వేగభరితం

సినీజోష్ రేటింగ్ : 3/5 

Cinejosh Review : Balagam:

Balagam Movie Telugu Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ