సినీజోష్ రివ్యూ: సామజవరగమన
నిర్మాణం: A K ఎంటర్ టైన్ మెంట్స్ - హాస్య మూవీస్
నటీనటులు: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, వీకే నరేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, దేవీ ప్రసాద్, ప్రియ తదితరులు
సంగీతం: గోపి సుందర్
కూర్పు: చోటా కె ప్రసాద్
ఛాయాగ్రహణం: రామ్ రెడ్డి
నిర్మాతలు: అనిల్ సుంకర - రాజేష్ దండా
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
విడుదల తేదీ: 29-06-2023
అందిన ప్రతి అవకాశాన్నీ స్వాగతిస్తూ..
పొందిన ప్రతి పాత్రలోనూ చక్కగా రాణిస్తూ
నేచురల్ పర్ ఫార్మర్ అనిపించుకున్నాడు శ్రీ విష్ణు.
ఆపై అప్పట్లో ఒకడుండేవాడు అంటూ హీరోగా మారాడు.
బ్రోచేవారెవరురా అంటూ బాక్సాఫీస్ కలెక్షన్లు బాగానే దోచేశాడు.
ఇక విభిన్న కథలను ఎంచుకుంటూ - ప్రయోగాలకు సైతం సిద్ధమంటూ
తన ప్రయత్నాలు చేస్తూ వస్తోన్న శ్రీ విష్ణుకి పరాజయాల పలకరింపులూ తప్పలేదు.
అందుకే ఈసారి తన కంఫర్ట్ జోన్ అయిన కామెడీ ఎంటర్ టైనర్ తో
సామజవరగమన అంటూ సరదాగా నవ్వించే సినిమా చేశా అంటున్నాడు శ్రీ విష్ణు.
అంతేకాదు.. అవుట్ ఫుట్ పైన ఉన్న నమ్మకంతో రిలీజ్ కి ఐదు రోజుల ముందు నుంచే
అల్ ఓవర్ ప్రీమియర్ షోస్ కూడా స్టార్ట్ చేసేసారు. మీడియాకి కూడా స్పెషల్ షో వేసేసారు.
మరీ చిత్రం రేపు (జూన్ 29) విడుదల అవుతోన్న నేపథ్యంలో
కొన్ని గంటల ముందుగానే సామజవరగమన సమీక్షను మీకందిస్తోంది సినీజోష్.!
సామజవరగమన - స్టోరీ : తండ్రిని డిగ్రీ చదివించే కొడుకు కథగా సరికొత్త రీతిలో స్టార్ట్ అవుతుంది సామజవరగమన. థియేటర్ బాక్సాఫీస్ లో జాబ్ చేసే బాలు (శ్రీ విష్ణు) ఆ సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తూ, తండ్రిని చదివిస్తూ ఉంటాడు. అందుకు కారణం ఏమిటంటే బాలు తాతయ్య రాసిన వీలునామా. బాలు తండ్రి అయిన ఉమా మహేశ్వరరావు (నరేష్) డిగ్రీ పాస్ అయితేనే ఉన్న వేల కోట్ల ఆస్తి వారికి చెందుతుంది అనేది కండిషన్. అయితే ఉమా మహేశ్వరరావు ముప్పయ్యేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఆ డిగ్రీ మాత్రం గట్టెక్కలేకపోవడం అనే ట్రాక్ బాగా నవ్విస్తుంది. అలాగే డిగ్రీ ఎగ్జామ్స్ లో పరిచయం అయిన సరయు (రెబ మోనికా జాన్)ని పేయింగ్ గెస్ట్ గా ఇంటికి తీసుకురావడం కూడా కన్విన్సింగ్ గానే అనిపిస్తుంది. బాలు ప్రవర్తన చూసి సరయు ప్రేమలో పడితే.. బాలు మాత్రం ఆమెని రాఖీ కట్టమంటాడు. ఆ అమ్మాయినే కాదు.. ఏ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పినా ఆమెతో రాఖీ కట్టించేసుకోవడం బాలు నైజం. మరి అతను ఎందుకలా చేస్తున్నాడు, సరయు ప్రేమనైనా అంగీకరించాడా, సరయు తండ్రి (శ్రీకాంత్ అయ్యంగార్)ని ఎలా హ్యాండిల్ చేసాడు, గమ్మత్తైన బాలు బావ (వెన్నెల కిషోర్) కథేంటి, బాలు తండ్రి డిగ్రీ ఏమైంది వంటి వివరాలన్నీ తెరపై చూడడమే సమంజసంగా ఉంటుంది. సరదాగానూ ఉంటుంది.
సామజవరగమన - స్క్రీన్ ప్లే : సాదా సీదా కథే అయినా ఆద్యంతం ఆహ్లాదంగా సాగే కథనం సామజవరగమన చిత్రానికి ప్రధాన బలం అని నిస్సందేహంగా చెప్పొచ్చు. కన్విన్సింగ్ సీన్స్ తో, కాంటెంపరరీ కామెడీ పంచెస్ తో హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఈ స్క్రిప్ట్ ని మలుచుకున్నారు దర్శకుడు. శ్రీ విష్ణు - నరేష్ ల ట్రాక్, శ్రీ విష్ణు - రెబా మోనికాల లవ్ స్టోరీ, నరేష్ - రెబా మోనికాల ట్యూషన్ సెంటర్ ఫన్, నాని జెర్సీ సినిమాలోని ఎమోషనల్ సీన్ పేరడీ, కుల శేఖర్ గా వెన్నెల కిషోర్, బాద్ షాగా సుదర్శన్... ఇలా అడుగడుగునా నవ్వించే అంశాలతో పరుగులు తీసింది సామజవరగమన కథనం. అయితే ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ప్రథమార్థం ముగిశాక ద్వితీయార్ధంలో మాత్రం కాస్త సాగతీత కనిపించింది. కానీ కామెడీ మాత్రమే సరిపోదు.. కథకి కాస్త ఎమోషనల్ టచ్ కూడా ఇవ్వాలనే దర్శకుడి తాపత్రయాన్ని తప్పుపట్టలేం. అలాగే ఏమాత్రం వల్గారిటీ, వయొలెన్స్ లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఫిలింగా సామజవరగమనను తెరెకెక్కించినందుకు అభినందించకుండా ఉండలేం.!
సామజవరగమన - టీమ్ ఎఫర్ట్ : శ్రీ విష్ణుకి మరోసారి పర్ ఫార్మెన్సుకే కాక స్టోరీ సెలక్షన్ కీ అభినందనలు అందించే చిత్రం సామజవరగమన. బాయ్ నెక్సెట్ డోర్ లుక్స్ తో ఎప్పుడూ ఆకట్టుకునే శ్రీ విష్ణు ఈసారి మరింత పసందైన పాత్ర దొరకడంతో అందులో అలవోకగా ఒదిగిపోయాడు. కామెడీని పండించడంలో తన ప్రత్యేకతని చక్కగా చాటుకున్నాడు. ముఖ్యంగా ఈ కాలం అమ్మాయిల గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పిన లెంగ్తీ డైలాగ్ కి అయితే థియేటర్స్ లో కుర్రాళ్ళు క్లాప్స్ కొట్టడం ఖాయం. సీనియర్ యాక్టర్ నరేష్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ ఇందులోని చిత్రమైన పాత్రలో ఆయన చెలరేగిపోయిన తీరు మాత్రం చూసి తీరాల్సిందే. సరయు పాత్రలో రెబా మోనికా జాన్ సరిగ్గా ఇమిడిపోయింది. శ్రీకాంత్ అయ్యంగార్ కి అనువైన క్యారెక్టర్ దొరికింది. ఇక వెన్నెల కిషోర్ కి స్క్రీన్ స్పేస్ తక్కువే ఉన్నా... తను ఉన్నంతసేపు ఫన్నే ఫన్ను. సుదర్శన్ తనదైన స్లాంగ్ లో పంచులు వేసాడు. ఇతర తారాగణం వారి పాత్రలకు న్యాయం చేసారు. గోపీ సుందర్ మ్యూజిక్ పాటల్లో కంటే.. నేపథ్య సంగీతంలో ఎక్కువ మ్యాజిక్ చేసింది. సినిమాటోగ్రఫీ - ఎడిటింగ్ విభాగాలు తమ బాధ్యతను నిర్వర్తించాయి. డైలాగ్స్ ఆడియన్స్ కోరుకునే ఫన్ అందించాయి. చాలా నిజాయితీతో, నిబద్దతతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని దర్శకుడిగా అరంగేట్రం చేసిన రామ్ అబ్బరాజుకి అందరి అభినందనలే కాకుండా.. అదే స్థాయిలో అవకాశాలూ అందుతాయి. అంతమంది ఆర్టిస్టులతో, అంత ఆహ్లాదంగా, బ్యాలెన్సింగ్ గా ఈ చిత్రాన్ని హ్యాండిల్ చేసిన అతని దర్శకత్వ ప్రతిభ మున్ముందు కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ అందిస్తుందని ఆశిద్దాం. అలాగే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని ప్రొడ్యూసర్స్ అందుకు తగ్గ ఫలితం పొందడం తథ్యమే.. సామజవరగమన చిత్రానికది సాధ్యమే.!
సామజవరగమన - ఎనాలసిస్ : సినిమా రిలీజుకి ఐదు రోజుల ముందు నుంచే ప్రీమియర్ షోస్ స్టార్ట్ చేసారంటే మేకర్స్ గట్ ఫీలింగ్ అర్ధం చేసుకోవచ్చు. షో షో కీ పెరుగుతున్న పాజిటివ్ టాక్ గమనిస్తే ఈ చిత్రం ఫలితాన్ని అంచనా వెయ్యొచ్చు. ఇటు యూత్ కి కనెక్ట్ అయ్యే లవ్, ఫన్ ఎలిమెంట్స్ ఉండడంతో పాటు అటు హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కనుక ఆ వర్గం ప్రేక్షకులూ అండగా నిలుస్తారు. సో.. సరదా నవ్వుల ప్రయత్నం సామజవరగమన సక్సెస్ ట్రాక్ లో సాఫీగా ట్రావెల్ చేసి తీరుతుందనేది ట్రేడ్ రిపోర్ట్. మొత్తానికి అల్లూరితో భంగపడ్డ హీరో శ్రీ విష్ణుకీ, ఏజెంట్ తో దెబ్బతిన్న నిర్మాత అనిల్ సుంకరకీ అతి పెద్ద రిలీఫ్ అవనుంది సామజవరగమన.!
పంచ్ లైన్ : సరదాగా సాగిన సామజవరగమన
సినీజోష్ రేటింగ్ : 3/5