సినీజోష్ రివ్యూ: భగవంత్ కేసరి
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నటీనటులు: బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, ప్రియాంక జవాల్కర్, శరత్ కుమార్, రఘు బాబు, జాన్ విజయ్ తదితరులు
మ్యూజిక్: థమన్
సినిమాటోగ్రఫీ: C. రామ్ ప్రసాద్
ఎడిటింగ్: తమ్మిరాజు
ప్రొడ్యూసర్స్: సాహు గారపాటి, హరీష్ పెద్ది
డైరెక్టర్: అనిల్ రావిపూడి
రిలీజ్ డేట్: 19-10- 2023
మాస్ గాడ్ అని పేరు పొందిన కథానాయకుడు
మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు
ఇద్దరూ కలిశారనగానే ఈ కాంబినేషన్‌లో మాంచి మసాలా మూవీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఆడియన్స్.
కానీ వాళ్ళు మాత్రం భిన్నంగా ఆలోచించారు.
సొసైటీకి కొంచెం మంచి చెప్పే ప్రయత్నం చేశారు.
అలా ఓ సందేశంతో వచ్చిన సినిమానే భగవంత్ కేసరి.
బాలయ్య బాబు తాలూకూ ఇమేజ్‌కి న్యాయం చేస్తూనే అనిల్ రావిపూడి ఓ ఆడపిల్ల కథ చెప్పాలనే ప్రయత్నం చేశాడు.
అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే నందమూరి నటసింహంపై యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్స్ డిజైన్ చేసిన అనిల్ రావిపూడి తాను చెప్పాలనుకున్న కథని కథగానే చెప్పాలని చూశాడు. ఆ ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాడనేది సమీక్షలో చూద్దాం.
స్టోరీ :
జైలు జీవితంలో అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి (బాలకృష్ణ)కి జైలర్ (శరత్ కుమార్) కూతురు విజ్జి పాప(శ్రీలీల)తో ఏర్పడిన పరిచయం అనుబంధంగా మారుతుంది. తన సంరక్షణలో పెరిగే విజ్జిని జైలర్ కోరిక మేరకు ఆర్మీలో చేర్పించేందుకు శారీరకంగా, మానసికంగా శిక్షణ ఇప్పించడానికి ప్రయత్నిస్తుంటాడు భగవంత్ కేసరి. కానీ ఆర్మీలో చేరడం ఇష్టం లేని విజ్జి అలియాస్ విజయలక్ష్మి భగవంత్ కేసరి సలహాలను, సూచనలను పట్టించుకోదు. కాలేజీలో తన క్లాస్‌మెట్‌తో ప్రేమలో పడిన విజ్జీ తన చిచ్చాకు దూరంగా ఉండాలని కోరుకొంటుంది. విజ్జిని మానసికంగా దృఢంగా చేసేందుకు కాత్యాయని(కాజల్) భగవంత్‌కి ఎలా సహకరించింది? భగవంత్ కేసరి అనుకున్నట్టుగా విజ్జిని ఆర్మీకి పంపించగలిగాడా? విజ్జికి శిక్షణ ఇప్పించే క్రమంలో భగవంత్ కేసరి ఎదుర్కొన్న సమస్యలేమిటి? అసలు భగవంత్ కేసరి జైలులో ఎందుకున్నాడు? అనేది మిగిలిన కథ.
స్క్రీన్‌ప్లే:
మాస్‌ని, కామెడీ ఆడియన్స్‌ని మెప్పించగలడనే పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఆ క్రెడిబులిటీకి తగ్గట్టుగానే వరస సక్సెస్‌లని సాధిసున్నారు. ఎఫ్2, ఎఫ్3 తర్వాత మాస్ హీరో బాలకృష్ణతో జత కట్టాడు. అఖండ, వీర సింహ రెడ్డి చిత్రాలతో ఊర మాస్‌గా ఆడియన్స్‌ని మెప్పించిన బాలయ్యతో అనిల్ రావిపూడి అంటే.. అందరూ కామెడీ-యాక్షన్ రెండూ కోరుకున్నారు. అనిల్ రావిపూడి మాత్రం కామెడీని సైడ్‌కి నెట్టి బాలయ్యకి కలిసాచ్చిన యాక్షన్‌నే తీసుకుని తండ్రి-కూతురు సెంటిమెంట్‌తో కథని లాగించేశాడు. ఎమోషనల్ సీన్స్- హీరోయిజం అంటూ కథని కాస్త స్లోగా మొదలు పెట్టినా.. కాజల్-బాలయ్య కాంబో సన్నివేశాలు ఫస్ట్ హాఫ్‌లో సరదాగా ఉంటాయి. శ్రీలీలతో చేయించిన యాక్షన్ ఆడియన్స్‌కి నచ్చేస్తుంది. బాలయ్య-శ్రీలీల కలిశాక కథలో వేగం పెరుగుతుంది. బిడ్డ అని బాలయ్య-చిచ్చా అని శ్రీలీల చేసే సందడి ఓ రేంజ్‌లో ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్‌లోను బాలయ్య-శ్రీలీల నడుమ వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రధాన బలం. అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి బాగా చూపించాడు అనిల్ రావిపూడి.
ఎఫర్ట్స్:
బాలకృష్ణ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలలో భిన్నంగా కనిపించారు. ఆయన లుక్స్, స్టయిల్ అన్ని అభిమానులని విపరీతంగా మెప్పిస్తాయి. అవే సినిమాకి ప్రధాన బలంగా మారాయి. బాలయ్య తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్, యాక్షన్ సీన్స్‌లో కనిపించిన తీరు, శ్రీలీలతో బాలయ్య చూపించిన అనుబంధం అన్నీ సహజంగా అనిపిస్తాయి. బాలయ్య పాత్ర తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. శ్రీలీల పాత్ర. విజ్జి పాత్రలో శ్రీలీల నటన అబ్బురపరుస్తుంది. ఎమోషనల్ సన్నివేశాల్లోనే కాదు.. యాక్షన్ సీన్స్‌లోనూ శ్రీలీల నటనలో ఎంతో పరిణీతి చూపించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో శ్రీలీల పెర్ఫార్మెన్స్ వేరే లెవల్. ఆమెకి వచ్చిన అవకాశాన్ని100 శాతం చక్కగా సద్వినియోగం చేసుకుంది. కాత్యాయని పాత్రలో కాజల్‌కి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఆమె లుక్స్ వైజ్‌గా బావుంది. అర్జున్ రాంపాల్ స్టైలిష్ విలన్‌గా రొటీన్ పాత్రలో కనిపించారు. మిగతా నటీనటుల తమ పరిధిమేర నటించి మెప్పించారు.
టెక్నికల్ గా.. బాలయ్య బాబు అనగానే పూనకం తెచ్చేసుకునే థమన్ ఈ సినిమాకి కూడా గట్టిగానే దరువేశాడు. కానీ కథలో కంటెంట్ సరిపోలేదంతే. రామ్ ప్రసాద్ ఫొటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ని అందంగా తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా బాలకృష్ణ లుక్స్ ని అభిమానులందరికి నచ్చేలా చూపించింది. ఇతర సాంకేతిక నిపుణులందరూ కూడా ది బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నించారు. ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి బాలకృష్ణ వంటి మంచి మాస్ హీరో దొరికినా ఆయన ఇమేజ్ ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు సినిమా తీసెయ్యకుండా, నేటి సొసైటీకి అవసరమైన మంచి పాయింట్ ని చెప్పే ప్రయత్నం చేసాడు. ఈ ప్రయత్నంలో అతను అందించగలిగింది ఒక యావరేజ్ సినిమానే కావొచ్చు కానీ, పలు సందర్భాల్లో తాను చెబుతున్నట్టు ఇది చాలామందికి చాలా ఏళ్ళ పాటు ఓ మంచి సినిమాగా గుర్తుండిపోతుంది. షైన్ స్క్రీన్ అధినేతలు అస్సలు ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. బాలయ్య బాబుకి సరిపడే మేకింగ్ వాల్యూస్ తో ఫాన్స్ కి తగ్గ ఐ ఫీస్ట్ ఇచ్చారు.
ఎనాలసిస్:
బాలయ్య సినిమా అనగానే నందమూరి అభిమానులే కాకుండా ఇతర అభిమానులు కూడా మాస్, యాక్షన్‌ని భారీగా ఊహిస్తారు. కానీ ఇందులో వాటిని ఎంత వరకు ఉండాలో అంత వరకే అనిల్ రావిపూడి వాడుకున్నాడు. మరీ ముఖ్యంగా బాలయ్య నుంచి ఈ టైమ్‌లో ఇలాంటి సినిమాని ప్రేక్షకులు అస్సలు ఊహించి ఉండరు. కథేం కొత్తగా అనిపించదు కానీ.. బాలయ్య ఈ కథని ఓకే చేయడం చూస్తుంటే.. ఆయన డైరెక్టర్స్ నుంచి ఏం కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. ఈ సినిమాలో ఆయన తగ్గిన తీరు, కనబడిన తీరు చూస్తే.. ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చేయకుండా ఎలాంటి జోనర్ అయినా నేను రెడీ అనే సంకేతాలను పంపినట్లయింది. కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఈ కథతో అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. అలాగే కథేంటో ముందే తెలిసిపోవడం కూడా.. సినిమాపై క్యూరియాసిటీని కలిగించదు. ముఖ్యంగా ప్రథమార్థం విభిన్నంగా ఉన్నప్పటికీ.. ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దానిపైనే భగవంత్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఫైనల్‌గా దసరా సీజన్ ఒక్కటే ఈ భగవంత్ కేసరికి బలం.
సినీజోష్ రేటింగ్: 2.5/5
పంచ్ లైన్: భగవంత్ కేసరి-Dont Care