Advertisementt

సరిపోదా శనివారం మినీ రివ్యూ

Thu 29th Aug 2024 06:22 PM
saripodhaa sanivaaram  సరిపోదా శనివారం మినీ రివ్యూ
Saripodhaa Sanivaaram Mine Review సరిపోదా శనివారం మినీ రివ్యూ
Advertisement
Ads by CJ

నాని అంటే వైవిధ్యమైన చిత్రాలు 

నాని అంటే విభిన్నమైన పాత్రలు 

నాని అంటే సరికొత్త కథాంశాలు  

నాని అంటేనే ప్రయత్నాలు, ప్రయోగాలు !

సబ్జక్ట్స్ లో డెప్త్ నీ - క్యారెక్టర్స్ లో స్ట్రెంగ్త్ నీ కరెక్ట్ గా జడ్జ్ చేస్తూ వరుసగా పోలిక లేని, పొంతన లేని సినిమాలతో వెండితెరపై నవరస నట నర్తన సాగిస్తోన్న నాని నేడు సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకులను పలకరించాడు. అంటే సుందరానికి ఆశించిన స్థాయి సక్సెస్ కాకపోయినా దర్శకుడు వివేక్ ఆత్రేయకి మళ్ళీ మరో అవకాశం ఇచ్చిన నాని నమ్మకం నిలబడిందా, ఎస్.జె.సూర్య తో ప్లాన్ చేసిన ఫెరోషియస్ ఫేస్ ఆఫ్ ఆడియన్సుని అలరించిందా, అభినయించడమే కాకుండా అన్నీ తానే అయి ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా నాని పడ్డ శ్రమ సరిపోయిందా... ఆ అన్ని ప్రశ్నలకూ సమాధానమే ఈ సరిపోదా శనివారం సమీక్ష. 

సరిపోదా.. కథ చిన్నదైనా కథనం మిన్నగా ఉంటే !

వారమంతటి కోపాన్ని ఒక్క రోజు మాత్రమే ప్రదర్శించే కథానాయకుడు.  ప్రతి రోజూ వారానికి సరిపడా క్రోధాన్ని ప్రదర్శించే ప్రతినాయకుడు. ఈ రెండు పాత్రలు తాడో పేడో తేల్చుకుందామంటూ తలపడితే, ఎత్తుకు పై ఎత్తులతో ధాటిగా ధీటుగా పోరాటం చేస్తుంటే అదే సరిపోదా శనివారం సినిమా. తల్లికి ఇచ్చిన మాటకి కట్టుబడి తరచుగా తనకు కలిగే ఆగ్రహానికి శనివారం మాత్రమే ఆన్సర్ ఇచ్చే వ్యక్తి సూర్య (నాని). సొంత అన్నపైనే కక్ష కట్టి ఏకంగా ఓ ప్రాంతాన్నే వేధించే క్రూరమైన పోలీస్ దయా (ఎస్.జె.సూర్య). అస్సలు సంబంధమే లేని వీరిద్దరి మధ్య వైరం ఎందుకు మొదలైంది - ఎలా ముగిసింది అన్నదే క్లుప్తంగా చిత్ర కథ. ఓస్.. ఇంతేనా అనిపించినా, ఒక్క రోజు కోసం కోపాన్ని అణిచిపెట్టుకోవడం అనే ఆ అతి బలహీనమైన అంశాన్నే ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో తెరపైకి తెచ్చారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఫస్టాఫ్ స్లో గా ఉందనో, ఓవరాల్ గా లెంగ్త్ ఎక్కువైందనో కొన్ని విమర్శలు వినిపించొచ్చు గాక... కానీ కథాంశం చిన్నదే అయినా కథనం మిన్నగా ఉందనే కామన్ ఆడియన్ కామెంట్ సరిపోద్ది కదా పనైపోవడానికి.. పాసైపోవడానికి !!

సరిపోదా..  సమర్థులైన నటులు సై  సై అంటుంటే !

రెగ్యులర్ గా డిఫరెంట్ జానర్స్ ట్రై చేసే స్టార్స్ సహజంగానే అరుదు కనుక ఆ నేచురల్ స్టార్ బిరుదు అతికినట్టు సరిపోతుంది నానికి. దసరా వంటి రస్టిక్ ఫిల్మ్, హాయ్ నాన్న వంటి సెన్సిబిల్ ఫిల్మ్ తరువాత సరిపోదా శనివారం రూపంలో ఓ ఇంట్రెస్టింగ్ ఏక్షన్ డ్రామా ఎటెంప్ట్ చేసిన నాని నటుడిగా సూర్య ప్రతాపాన్ని చూపించారు. ఇతర అన్ని సన్నివేశాల్లో సింపుల్ గానే కనిపిస్తూనే, యాక్షన్ ఎపిసోడ్స్ లో మాత్రం శివతాండవం ఆడేసాడని చెప్పొచ్చు. అలాగే ఎస్ జె సూర్య దయా దాక్షిణ్యాలు లేని దయా  పాత్రలో జీవించేసారు. ఓ విధంగా ఈ చిక్కని కథనంలో తక్కెడ ఎక్కడా తగ్గకుండా చేసిన ఘనత ఎస్ జె సూర్య దే. ఆ పాత్రకి ఆయన్ని ఎంచుకోవడం ది బెస్ట్ ఛాయస్. కథానాయిక ప్రియాంక క్యూట్ గా కనిపించింది. మురళి శర్మ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, హర్షవర్ధన్ వంటి ఇతర తారాగణం తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతిక నిపుణులలో, సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ శెభాష్ అనిపించుకున్నారు. అతని నేపథ్య సంగీతం సినిమాకి పెద్ద ఎస్సెట్ గా మారింది. ఎట్ ది సేమ్ టైమ్ ఏక్షన్ కొరియోగ్రఫీ మంచి మార్కులు వేయించుకోగా, మురళి సినిమాటోగ్రఫీ భిన్నమైన వర్ణాలను ఆవిష్కరిస్తూ అండగా నిలిచింది. ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సిందే అంటున్నాడు చూసిన ప్రతి ఆడియన్. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్న ఈ చిత్రంతో  కమర్షియల్ దర్శకుడిగానూ రాణించగలననే కోణాన్ని చూపించారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. అక్కడక్కడా (ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్) కొంత ల్యాగ్ మినహాయిస్తే, కమర్షియల్ సినిమాకి ఈమాత్రం సరిపోద్ది అనే సరైన సరంజామాతోనే వచ్చింది సరిపోదా శనివారం !! 

సరిపోద్దా ఈపాటి రిపోర్ట్.. వచ్చుద్దా సాలిడ్ రిజల్ట్ !

సరిపోదా శనివారం ప్రమోషన్స్ కోసం అహర్నిశలూ శ్రమించిన నానికి సూపర్ ఓపెనింగ్స్ తో ప్రాపర్ రిప్లై ఇచ్చారు ప్రేక్షకులు. ప్రీమియర్స్ నుంచే మంచి మౌత్ టాక్ పొందిన ఈ చిత్రానికి విమర్శకుల సమీక్షలు కూడా సహేతుకంగానే వస్తున్నాయి. నాని - ఎస్ జె సూర్యల పెర్ ఫార్మెన్స్ లే మెయిన్ ప్లస్ అనిపించుకుంటున్న ఈ సినిమా భవితవ్యం మినిమమ్ గ్యారంటీ రిజల్ట్ నే చూపిస్తోంది. అయితే నాని కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీగా రూపొందిన ఈ చిత్రానికి సాదా సీదా సక్సెస్ సరిపోదు. స్ట్రాంగ్ హిట్ అనిపించుకోవాల్సిందే. మరి అందుకు సరిపోద్దా ఈపాటి  రిపోర్ట్ - వచ్చుద్ధా సాలిడ్ రిజల్ట్ అనేది ముందు ముందు తేలనుంది. 

పంచ్ లైన్: సరిపోదా శనివారం - యునానిమస్ గా సరిపోయినట్లే ! 

సినీజోష్ రేటింగ్: 2.75/5

Saripodhaa Sanivaaram Mine Review:

Saripodhaa Sanivaaram Telugu Movie Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ