పెళ్లి తర్వాత కూడా వన్నె తగ్గని అందాల భామ కరీనాకపూర్ ఎన్నో బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. ఈ అమ్మడు తమ ప్రొడక్టులను ప్రమోట్ చేస్తే చాలు అమ్మకాలు విపరీతంగా ఉంటాయని కంపెనీలు నమ్ముతుంటాయి. ఇక ఇప్పుడు వీహెచ్‌పీకి చెందిన 'హిమాలయ ధ్వని' మ్యాగజైన్ కూడా కరీనాకపూర్ బ్రాండ్ వాల్యూను వాడుకోవాలనుకున్నట్టుంది. అందుకే 'లవ్ జిహాద్' గురించి ప్రచురించిన కథనానికి సంబంధించి మ్యాగజైన్ కవర్‌పేజిపై కరీనా ముఖాన్ని చిత్రీకరించారు. ప్రేమ పేరిట హిందూ యువతులను ముస్లింలు వివాహం చేసకుంటూ 'లవ్ జిహాద్' కొనసాగిస్తున్నారని వీహెచ్‌పీ ఆరోపిస్తోంది. అదేవిధంగా హిందువు అయిన కరీనాకపూర్ ఇప్పుడు హీరో సైఫ్‌అలీఖాన్‌ను పెళ్లి చేసుకొని ముస్లింగా మారిపోయిందని ఈ మ్యాగజైన్ ప్రచురించింది. ఇందుకోసం కరీనా ముఖం సగం కనిపించేలా మిగితా సగం బుర్ఖాతో ఉండేలా మార్ఫింగ్ చేయించి కవర్‌పేజీపై ప్రచురించారు. ఈ ఫొటోపై కరీనాకు ఏమైనా అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్లవచ్చనికూడా వీహెచ్‌పీ స్పష్టం చేసింద. కాని ఇప్పటివరకు ఈ విషయం గురించి మాత్రం కరీనా స్పందించలేదు.