చక్రి మరణించి మూడు రోజులు కూడా కాకముందే ఆయన ఇంట్లో వివాదం తలెత్తింది. దశ దిన కర్మ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పిన చక్రి భార్య శ్రావణి ఇటీలవె మీడియా ముందుకు వచ్చి తన భర్త మృతికి ఆయన కుటుంబ సభ్యులే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. చక్రి తల్లి, ఆయన సోదరుడు కలిసే చక్రిని హత్య చేశారని ఆరోపించడం సంచలనం రేపింది. అటు తర్వాత చక్రి తల్లి కూడా శ్రావణిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిరువురూ పలు చానళ్ల ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం అటు చక్రి అభిమానులతోపాటు ఇటు సినీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ వివాదం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ వద్దకు చేరుకుంది. చక్రి భార్యతోపాటు ఆయన తల్లి, తోబుట్టువులు కేటీఆర్‌ను కలిశారు. ఇక ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టేందుకు కేటీఆర్ ఇరువర్గాలతో మాట్లాడినట్లు సమాచారం. మరి ఈ ఆస్తుల పంచాయతీని కేటీఆర్ ఎంతవరకు పరిష్కరించారో త్వరలోనే తేలనుంది.