సెన్సేషనల్ హీరోయిన్ పూనమ్ పాండే ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాత కిషోర్ రాఠి సమర్పణలో మనీషా ఆర్ట్ అండ్ మీడియా ప్రై. లిమిటెడ్ పతాకంపై వీరు కె. దర్శకత్వంలో మహేష్ రాఠి నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ‘మాలిని అండ్ కో’. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫైట్ చిత్రీకరణ హైదరాబాద్‌లోని డాగ్ హౌస్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. కిషోర్ రాఠి కుమార్తె మనీషా, ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి టీజర్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో మిలన్, చిత్ర సమర్పకులు కిషోర్ రాఠి, చిత్ర దర్శకుడు వీరు కె., నటుడు జీవా పాల్గొన్నారు.
జి.నాగేశ్వరరెడ్డి: నేను, వీరు ఎస్వీ కృష్ణారెడ్డిగారి దగ్గర దర్శకత్వ శాఖలో కలిసి పనిచేశాం. మనీషా ఫిలింస్ బేనర్‌లో కిషోర్‌రాఠిగారు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలు నిర్మించారు. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. వీరు ఇంతకుముందు చేసిన సినిమాలకు, ఈ సినిమాకి చాలా తేడా వుంది. టేకింగ్ పరంగా చాలా అడ్వాన్స్ అయ్యాడు. వీరు చేసిన సినిమా సూపర్‌హిట్ అయ్యిందంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వారి ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత అంతగా సంతోషించే వ్యక్తిని నేను. టీజర్ చాలా బాగుంది. తప్పకుండా ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది.
జీవా: మనీషా సంస్థ అంటే మంచి సినిమాలకు పెట్టింది పేరు. తమ దర్శకుడిని ఎలాంటి ఇబ్బందీ పెట్టని నిర్మాత కిషోర్ రాఠిగారు. డైరెక్టర్‌కి ఏం కావాలో అన్నీ సమకూర్చి ఒక మంచి సినిమా తియ్యడానికి ఆయన ఎంతో సహకరిస్తారు. వీరు అన్నీ తనే అయి షూటింగ్ సజావుగా జరిగేలా కష్టపడతారు. సిన్సియర్‌గా తన వర్క్ కంప్లీట్ చేస్తారు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఈ సినిమా మనీషా బేనర్‌లో మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది.
వీరు కె.: 12 సంవత్సరాల తర్వాత మనీషా సంస్థలో మళ్ళీ సినిమా వస్తోంది. ఒక సక్సెస్‌ఫుల్ సినిమాకి కావాల్సిన హంగులన్నీ ఈ సినిమాలో సమకూరాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని మూడు పాటల్ని ప్రేమ్‌రక్షిత్‌గారి కొరియోగ్రఫీలో బ్యాంకాక్‌లో చిత్రీకరించడం జరిగింది. పూనమ్ పాండే అంటే అందరికీ ఒక గ్లామర్ డాల్‌గానే తెలుసు. కానీ, ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా, పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ వున్న ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఆమె నటించింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన మిలన్ చాలా ఎక్స్‌లెంట్‌గా చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ నేతృత్వంలో ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది. మిలన్‌లో మంచి పొటెన్షియాలిటీ వుంది. తప్పకుండా హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఈ సినిమా ఆల్రెడీ డబ్బింగ్ స్టేజ్‌లో వుంది. 29, 30, 31 తేదీల్లో బ్యాంకాక్‌లో జాకీచాన్ సినిమాలకు పనిచేసిన రోనీ మాస్టర్ కంపోజ్ చేసిన ఓ ఫైట్‌ని చిత్రీకరించబోతున్నాం. దాంతో టోటల్‌గా షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఈ నెలాఖరులో ఆడియోను రిలీజ్ చేసి ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.