‘‘మెగాస్టార్ చిరంజీవితో 150వ సినిమా అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది. చిరు స్థాయికి తగిన కథ నా దగ్గర ఉంది. ఆయన అనుమతి ఇస్తే తప్పకుండా ఆయనతో సినిమా చేస్తాను’’ అని అడ్డాల శ్రీకాంత్ అన్నారు. భద్రాచలంలో భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతరాష్ట్ర నాటిక పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విలేకరులతో మాట్లాడారు. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేసిన ‘ముకుంద’ సినిమా విజయంతో తర్వాతి సినిమా పనులను వేగవంతం చేశారు. చిరంజీవిగారి 150వ సినిమాకు దర్శకుడిగా అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని ఆయన తెలిపారు. ఇంకా ఆయన చెబుతూ ‘‘సగటు మానవుని జీవితం ఆధారంగా, కుటుంబ సమేతంగా చూసేలా నా సినిమాలుంటాయి. ప్రస్తుతం మహేష్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’ సినిమా చెయ్యబోతున్నాను. కథ రెడీగా ఉంది. కథానాయిక ఎంపిక జరగాల్సి ఉంది. సీతమ్మవాకిట్లో సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో మరో మల్టీస్టారర్ సినిమా చెయ్యాలనుంది’’ అని అన్నారు.