అర్చన ఏకపాత్రాభినయంతో 'ఐడియా మూవీ క్రియేషన్స్' పతాకంపై హర్ష మేఘన సమర్పణలో శ్రీకాంత్ నిర్మాతగా, సుజాత బౌరియా దర్శకత్వంలో రూపొందించిన సినిమా 'పంచమి'. ఈ సినిమా మార్చి 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకురాలు సుజాత బౌరియా మాట్లాడుతూ "ఈ చిత్రం ఆడియోకి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు మెంబర్స్ చూసి అభినందించి క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చారు. భారతీయ సినీ చరిత్రలో ఇది ఒక వినూత్న ప్రయత్నం. ఈ సినిమా కోసం నాకు సహకరించిన ప్రొడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు. అర్చన అభినయం ప్రత్యేకంగా నిలుస్తుంది" అని అన్నారు.
ప్రొడ్యూసర్ డి.శ్రీకాంత్ మాట్లాడుతూ "టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ సినిమా విడుదలకు కొంచెం లేట్ అయినా ప్రేక్షకులు వంద శాతం ఈ సినిమా చూసి త్రుప్తి చెందుతారు. మార్చి 6 న రెండు తెలుగు రాష్ట్రాల్లో 130 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇది ఓ ఎక్స్పెరిమెంటల్ కమ్ కమర్షియల్ సినిమా. గ్రాఫిక్స్ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి" అని అన్నారు.
హీరోయిన్ అర్చన మాట్లాడుతూ "ఫోటోగ్రాఫర్ అయిన ఓ అమ్మాయికి అడవిలో ఎదురయ్యే సంఘటనలను ఎలా ఎదుర్కొని బయటపడిందనేదే కథ. ప్రీ క్లైమాక్స్ దగ్గర వచ్చే మ్యూజిక్ అధ్బుతంగా ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
సంగీత దర్శకుడు శ్రీకోటి మాట్లాడుతూ "ఈ సినిమాలో 6 పాటలు కథకు అనుగుణంగా ఆణిముత్యాలుగా ఉంటాయి. ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి సినిమాగా చరిత్రలో మిగిలిపోతుంది" అని అన్నారు.
ఈ చిత్రానికి పాటలు: సుద్దాల అశోక్ తేజ, సినిమాటోగ్రఫీ: రఘు ఆర్. భల్లారి, ఎడిటింగ్: కోడెం అజయ్, గ్రాఫిక్స్: రాజేష్ పాల.