శివాజీ రాజా హీరోగా మాస్టర్ నితిన్ సాయి బొమ్మి, మాస్టర్ శరత్‌కుమార్ సమర్పణలో శ్రీసిద్ధి వినాయక సినిమా కంపెనీ పతాకంపై నిర్దేష్ నెర్స్ దర్శకత్వంలో శ్రీమతి సునీత శ్రీనివాసరావు బొమ్మి నిర్మిస్తున్న చిత్రం ‘పోలీస్ పాపారావు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఉగాది కానుకగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపేందుకు మంగళవారం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో శివాజీ రాజా, దర్శకుడు నిర్దేశ్ నెర్స్, నిర్మాత శ్రీమతి సునీత శ్రీనివాసరావు బొమ్మి, సంగీత దర్శకుడు తారకరామారావు, సినిమాటోగ్రాఫర్ చంద్రశేఖర్ వేమూరి, ఎడిటర్: విజై ఆనంద్ వడిగి, గేయ రచయిత రాజు తప్పెట, నటి కళ్యాణి, నటులు రాపెట్ అప్పారావు, సముద్రం వెంకటేష్, శేఖర్ చైతన్య, శ్రీనివాసరావు బొమ్మి తదితరులు పాల్గొన్నారు.
సునీత శ్రీనివాసరావు బొమ్మి: ఇది మా మొదటి సినిమా. చాలా మంచి స్టోరీతో చేశాం. పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే అందరిలో బ్యాడ్ ఒపీనియన్ వుంటుంది. ఇందులో కూడా మంచి వాళ్ళు, నిజాయితీ పరులు వున్నారని చెప్పే సినిమా ఇది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో మంచి మెసేజ్‌తోపాటు కామెడీ కూడా వుంటుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ఈ చిత్రంలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో కోఆపరేట్ చేసి మంచి సినిమా చేశారు. ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.
శివాజీరాజా: చిన్న సినిమాలు రిలీజ్ చేయడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అలాంటి టైమ్‌లో సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేకుండా ఒక మంచి సినిమా నిర్మించాలన్న ఉద్దేశంతో ముందుగా రావి కొండలరావుగారిని సంప్రదించారు. ఆయన కథ విని హీరోగా శివాజీరాజా అయితే బాగుంటాడని చెప్పారట. ఆయన నన్ను సజెస్ట్ చేశారని చెప్పగానే కథ కూడా అడగకుండా ఓకే అన్నాను. పాడేరు, అరకులో 29 రోజులు షెడ్యూల్ అనుకుని వెళ్ళాం. అందరి కోఆపరేషన్‌తో 23 రోజుల్లోనే పూర్తి చేయగలిగాం. ఈ సినిమాలో ఒక సస్పెన్స్ వుంది. 11 రీళ్ళ వరకు చూసిన వారు సినిమాలో విలన్ అనేది ఎవ్వరూ గెస్ చేయలేరు. అలాంటి మంచి సబ్జెక్ట్‌తో నిర్దేశ్‌గారు చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నా నమ్మకం.
నిర్దేశ్ నెర్స్: ఇది నా రెండో సినిమా. నా మొదటి సినిమాకి నంది అవార్డు వచ్చింది. కెమెరామెన్‌గా వున్న నేను డైరెక్టర్‌గా మారాను. టోటల్‌గా ఒక హిల్ స్టేషన్‌లో జరిగే కథ ఇది. శివాజీరాజాగారు కామెడీ చేస్తారని అందరికీ తెలుసు. కానీ, ఆయన కామెడీతోపాటు ఎమోషన్‌ని కూడా బాగా చెయ్యగలరు. ఇందులో కొన్ని సీన్స్‌లో చాలా ఎమోషనల్‌గా నటించారు. ఈ క్యారెక్టర్‌కి ఆయన హండ్రెడ్ పర్సెంట్ సూట్ అయ్యారని సినిమా చూసిన తర్వాత అందరూ చెప్తారు. ఈ సినిమా చెయ్యడంలో నిర్మాతగారు ఎంతో సహకరించారు. ఇందులో వున్న రెండు పాటల్ని తారక రామారావు చాలా బాగా చేశాడు. అలాగే రీరికార్డింగ్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.
కళ్యాణి: ఉగాది అంటే అన్ని రుచులు వుంటాయి. అలాగే ఉగాదికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు వున్నాయి. చక్కని మెసేజ్ ఇస్తూనే ఎంటర్‌టైన్ చేసే మంచి కథతో నిర్దేశ్‌గారు ఈ సినిమా చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన తారక రామారావు నా తమ్ముడు. అతనికి ఇది మొదటి సినిమా. ఈ సినిమాకి సంబంధించి చాలా మందికి ఇది మొదటి సినిమా. ఈ సినిమాని సక్సెస్ చేసి అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
శివాజీరాజా, నవీన, కరాటే కళ్యాణి, వైజాగ్ హేమ, శ్రీనివాసరావు బొమ్మి, సముద్రం వెంకటేష్, శేఖర్ చైతన్య, అల్లు రమేష్, రాపెట్ అప్పారావు, సత్యప్రసాద్, బాదంగీర్ సాయి, వి.వెంకటనాయుడు, మాస్టర్ నితిన్‌సాయి బొమ్మి, మాస్టర్ శరత్‌కుమార్ బొమ్మి నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రావి కొండలరావు, సంగీతం: తారక రామారావు, సినిమాటోగ్రఫీ: చంద్రశేఖర్ వేమూరి, ఎడిటింగ్: విజై ఆనంద్ వడిగి, డాన్స్: ఘన్‌శ్యామ్, పాటలు: రాజు తప్పెట, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీనివాసరావు బొమ్మి, నిర్మాత: శ్రీమతి సునీత శ్రీనివాసరావు బొమ్మి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: నిర్దేశ్ నెర్స్.