చిత్ర పరిశ్రమలో ఎడిటర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన కోలా భాస్కర్ ఇప్పుడు తన తనయుడైన కోలా బాలకృష్ణను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయన నటిస్తున్న చిత్రానికి 'నన్ను వదిలి నీవు పోలేవులే' అనే పేరు పెట్టారు. దీనికి 'అది నిజములే' అన్నది ఉపశీర్షిక. ఇందులో కోలా బాలకృష్ణ సరసన వామిక కథానాయికగా నటిస్తోంది. హిందీ, పంజాబీ భాషల్లో మూడేసి చిత్రాలు చేసిన ఆమెకు దక్షిణాదిన ఇదే తొలి చిత్రం. గతంలో '7జి బృందావనకాలనీ' , 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' , 'యుగానికి ఒక్కడు' చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీరాఘవ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఆయన సతీమణి గీతాంజలి శ్రీరాఘవ దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. బీప్ టోన్ స్టూడియోస్ పతాకంపై కంచర్ల పార్థసారథి సమర్పణలో కోలా భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్త్తుతం కేరళలోని మూనార్ లో పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. యూత్ ఫుల్ ప్రేమకథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం పతాక సన్నివేశాల చిత్రీకరణ ఏప్రిల్ 10కి పూర్తవుతుంది. ఆ తర్వాత ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో యూనివర్శల్ కంపెనీకి ఆడియో ఆల్బమ్ ను రూపొందించి, అందరి దృష్టినీ ఆకర్షించిన అమృత్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు: శ్రీరాఘవ, పాటలు: అనంత్ శ్రీరామ్, చాయాగ్రహణం: శ్రీధర్, సమర్పణ: కంచర్ల పార్థసారథి, నిర్మాత: కోలా భాస్కర్, దర్శకత్వం: గీతాంజలి శ్రీరాఘవ.