ఎన్నో భారీ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆస్కార్ వి.రవిచంద్రన్, ఆస్కార్ ఫిలిం ప్రై. లిమిటెడ్ పతాకంపై ధనుష్ హీరోగా భరత్‌బాల దర్శకత్వంలో తమిళంలో నిర్మించిన చిత్రం ‘మరియన్’. తమిళ్‌లో సూపర్‌హిట్ అయిన ఎన్నో మంచి చిత్రాలను ఎస్.వి.ఆర్. మీడియా ప్రై. లిమిటెడ్ పతాకంపై తెలుగు ప్రేక్షకులకు అందించిన శోభారాణి ‘మరియన్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో విడుదలైంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో సోని మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి ఆడియోను ఆవిష్కరించి తొలి సి.డి.ని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్‌కి అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను కూడా కె.అచ్చిరెడ్డి విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో ప్రిన్స్, మల్టీ డైమెన్షన్ వాసు, టి.ప్రసన్నకుమార్, రవి, బి.ఎ.రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
కె.అచ్చిరెడ్డి: సాంగ్స్ చాలా బాగున్నాయి. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ ఎలా వుంటుందో మనందరికీ తెలుసు. విజువల్‌గా కూడా పాటలు బాగా తీశారు. ధనుష్ ఈ చిత్రంలో ఎంతో ఇన్‌వాల్వ్ అయి చేశారు. ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ అవుతుంది. శోభారాణిగారు ఎస్.వి.ఆర్. మీడియా బేనర్‌లో 10 సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తున్నారు. ఎన్నో మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఎన్ని అవరోధాలు వచ్చినా అవన్నీ అధిగమించి మంచి సినిమాలు అందించాలన్న తపన వున్న నిర్మాత ఆమె. ‘మరియన్’ ఎస్.వి.ఆర్. మీడియాలో మరో సూపర్‌హిట్ అవుతుందన్న నమ్మకం నాకు వుంది.
వాసు: తమిళ్‌లో మంచి హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. సినిమా మీద అభిమానంతో డిస్ట్రిబ్యూటర్‌గా ఎన్నో సినిమాలు అందించి, తమిళ్‌లో హిట్ మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించి మంచి పేరు తెచ్చుకున్నారు శోభారాణిగారు. ధనుష్‌కి ఈమధ్య రఘువరన్ బి.టెక్, అనేకుడు తెలుగులో మంచి విజయాలు సాధించాయి. ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది.
ఆర్.పి.పట్నాయక్: తమిళ్ సినిమాలను డబ్బింగ్ చేసి ఎస్.వి.ఆర్. మీడియాపై రిలీజ్ చేసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. పాటలు చాలా బాగున్నాయి. విజువల్‌గా కూడా ఎక్స్‌లెంట్‌గా అనిపిస్తున్నాయి. ధనుష్ సినిమాలంటే తెలుగులో కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ వుంటున్నాయి. ఈ సినిమా కూడా తెలుగులో ధనుష్‌కి మంచి హిట్ సినిమా అవుతుంది. శోభారాణిగారికి ఈ సినిమా సక్సెస్ అయి లాభాలు తెచ్చిపెడుతుంది.
టి.ప్రసన్నకుమార్: తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించడంలో ఎంతో డెడికేటెడ్‌గా వర్క్ చేస్తారు శోభారాణిగారు. ‘మరియన్’ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ధనుష్, పార్వతీ మీనన్ హీరోహీరోయిన్లు అయినప్పటికీ స్క్రీన్‌మీద వారి క్యారెక్టర్లు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప వాళ్ళు కనిపించడం లేదు. డైరెక్టర్ ఆడియన్స్‌ని అంతగా ఇన్‌వాల్వ్ చేసినట్టు అనిపిస్తోంది. డెఫినెట్‌గా ఈ సినిమా పెద్ద హిట్ శోభారాణిగారికి మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. ఆ లాభాలతో తెలుగులో స్ట్రెయిట్ మూవీ చెయ్యాలని నా కోరిక. అంతకుముందే ఒక సినిమా చెయ్యాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల సెట్స్ వరకు వెళ్లలేదు. ఆ సినిమాయే నరేష్ హీరోగా వచ్చిన ‘సుడిగాడు’.
ప్రిన్స్: పాటలు బాగున్నాయి, విజువల్స్ కూడా అద్భుతంగా వున్నాయి. ధనుష్‌కి తెలుగులో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అలాగే ఎస్.వి.ఆర్. మీడియాలో మరో సూపర్‌హిట్ సినిమాగా నిలుస్తుంది.
శోభారాణి: ఇది హై ఓల్టేజ్ మూవీ. ఇందులో ప్రతి పాట, ప్రతి సీన్ చెక్కిన శిల్పంలా వుంటుంది. ఈ సినిమాని మాకు ఇచ్చి ప్రోత్సహించిన ఆస్కార్ రవిచంద్రన్‌గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2008లో ముగ్గురు విదేశాలలో కిడ్నాప్ అయ్యారు. ఆ ముగ్గురు 21 రోజుల తర్వాత కిడ్నాపర్స్ చెర నుంచి తప్పించుకొని వచ్చారు. దాన్ని ఒక సినిమాగా మలచడంలో భరత్‌బాలగారు ఎంతో కృషి చేశారు. ఆ ముగ్గురినీ కలుసుకొని ఎంతో రీసెర్చ్ చేసి ఈ సబ్జెక్ట్ రెడీ చేశారు. ధనుష్‌గారు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తన క్యారెక్టర్‌ను చేశారు. ఈ సినిమాకి రెహమాన్‌గారి మ్యూజిక్ చాలా ఎస్సెట్ అని చెప్పాలి. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ స్క్రిప్ట్ రెడీ చేయడంలో ధనుష్‌గారు కూడా 9 నెలలు కష్టపడ్డారు. భరత్‌బాలగారికి ఎంతో సన్నిహితుడైన ఎ.ఆర్.రెహమాన్ ఈ కథ విని ఎంతో ఇన్‌స్పైర్ అయి మ్యూజిక్ చేయడానికి ఒప్పుకున్నారు. తెలుగులో కూడా ఈ పాటలు సూపర్‌హిట్ అవుతాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం.